డైలీ సీరియల్

ట్విన్ టవర్స్ 15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నప్పటి వౌళి గుర్తుకువచ్చాడు. నేను మామూలుగా ఎక్కువగా పిల్లల్ని దగ్గరకు తీయను, దూరంగా నుంచుని పలకరించడం తప్ప. నాకెందుకో ఎవరి పిల్లల్ని చేరదీయడంలో సరదా లేదు.
నిజం చెప్పాలంటే మొదటగా మా రాజకుమారుడు, తరువాత వౌళి అంతే! చిన్నప్పుడు వౌళిని కూడా ఎక్కువగా ముద్దు పెట్టుకునేదాన్ని కాదు. కానీ మా అన్నయ్యే వాడికి నేర్పించాడు. అందరికీ ముద్దుపెట్టడం. అందుకనే, ఎవరు వాడిని ఎత్తుకున్నా సరే ముద్దులు పెట్టేస్తూ ఉండేవాడు, వాడి చొంగ అందరికీ పూస్తూ!
అప్రయత్నంగా నవ్వు వచ్చింది వాడి చిన్నప్పటి చేష్టలు తలచుకునేటప్పటికి.
‘‘షుక్రియా బెహన్‌జీ’’ అంటూ తిరిగి వచ్చింది పంజాబీ వనిత.
నవ్వుతూ తల ఊగించాను. పాపాయిని ఆ అమ్మాయికి అందించాను. వ్యవహారం చూస్తే, మొదటిసారిగా వెడుతున్నట్లుంది విదేశాలకు ఒంటరిగా చిన్న పాపాయితో.
బలంగా శ్వాస వదిలి తల వెనక్కి వాల్చుకున్నాను. మళ్లీ సంగీతం వినడంలో మునిగిపోయాను. నేను కూడా నేర్చుకున్నాను. కాని, ఎక్కువగా, పాడను ఎవరి ముందు.
నా సంగీతం నాకే పరిమితం. నాకూ నా బాత్‌రూంకి. అంతే! పదిమందిలో పాడటం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఎవరికి ఇష్టం అనుకుని నేర్చుకున్నానో, ఆ వ్యక్తికి పాడి వినిపించనేలేదు.
***
విజయవాడకి తిరిగి వచ్చిన రోజు నాకేమిటో పోయిన స్వాతంత్య్రం తిరిగి వచ్చినట్లనిపించింది. కానీ, నా ఫ్రీడమ్‌లోనే నేను బందీ అయిపోతానని ఎప్పుడూ అనుకోలేదు.
ఇంటికి వచ్చి మూడు రోజులు అయినా నా పెట్టె తెరవలేదు. నా బట్టలు బయటికి తీయలేదు. తీరా పెట్టె తెరిచేటప్పటికి పైన రఘు ఫొటో ఉంది. దాన్ని బయటికి తీసి అందరి ముందు టేబుల్ మీద పెట్టాలంటే సిగ్గనిపించింది. అందుకని అసలు పెట్టెలోంచే తీయలేదు.
ఏదో నేను పరీక్షల హడావిడిలో పెట్టె తీయలేదనుకున్న వదిన అన్నీ తనే సర్దేసింది. రఘు ఫొటో టేబుల్‌మీద పెట్టింది. మాగజైన్ తీసి పైన పెట్టింది.
ఆ రాత్రి పడుకోబోతూ మాగజైన్ తెరవగానే అందులోనుంచి రెండు గులాబీలు జారిపడ్డాయి. పూలు వడలి ఫ్లాట్‌గా అయ్యాయి. కానీ, వాటి చక్కదనం మాత్రం పోలేదు. తిరిగి వాటిని జాగ్రత్తగా బరువైన పుస్తకం మధ్య పెట్టి పైన దాచాను.
రఘుతో మూడు రోజులు గడిపి వచ్చాక పుస్తకంలో తల దూర్చడం చాలా కష్టమనిపించింది. 72 గంటల సహచర్యం, కొన్ని వందల గంటలను వృధా చేయించింది. వంటరిగా కూచుంటే చాలు, అవే ఆలోచనలు చర్వితచరణంలాగా తిరిగేవి. అతను పక్కన నుంచున్నట్లే అనిపించేది. అతని దగ్గర నుంచి వచ్చే ప్రత్యేకమైన కలోన్ వాసనలు వస్తున్నట్లే అనిపించేది. మెడకు దగ్గరగా అతని శ్వాస తగులుతున్నట్లే అనిపించేది. నా చేతులు అతని చేతుల్లో ఉన్నట్లే అనిపించేది. నా అరచేతులు వంక ఎన్నిసార్లు చూసుకున్నానో లెక్కలేదు.
