డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-38

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేదమ్మా! వౌళికోసం బెంగ పడటంలేదు కాని చూసి మూడు నెలలు అయింది కదా అన్నాను.
మొదట్లో అలాగే అనిపిస్తుంది కల్యాణి! రాను రాను అలవాటయిపోతుంది. ఒక తల్లికి, ‘‘పిల్లలు సుఖంగా బతుకుతున్నారు అన్న వార్త చాలు’’- సంతృప్తికరంగా బతికేయడానికి. ప్రతిరోజూ మన కళ్ళముందు ఉండాలి అని ఉండదు. ఇది కాలధర్మం కదా. పిల్లలు రెక్కలొచ్చి వాళ్ల జీవితాల్లో ఎగరడానికి. ఒకవేళ వాళ్ళు మళ్లీ సరిగ్గా ఎగరలేకపోతే అది ఎక్కువ దుఃఖం కలిగిస్తుంది’’ అంది.
అమ్మ వంక చూశాను. ఆరుగురిని కన్నా దగ్గరలో ఉన్నది అన్నయ్య ఒక్కడే! దురదృష్టవశాత్తు నేనూనూ!
మూడో అన్నయ్య అయితే ఆస్ట్రేలియాలో ఉంటాడు, మూడు నాలుగేళ్ళకు ఒకసారి వస్తాడు. కాని అమ్మ వాడిని మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ మిస్ అయినట్లు కనిపించేది కాదు. కానీ వాళ్ళు కనిపించినపుడు మాత్రం వాళ్ళని చిన్నపిల్లల్లాగే చూసేది ఎవరికి ఏది ఇష్టమో అది వండిపెడుతూ-
మా వదినలంతా మా అన్నయ్యలని చాలా వేళాకోళం చేసేవారు. ఇంక ఇంటికివచ్చారుగా పాపాయిలు అయిపోతారు, అమ్మదగ్గర గారాలు గునుస్తూ, ఇష్టమయినవి అన్నీ తింటూ అని.
వౌళితో నాకు ఎడబాటు అలవాటు అవుతోంది అని అనుకుంటున్న సమయంలో నాకు విజయవాడకు 40 కిలోమీటర్లు దూరంలో కాలేజీకి ప్రిన్సిపల్ పోస్టుకు ప్రమోషన్ వచ్చింది. అన్నయ్యకు మాత్రం నేను వెళ్ళడం ఏ మాత్రం ఇష్టంలేదు. ఎందుకు అనవసరమైన బాధ్యత? ఇక్కడ హాయిగా ఉన్నావు. అక్కడ ఒంటరిగా ఉండాలి. కొత్త కాలేజీ అంటే బోలెడు చాకిరి అని డిస్‌కరేజ్ చేయాలని చూశాడు. కాని ఈసారి వదిన పట్టుబడింది. అన్నయ్యని ఒప్పించింది. లెక్చరర్ వేరు, ప్రిన్సిపాల్ వేరు. ఆ హోదాయే వేరు. ఎంత దూరం. అడ్డు చెప్పద్దంటూ. ఇదంతా కల్యాణి స్వయంకృషి.
ఇప్పుడు వౌళి కూడా దగ్గర లేడు. వెళ్లనివ్వండి. మంచి ఛాలెంజింగ్ వర్క్. తన సామర్థ్యత వెల్లడించుకోవలసిన సమయం. కల్యాణి బిజీగా ఉంటే వౌళి దగ్గరలో లేడని కూడా ఆలోచిస్తూ ఉండిపోదు అని.
అలా పుట్టి పెరిగాక మొట్టమొదటిసారిగా వియవాడ వదలి వేరే ఊరు వెళ్లాను.
అక్కడ పరిస్థితి అక్షరాలా అన్నయ్య చెప్పినట్లే ఉంది. ఆ కాలేజీకి 4 గోడలు, 5 లక్షలు బ్యాంకులో ఉన్నాయి అంతే. ఏ ఇతర సదుపాయాలూ లేవు. అటువంటి దాని రూపురేఖలు రావడానికి చాలా కృషి చేశాను. కాని ఆ పరిశ్రమలో నాకొక పెద్ద విషయం నన్ను గురించి నేను తెలుసుకున్నాను. నేను అంత అసమర్థురాలిని కాదు. అవసరం మీద పడితే నేనూ చాలా బాధ్యతలే నిర్వహించగలనని.
నేను కాలేజీ పునరుద్ధరణలో చాలా బిజీ అయిపోయాను. ఆ హడావిడిలో నాలుగు సంవత్సరాలు ఎప్పుడు గడిచిపోయాయో తెలియదు. వౌళి మద్రాస్ ఐఐటి నుంచి మంచి మార్కులతో పాస్ అయ్యాడు. అదేం దురదృష్టమో కాని, మన దేశంలో తెలివితేటలున్న ప్రతి ఒక్క విద్యార్థి అమెరికా వెళ్ళి ఏదో ఉద్ధరించాలనే! మొదట్లో పెద్దగా బాదర్ చేయలేదు సీటు వచ్చినపుడు చూద్దాంలే అని.
ఈమధ్యకాలంలో ఐఐటిలకి చాలా గొప్పగా గౌరవం పెరిగింది. అక్కడనుంచి వచ్చే విద్యార్థులకు కూడా చాలా అవకాశాలు ఎదురవడం మొదలుపెట్టాయి.
వౌళి మరీ కష్టపడకుండానే నాలుగయిదు అమెరికన్ యూనివర్సిటీలలో సీట్స్ దొరికాయి.
ఆ వార్త వినగానే బలంగా నిట్టూర్చాను.
ఒక్క క్షణం ఆనందించాను.
