డైలీ సీరియల్

యమహాపురి 32

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేవతి చప్పున వీధి తలుపు మూసింది. డ్రాయింగ్ రూం దాటి బెడ్రూంలోకి వెళ్లింది. ఇంకా మూసే ఉన్న అటాచ్డ్ బాత్రూం వైపే చూస్తూ- ‘‘వచ్చిన వాళ్లు వెళ్లారుకానీ, స్నానమైందా?’’ అంది.
‘‘ఇలా స్నానమైంది. అలా బెల్లు మ్రోగింది. వచ్చిందెవరో తెలియక- మళ్లీ బాత్రూంలో దూరాను’’ అంటూ బయటకొచ్చాడు సుందరం నడుం తువ్వాలుతో కప్పుకుని.
ఐదడుగుల ఎనిమిదంగుళాల నిండైన విగ్రహం. వ్యాయామంతో తీర్చిదిద్దినట్లున్న శరీరం. అప్పుడే స్నానం చేసి వచ్చాడేమో- పచ్చని మేనిపై నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. నీటి చుక్కలు లేకపోయినా- కాలి పిక్కలు కూడా బంగారంలా మెరుస్తున్నాయి.
‘‘ఒక స్టవ్‌మీద పాలు కాస్తున్నా, ఒక స్టవ్‌మీద చట్నీకి వేయిస్తున్నా, మధ్యలో పనిమనిషి తోమిన గినె్నలు మంచినీళ్లతో తొలుస్తున్నా, ఆ సందట్లో వచ్చాడు కేశవ్’’ అంది రేవతి.
‘‘కేశవ్ ఎవరు?’’ అన్నాడు సందరం సాలోచనగా.
‘‘నరసింహంగారబ్బాయండీ- కేశవ్ గుర్తులేడూ?’’
‘‘ఆ.. వాడా- పేరు గుర్తులేదులే- ఎందుకొచ్చాట్ట?’’
‘‘నరసింహంగారు అర్జంటుగా మీకిమ్మని వాడి చేత ఈ కవరు పంపించారు’’ అంటూ కవరు అతడికందించి అక్కణ్ణించి వెళ్లిపోయింది రేవతి.
సుందరం ఆ కవరందుకుని పక్కన పెట్టాడు. తువ్వాలు తీసి యూనిఫాంలోకి మారాడు. తల దువ్వుకున్నాడు.
అప్పుడు కవరు చించి ఉత్తరం తీసి చదివాడు. అంతే- ఎక్కడలేని చిరాకూ వచ్చేసింది ముఖంలోకి. విసురుగా వంటింట్లోకి వెళ్ళాడు.
రేవతి అతణ్ణి చూస్తూనే- ‘‘టిఫిన్ రెడీయే- చట్నీ ఒక్కటి మిక్సీలో తిప్పాలి. ఒక్క నిమిషం ఆగరూ’’ అంది.
‘‘ఏం మనిషివి రే! ఎవరో వచ్చి అర్జంటని చెప్పి ఓ ఉత్తరమిచ్చి వెడితే- అందులో ఏముందోనన్న కుతూహలం లేదా నీకు?’’ అన్నాడు సుందరం.
వేయించిన దాన్ని జార్లో వేసి మిక్సీలో సెట్ చేసి, ‘‘ఇప్పుడీ మిక్సీ చప్పుడులో మీ మాట నాకు వినపడదు, నా మాట మీకు వినపడదు’’ అంటూ మిక్సీ ఆన్ చేసింది. వెంటనే గీమన్న చప్పుడు మొదలు.
సుందరం అక్కణ్ణించి వెళ్లిపోలేదు. అబ్బురంగా భార్యనే చూస్తున్నాడు. ఆమె దృష్టంతా చేస్తున్న పనిమీదే!
‘‘విద్యుక్త ధర్మం పట్ల అంకితభావానికి ఇల్లాలికి మించిన ఆదర్శ వ్యక్తి ఉండరు. ఈ దేశంలో ప్రతి ఇల్లాలూ ఓ ఆదర్శ వ్యక్తి. రోజూ చూసే ఆమె నుంచి నేర్చుకుంటే చాలు. మన దేశంలో ప్రతి ఒక్కరూ ఆదర్శ పౌరులౌతారు’’ అనుకున్నాడు సుందరం మనసులో.
ఐదు నిమిషాల్లో రేవతి డైనింగ్ టేబుల్‌మీద ప్లేట్లలో ఇడ్లీలు సద్ది చట్నీ వడ్డించింది. ఇద్దరూ ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు.
సుందరం వౌనంగా ఇడ్లీ ముక్క విరిచి చట్నీలో అద్ది నోట్లో పెట్టుకుంటుంటే- ‘హమ్మయ్యా- నా మనసిప్పటికి తెరిపిన పడింది. లేటై ఎక్కడ టిఫిన్ తినకుండా స్టేషన్‌కి వెళ్లిపోతారోనని భయపడ్డాను’’ అంది తనూ ఓ ముక్క విరిచి తింటూ.
