డైలీ సీరియల్

యమహాపురి 53

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఊరికి అరిష్టం పోవడానికి మామూలు ముఖం పనికిరాదు. నీలాంటి ముఖం ఉండాలి. నువ్వు నాకు నచ్చావ్’’ అంది మాత.
అవకాశం వదులుకోలేదు రాజా. ‘‘దేవతలా ఉన్నారు. మీరున్నచోట అరిష్టమెందుకొస్తుందమ్మా! నాతో అలా అన్నారు కానీ- యమ నన్నిక్కడికి పంపడంలో వేరే ఏదో ఉద్దేశ్యముందని నా అనుమానం’’ అన్నాడు.
‘‘ఆయన నీకేం చెప్పారో చెప్పు. ఆయన ఉద్దేశ్యం నేను పసికడతాను’’ అంది మాత నమ్మకంగా.
ఆమె గొంతులో నమ్మకం, కళ్లలో నమ్మకం. ‘‘ఆ నమ్మకం తనమీద తనకే కాదు, నామీద కూడా’’ అనుకున్నాడు రాజా.
‘‘ఆయన నాకేం చెప్పలేదు. ఇక్కడికొచ్చి ఏం చెయ్యాలో నాకు తెలియదు. కానీ ఆయన దేవుడు. ఎప్పటికప్పుడు తన ఆదేశాన్ని నాకు స్ఫురింపజేయగల శక్తి ఆయనకుందని నాకు తెలుసు. అందుకే ఆయనే్నమీ అడగలేదు’’ అన్నాడు రాజా.
‘‘ఆయన లేనప్పుడు ఆయన ప్రతినిధిగా ఇక్కడికొచ్చావ్. అదిగో- అక్కడ ఆయన సింహాసనముంది. ఆయన వచ్చేదాకా అది నీది. దానిమీద కూర్చోగానే నీకు ఆయన ఆదేశాలు చెవిలో వినిపిస్తాయి’’ అంది మాత.
వృద్ధుడు వెంటనే, ‘‘అది మామూలు సింహాసనం కాదు. దేవుడిచ్చిన సింహాసనం. దానిమీద కూర్చున్నపుడు దేవుడి ఆదేశాలు తనకి వినిపించేవని యమ అనేవారు. మనిషికెంతో కష్టమనిపించే పనులని ఆయన అవలీలగా చెయ్యడానికి ఆ సింహాసనం మహిమే కారణం. అదే ఆయన్ని మాకు దేవుణ్ణి చేసింది. దానిమీద కూర్చుంటే, యమ శక్తులు పూర్తిగా మీకొస్తాయి. మాత ఆనతి అయింది. మీరా సింహాసనంమీద కూర్చోవచ్చు’’ అన్నాడు.
రాజా ఓసారి సింహాసనం వంక చూశాడు.
ఎత్తుగా ఉంది. రెండు చేతులూ ఆన్చుకునే చోట నోరుతెరిచిన సింహం ముఖాలు.
రాజాకి వళ్లు జలదరించింది.
అతడికి మాయ మంత్రాలమీద నమ్మకం లేదు. కానీ ఒక ఊరిని శాసిస్తున్న యమ కూర్చునే సింహాసనమది.
ఆ సింహాసనంలో ఏదో నెగెటివ్ శక్తి ఉండి ఉంటే- అది తనని కూడా లొంగదీసుకుంటే..
రాజా తల అడ్డంగా ఊపాడు. ‘‘నేను యమని కాదు. యమ ప్రతినిధిగా వచ్చాను. ఆయనె్నలా గౌరవించానో ఆయన సింహాసనాన్నీ గౌరవిస్తాను’’ అంటూ ఆ సింహాసనం ముందుకి వెళ్లి సాష్టాంగపడ్డాడు. తర్వాత లేచి నిలబడి, ‘‘ఆ సింహాసనం ముందు నా స్థానం ఇక్కడే’’ అన్నాడు.
మాత కళ్లలో వెలుగు, ‘నీ మర్యాద బాగానే ఉంది. కానీ, నువ్వా సింహాసనంమీద కూర్చుంటేనే బాగుంటుంది’’ అంది.
‘‘మాతా! రాజరికంలో వారసత్వం ముఖ్యం. ఆ సింహాసనం యమది. ఆయనతోపాటు మీది. మీ తర్వాత పుత్రది. అదీ నియమం. ఈ విషయంలో చర్చించడానికేం లేదు’’ అన్నాడు రాజా.
‘‘సరే నీ ఇష్టమే ఆయన అభీష్టమనుకుంటాను’’ అని, ‘‘పద- నీకు యమ సామ్రాజ్యాన్ని పరిచయం చేస్తాను’’ అంది మాత.