ఇంకో క్షణం దిగులుపడ్డాను
మరింకో క్షణం బాధపడ్డాను.
బాధపడింది - వౌళికి సీటు వచ్చినందుకు కాదు. నేనింత స్థిరత్వం లేనిదాన్నయిపోయానే అని.
వౌళి యుఎస్‌ఎ వెళ్ళే ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి. వీసా కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ ప్రయత్నాలలో ఇంటి పట్టునే ఉంటున్నాడు.
వదినతో అతి చులాగ్గా- వాడెక్కడికి వెళ్లి చదువుకున్నా నాకు అభ్యంతరం లేదని అయితే చెప్పాను కానీ, తీరా వాడు వెడదామనుకునేటప్పటికి అది రూపుదాల్చేటప్పటికి నాకు లోలోపల చాలా కంగారుగా అనిపించసాగింది. వాడింటినుంచి వెళ్లి చదువుకోవడం, పోయిన నాలుగేళ్లుగా అలవాటయిపోయింది. కాని, ఇది మరో దేశం. భారతదేశపు అవధులు దాటంగానే మన చేతులు కట్టడయిపోతాయి. మళ్లీ చూడాలన్నా, వాళ్ల దగ్గరకు వెళ్లాలన్నా, మరొకరి దయాదాక్షిణ్యాలమీద ఆధారపడాల్సి వుంటుంది.
వీడు అమెరికా వెళ్లిపోతే మళ్లీ వాడిని జీవితంలో చూడగలనా? వీడు కూడా దూరమయిపోతే? చాలా దిగులు అనిపించసాగింది. నేనింత పిరికిదాన్ని అని ఎప్పుడూ అనుకోలేదు. నా గతం, నా కొడుకు భవిష్యత్తును శంకించేలా చేస్తుందని అనుకోలేదు. నేను గట్టిగా వద్దంటే ఆగిపోతాడేమో. ఈ దేశంలో ఎంఎస్ చేస్తాడేమో! కానీ, నాకు అలా ఆపాలని లేదు. వాడి కోరికలకు అడ్డుగా నిలవాలని లేదు. వాడి భవిష్యత్తుకు నేను పునాది కావాలి. కానీ, అవరోధం కాకూడదు.
తల్లిదండ్రులు ఎప్పుడూ పట్టుగోడలే! వాళ్ళే పిల్లలకు జీవితం అవరు. వాళ్ళతో జీవితం మొదలయినా వాళ్ళ పరిధిలోంచి బయటపడిపోతారు. అలా పడకపోతే అదీ ధర్మ విరుద్ధమయిపోతుంది.
నాకిది చిన్నప్పటినుంచి ఉన్న బలహీనత. ఆలోచన ఎక్కడ ఒక చిన్న సంఘటన మీద మొదలవుతుంది. ఇక అదుపు ఆజ్ఞ లేకుండా ఆకులు తొడిగి, కొమ్మలు పెరిగి మహావృక్షమవుతుంది. ఆ వృక్షఛాయలో నేను నలిగిపోతాను.
ఇప్పుడు పరిస్థితి అదే! వౌళి అమెరికాలో చదువునుండి వాడి భవిష్యత్తు అంతా ఊహించేస్తున్నాను. అందులో నా స్థానం ఎలా మరుగు పడిపోతుందో ఆలోచిస్తున్నాను. చాలా స్వార్థపరురాలయిపోతున్నాను, అనుకున్నాను.
మంచంమీద ఇక పడుకోవాలనిపించలేదు. పోయిన రెండు గంటలనుండి దొర్లుతూనే ఉన్నాను. లేచి గ్లాసులోంచి మంచినీళ్ళు వంచుకున్నాను. మెల్లిగా బయటికి వచ్చి కాళ్ళకు చెప్పులు వేసుకుని మెల్లిగా మెట్లెక్కి పైడాబాలోకి వెళ్లాను.
పున్నమి ముందు రోజుల మూలంగా వెలుతురు బాగా ఉంది. ఊరంతానిద్రపోతోంది. ఆ పరిసరాలు ఆ మాత్రం ప్రశాంతంగా ఉండాలంటే అది అర్థరాత్రి అవ్వాలి. రోడ్లమీద వాహనాలు వెళ్ళడంలేదు. కూరగాయల వాళ్ళు అరవడంలేదు. మనుషులు పరుగులలాంటి నడకలతో తొందరపడడంలేదు. చాలా నిశ్శబ్దంగా ఉంది.
విజయవాడ చుట్టూ కొండల మూలంగా ఎప్పుడూ చల్లగా ఉండదు. పగలంతా ఆవహించిన సూర్య కిరణాల ప్రభావం, రాత్రి చల్లదనం ఆవరించగానే ఆ కొండలమీద పడి, వేడి బయటకు వస్తుందా అనిపిస్తుంది. మంచినీళ్ళు తాగుతూ పిట్టగోడ మీద కూచున్నాను దూరంగా మినుకు మినుకుమనే ఎర్ర లైట్లు చూస్తూ-
వెనక నుంచి అడుగుల శబ్దం వినిపించింది. ఒక్క క్షణం భయంతో ఒళ్ళు గగుర్పొడిచింది, ఇంత రాత్రప్పుడు ఎవరా అని. వెనక్కి తిరిగి చూసేలోపల బలంగా రెండు చేతులు భుజాలమీద పడ్డాయి. పరిచిత స్పర్శ తగలంగానే వెనుతిరిగి చూడాలనిపించలేదు కూడా!
తిరిగి చూస్తే నా మొహంలో చిట్టాడే భావాలు వౌళి క్షణంలో పసిగట్టగలడు.

-ఇంకా ఉంది

రమాదేవి చెరుకూరి