డైలీ సీరియల్

యమహాపురి 28

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడాది క్రితం యోగి లతికను చూశాడు. తొలి చూపులోనే మనసు పారేసుకున్నాడు. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆమె కూడా అతడంటే ఇష్టపడింది.
నెల్లాళ్ల క్రితం యోగి ఆమెని పెళ్లి చేసుకుంటానన్నాడు. లతిక ఒప్పుకోలేదు.
‘‘లతికకి కులం, మతం వగైరా పట్టింపులు లేవు. ఆమె అభీష్టానికి పెద్దలు అడ్డురారు. కానీ ఊరు ఒప్పుకోదుట. ఊరొప్పుకోవడమేమిటని నిలదీస్తే- గజగజ వణికిపోయింది తప్ప బదులివ్వలేదు. ఇంకా నొక్కిస్తే కళ్లనీళ్లు పెట్టుకుంది’’ అన్నాడు యోగి.
శ్రీకర్ కళ్లలో రవంత ఆసక్తి. ‘‘చిత్రంగా ఉందే- ఏ ఊరామెది?’’ అన్నాడు. గొంలోనూ రవంత కుతూహలం.
‘‘నరకపురి- అనే గ్రామం పేరు విన్నారా సార్!’’ అన్నాడు యోగి.
‘‘నరకపురి?’’ అన్నాడు శ్రీకర్ ఉలిక్కిపడి. కానీ విన్నాడో లేదో చెప్పలేదు.
యోగి శ్రీకర్‌ని చూడ్డం లేదు. అతడి దృష్టి టీపాయిమీదున్న టైమర్‌మీదనే ఉంది. ‘‘మీరు నాకిచ్చిన టైంలో మూడు నిముషాలు ఐపోయాయి సార్! ఇక్కడితో లతిక టాపిక్‌కి ఫుల్‌స్టాప్ పెట్టి- రెండో టాపిక్‌గా- నరకపురి గురించి నాకేం తెలుసో వీలైనంత తొందరగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను’’ అన్నాడు.
లతికది నరకపురి. అది చైనాకే ఆదర్శప్రాయమైన సామ్యవాద గ్రామం.
అక్కడ కుటుంబాలుంటాయి కానీ ఆస్తులుండవు. ఉద్యోగాలుంటాయి కానీ జీతాలుండవు. ఎవరి జీవితంమీద ఎవరికీ అధికారం ఉండదు. ఊరుమ్మడి సంపద, నిర్ణయాలు ఆ ఊరిని నడిపిస్తాయి.
ముందా ఊరి వాళ్ళు లతికకి పెళ్లి చెయ్యాలనుకుని, టెన్తు తర్వాత చదువు మానిపించారు. ఏడాది క్రితం ఎందుకో ఆ నిర్ణయం మారింది. ఆమె చదువుకుందుకు ఈ ఊరొచ్చింది.
‘‘లతికకి చదువుమీద ఆసక్తి లేదా?’’ అన్నాడు శ్రీకర్.
‘‘ఆమెకి ఇంజనీరు కావాలని అభిలాష. కానీ ఊరివాళ్ళొప్పుకోరు’’ అన్నాడు యోగి.
‘‘ఇప్పుడామె ఇక్కడే వుంది కదా! ఊరొదిలి మీలాంటివాడి ఆశ్రయం పొంది- తన అభీష్టం తీర్చుకోవచ్చుగా’’’
‘‘ఆ సలహా నేనూ ఇచ్చాను సార్! కానీ ఈ విషయంలో మనకి తెలియని ఇబ్బంది ఏదో ఉంది. ఆమె ఎందుకో, దేనికో బాగా భయపడుతోంది’’ అన్నాడు యోగి.
‘‘ఒకసారి ఆ ఊరెళ్లి రాలేకపోయారా?’’ అన్నాడు శ్రీకర్.
‘‘వీసా లేకుండా అమెరికా వెళ్లి రావచ్చేమోకానీ- అపరిచితులకి ఆ ఊళ్ళో అడుగెట్టడం అసాధ్యం సార్!’’
శ్రీకర్ కళ్లలో పెరిగిన ఆసక్తి. ‘అదెలా?’’ అన్నాడు. కళ్లలోని ఆసక్తి గొంతులోనూ ధ్వనించింది.
యోగి టీపాయ్‌మీది సెల్‌ఫోన్లో టైమర్‌నే చూస్తున్నాడు. పది నిముషాలు పూర్తి కావడానికింక మూడు నిముషాల నలభై సెకన్లుంది. ‘‘ఇంకెంతో టైం లేదు సార్! నరకపురి విషయలు ఇక్కడితో ఆపి- మూడో టాపిక్‌కి వస్తాను. మీకు జగదానందస్వామి గురించి తెలుసా సార్!’’ అన్నాడు.
‘‘పేరు విన్నట్లే వుంది. కానీ వివరాలు గుర్తురావడం లేదు’’ అన్నాడు శ్రీకర్ సాలోచనగా.
