డైలీ సీరియల్

యమహాపురి 59

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అంటే నువ్వు నేను చెప్పకుండానే- ఎంక్వయిరీలు చేస్తున్నావన్నమాట!’’ అన్నాడు శ్రీకర్ ఆశ్చర్యంగా.
‘‘చెబితే- మీరు పని చేయించుకుందుకు నన్ను ఉబ్బేస్తారు. తర్వాత- పొగడ్తలకు పడిపోయి పని చేశాననుకుంటారు. పొగడ్తలకు లొంగనిదాన్నని ఋజువు చేసుకుందుకే- మీరు చెప్పకుండానే నా అంతట నేను ఎంక్వయిరీలు చేస్తున్నాను. అదీకాక ఏ పనీ మధ్యలో వదలడం నాకిష్టముండదు’’ అంది వసంత.
‘‘మరి రాణి నరకపురి వెళ్లిందనీ, ఇప్పట్లో తిరిగిరాదనీ తెలిసినప్పుడు వెంటనే నాకు చెప్పొద్దూ...’’ అన్నాడు శ్రీకర్ నిష్ఠూరంగా.
‘‘చెబితే ఏం చేస్తారు? నరకపురిలో ఏదో జరుగుతోంది- అంటారు. ఆ మాట మీ నోట రోజూ వినేదేగా...’’
‘‘ఔను. నరకపురిలో ఏదో జరుగుతోంది...’’ అని నాలిక్కరుచుకున్నాడు శ్రీకర్.
***
జగదానందస్వామి దీవెనలందుకున్న ఆరుగురిలో ఒకడు రాజా. అతడు నరకపురి వెళ్లాడు. ఒకడు యోగి. అతడు నరకపురి యవతి లతికని ప్రేమించాడు. ఒకామె రాణి. ఆమె ఈ ఊళ్ళోనే హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతోంది. ఆమెది నరకపురి. ఇంకా ముగ్గురున్నారు. పోలీసు పద్ధతిలో ఆరా తియ్యగా వారిపై వచ్చిన రిపోర్టు శ్రీకర్ చేతిలో ఉంది.
ఒకాయన అవినాష్, వయసు నలభై ఐదు. ఒక ప్రయివేటు కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. తెలుగు, సంస్కృతాల్లో పాండిత్యముంది. మన పురాణాల సారాన్ని పదిమందికీ అర్థవంతంగా చెప్పాలని ఎప్పట్నించో ఆయన కోరిక. ఏడాది క్రితం ఓ గుడిలో ఆయనకి అలాంటి అవకాశమొచ్చింది. ఆయన మొదటి ఉపన్యాసానికే శ్రోతలనుంచి అనూహ్య స్పందన లభించింది.
అనేక సంస్థలు ఆయన్ని ప్రవచనాలు చెప్పమని ఆహ్వానిస్తున్నాయి. ఉద్యోగ బాధ్యతలవల్ల ప్రతి ఆహ్వానాన్నీ మన్నించలేకపోతున్నాడు. కానీ అడపాతడపా ఆయనిచ్చే ఉపన్యాసాలు ఆయనకు అంతో ఇంతో పేరు తెచ్చి పెట్టాయి. ఈ ఊపుఇలాగే కొనసాగితే ఆయన ఉద్యోగం మానేయాలని కూడా అనుకుంటున్నాడు.
రెండోవాడు సుధాకర్. వయసు పాతికేళ్లు. పెద్దగా చదువుకోలేదు. మిమిక్రీలో, వెంట్రిలాక్విజంలో పరిణతి సాధించాడు. ప్రదర్శన ఇస్తే చప్పట్లకు లోటు లేదు కానీ- పరిచయాలు చాలకనో, ఆ రంగంలో పోటీ ఎక్కువగా ఉండడంవల్లనో- పిలిచేవారు తక్కువే.
మూడో ఆమె రచయిత్రి ఉష, వయసు ముప్ఫై అయిదు. అనాదిగా స్ర్తికి జరుగుతున్న అన్యాయాన్ని చెప్పడానికీ, ఎదిరించడానికీ రచనా వ్యాసంగం
చేపట్టిందామె. ఐతే లోపం మహిళలలోనూ ఉన్నదనీ వారు తమని తాము సంస్కరించుకోవాలనీ ప్రబోధిస్తుందామె. సామాన్య పాఠకులు ఆమె రచనల్ని మెచ్చినా- లబ్దప్రతిష్ఠుల్లో అటు స్ర్తివాదులూ, ఇటు పురుషాహంకారులూ ఆమెకు సానుకూలం కారు. అందువల్ల ఆమె పేరు చాలామందికే తెలిసినా- వేదికలపై కనిపించేది తక్కువ.
వీళ్లందరికీ ఏదైనా లంకె ఉన్నదా అని ఎంత ఆలోచించినా ఏమీ స్ఫురించడంలేదు శ్రీకర్‌కి.
‘‘ఈ ముగ్గురి గురించీ మరికాస్త ఆరా తియ్యమని యోగికి చెప్పాను. ఆరా పూర్తయిందన్నాడు. ఎం చెబుతాడో ఏమో!’’ అనుకున్నాడు శ్రీకర్. సరిగ్గా అప్పుడే సెల్ మ్రోగింది. సుందరం!
‘‘సార్! ఆటో రెడీ! ఎక్కడకు రమ్మంటారు?’’ అన్నాడు సుందరం..
శ్రీకర్ అతడికి తానెక్కడకొచ్చేదీ చెప్పి ఫోన్ పెట్టేశాడు. టైం చూసుకుని, ‘‘ముందు గోపాల్‌ని, ఆ తర్వాత యోగిని కలుసుకోవాలి’’ అనుకున్నాడు.
***
‘‘ఇక్కడ ఆపు’’ అన్నాడు ఇన్స్‌పెక్టర్ శ్రీకర్ ఓ బస్టాప్ దగ్గిర. అతడు మఫ్టీలో ఉన్నాడు.
డ్రైవరు వేషంలో ఉన్న సుందరం- ఆటోని బస్‌స్టాపులో నిలబడ్డ గోపాల్ దగ్గిర ఆపాడు.
అప్పటికి గోపాల్ ఐదుసార్లు అసహనంగా వాచీ చూసుకున్నాడు. ఆరోసారి చూసుకుంటుండగా సుందరం అతణ్ణి పలకరించి, ‘‘సారీ, లేటయింది’’ అన్నాడు.
అది ముందుగా ఫోన్లో చేసుకున్న ఏర్పాటు కావడంతో గోపాల్ చటుక్కున ఆటో ఎక్కాడు. ఆటో స్టార్టయింది.
‘‘నీకు తెలిసినవన్నీ వివరంగా చెప్పు. ఎంతసేపైనా ఫరవాలేదు. చెప్పడం పూర్తయ్యేదాకా ఆటో తిరుగుతూనే ఉంటుంది. మీటరు తిరక్కుండా ఆటోలో తిరిగితే ఎంతసేపైనా బాగుంటుంది కదా!’’ అన్నాడు శ్రీకర్ నవ్వి.
గోపాల్ నవ్వలేదు. ‘‘నాకు చాలా విషయాలు తెలిశాయి. తలచుకుకంటే గుండె అదిరిపోతోంది’’ అన్నాడు.
‘‘‘గుండె చిక్కబట్టుకుని ప్రశాంతంగా ఒకటొకటిగా అన్నీ చెప్పు’’ అన్నాడు శ్రీకర్.
‘‘నా కథ కేశవరావుతో మొదలౌతుంది సార్! కానీ నిజానికది వ్యాఘ్రేశ్వరుడి కథ’’ అన్నాడు గోపాల్.
వ్యాఘ్రేశ్వరుడెవరూ అనలేదు శ్రీకర్. ‘ఊ’ అన్నాడు చెప్పమన్నట్లు.
***
కేశవరావుకి నలభై ఏళ్ళ వయసులో భార్య పోయింది. సుమిత్రని రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి ఆయన పెద్ద భార్య కూతురు శాంతకి పదహారేళ్లు.
పేరు సుమిత్ర కానీ- ఆమె రామాయణంలో కైకేయిని మించిన గయ్యాళి. ఆమె శాంతని రాచి రంపాన పెట్టేది. పెళ్లానే్నమీ అనలేక, కూతురి బాధలు చూడలేక ఆమెకి త్వరగా పెళ్లి చేసి పంపేయాలనుకున్నాడు కేశవరావు. ఆ ప్రయత్నంలో అతడికి కృష్ణమూర్తి తటస్థపడ్డాడు.
కృష్ణమూర్తి చిరుద్యోగి. ఎవర్నడిగినా బుద్ధిమంతుడని చెప్పారు. అయినవాళ్లు లేరు కాబట్టి బాధ్యతలు లేవు. మంచి సంబంధమని, కూతురు సుఖపడుతుందని అనుకుని- అతడికి శాంతనిచ్చి పెళ్లి చేశాడు కేశవరావు.
శాంత నెమ్మదస్థురాలు. మంచిది. భర్తకు అనుకూలవతి. అందుకని కృష్ణమూర్తి జీవితం ఆనందమయంగా గడిచిపోవాల్సిందే కానీ అతడు ఆమె గుణగణాలకంటే అత్తగారు తనకిచ్చే మర్యాదలకు ప్రాధాన్యమిచ్చాడు.
కృష్ణమూర్తి వారాలు చేసుకుని పైకొచ్చినవాడు. జీవితంలో ఎవర్నించీ గౌరవ మర్యాదలు పొందనివాడు. చిరుద్యోగి కాబట్టి ఆఫీసులోనూ అతడికి లభించే మర్యాద అంతంతమాత్రమే. పెళ్లయితే అత్తవారింట తనకి ప్రత్యేక గౌరవ మర్యాదలు లభిస్తాయని ఆశపడ్డాడు. కానీ సవతి కూతురు మొగుణ్ణి సుమిత్ర ఎందుకు గౌరవిస్తుంది?

ఇంకా ఉంది

వసుంధర