డైలీ సీరియల్

యమహాపురి 31

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకర్ తల పంకించి, ‘‘అంతా చిత్రంగా ఉందే!’’ అన్నాడు. తర్వాత నెమ్మదిగా, ‘‘ఇంతకీ మీకు పని కావాలని అడిగి నాకు పని అప్పగించారేమిటి?’’ అన్నాడు.
‘‘మీరు నాకు వాళ్ల వివరాలిస్తే- వాళ్ళను కలుసుకుని మాట్లాడి ముందేం చెయ్యాలో నిర్ణయించడం నా పని’’ అని ఓ క్షణం ఆగి, ‘‘నాకు నరకపురి వెళ్లాలనుంది. నేనక్కడికి వెళ్లే ఏర్పాట్లు చేస్తే- మిగతా వ్యవహారమంతా నేను చూసుకుంటాను. నాకు నేనుగా మాత్రం కాదు. ఇన్స్‌పెక్టర్ భయంకర్ మనిషిగా! ఇందులో కష్టనష్టాలన్నీ నావి. అవసరమనుకుంటే అందుకు వ్రాతమూలకంగా హామీ ఇస్తాను’’ అన్నాడు యోగి.
శ్రీకర్ ఆలోచనలో పడ్డాడు. కాసేపాగి, ‘‘మీరడిగే సాయం నానుంచి కాదు. డిపార్టుమెంటునుంచి. మీరడిగే సాయం సమాజం కోసం కాదు, వ్యక్తిగతం. మీ విషయంలో నేనెలా స్పందించాలో తెలియడంలేదు’’ అన్నాడు.
‘‘మీరేమీ అనుకోనంటే నేనొకటి అంటాను సార్!’’ అన్నాడు యోగి.
‘‘ఇంతవరకూ అన్నవన్నీ- నేనేదో ఒకటి అనుకునేవే. అవన్నీ విన్నాను. నిండా మునిగేక చలేమిటి? అనేదేదో అనండి’’ అన్నాడు శ్రీకర్.
‘‘సార్! మీ ఇంట్లో ఏదైనా వస్తువు కనపడలేదనుకోండి. అది వెతకడానికి మీరు పోలీసు బుర్ర ఉపయోగించారనుకోండి. అప్పుడది డిపార్టుమెంట్ పని ఔతుందా?’’ అన్నాడు యోగి.
శ్రీకర్‌కి కాసేపటి క్రితం ఇంట్లో జరిగిన విశేషం గుర్తుకొచ్చింది. ‘‘అది నా స్వవిషయం’’ అన్నాడు వెంటనే.
‘‘నేను మీ తమ్ముణ్ణనుకోండి. లేదా మిత్రుణ్ణనుకోండి. అప్పుడు నాకు సాయపడితే అది స్వవిషయమే ఔతుంది కదా!’’ అన్నాడు యోగి.
‘‘మొత్తంమీద అపరిచితులుగా వచ్చి తమ్ముడై కూర్చున్నారు. కానీ తమ్ముణ్ణెవరైనా- మీరు మీరని మన్నిస్తారా’’మీరే చెప్పండి’’ నవ్వాడు శ్రీకర్.
‘‘ఇందాకట్నుంచి ఈమాటే చెబుదామనుకుంటున్నాను. మీరు నన్ను మీరనడం ఏదోలా అనిపిస్తోంది. ప్లీజ్ నువ్వనండి. అదే నాకు బాగుంటుంది’’ అన్నాడు యోగి.
‘‘ఓకే, మరి అన్నని ఎవరైనా మీరంటారా?’’ అన్నాడు శ్రీకర్.
‘‘మీరు పోలీసాఫీసరు. మీ హోదాని చూసి మీ సాయమడిగాను. మీరు నాకు అనే్న అయినా మీ హోదాని నేను గౌరవించాలి. నాకు ఏ హోదా లేదు. మానవత్వంతో తమ్ముడన్న అనుబంధాన్ని కల్పించుకుని మీరు నాకు సాయపడుతున్నారు. మీరు నన్ను నువ్వనడమే కరెక్ట్! ప్లీజ్ యాక్సెప్ట్ మై లాజిక్’’ అన్నాడు యోగి.
‘‘ఓకే, సమాజంలో ఓ మనిషిని- తమ్ముడిలా ఫీలై సాయం చెయ్యాలనుకుంటున్నాను. అందువల్ల సమాజానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అని ఆలోచించను’’ అన్నాడు శ్రీకర్.
‘‘మర్చిపోకండి సార్! నాకు జగదానందస్వామి దీవెన లభించింది. అది ఫలిస్తే సమాజానికి మేలు జరగడం తథ్యం. అది ఫలించడానికి చేసే కృషి సమాజ సేవ అనిపించుకుంటుందని నా నమ్మకం’’ అన్నాడు యోగి.
‘‘ఓకే’’ అని నవ్వి, ‘‘నీ లాజిక్ స్పెషల్‌గా వుంది. మా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కి కౌన్సిలర్‌గా ఉపయోగపడతావనిపిస్తోంది’’ అన్నాడు శ్రీకర్.
‘‘నాదేం లేదు సార్, అంతా జగదానందస్వామి దీవెన మహిమ. మళ్లీ మిమ్మల్నెప్పుడు కాంటాక్ట్ చెయ్యాలో చెప్పండి సార్!’’ అన్నాడు యోగి.
‘‘నాది ట్వంటీఫోర్ అవర్స్ డ్యూటీ! నేనింట్లో వున్నా- ఆఫీసు గురించే ఆలోచిస్తుంటాను. ఈ క్షణం నుంచే నీ పనిమీదుంటాను. ఇంకో గంటలో నేనే నిన్ను కాంటాక్ట్ చేసినా ఆశ్చర్యం లేదు. నా నంబరు చెబుతాను, ఫీడ్ చేసుకో. ఓ మిస్డ్ కాలియ్యి- సేవ్ చేసుకుంటాను’’ అంటూ నంబరు చెప్పాడు శ్రీకర్.
యోగి నంబరు ఫీడ్ చేసుకుని శ్రీకర్‌కి మిస్డ్‌కాలిచ్చి, ‘‘మీరొద్దు సార్! ఈ రాత్రి నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను’’ అన్నాడు.
శ్రీకర్ జవాబిచ్చేలోగా లోపల్నుంచి ‘‘హంవర్కయింది. పిల్లలు ఆటలకి బయల్దేరుతున్నారు’’ అంది వసంత.
శ్రీకర్ చటుక్కున, ‘‘ఈ రాత్రికొద్దులే- రేపు ఏదో సమయంలో నేనే నిన్ను కాంటాక్ట్ చేస్తాను’’ అన్నాడు.

