డైలీ సీరియల్

సింధు నాగరికతలో ఓ ప్రేమకథ-27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నీకు లేదనా! నాకు కాబోయే భార్యకు ఇవ్వాలని ఇస్తున్నా, వొద్దనకు’’. ‘‘ఈ విలువైన కానుకలు ఇచ్చారుగా..’’
‘‘ఆ కానుకలు నీకు సామాన్య అవసరాలు తీరుస్తాయా? తీసుకో, లేకపోతే నాకు చాలా నిరాశ కలుగుతుంది.. నా సంతోషం కోసం..’’ ఆమె డబ్బు తీసుకోక తప్పలేదు.
ఇంటికి వచ్చిన అజోడా నేరుగా తన గదిలోకి వెళ్లి పక్కమీద వాలాడు. ఇదివరకే ఓ పరిచారికుడు గదిలో పెట్టిన కంచు సమ్మెలో నూనె పోసి వొత్తి మార్చి చిన్న దివిటితో వెలిగించి వెళ్లాడు.
గదిలోకి అజోడా తల్లి మాజా వచ్చింది.
‘‘ఏరా రావడం ఆలస్యం అయింది. చాలా అలిసిపోయావా ఏమిటి?’’ అడిగింది మాజా.
‘‘పగలంతా వ్యాపార పనుల్లో తలమునకలుగా ఉన్నా, తర్వాత స్నేహితులతో కలిసి కాలక్షేపం చేశా’’.
‘‘అది సరేరా, నాన్నా, కొండమీద ఉత్సవం దగ్గర పడుతోంది కదా! ఉత్సవానికి గోదా, బావా పిల్లలు వస్తున్నారట’’.
అజోడా లేచి ‘‘అక్కా బావా పిల్లలు వస్తున్నారా!’’ అన్నాడు హుషారుగా.
‘‘హడప్పానుంచి ఓ వర్తకుల బృందం వచ్చిందట. వాళ్ళ ద్వారా కబురు పంపారు. త్వరలో బయలుదేరుతారట’’ అంది మాజా.
‘‘అబ్బా! అక్కా పిల్లల్ని చూసి రెండేళ్ళవుతోంది’’ అన్నాడు అజోడా ఉద్వేగంతో.
‘‘ఔనురా. దాన్ని, పిల్లల్ని చూడడానకి నా కళ్ళు కాయలు కాచాయి నేనెప్పుడూ వాళ్ళనే తల్చుకుంటూంటా.’’
‘‘పురుడు పోసుకుని పసిబిడ్డడితో వెళ్లింది. ఆ ఏడు ఉత్సవం చూసింది. నిరుడు రాలేదు. చంటాడు రెండేళ్ళవాడయాడు అనుకుంటా’’ అన్నాడు అజోడా.
‘‘ఔనురా. ఆమధ్య హడప్పానుంచి ఓ వ్యాపారితో కబురు పంపించింది. చంటాడు ఇల్లంతా పరిగెత్తుతూ సందడి చేస్తున్నాడట. వాడి అక్కకి నాలుగేళ్ళు వెళ్ళాయి కదా! ఇద్దరూ కలిసి ఇల్లు దద్దరిల్లేలా గొడవ చేస్తారట’’.
ఇంతలో హనోడా గదిలోకి వచ్చి ‘‘ఈ వింతైనా కబురు వినండి. మొహంజోదడోలో దంత వైద్యులు చనిపోయిన మనిషి రెండు దంతాలు తీసి బతికున్న మనిషికి అమర్చారట. అవి చక్కగా అతుక్కున్నాయట. వాటితో తిండి నములుతున్నాడట ఆ మనిషి’’ అన్నాడు.
‘‘ఎంత చిత్రం! మన వైద్యులు దేవాంతకులు’’.
‘‘అది నిజమేనా నాన్నగారు’’ అన్నాడు అజోడా.
‘‘నీ మొహం ఏమిటి అంత విప్పారింది. అక్క వస్తున్నట్లు తెలిసిందా?’’ అడిగాడు హనోడా.
‘‘ఔను, నాన్నగారు, అన్నట్టు అక్కకు నేను కొన్న బిళ్ళల హారం మోరికి బహుమానంగా ఇచ్చేశాగా. వెంటనే అటువంటిది కొని ఉంచుతాను. సుమేర్ నుంచి నగల వ్యాపారి ఒకడు ఊళ్ళో ఉన్నాడని విన్నా’’ అన్నాడు అజోడా.
‘‘అలాగే చేయరా!’ అన్నాడు హనోడా.
‘‘ఇన్నాళ్ళకు అక్క వస్తోంది. అందుకోసం మనం అక్కని పిల్లల్ని తనివితీరేవరకు ఇక్కడ పెట్టుకుని పంపుదాం. బావకి తొందరైతే ముందే వెళ్లిపోవచ్చు’’ అన్నాడు అజోడా.