‘‘ఆ విషయం నాకు తెలుసు రే! కానీ ఎంతసేపూ నా గురించేనా- ఆలోచన! నీకంటూ కొన్ని సరదాలూ, కుతూహలాలూ ఉంటాయిగా!’’ అన్నాడు సుందరం.
‘‘ఆ.. చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం టూ బెడ్రూం అపార్ట్‌మెంట్లో ఉంటున్నామా- ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌసులో ఉండాలనుకుంటుంది. ఆటోల్లో తిరుగుతున్నామా- స్వంత కార్లో వెళ్లాలనుంటుంది. సరదా అంటే ఎవరికి వాళ్లు సినిమా చూడ్డం అనుకుంటున్నామా? ఇద్దరం కలిసి సింగపూర్ వెళ్లి రావాలనుంటుంది. ఆలోచనలకి రెక్కలొస్తే- కోరికలు గుర్రాలౌతాయి’’ ఆగింది రేవతి.
సుందరం ముఖం మాడిపోయింది. ‘‘సారీ రే! నేను నీ అంచనాలు అందుకోలేకోతున్నా కదూ!’’ అన్నాడు.
‘‘అదిగో, టిఫిన్ తినడం ఆపేశారు. అందుకే నేను మాట్లాడను. నేను చెప్పేదింకా అవలేదు. మీరు టిఫిన్ తింటుంటే- పూర్తి చేస్తాను...’’ అంది రేవతి.
సుందరం ఆమె వంక చూడలేదు. తల వంచుకుని వౌనంగా ఇడ్లీ తినసాగాడు.
‘‘్భరతంలో అర్జునుడున్నాడే, ఆయనే నాకు ఆదర్శం. ఒకసారి గురువు ద్రోణాచార్యులవారు శిష్యులందర్నీ పిలిచి ఓ పెద్ద చెట్టు చూపించాడు. దాని చిటారు కొమ్మమీద ఓ బొమ్మ పిట్టను పెట్టాడు. గురి చూసి ఆ పిట్ట కన్నుమీద కొట్టమన్నాడు. అపుడు అర్జునుడేం చేశాడూ- దృష్టంతా పిట్ట కన్నుమీదే పెట్టాడు. మిగతా వాళ్ళందరికీ చుట్టూ మనుషులు, చెట్టు, పిట్ట వగైరాలన్నీ కనిపిస్తే ఆయనకి మాత్రం తన చుట్టూ ఎవరున్నారో తెలియలేదు. చెట్టు కానీ, దాని కొమ్మలు కానీ, వాటిమీదున్న బొమ్మ పిట్ట కానీ కనబడలేదు. పిట్టకన్ను- అంతే! గురి చూసి కొట్టాడు. అనుకున్నది సాధించాడు. అలా జీవితమంతా అనుకున్నది సాధిస్తూనే ఉన్నాడు’’ ఆగింది రేవతి.
‘‘అంటే నువ్వు నన్ను జీవితమంతా సాధించాలనుకుంటున్నావా?’’ అన్నాడు సుందరం నవ్వడానికి ప్రయత్నిస్తూ.
‘‘సాధించాలనుకున్నది నిజమే! కానీ మిమ్మల్ని కాదు, మీ కోసం..’’ అంది రేవతి.
సుందరానికి వెంటనే అర్థం కాలేదు. ‘‘ఊ?’’ అన్నాడు ప్రశ్నార్థకంగా.
‘‘మనకి ఇంతకంటే పెద్దిల్లు కావాలండీ అన్నాననుకోండి, అది మిమ్మల్ని సాధించడం. ఈ ఇంటిని మీరు మెచ్చేలా అలంకరించాననుకోండి. అది మీకోసం సాధించడం. మనం కారు కొందామండీ అంటే మిమ్మల్ని సాధించడం. మనం కలిసి వందమైళ్లు నడిచినా- కార్లో ప్రయాణం చేసినట్లుందన్నాననుకోండి- అది మీకోసం సాధించడం. ఆఫీసుకెళ్లేలోగా మీకు టిఫిన్ చేసి పెట్టడంలో ఉన్న ఆనందం- కేశవ్ ఇచ్చిన ఉత్తరంలో ఏముందన్న ఆలోచనలో ఉండదు నాకు..’’ అని- ‘‘అన్నట్లు ఆ ఉత్తరంలో ఏముందోనని చాలా కుతూహలంగా ఉంది. చెప్పడానికిప్పుడు టైముందా మీకు’’ అనడిగింది రేవతి.
సుందరం టిఫిన్ తినడం ఐపోయింది. లేచి వాష్ బేసిన్ దగ్గర చెయ్యి కడుక్కొచ్చాడు.
రేవతికి కూడా టిఫిన్ తినడం ఐపోయింది. తనూ వాష్‌బేసిన్ దగ్గర చెయ్యి కడుక్కొచ్చింది.

ఇంకా ఉంది

వసుంధర