5
అది రేవతి అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో మూడో అంతస్తులో 307వ నంబరు అపార్ట్‌మెంట్.
వీధి గుమ్మానికి ఆనుకుని ఉన్న గోడకి ఓ స్విచ్‌బోర్డు, దానికిందనే ఓ నేమ్ ప్లేట్ ఉన్నాయి.
నేమ్ ప్లేట్‌మీద వై.సుందరం అన్న పేరుంది. స్విచ్‌బోర్డులో కాలింగ్ బెల్ స్విచ్ ఉంది.
కింద నుంచి పైకి రావడానికి లిఫ్ట్ ఉన్నా- ఉపయోగించుకోక, హడావుడిగా మెట్లెక్కి వచ్చిన ఓ ఎనిమిదేళ్ల కుర్రాడు- ఆ కాలింగ్‌బెల్ నొక్కాడు.
కొద్ది క్షణాల్లో తలుపు తెరుచుకుంది. సుమారు పాతికేళ్ల యువతి తలుపు తీసింది.
జుట్టు చెదిరి ఉంది. ముఖంమీద చిరు చెమటలు. ఏదో పని మధ్యలో ఉన్నట్లు చీర బొడ్లోకి దోపింది. తడి చేతులు కాబోలు మాటిమాటికీ పైట కొంగుతో తుడుచుకుంటోంది.
కుర్రాడు ఆమెను చూస్తూనే, ‘‘నమస్తే, రేవతి ఆంటీ!’’ అన్నాడు.
ఆమె మాటవరసకి, ‘‘నమస్తే!’’ అని బదులిచ్చి, ‘‘ఏంటి కేశవ్, పొద్దునే్న మాంచి హడావుడి టైంలో వచ్చావ్!’’ అంది.
అవతలున్నది చిన్న కుర్రాడే ఐనా తన విసుగుని బయట పడనివ్వని సంస్కారం ఆమెది.
‘‘సుందరం అంకుల్‌కి డాడీ అర్జంటుగా ఈ లెటరిమ్మన్నారు’’ అన్నాడు కేశవ్.
రేవతి అతడిచ్చిన కవరు తీసుకుని, ‘‘ఏమిటంత అర్జంటు?’’ అంది.
‘‘ఏమో ఆంటీ! చదివి డాడీకి ఫోన్ చెయ్యమనండి. నాకు స్కూలుకి టైమైపోతోంది’’ అని వెనక్కి తిరిగాడు కేశవ్.
రేవతి అతణ్ణి ఆపలేదు. ‘‘అంత అర్జంటైతే ఫోన్ చెయ్యొచ్చుగా, లేకపోతే తనే రావచ్చుగా. చిన్న కుర్రాడి చేత ఇలా లెటరు పంపడమేమిటీ?’’ అనుకుంటూ ఓ క్షణం ఆలోచనలో పడింది.
లోపల్నుంచి ‘‘ఎవరొచ్చారు రే?’’ అంటూ అరిచాడు ఆమె భర్త సుందరం.

ఇంకా ఉంది

వసుంధర