డైలీ సీరియల్

వ్యూహం-45

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతనివైపు చూస్తూ కూర్చుంది సావేరి. అతని కళ్లలో మోసం, దగా కన్పించలేదు. ‘నీకు నేను తోడుంటాను కలకాలం!’ అన్నట్లు తనవైపు చూశాడు అతను.
వేడివేడిగా కాల్చిన మొక్కజొన్నకండెలు తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది సీతమ్మ. అవి తిన్నాక వేడి టీ చప్పరించుకుంటూ తాగేరు. ఆ వాతావరణంలో సీతమ్మ ఇచ్చిన టీ రుచి వాహ్.. తాజ్ అన్నట్లుగా వుంది.
వాళ్ళేం మాట్లాడుకోలేదు.
కళ్ళే ఎన్నో మూగభాషలు మాట్లాడుకున్నాయి.
ఫైర్‌ప్లేస్‌లో మంట ఆరిపోయింది. వాన తగ్గిపోయింది.
బయటకువచ్చి చూస్తే సాయంత్రం నీరెండ ఆ ప్రాంతమంతా ఆవరించుకుని వుంది. ఆ నీరెండలో వర్షం తడిసిన పచ్చని చెట్లు మిలమిలా మెరుస్తూ వాళ్ళిద్దరూ జీవితంలో ఎప్పుడూ చూడని ఆకుపచ్చ సౌందర్యాన్ని ఆవిష్కరించాయి వాళ్ళ కళ్లముందు.
‘‘రాత్రికి ఇక్కడే వుంటారా బాబూ! భోజనం ఏర్పాట్లు చేస్తాను’’ అంది సీతమ్మ.
అమ్మ మా కోసం ఎదురుచూస్తూ వుంటుంది.
తడిబట్టలు ఆరిపోయాయి. బట్టలు మార్చుకుని కారు ఎక్కి కూర్చున్నారు. కారు బయల్దేరేముందు పర్సులోనుంచి వెయ్యి రూపాయల నోటు తీసి సీతమ్మకు ఇచ్చాడు నిశాంత్.
***
ఆఫీసులో కూర్చుని ఫైల్స్ తిరగేస్తున్నాడు స్కంద.
సెక్రటేరియట్ నుంచి వచ్చిన కవరు తెచ్చి స్కంద టేబుల్ ముందు వుంచాడు స్టెనో.
కవరు చించి చూసాడు.
ఒక్కసారిగా నీరసం ఆవరించింది.
ఇన్నాళ్ళు తను ప్రాణాలకు తెగించి పడిన కష్టమంతా బూడిదపాలైనట్లయ్యింది. క్రైమ్ బ్రాంచి నుంచి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సుకి ట్రాన్స్‌ఫర్ చేశారు.
డిజిపి ఫోన్ చేశాడు వెంటనే.
‘‘సార్.. మరో నెల నన్ను ఇదే పోస్టులో కొనసాగనివ్వండి. మీరు నాకు అప్పగించిన ‘మిషన్’ పూర్తి అయ్యే స్టేజీలో వుంది. ఆ తరువాత నన్ను మీరు ఎక్కడకు ట్రాన్సఫర్ చేసినా ఫర్వాలేదు’’ అన్నాడు స్కంద.
‘‘సారీ స్కంద.. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు స్ట్ఫా యువర్ ట్రాన్సఫర్ ఆర్డర్స్.. బట్ ఇన్ పైన్.. మినిస్టర్‌గారి మీద ప్రెజర్ తీసుకువచ్చారు ఢిల్లీ స్థాయిలో.’’ అన్నాడు డిజిపి.
డిజిపిగారే ఆ మాట అన్నాక తను ఇక్కడనుంచి రిలీవ్ కాక తప్పదు.
తను ఎవరినైతే ఛేజ్ పట్టుకోవాలనుకున్నాడో వాళ్ళే తన వెంటబడి దూరంగా తరిమేస్తున్నారు.