యోగి గొంతు సవరించుకున్నాడు.
జగదానందస్వామి ఆశ్రమం జనాలకి దూరంగా, భద్రాచలానికి దగ్గిర్లో ఓ అడవి ప్రాంతంలో ఉంది. చాలామంది ఆయన్ని అవతారపురుషుడంటారు. ఇంకా చాలామంది దేవుడని నమ్ముతారు.
తన గురించి ఎలాంటి ప్రచారమున్నా- ఆయన మాత్రం తాను మామూలు మనిషినని ఖచ్చితంగా చెబుతాడు. ఎవరినీ కాళ్లకు మ్రొక్కనివ్వడు. ఆర్భాటాలకి ఒప్పుకోడు. కానుకలిస్తే తీసుకోడు.
ఆయన అప్పుడప్పుడు జనం మధ్యకు వెళతాడు. ఏర్పాటుచేసిన సభల్లో మంచిని ప్రబోధిస్తూ ప్రసంగిస్తాడు. ఆయన భాష సరళంగా, పామరులకి కూడా అర్థమయ్యేలా ఉంటుంది. ఆయన గొంతు విద్యాధికుల్నీ, హేతువాదుల్నీ కూడా మంత్రముగ్ధుల్ని చేస్తుంది.
జగదానందస్వామికి ఓ రివాజుంది. ఎక్కడ సభ చేసినా- తన ప్రసంగం పూర్తికాగానే, సభికుల్లో కొందరిని వేదికమీదకి ఆహ్వానిస్తాడు. వారికి కర్తవ్యబోధ చేస్తాడు. కర్తవ్య నిర్వహణకుగానూ దీవిస్తాడు. ఆ దీవెనలు తనవి కావనీ, దేవుడి ఆదేశంమీద అందజేసాననీ అంటాడు. ఆ దీవెనలు అమోఘమని అంతా అంటారు.
ఆయన ప్రసంగం వినాలని కొందరు, ఆయనమీద భక్త్భివంతో కొందరు ఆయన నుంచి దీవెనల కోసం కొందరు, ఆయనపై కుతూహలంతో కొందరు.
అలా వచ్చినవారితో ఆయన సభలు క్రిక్కిరిసి ఉంటాయి.
‘‘రెండు వారాల క్రితం ఆయన మనూళ్లో ఒక సభ నిర్వహించాడు. వేదికపైకి పిల్చిన ఆరుగురిలో- ఒక యువ జంట, నేను, మరి ముగ్గురు ఉన్నాం. ఒక్కొక్కరినే దగ్గిరగా పిలిచి నెమ్మదిగా ఏదో చెప్పాడు. ఒకరికి చెప్పింది ఇంకొకరికి తెలియదు. ఆయన నాతో, ‘నీకో సమస్య ఉంది. దాన్ని పరిష్కరిస్తే సమాజానికి మేలు జరుగుతుంది. ఆ విషయమై కృషి చెయ్యడానికి నీకు నేడు దేవుడి దీవెన లభించింది. నీ కృషిలో నాలుగు నెల్లక్రితం ఈ ఊరొచ్చిన ఓ పోలీసు అధికారి నీకు సాయపడతాడు. నువ్వెళ్లి ఆయన్ను కలుసుకో’ అన్నాడు. ఆ మాటలు వినగానే నాలో కొత్త ఉత్సాహం కలిగింది. కొత్త శక్తి వచ్చింది. ఆయన చెప్పిన పోలీసు అధికారి గురించి వాకబు చేశాను. మీ గురించి తెలిసింది’’ ఆగాడు యోగి.
‘‘నాకాట్టే తెలియని ఓ స్వామి- నా నుంచి మీకు సాయం లభిస్తుందని చెప్పాడా? అది ఐజీ నుంచి ఆర్డరులా భావించి నేను మీకు సాయపడాలా? నా చెవుల్లో మీకు క్యాబేజీ పూలు కనిపిస్తున్నాయా?’’ అన్నాడు శ్రీకర్.
యోగి టీపాయ్‌మీదున్న మొబైల్ తీసుకుని, ‘‘పది నిముషాలకి పది సెకన్ల ముందే నేను చెప్పాల్సింది చెప్పేయగలిగాను. మీ సంస్కారాన్ని దురుపయోగం చేయకుండా నా మర్యాద కాపాడుకున్నాను. అయాం హాపీ సార్’’ అంటూండగా మొబైల్ నుంచి పెద్దగా కూత వినిపించింది.
అప్పుడు లోపల్నుంచి ‘‘పిల్లల హోంవర్క్ ఇంకా అవలేదు. మీరొచ్చి కథలు చెప్పొద్దు’’ అన్న వసంత గొంతు వినిపించింది. అది మొబైల్ కూతలా కాక కోయిల స్వరంలా వుంది.
శ్రీకర్ నిట్టూర్చి ‘‘నేనడిగిందానికి మీరు బదులివ్వలేదు’’ అన్నాడు.

ఇంకా ఉంది

వసుంధర