‘‘బాగుందిరా. అంతా మన చేతుల్లో ఉందా? ఆమె ఆ ఇంటి కోడలు. ఇక్కడ వాళ్ళు ఎన్ని రోజులుండాలో వాళ్ళకే వదిలిపెట్టాలి మనం’’ అంది మాజా.
‘‘సరే మన ప్రయత్నం చేద్దాంరా. ముందు వాళ్ళని రానీ. మాజా! ఆమె గదులు శుభ్రం చేయించు’’ అన్నాడు హనోడా.
‘‘అలాగే చేయిస్తా’’ అంది ఆమె. బైటకు నడుస్తూ, హనోడా కూడా ఆమె వెంటే నడిచాడు. వాళ్ళిద్దరూ హనోడా గదిలో ప్రవేశించి ఆసనాలపై కూర్చున్నారు.
‘‘ఏవండీ మన ఇంటి పరిస్థితి చూస్తున్నారుగా. పనివాళ్ళ చేత సరిగ్గా పని చేయించే ఆజమాయిషీ లేదు. ఎంత చెప్పినా మీరు మోరీ జాగాలో ఎవరినీ కుదర్చలేదు. ఇపుడు గోదా, అల్లుడు వస్తే మన ఇల్లు చూసి ఏమనుకుంటారు?’’
‘‘ఔను మాజా, నీకు నిజం చెప్పాలంటే మోరీ వంటి పనిమంతురాలు నాకు ఎంత ప్రయత్నించినా కనబడలేదు. ఇప్పుడు తప్పనిసరిగా ఏ మనిషినో కుదర్చాలిగా! అదే చేస్తాను’’.
‘‘ఏవండోయ్, నాకు మరో ఆలోచన వచ్చింది. మన అమ్మాయి వస్తోందిగా, అదంటే వీడికి వల్లమాలిన అభిమానం. అది ఏమన్నా కాదనడు. మీకు గుర్తుందా, వాడు ఓడలో సుమేర్‌కు వెళతానని పట్టుబట్టినప్పుడు మనమెంత చెప్పినా విననివాడు అక్క చెప్పగానే విని ఆ ప్రయాణాన్ని విరమించుకున్నాడు.’’
‘‘ఔను, సముద్ర ప్రయాణం ప్రమాదకరమైనది. దాంట్లోనూ నీకు అలవాటు లేదు. తల్లిదండ్రులకు ఒక్కడివే కొడుకువి. అందువలన ఈ ఆలోచన మానుకో అని అక్క అనగానే మానుకున్నాడు’’.
‘‘ఆ విధంగానే ఆ నంగనాచి మాయలోంచి బైటపడి మనం కుదిర్చిన బంగారాం లాంటి సంబంధం చేసుకోమని దాని చేత చెప్పిస్తే వాడు తన పట్టు వీడతాడేమో!’’
‘‘నువ్వు చెప్పిన ఆలోచన బాగానే వుంది. ఏ పుట్టలో ఏ పాముందో! మన ప్రయత్నం మనం చేద్దాం’’.
రెండు రోజులు తరువాత ఓ మనిషిని ఇంటిని సరిదిద్దే పనిలో పెట్టుకున్నారు. అతడు భవంతిని శుభ్రం చేయిస్తున్నాడు. కానీ అలంకరణ మాత్రం చేయించలేకపోతున్నాడు. అతడు అంగళ్ళనుంచి తెస్తున్న అలంకరణ సామగ్రి బాగుండడంలేదు. అతడికి కళాత్మక దృష్టి అంత పదునైనది కాదు. ఇంటికి వెల్ల వేయించాడు కానీ అలంకరణ పని మాత్రం ఆషామాషీగా ఉంది.
దాంతో అజోడా అతణ్ణి మాన్పించాడు. తల్లిదండ్రులతో ‘‘అక్కకి ఇంటి శుభ్రత అన్నా అలంకరణ అన్నా పిచ్చి మోజు కదా! మన భవంతి పరిస్థితిని చూసి అక్క తప్పక బాధపడుతుంది. భవంతిని చక్కగా తీర్చిదిద్దాలంటే మోరీని పిలిపించడం అత్యవరం. ఆమె మన భవంతిని కళాసౌధంగా తీర్చిదిద్దుతుంది’’ అన్నాడు.
గతుక్కుమన్న తల్లిదండ్రులు కొడుకు చెప్పింది నిజమేనని మనసులో అనుకున్నారు. అలా అని మోరీని మళ్లా పనిలో పెట్టుకుంటే ఏ అఘాయిత్యం చేస్తుందోనన్న భయం కూడా వేధించింది వాళ్ళను.
‘‘దానికి త్వరలో పెళ్లి కాబోతోందిగా! వాకబు చేసి మరెవరినైనా కళా ప్రవీణుడిని నియమించుదాం’’ అంది మాజా.
- ఇంకాఉంది

-పులిగడ్డ విశ్వనాథరావు