కొత్త ఆఫీసర్ కావడం, అతను ఛార్జి తీసుకుని విషయాలన్నీ ఆకళింపు చేసుకునేసరికి ఆరు నెలలు పడుతుంది. అతను మనకెందుకు రిస్క్.. జీతం డబ్బులు వస్తున్నాయి గదా! ఆఫీసర్స్ క్లబ్‌లో కూర్చుని పేకాట ఆడుకోవడం ఉత్తమంగాని, కిడ్నీ మార్పిడి కుంభకోణం ఛేదిస్తే తనకేం వొరుగుతుంది? అనుకున్నాడంటే ఫైలుకు దుమ్ము పట్టుకుపోతుంది.
డాక్టర్ లోహిత పీకల్లోతు కష్టాలలో పడిపోతుంది.
ట్రాన్స్‌ఫర్ ఆర్డర్స్ కాన్సిల్ చేయించాలి! ఎలా? తనకు పొలిటికల్ పలుకుబడి లేదే!
ప్రొఫెసర్ దయానందరావు గుర్తుకువచ్చాడు ఆ క్షణంలో.
***
దయానందరావు మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైరయ్యాడు. రిటైరైకూడా ఇరవై య్యేళ్ళు అయ్యింది.
ఓసారి లోహితతో కలిసి వాళ్ళింటికి సెప్టంబర్ ఐదో తారీఖు వెళ్లాడు స్కంద. ఆయనకు శాలువా కప్పి బొకే ఇచ్చి పాదాభివందనం చేసింది. ఆమెతోపాటు అతను నమస్కరించాడు.
‘‘వీరు స్కంద, ఐపిఎస్, క్రైమ్ బ్రాంచ్‌లో పనిచేస్తున్నారు. నాకు కాబోయే భర్త’’ స్కందను పరిచయం చేస్తూ నవ్వుతూ చెప్పింది.
‘‘మెడికల్ ప్రొఫెషన్ వున్నవాడిని సెలెక్టు చేసుకోకుండా పోలీసు ఆఫీసర్ని లైఫ్ పార్ట్‌నర్‌గా ఎంపిక చేసుకున్నావ్.. ఇబ్బంది పడతావేమో!’’ అన్నాడాయన.
‘‘మొదట్లో ఆయన పోలీసు అధికారని నాకు తెలియదు సార్. అతనితో సాన్నిహిత్యం ఏర్పడి మనస్సు అర్పించేక తెలిసింది’’ అంది లోహిత.
‘‘నీ నిర్ణయాన్ని నేను తప్పుపట్టడంలేదు. మీ ఇద్దరి ప్రొఫెషన్స్ ప్రజలతో డైరెక్టుగా సంబంధాలు వుండేవి. పగలనక రాత్రనక ప్రజలకు సేవ చెయ్యడానికి సిద్ధంగా వుండాలి! ఇద్దరూ కలిసి తిరగడానికి సమయం చిక్కదు. సాయంత్రం ఐదయ్యేసరికి ఇంటి ముందు లాన్‌లో రిలాక్సడ్‌గా కూర్చొనే ప్రొఫెషన్స్ కాదు మీవి.. ప్రజలకు సేవ చేసే క్రమంలో మీ వ్యక్తిగతంగా ఫ్యామిలికి కేటాయించే సమయం తగ్గిపోతుంది.. ఆ ఉద్దేశంతో అలా అన్నాను.. తప్పుగా అర్థం చేసుకోకండి!’’
ఇద్దరికీ శుభాశీస్సులు చెప్పాడాయన.
ఇంట్లో పదిమందిదాక పిల్లలు గంతులేస్తూ కన్పించారు.
‘‘మీ మనుమలు, మనవరాళ్ళా?’’
పెద్దగా నవ్వి మీసాలు సవరించుకున్నాడు దయానందరావు. ఏదో మాట్లాడబోయేడు.. దగ్గుతెర అడ్డొచ్చింది.
లోహిత గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చి ఆయనకు అందించి, గొంతు ఛాతీ నిమిరింది.
ఇంకా ఉంది

అలపర్తి రామకృష్ణ