***
యమ సామ్రాజ్యమంటే ఏమో అనుకున్నాడు. కానీ రాజా ఆ భవనంలో చూసిన విశేషాలు అతడి ఊహకందనివి.
అది చాలా పెద్ద భవనం. అందులో యమ బంధువులే సుమారు వందమంది వుంటారు. అక్కడ వాళ్లకున్న సదుపాయాలు ఢిల్లీలో మంత్రులకి కూడా ఉండకపోవచ్చు.
అక్కడ ఓ గదిలో దేశాలకు దేశాల్ని కొనగల బంగారం, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి. రెండు గదుల్లో వెయ్యి రూపాయల నోట్ల కట్టలతో నిండిన సూట్‌కేసులు గుట్టలు గుట్టలుగా పడున్నాయి. ఆరు బయట ఉన్న గాదెల్లో ఒక మహానగరాన్ని ఏళ్ల తరబడి పోషించగల ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, పాలు, పళ్లు, కూరగాయలు ఉన్నాయి. వాటిని నిల్వ చెయ్యడానికి ఆధునిక శాస్ర్తియ సౌకర్యాలున్నాయి. ఆ భవనం, పరిసరాలు- ఒక మహాకోశాగారాన్ని తమలో ఇముడ్చుకున్నాయి.
ఇంత సంపద, ఇన్ని సౌకర్యాలు ఉన్నచోట వాటిని కాపాడే సేవకుల పరిస్థితి మాత్రం దుర్భరం.
యమకి భారతదేశపు చట్టంతో కానీ, శిక్ష్మాస్మృతితో కానీ నిమిత్తం లేదు.
ఆయన చట్టం ఆయనది. ఆయన శిక్షా విధానం ఆయనది.
జనాలకి ఆయన వేసే శిక్షలు విభిన్నంగా వుంటాయి. విపరీతంగా ఉంటాయి. కొన్ని వణికించేలా ఉంటాయి. కొన్ని శిక్షలు గ్రామస్థులు తమ ఇళ్లలో ఉంటూనే అనుభవిస్తారు. కొందర్ని రాజభవనానికి తరలిస్తారు.
రాజభవనానికి తరలించబడే నేరస్థులు మాత్రం- పురుషులైతే యువకులూ, బలిష్టులూ అయుండాలనీ- ఆడవాళ్లయితే వయసు, సొగసు ఉండాలనీ నియమం.
ఆ భవనం చుట్టూ కొన్ని రాటలు పాతి ఉన్నాయి. యమ వేసిన శిక్ష అనుభవించడానికి వచ్చిన గ్రామస్థుల్ని పొడవాటి గొలుసులతో ఒక్కొక్కర్ని ఒక్కో రాటకు కట్టేస్తారు. ఆ గొలుసులు ఎంత పొడవైనవంటే వాళ్లు ఆ పరిసరాలన్నీ తిరగొచ్చు. అలా తిరుగుతూనే వాళ్లు తమకి అప్పగించిన పనులు చేస్తారు.
పశువుల్ని కడిగి, మేపి, పాలు పితికి, పేడ చేసి పిడకలు చెయ్యడం వగైరా పనులన్నీ ఒక తరహా. ఇంటిపని, వంట పని, తోటపని, బట్టలుతకడం వగైరా పనులన్నీ ఒక తరహా.
ఇవికాక ఆడవాళ్లకి అదనంగా మరికొన్ని బాధ్యతలున్నాయి. యమ బంధు మిత్ర గణంలో పురుష పుంగవులకి వారు కోరిన సపర్యలు చెయ్యాలి. కొన్ని సపర్యలకిగానూ- భవనంలో మూడు విలాస మందిరాలున్నాయి. విలాస మందిర ప్రవేశ భాగ్యం లభించిన యువతులకి- తాత్కాలికంగా సంకెళ్లనుంచి విముక్తి లభిస్తుంది.
శిక్షాకాలంలో సేవకులెవ్వరూ నోరు విప్పి మాట్లాడకూడదు. ఆవులు అంబా అనొచ్చు. మేకలు మే మే అనొచ్చు. గాడిదలు ఓండ్రపెట్టవచ్చు. కుక్కలు మొరగొచ్చు. సేవకుల గొంతు మాత్రం ఏ స్వరమూ పలకకూడదు. పలికితే కఠిన శిక్ష ఉంటుంది. ఆ శిక్ష కూడా వౌనంగా భరించాలి.
దీపం వెలుగునిస్తే- దాని వెనుక నీడ ఉంటుంది. కొన్ని దీపాల నీడ వెలుగుని మించి ఉంటుంది. అక్కడ సంపదల వెలుగులో సేవకుల నీడ చూసేక- ఆ సత్యపు విశ్వరూపం స్పష్టమైంది రాజాకి.

ఇంకా ఉంది

వసుంధర