డైలీ సీరియల్

యాజ్ఞసేని -- 76

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మరాజు కళ్ళు విప్పక, భయంకరమైన నాచూపుతో నిరపరాధులైన ప్రజలు మండిపోకూడదనే భావంతో ముఖాన్ని కప్పుకొని వెళ్లసాగాడు.
భీమసేనుడు బాహుబలంలో నాకు సాటి రాగలవారు ఎవ్వడూ లేడని, తన విశాల బాహువుల వైపు చూస్తూ పోసాగాడు.
అర్జునుడు ఇసుక జల్లుతూ యుధిష్ఠిరుని అనుసరిస్తున్నాడు. తాను వెదజల్లుతున్న ఇసుక రేణువులు ఒకదానితో ఒకటి కలియకుండా నేలపై పడుతున్నట్లు శత్రువులపై ఒకదానితో ఒకటి తగలకుండా ఉండే శరవర్షాలను కురిపించబోతున్నాడు అనే భావన స్ఫురించేటట్లు పయనించాడు.
సహదేవుడు తన ముఖాన్ని ఇప్పుడు ఎవ్వరూ తెలిసికొనగూడదనే భావంతో తన ముఖంపై మట్టిపూసుకొని వెళ్ళనారంభించాడు.
నకులుడు దారిలో తాను ఏ మనస్సును కూడా దొంగిలించకూడదనే భావనతో ఒళ్ళంతా దుమ్ము కొట్టుకొని వెళ్ళాడు.
యాజ్ఞసేని అయిన ద్రౌపది జుట్టు విరబోసుకొని వున్నది. ఆమె విలపిస్తూ ఎవరి అన్యాయం వలన నేడు తానా స్థితికి వచ్చానో, వారి భార్యలు కూడా నేటికి పదునాల్గవ సంవత్సరంలో భర్తలను, పుత్రులను, బంధువులను, ప్రియజనులను కోల్పోయి, శరీరమంతా నెత్తుటి మరకలు, దుమ్ము ధూళి నిండగా జుట్టు విరబోసుకొని భర్తలకు తిలోదకాలిచ్చి హస్తినలో ప్రవేశిస్తారనే సంకేతాన్ని ఇస్తున్నట్లుగా భర్తలను అనుసరించి నడవసాగింది.
ధౌమ్యుడు పాండవుల పురోహితుడు. అతడు చేతిలో దర్భలను నైరృతి వైపు చూపుతూ యమ సంబంధ సామగానం చేస్తూ ముందు నడుస్తున్నాడు. యుద్ధంలో కౌరవులు మరణిస్తే గురువులు కూడా ఈ విధంగానే సామగానం చేస్తూ నడుస్తారని సూచిస్తూ పయనిస్తున్నాడు.
అని విదుర మహాశయుడు ధృతరాష్ట్రునికి పాండవులు వివిధ భంగిమలలో అరణ్యవాసానికి పయనమైన విధానాన్ని వారి చేష్టలలోని ఆంతర్యాన్ని తెలిసేటట్లు వివరించి చెప్పాడు. ప్రజలు కూడా దుఃఖించారు.
ఆ విధంగా పాండవులు హస్తినాపురాన్ని వీడి వెళ్తుండగా మేఘాలు లేకుండానే మెరుపులు వచ్చాయి. భూమి కంపించింది. నగరానికి ఎడమవైపు ఒక ఉల్క నేల రాలింది. గ్రద్దలు, నక్కలు, కాకులు మొదలైన ప్రాణులు దేవాలయాలలో, యజ్ఞశాలల్లో, మేడలపై మాంసపు ముక్కలను వదిలి వెళ్లాయి.
ఈ రకంగా ధృతరాష్ట్ర విదురులు మాట్లాడుకొనే సమయంలో నారద మహర్షి సభామధ్యంలో కౌరవుల ఎదుట నిల్చి భీకరంగా ‘‘నేటికి పదునాల్గవ సంవత్సరంలో దుర్యోధనుని అపరాధంతో భీమార్జునుల బలంవలన కౌరవులందరూ మరణిస్తారు’’ అని పలికి గగనతలంపై ఎగిసి వెంటనే అదృశ్యమయ్యాడు. అప్పుడు సంజయుడు-
‘‘పాంచాలి, తపస్విని, అయోనిజ, రూపతి, అగ్నివంశంలో పుట్టినది, సర్వధర్మాలు తెలిసినది, కీర్తిమతి అయిన అటువంటి ఆమెను సభామధ్యంలోనికి ఈడ్చినప్పుడే రోమాలు నిక్కబొడిచే భయంకర యుద్ధానికి ప్రారంభం జరిగింది. దొంగజూదమాడే దుర్యోధనుడు తప్ప మరెవ్వరూ అటువంటి పనిచేయరు. ద్రౌపది సభామధ్యంలో పాండవులను చూచింది. వారిని ఆ స్థితిలో చూచి ఆమె కోపించింది’’ అని సంజయుడనగా ధృతరాష్ట్రుడు-
‘‘సంజయా! ఆమె తలచుకొని ఉంటే ఇప్పటికీ నేనూ, నా కుమారులు మిగిలి ఉండేవాళ్ళం కాదు’’ అని అన్నాడు.
ధృతరాష్ట్రుడు బరువైన హృదయంతో కలత చెంది కూర్చున్నాడు. సంజయుడు నిష్క్రమించాడు.
హస్తినాపురాన్ని వీడి పాండవులు రథాలనెక్కి గంగానదీ తీరంలోని ‘ప్రమాణం’ అనే వటవృక్షం దగ్గరకు చేరారు. ఆ రాత్రి అక్కడ గడిపారు.
పాండవులపట్ల గల స్నేహంవలన కొందరు బ్రాహ్మణులు వారిని అనుసరించి వచ్చారు. ఆ రాత్రి గడిచిన మరునాడు యుధిష్ఠిరుడు తమ పురోహితుని సమీపించి సోదరులందరి సమక్షంలో
‘‘వేదపారంగులైన బ్రాహ్మణులు వనంలో నాతో వస్తున్నారు. నేను వీరిని పోషించలేను. వీరిని విడిచిపెట్టలేను. వారికీయగల శక్తి నాకు లేదు. నేనేం చేయాలో మీరే చెప్పండి’’ అని అడిగాడు.
..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము