డైలీ సీరియల్

యాజ్ఞసేని-51

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకు ధర్మరాజు, ధౌమ్యుడు, మంత్రులు కూడా సంతోషించారు.
అక్కడికి చేరిన కృష్ణద్వైపాయనుడు వారితో గూడి ఆనందించాడు. అర్జునుని చూసి ‘‘అర్జునా! భాగ్యవశాన నీకు చక్కని బుద్ధి కలిగింది. చాలా బాగుంది. భూమినంతటినీ జయించే ఉత్సాహం నీకు కలిగింది. పాండు మహీపతి నీవంటి పుత్రుని బొంది ధన్యుడయ్యాడు. నీ బాహుబలం సహాయంతో ధర్మరాజు రాజసూయాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తాడు. అందువలన అర్జునా! నీవు దేవతలచే రక్షింపబడే ఉత్తర దిక్కునకు పొమ్ము. దేవతలను జయించి రత్నాలను తీసుకురాగలవు. తూర్పు దిక్కుకు బలశాలి అయిన భీమసేనుడు వెళతాడు. మహారథికుడైన సహదేవుడు దక్షిణ దిక్కునకు వెళతాడు. వరుణ పాలితమైన పశ్చిమ (పడమటి) దిక్కునకు నకులుడు పయనవౌతాడు. దీనిని మీరు పాలించండి’’ అని అన్నాడు. పాండు సుతులందరూ మహర్షికి నమస్కరించి ‘‘మునిశ్రేష్ఠా! మీ ఆజ్ఞానుసారం మేమందరమూ నడుస్తాము’ అని సవినయంగా అన్నారు. అంత ధర్మజుడు అర్జునుని చూచి ప్రేమతో-
‘‘అర్జునా! పూజనీయులైన బ్రాహ్మణుల స్వస్తి వాక్యాలు విని జైత్రయాత్రకు బయలుదేరుము. నీకు విజయము తథ్యం. నీ కోరిక తీరుతుంది’’ అని అనగా అర్జునుడు అన్నగారికి నమస్కరించి అనుజ్ఞ పొంది అగ్నిదేవుడు ప్రసాదించిన అద్భుతాలను సాధించగల గొప్ప రథంమీద సైన్య సమేతుడై ఉత్తరదిశగా పయనమైనాడు.
అట్లే ధర్మరాజు అనుజ్ఞతో భీమసేనుడు తూర్పు దిక్కునకు బయలుదేరి వెళ్ళాడు.
నకులుడు సైన్య సమేతుడై పశ్చిమ దిక్కునకు పయనమై వెళ్ళాడు.
సహదేవుడు పటాటోపంతో దక్షిణ దిక్కునకు సైన్య సమేతుడై బయలుదేరాడు.
ధర్మరాజు రాజ్యలక్ష్మిని అనుభవిస్తూ ఖాండవప్రస్థంలో (ఇంద్రప్రస్థం)లో నివసించాడు.

పాండవుల దిగ్విజయ యాత్ర
(అర్జునుడు)
పాండవ మధ్యముడైన అర్జునుడు ఉత్తర దిగ్విజయ యాత్రకు సైన్యంతో బయలుదేరాడు. ఎలాంటి పరాక్రమాన్ని ప్రదర్శించకుండానే కళింగ దేశ రాజులందరినీ జయించాడు. కళింగులతోపాటు అనర్తీయులను, కాలకూటులను జయించాడు. శాకల ద్వీపాన్ని (సుమండలదేశంలోని) రాజైన ప్రతివింధ్యునీ జయించి, మిగిలిన ఏడు ద్వీప రాజులను ఓడించి వారితోపాటు ప్రాగ్జ్యోతిషపురంపై దాడిచేశాడు. ప్రాగ్జ్యోతిషపురాధీశుడైన భగదత్తునితో గొప్పయుద్ధం చేశాడు. భగదత్తుడు కూడా కిరాత, చీనుల, సముద్ర తీరవాసలతో అర్జునుని ఎదిరించాడు. ఎనిమిదిరోజులు భీకరమైన పోరు జరిగింది. అప్పుడు భగదత్తుడు నవ్వుతూ-
‘‘అర్జునా! నీవు ఇంద్రుని పుత్రుడవు. నేను ఇంద్రుని స్నేహితుడను. అయినా నీతో సంగ్రామంలో నిలువలేకపోయాను’’ అని అన్నాడు. అంత అర్జునుడు తన రాకకు గల కారణాన్ని వివరించాడు. భగదత్తుడు సంతోషంతో అమితమైన ధనరాశులను కానుకగా సమర్పించాడు.
తదుపరి అర్జునుడు అంతర్గిరి, బహర్గిరి, ఉపగిరి అనే ప్రదేశాలను, ఉలూకదేశవాసి అయిన బృహంతుని, పిమ్మట సేనాబిందుని ఓడించి, మోదాపురం, వామదేవం, సుదామ్నం, సుసంకులం, అనే ఉలూకదేశ ఉత్తరప్రాంతాలను, పంచగణ దేశాలనూ, పౌరవ దేశాధిపతి అయిన విష్వగశ్వుడిని, కాశ్మీర దేశ క్షత్రియులను, రాజలోహితుని, త్రిగర్తులను, దార్వులను, కోకనదులను, అభీర నగరాన్ని, ఉరగావాసి రాజైన రోచమానుని, సింహపురి రాజు చిత్రాయుధుని, సుహ్ములను, చోళులను, బాహ్లికులను, కాంభోజులను, దరదులను, ఈశాన్యవాసులైన దస్యులందరినీ, పరమ కాంభోజ, ఋషిక, హిమవంతుని, సిష్కుటదేశ అధిపతులను, కింపురుషు దేశములను, కినె్నర, సాటక (గుహ్యరక్షిత గంధర్వులను) జయించాడు. వారి వద్దనుండి అనేకానేక రత్నరాశులను, ధనరాశులను, రంగురంగు గుఱ్ఱాలను, తిత్తిరి, కల్మాష, మండూకాలనే జాతి గుఱ్ఱాలను కప్పంగా గ్రహించాడు.
రాజులందరినీ ధర్మరాజు రాజసూయయాగానికి రమ్మని ఆహ్వానించాడు.
రత్నాల రాశులతో, మణులతో, ధనరాశులతో, వివిధ వస్తు వాహనాలతో అపారమైన సంపత్తితో అర్జునుడు ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చాడు. సంపదనంతటినీ ధర్మరాజుకు సమర్పించాడు.

- ఇంకా వుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము