డైలీ సీరియల్

సింధు నాగరికతలో ఓ ప్రేమకథ-31

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని ద్వారాలకు రంగు రంగుల చక్కని ఆకృతులుగల పట్టు తెరలు, కొన్ని ద్వారాలకు పూసల మాలలు వేలాడగట్టారు. వాటిలోంచి లోపలకు వెళుతున్నా బైటకు వస్తున్న అవి కదిలి సున్నితమైన గలగల ధ్వనులు వినబడతాయి.
నడవల్లో, వసారాల్లో గోడలకు దివిటీలు పెట్టేందుకు కంచు దీస్తంభాలు ఎతె్తైన పీఠాలపై ఉంచారు. నేలపై సెమ్మెలుంచారు. రాత్రివేళ ఈ దీపాల్లో, దివిటీల్లో నూనె పోసి వెలిగిస్తే భవంతి దేదీప్యమానంగా వెలుగొందుతుంది.
పిల్లలకోసం మోరీ కొయ్య బంతులు, మెడ ఆడించే బొమ్మలు, తాబేలు ఆకారంలోవున్న మట్టి ఈల, కుక్క, పులి, పిల్లుల మట్టిబొమ్మలు కొని ఉంచింది. ఉద్యావనంలో ఉయ్యాలలు ఎలాగూ ఉన్నాయి. చంటి పిల్లవాడికి తాడు లాగే ఉయ్యాల చేయించి గోదా గదిలో పెట్టించింది మోరీ.
వంట గదిలో ఒక పొయ్యిలో ఎల్లప్పుడూ అగ్గి రగులుతూ ఉంటుంది. ఆ పొయ్యిని ఎల్లవేళలూ మండుతూ ఉంచే బాధ్యత ఇద్దరు పరిచారికలది. మిగతా పొయ్యిలు వంటలయ్యాక ఆర్పివేస్తారు.
వంట గదిని ఆనుకుని తాగునీళ్ళ గది ఉంది. అక్కడ పెద్ద బానల్లో, కుండలో కూజాల్లో నీళ్ళుంటాయి. ఇంటి వెనుకనున్న రెండు బావుల్లోంచి పరిచారకులు నీళ్ళు తోడి బానలను గట్రా నింపుతూంటారు.
స్నానాల గదిలో బానాల్లో నీళ్ళు ఉంచుతారు. మురుగునీరు వీధిలోనున్న పెద్ద కాలువలోకి పారుతోంది. ఆ కాలువపై కప్పు ఉంటుంది.
వెల్లవేసి అలంకరించిన తర్వాత భవంతి కొత్త పెళ్లికూతురిలా ముస్తాబైనట్లు ఉంది. ఇది చూసి మాజా భర్తతో ‘‘ఏవండోయ్ మన భవంతిని చూసి గోదా ఎంతలా పొంగిపోతుందో ఈ భవంతి ఇంతలా ఎప్పుడూ ముస్తాబవలేదు’’ అంది ఆనందంతో.
‘‘గోదా సంతోషిస్తే మనం సంతోషించినట్టే కదా!’’
‘‘ఔనండోయ్. మోరీకి తగు పారితోషికం ఇద్దాం. భవంతిలో పనులు కూడా ఎంత సజావుగా సాగుతున్నాయో! నీళ్ళు, దీపాలు, శుభ్రత, పాలు పెరుగు, వంట సామాన్లు, అన్నీ రవంత జాప్యం కాని లోపం కాని లేకుండా సరఫరా అవుతున్నాయి. వంటలుల మన రుచులకు తగ్గట్టుగా తయారవుతున్నాయి.’’
హనోడా రహస్యంగా ‘‘మనవాడు కూడా ఆమెతో ఏ వేషాలు వేయడం లేదు. దానే్న చేసుకుంటానని అనడం లేదు’’.
‘‘ఔనండి. ఐతే దానే్న భవంతి నిర్వహణ పని కొనసాగించమందాం’’.
‘‘అలాగే చేద్దాం. మన అమ్మాయి, అల్లుడు, పిల్లలు రేపో ఎల్లుండో చేరవచ్చు. అన్నట్టు వాళ్ళ వసతికి అన్ని ఏర్పాట్లు అయ్యాయి కదా! కొండమీద ఉత్సవం నాలుగు దినాల్లో జరగనుంది. వాళ్ళకు బట్టలు కొన్నావా?’’
‘‘వాళ్ళు వస్తున్నారని కబురు అందగనే కొనేశానండి. అజోడా గోదాకి బిళ్ళల గొలుసుకొంటున్నాడు’’
‘శభాష్’
‘‘పాపం చంటి పిల్లాడితో వారంరోజులు ప్రయాణం, ఎంతలా పీక్కుపోయి ఉంటారో!’’
‘‘దారిలో సరైన ఆహారం దొరికితే దొరుకుతుంది. లేకపోతే లేదు. ఏం చేస్తాం. దూరపు సంబంధం చేసుకున్నప్పుడు అన్నిటికీ సిద్ధమయి ఉండాలి.
ఆ మర్నాడు సూర్యుడు నెత్తిమీద ఉండగా గోదా, కుటుంబం చేరారు.
వాళ్ళబండి వచ్చిందని సేవకులు చెప్పగానే హనాడో, మాజా, అజోడా పరుగు పరుగునబండి వద్దకు చేరారు. మాజా చంటివాడిని ఎత్తుకుని ముద్దెట్టుకుంటూ సంబరడిపోతూంటే వాడు ఆమె మొహాన్ని తేరిపార చూసి ఏడుపు లంఘించాడు. వాణ్ణి గోదాకు అప్పజెప్పి ‘‘ఏమే, వీడు ప్రయాణం తట్టుకోగలిగాడా?’’ అని అడిగింది.
‘‘బండి కుదుపులు, వేడితో ఏడుస్తూండేవాడు. బట్ట తడిపి వొళ్ళు తుడుస్తూండేదాన్ని’’
నాలుగేళ్ళ మనవరాల్ని ‘‘ఏమే నేను జ్ఞాపకం ఉన్నానా?’’ అని అడిగింది.
లేదని చెప్పింది తలాడించి. సామాన్లన్నీ దింపి లోపల పెట్టారు సేవకులు.
భవంతి అలంకారాన్ని చూసి గోదా ‘‘ఇప్పుడు మన భవంతిని చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఎవరు చేయించారు ఈ పనంతా?’’ అని అడిగింది.
‘‘తమ్ముడే చేయించాడు’’ అంది మాజా.
‘‘నిజం చెప్పాలంటే మోరీ అనే అమ్మాయి చేయించింది. మన ముఖ్య చేనేతకారుడి కూతురు. ఆమె భవంతి వెనుక పనులు చేయిస్తున్నట్లుంది’’ అన్నాడు అజోడా.
గోదా దూర ప్రయాణం చేసి వచ్చిందేమో ‘‘ముందు స్నానం చేసి దుస్తులు మార్చుకోనీయరా తమ్ముడు’’ అని తుండుగుడ్డ, వస్త్రాలు తీసుకుని స్నానాల గదిలోకి వెళ్లింది పిల్లలతో.
‘‘నూనె, నలుగుబిండి, కుంకుడు, పసుపు స్నానాల గదిలో ఉన్నాయిలే’’ అంది మాజా. ఓ పరిచారికని ‘వేన్నీళ్ళు పెట్టావా?’ అని అడిగింది.
‘‘పెట్టా అమ్మగారు’’’ అంది ఆమె.
ప్రయాణపు బడలిక గోదా అందచందాల్ని ఎంత మాపినా మాపలేకపోయాయి. స్నానం చేశాక కుందనపు రంగు, నిపుణుడైన శిల్పి చెక్కినట్టుండే శరీర సౌష్ఠవం, ఎర్రటి పెదాలు, ముక్కు, నాగుబాముల్లాంటి కేశ సంపదతో ఆమె చూడముచ్చటగా ఉంది.
పిల్లలకు నీళ్ళు పోసి, తనూ నీళ్ళు పోసుకుని సింగారించుకుంది.
అప్పటికి మోరీ వచ్చి గోదాని పలకరించడానికి ఎదురు చూస్తోంది.
నమ్రతతో వంగి దండం పెట్టింది. ‘‘తమరి రాకకోసం మేమంతా అత్యంత ఆతురతతో ఎదురుచూస్తున్నాం, అమ్మాయిగారూ’’ అంది.
మోరీని ఆపాదమస్తకం చూసాక గోదా కాస్త అసూయతో మనసులో నాకంటే చక్కగా ఉందే అనుకుని ‘‘నీ పేరు మోరీ కదూ. నువ్వు భవంతిని నీ అంత చక్కగా తీర్చిదిద్దావు’’ అంది.
మోరీ వినయంగా నవ్వింది. అక్కడే వున్న అజోడా ‘‘ఈమె అలంకరణ నిపుణురాలే కాదు పేరుగాంచిన గాయని, నర్తకి. ప్రదర్శనలు ఇస్తూ ఉంటుంది’’ అన్నాడు - ఇంకాఉంది

-పులిగడ్డ విశ్వనాథరావు