డైలీ సీరియల్

ట్విన్‌టవర్స్ 14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ ఫొటోని నాతో తీసుకువెళ్లాలనిపించింది. కానీ ఎవరికీ చెప్పకుండా ఎలా? కాసేపు తటపటాయించాను. వెళ్ళేముందు చెప్పచ్చు అనుకుంటూ, సూట్‌కేసులో పెట్టుకున్నాను. రఘు ఫొటో నాదగ్గర అసలు లేదు. పెళ్లిలో చాలా ఫొటోలు తీశారు. కాని, అవి ఏవీ ఇంకా నా దగ్గరకు ఏమీ రాలేదు. కాసేపు సందిగ్ధంగా ఉండిపోయాను. చివరకు నాతో తీసుకువెడదామనే నిశ్చయించుకుని, సూట్‌కేసు మూసేశాను.
ఇంక అమ్మ, నాన్న రావడం తరువాయి. ఇంక ఇంటికి వెళ్లిపోవాలి. ఆ ఆలోచన రాగానే నా మనసు విజయవాడ వైపు పరుగెత్తింది.
విజయవాడ! అదో స్వర్గం నాకు. పుట్టింది, పెరిగింది, బతికింది అంతా విజయవాడలోనే! అది పల్లెటూరి పోకడలతో పట్నం. పట్నపు పోకడలతో పల్లెటూరు! కృష్ణమ్మ ఒడ్డున పెరిగిన ఊరు. క్రిష్టమ్మలాగానే ఎప్పుడూ గలగలలాడుతూ ఉంటుంది.
కొండెక్కి కూచున్న కనకదుర్గమ్మ పర్యవేక్షణ ప్రభావం ఎప్పుడూ ఆ ప్రదేశంమీద ఉంటుంది. అయ్యదేవర కాళేశ్వరరావు, టంగుటూరి ప్రకాశం, జంధ్యాల దక్షిణామూర్తి తదితర పెద్దలెందరో తీర్చిదిద్దిన ఊరు.
అందుకే వారందరి గౌరవార్థం వారి వారి విగ్రహాలు నెలకొల్పారు. ఆ పెద్దల సహృదయం, విశ్వనాధ, పింగళి వారల కళా హృదయం ఆ ఊరిలో ఈనాటికీ ప్రతిబింబిస్తూనే ఉంటుంది.
క్రిందకు దిగి వచ్చాను. రఘు అమ్మగారు నా వంక చాలా సునిశితంగా చూసింది. ఎర్రపడిన కళ్ళు, నిద్రలేమిని సూచిస్తున్నాయి. దానితో మొహం కూడా బాగా వడలినట్లయింది. ముఖంమీంచి దృష్టి నా మెడ మీదకు మళ్లింది. పసుపుతాడు, నల్లపూసలు వాటితోపాటు మెరుస్తున్న మరో చైన్ కనిపించింది. ఆవిడ వెంటనే ఆ చైన్‌ని బయటికిలాగింది. అది రఘు గొలుసు. ఆవిడకు సంజాయిషీ ఇస్తున్నట్లుగా అన్నాను.
‘‘నిన్న ఇంటికి రాంగానే తీసి ఇద్దామనుకుని, మర్చిపోయాను’’ అంటూ మెడలోంచి తీయబోయాను.
‘‘వద్దు వద్దు’’ అంటూ ఆపింది హడావిడిగా. తియ్యకు. ‘‘నీ దగ్గరే ఉంచు’’ అని వెళ్లిపోయింది.
ఆ గొలుసును రఘు నిన్న మధ్యాహ్నం ఎయిర్‌పోర్ట్‌కి వెడుతూ నా మెడలో వేశాడు. ‘దీన్ని నాతో తీసుకువెడితే ఎక్కడో పారేస్తాను. నీ దగ్గర ఉంచు. ఎక్కడయినా పోతే అమ్మ బాధపడుతుంది’ అంటూ.
అమ్మ, నాన్న వచ్చారు. అందరూ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. రఘు ఫొటో తీసుకున్నట్లు అత్తగారితో చెబ్దామంటే ఆ అవకాశమే దొరకటంలేదు.
పెట్టె తీసుకువెళ్లి టాక్సీలో పెట్టిస్తానన్నారు నాన్న. నాకు ముందుగా ఇష్టం లేదు. అందుకని అప్పుడే వద్దు అన్నాను. అప్పటికే రెండుమూడుసార్లు ఆవిడతో చెబ్దామనుకుంటే, ఎవరో ఒకరు అడ్డువచ్చారు.
అమ్మ పెద్దవాళ్ళందరికీ పాదాభివందనం చెయ్యమంది. చేసి, తటపటాయిస్తూ నిలుచుండిపోయాను బయటకు రాకుండా. చివరకు రఘు నాన్నగారే అన్నారు ‘‘ఆ అమ్మాయి నీకేదో చెప్పాలనుకుంటున్నట్లుంది వెళ్లి చూడు’’ అని ఆవిడ చెవిలో.
‘‘పైన అతని గదిలో ఉన్న ఫోటో నాతో తీసుకువెళ్ళచ్చా?’’ అని అడిగాను నేల వంక చూస్తూ.
అదో ప్రశ్నా అన్నట్లు చూసింది. ‘‘తీసుకో, వాడి వస్తువులు ఏం కావాలంటే అవి తీసుకువెళ్లు, అడగక్కరలేదు’’ అంది.
‘‘ఇంకేమీ వద్దు. అది ఒక్కటి చాలు’’ అనేసి గది బయటకు వచ్చాను. అందరికీ వీడ్కోలు చెప్పి, నా మూడు రోజుల కాపురాన్ని ముగించుకుని తిరిగి వచ్చేశాను.
***
‘‘వెజ్ ఆర్ నాన్ వెజ్’’ అడిగింది పక్కన కార్ట్ తోసుకుంటూ వచ్చిన ఎయిర్‌హోస్టెస్.
ఉలిక్కిపడి ఊహల్లోంచి వాస్తవంలోకి ఊడిపడ్డాను. సమాధానం చెప్పి చుట్టూ పరికించి చూచాను. అందరూ చాలా బిజీగా ఉన్నారు. భోజనం సర్వ్ చేస్తూ.
ఆ భోజనం బాక్స్‌ని తెరవంగానే గుప్పున బయటకు వస్తున్న వాసనలు నా ఆకలిని చంపేశాయి. నిజానికి అసలు ఆకలి లేదు. ఎటూ కాని సమయం. కాని విమానం పరిగెత్తే వేగంలో టైములు మారిపోయి పరిసరాలకు అనుకూలంగా సర్వ్ చేస్తూ ఉంటారు.
నేను నా జీవితం అంతా ఆంధ్రప్రదేశ్‌లోనే గడపడంతో నాకు వేరే వేరే భోజనాలు పెద్దగా అలవాటులేదు. చదువు, ఉద్యోగం అన్ని దగ్గరలోనే అవడంతో నాకు బయట ప్రపంచంతో పరిచయం తక్కువ. ఎయిర్‌హోస్టెస్ నాకు కూడా భోజనం తెచ్చి ఇచ్చింది. తినాలని లేకపోయినా అన్నీ తెరచి చూశాను. చక్కగా నీట్‌గా ప్యాక్ చేసి ఉన్నాయి. ఏమీ తినాలనిపించలేదు. పళ్ళు ఒక్కటీ తిని మిగిలనవి వదిలేశాను.
పైన వేలాడుతున్న మానిటర్‌లో ఏదో హిందీ సినిమా వస్తోంది. హీరో హీరోయిన్లు చెట్టాపట్టాలేసుకుని హుషారుగా ఎగురుతున్నారు.
పోయిన పాతికేళ్లలో సినిమాలు ఎంత మారిపోయాయో, టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో అనుకుంటూ బటన్ నొక్కాను. సినిమా చూడాలనిపించడంలేదు. చేతిలో ఉన్న బటన్స్ నొక్కుతూ ఉంటే సడెన్‌గా క్లాసికల్ ఛానల్ వచ్చింది. ఒక్కసారి చేతులు ఆగిపోయాయి. స్పీకర్స్ సర్దుకున్నాను.
సుబ్బలక్ష్మిగారి కంఠం ఎన్నిసార్లు విన్నా తనివి తీరని గొంతు. ఆవిడను పుట్టించినపుడు బ్రహ్మదేవుడు ఆవిడ నోట్లో తేనె పోసి ఉంటాడు, వసకు బదులు అనుకుంటూ కళ్ళు మూసుకుని సీటులో జారగిలబడి పాటలు వింటూ ఉండిపోయాను.
ఎవరో భుజం తట్టినట్లు అనిపించి కళ్ళు తెరిచాను. ముందు సీట్లో కూర్చున్న పంజాబీ వనిత, బొత్తిగా ఇంగ్లీష్ వచ్చినట్లు లేదు. రెస్ట్ రూమ్స్ వంక చూపిస్తూ హిందీలో మాట్లాడింది. పాపను కొద్ది నిమిషాలు చూస్తావా అని. తల ఊగించి చేతులు చూపాను. నిద్రపోతున్న బిడ్డను నా చేతుల్లో ఉంచి, ముందుకు వెళ్లి క్యూలో నుంచుంది.
నిద్రపోతున్న పాప ముఖం వంక చూశాను. చాలా బొద్దుగా, తెల్లగా ఉంది. నల్లని జుట్టు నుదుటమీద పడుతోంది.

-ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి