డైలీ సీరియల్

యమహాపురి 62

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లు- ప్రభాకరం పిల్లలు ఆ వాతావరణంలోనే పెరిగి పెద్దవుతున్నారు. కానీ ప్రభాకరం భయపడ్డడట్లు- ఆ వాతావరణం వారి సంస్కారంపై ప్రభావం చూపలేదు. వాళ్లు అప్పుల ఊబిలోంచి బయటపడ్డానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఆ సమయంలో - వ్యాