డైలీ సీరియల్

యమహాపురి - 26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంట్లో మాత్రం చిన్న డ్రెస్సింగ్ టేబుల్ తిప్పాలన్నా - ఆ పని నేనో, పనిమనిషో చెయ్యాలి. ఈ టేబుల్ అటు తిరిగుందనేగా- మీరు మా వస్తువులు దాని వెనకాల పడేశారు’’ అంది.
‘‘ఎంతలేదన్నా, పోలీసోడి పెళ్లానివి- బాగానే కనిపెట్టావ్! కానీ నేనెంత లాఠీ తిప్పినా, నేరస్థులే ఓ పట్టాన పడరు. కానీ నువ్వు మూతి మూడు వంకర్లు తిప్పావా- నా అంతటివాడు కూడా ఇట్టే పడిపోతాడు’’ అంటూ శ్రీకర్ డ్రెస్సింగ్ టేబుల్‌ని తానొక్కడూ యథాస్థానంలోకి తిప్పి సద్దేశాడు. వసంత తడబడి పిల్లలవంక చూసింది.
పిల్లలప్పుడు తమ వస్తువులు దొరికాయన్న ఉత్సాహంలో ఉన్నారు. తల్లిదండ్రులేమంటున్నారో, ఏం చేస్తున్నారో పట్టించుకునే స్థితిలో లేరు. దొరికిన వస్తువులతో ఉత్సాహంగా తమ గదిలోకి పరుగెత్తారు.
వాళ్లలా వెళ్ళేక వసంత కాస్త సద్దుకుంది. భర్త మాటలు మననం చేసుకుని తనలో తను ముసి మససిగా నవ్వుకుంది. అతణ్ణి ముచ్చటగా చూస్తూ, ‘‘నోటికొచ్చినట్లు మాట్లడేయడం కాదు. చుట్టుప్రక్కల ఎవరున్నారో గమనించాలి. లేకపోతే పోలీసుల చిదంబర రహస్యాలన్నీ బట్టబయలౌతాయి’’ అని హెచ్చరించింది.
‘‘పిల్లలు నా మాటలేం వినలేదు కానీ, ఇందాకా నీ సహజ సౌందర్యం గురించి ఏదో తర్వాత చెబుతానన్నావ్! ఆ చిదంబర రహస్యమేమిటో చెబుతావా, సస్పెన్సు తట్టుకోలేకపోతున్నాను’’ అన్నాడు శ్రీకర్.
‘‘వద్దులెండి. అసలే అందగాడినన్న భ్రమలో ఉన్నారు. తట్టుకోలేరు’’ అంది వసంత.
‘‘నాది భ్రమ కాదు. భ్రమే అనుకున్నా, అది నువ్వు కలిగించినదే కానీ నేను కల్పించుకున్నది కాదు. లేనిపోని అనుమానాలు పెట్టుకోకు. సస్పెన్సు పెంచకుండా వెంటనే చెప్పేసేయ్, ప్లీజ్’’ అన్నాడు శ్రీకర్.
వసంత వెంటనే చెప్పలేదు. మరి కాసేపు బులిపింజేసుకున్నాక ‘‘సూర్యభగవానుడి భార్య సంధ్య కథ నీకు తెలుసుగా’’ అంది.
‘‘తెలుసేమో కానీ గుర్తులేదు, నువ్వే చెప్పు’’ అన్నాడు శ్రీకర్.
‘‘సంధ్య విశ్వకర్మ కూతురు. సూర్యుణ్ణి పెళ్లి చేసుకుంది కానీ- అతడి కాంతినీ, వేడినీ భరించలేక పుట్టింటికి వెళ్లిపోయింది. విషయం తెలిసిన విశ్వకర్మ- సూర్యుణ్ణి పిలిచి- తన యంత్ర సామగ్రితో ఆయన కాంతినీ, వేడినీ కుమార్తె భరించగలిగిన స్థాయికి తగ్గించాడు’’ అంది వసంత.
‘‘ఐతే?’’
‘‘మీతో కాపురానికని, నేను నా సహజ సౌందర్యాన్ని మీరు భరించగల స్థాయికి తగ్గించాను. ఇక అద్దం ముందు నిలబడి మెరుగుదిద్దే ప్రసక్తి ఎక్కడ? అందుకే నాకు డ్రెస్సింగ్ టేబుల్ పెద్దగా అవసరపడదు’’ అంది వసంత.
శ్రీకర్ చురుగ్గా ఆమెని చూశాడు. ఓ క్షణం ఆగి, ‘‘నేను చాల అందగాడిననీ, నాకు నువ్వు తగనిదానివనీ, నువ్వే నాతో చాలాసార్లు అన్నావు. ఇప్పుడేమో ఇలాగన్నావు. రెండిట్లో ఏది నిజం?’’ అన్నాడు.
‘‘ఇది ప్రజాస్వామ్యం. మెజారిటీ విన్స్. కాబట్టి రెండోదే నిజం’’ అంది వసంత.
‘‘మెజారిటీ ఎక్కడ? ఫిఫ్టీ ఫిఫ్టీయేగా?’’ అన్నాడు శ్రీకర్.
‘‘నేను చాలా అందగత్తెననీ, మీరు నాకు తగనివారనీ- మీరే నాతో చాలాసార్లు అన్నారు. నాకంటే అందగాణ్ణని ఒక్కసారి కూడా నాతో మీరనలేదు. అలా మీతో కలిసి నా అందానికి రెండు ఓట్లు. నాతో కలిపి మీ అందానికి ఒక్కటే ఓటు. మెజారిటీ ఎవరిదంటారు?’’ అంది వసంత.
‘‘ఒప్పుకున్నాను. కానీ పోలింగింకా ఐపోలేదు. ఇప్పటిదాకా నువ్వు లీడ్‌లో ఉన్నావంతే! ఆ లీడ్ పోగొట్టి మళ్లీ ఫిఫ్టీ చేసే ఛాన్స్ నాకింకా ఉంది. ఔనా?’’
‘‘అలాగా- మరి ఈ వేళ పున్నమి అని తెలుసా? పెరట్లో సన్నజాజి విరగబూసిందని తెలుసా? చీకటి పడ్డానికింక రెండు గంటలే ఉందని తెలుసా?’’ అంది వసంత ఏదో ఆలోచిస్తున్నట్లు నటిస్తూ.
‘‘ఏయ్- టాపిక్ డైవర్ట్ చేస్తున్నావ్’’ అన్నాడు శ్రీకర్.
‘‘డైవర్షన్ కాదు. టాపిక్‌కే వస్తున్నా. మీ ఓటు హక్కు వినియోగించుకునేముందు ఈ విషయాలన్నీ గుర్తించుకుని బాగా ఆలోచించి ఓటు వెయ్యండి..’’ అంది వసంత గోముగా.
‘‘అన్యాయం. ఇదేదో బ్లాక్‌మెయిల్లా ఉంది’’ అన్నాడు శ్రీకర్.
‘ఓటింగు ముందు తిథి చెప్పాను. తన తోట గురించి మాట్లాడాను. టైమైపోతోందని హెచ్చరించాను. ఇది బ్లాక్‌మెయిలెలాగౌతుంది? ఎలక్షన్ కోడ్‌ని కూడా ఉల్లంఘించడం అనిపించుకోదు..’’ నవ్వింది వసంత.
శ్రీకర్ నీరసం నటిస్తూ, ‘‘ఎంత వారలైనా కాంత దాసులేనని పెద్దలు ఊరికే అనలేదు. ఏం చేస్తాం. ఇప్పుడు నీ అందం 3-1 మెజారటీ సాధించింది. కంగ్రాట్స్’’ అన్నాడు.
‘‘్థంక్స్! అదీ ఓటర్లో పరిణతి అంటే!’’ మెప్పుకోలుగా అంది వసంత.
‘‘ఏయ్ సంతూ! నువ్వే నెగ్గావు కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు నా అందం పెరగటానికి టిప్స్ చెప్పాలి’’ అన్నాడు శ్రీకర్.
‘‘ఎందుకు?’’
‘‘నీ సరి నేనని- అనిపించుకోవాలని నాకుండడం సహజం కదా!’’ అన్నాడు శ్రీకర్.
‘‘మీకలా ఉండడం సహజమే కానీ- ఏం చెప్పను? ఎలుక తోలు తెచ్చి ఎందాక ఉతికినా.. అన్నాడు వేమన...’’’ అంటూ కిల కిల నవ్వింది వసంత.
శ్రీకర్ ఉడుక్కోలేదు. మనోహరమైన ఆ నవ్వుకి పులకరిస్తున్నట్టు చూసి, ‘‘నిజమే- స్టేషన్లో పులిని. ఇంట్లో నీ ముందు కనీసం పిల్లిని కూడా కాదు, ఎలుకనై నీకు చులకనైపోయాను. కానీ ఎంచేతనో నాకు పులిలా గాండ్రించడం కంటే నీకు చులకనైపోవడమే బాగుంటుంది’’ అంటూ అదోలా చూస్తూ ఆమెకి దగ్గిరగా వెళ్లాడు.
పెళ్లికాని అమ్మాయి కూడా ఆ చూపుల భావం పసికట్టగలదు. వసంత ఇద్దరు పిల్లల తల్లి.
‘‘ఏయ్ ఏమిటది- ఆ చూపులేమిటి- అవతల గదిలో పిల్లలున్నారు’’ అని హెచ్చరించింది.
‘‘నాకవేమీ తెలియవు. నాలుగు గోడల మధ్య నేనూ, నవ్వుతూ నువ్వూ. ఇప్పుడీ ఎలుక కూడా పెద్దపులైపోతుంది. దీన్ని ఆపడం నీక్కూడా అసాధ్యం. జస్ట్ వెయిట్ అండ్ వాచ్’’ అంటూ ఆమెను దగ్గరగా తీసుకున్నాడు శ్రీకర్.

ఇంకా ఉంది

వసుంధర