నేను రెగ్యులర్‌గా చదువుకునే అలవాటు లేకుండా, పరీక్షల ముందు ప్రిపేర్ అయ్యేరకం అయి వుంటే ఆ పరీక్షల్లో తప్పకుండా తప్పేదానే్న. చివరి పరీక్ష రాసి ఇంటికి వచ్చిన రోజు మాత్రం చాలా రిలీఫ్‌గా అనిపించింది.
పది రోజుల తరువాత ఇంటికి వచ్చేసరికి టేబుల్‌మీద బ్లూ రంగు కవరు పెట్టి ఉంది. అది ఎగరకుండా రఘు ఫొటో ప్రేమ్ దానిమీద పెట్టి ఉంది. గబగబా ఆ ఉత్తరం చదివాను. ఆ మొట్టమొదటి ప్రేమలేఖ. రఘు రాసిన తొలి లేఖ.
ఆ ఉత్తరం ఎన్నిసార్లు చదివానో నాకే తెలియదు. ప్రతి అక్షరం కళ్ళముందు నిలిచిపోయింది. ప్రతి వాక్యం కంఠస్థం అయిపోయింది. సైన్స్‌తో నిండిన మెదడులో కళాత్మకమయిన కోణం కూడా ఉందా అని అనిపించింది. ఆ ఆలోచనే పెదవులపై చిరునవ్వు తెచ్చింది.
గదిలోకి అడుగుపెడుతున్న వదిన నా నవ్వు ముఖం చూచి, ‘‘ఏమిటోయ్? అంత మురిసిపోతున్నావు? మాకు చెప్తే మేము సంతోషిస్తాము కదా!’’ అంది.
‘‘ఏం లేదు వదినా’’ అన్నాను కొంచెం సిగ్గుపడుతూ!
ఏమనుకుందో ఏమిటో హఠాత్తుగా ఏడిపించే వదిన లెవెల్‌లోంచి పెద్దరికం తెచ్చుకుని, ‘‘కులాసాగా చేరాడా! అంతా బాగానే ఉంది కదా!’’ అని అడిగింది.
తల ఊగించాను. ఎందుకో ఆ ఉత్తరం ఎవరితోనన్నా పంచుకోవాలనిపించింది. నాకు వదిన కంటే మరొకరు లేరు. దూరంగా వెల్లిపోయిన మా అక్కల కంటే ఈవిడే నాకు క్లోజ్. అందుకే అన్నాను, ‘‘అంతా బాగానే ఉంది’’ నువ్వే చదువు అంటూ ఉత్తరం వదినకిచ్చాను.
నేనా! తెల్లబోయింది వదిన.
‘‘మీ ఆయన ప్రేమలేఖ నేను చదవడం ఏమిటి?’’ అని తనే సిగ్గుపడిపోయింది.
‘‘్ఫరవాలేదులే చదువు’’ అన్నాను. ఆ ఉత్తరంలో ఎయిర్‌పోర్టులో నా అరచేతులు ముద్దుపెట్టుకుని విమానంలోకి నడిచిన దగ్గరనుండి న్యూయార్క్‌లో విమానం దిగేవరకు తనలో కలిగిన భావాల్ని రాశాడు.
మూడు రాత్రులు గడిపిన మా ఇద్దరిమధ్య దూరం ఎంత తగ్గిపోయిందో, ఆ తగ్గిన దూరాన్ని ఈ ప్రయాణం ఎంత ఎక్కువ చేస్తోందో రాశాడు.
విమానంలో కలిసి వెడుతున్న ఏ దంపతులను చూసినా ఎంత ఈర్ష్యగా అనిపిస్తోందో. అసలు నాలో ఒకర్ని చూచి ఈర్ష్యపొందే గుణం ఉందని కూడా ఇప్పటివరకు తెలియదు అని రాశాడు.
విమానం కంటే స్పీడుగా నా మనసు నీ చుట్టూ పరిభ్రమిస్తోంది. ఇలాటి మనస్తితితో కొత్త దేశంలో కొత్త మనుషులు పరిసరాల మధ్య సెటిల్ అవడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో అంటూ చాలా చాలా రాశాడు.
ఆ ఉత్తరంలో ఒక భావుకత ఉంది.
ఒక వంటరితనం ఉంది.
నిస్సహాయత ఉంది.
నిజాయితీ ఉంది.
ఎక్కడ ఒక్క అసభ్యపు పదం లేకపోయినా, నా సమక్షం ఎంత కావాలనుకున్నాడో తెలుపుతోంది.

-ఇంకాఉంది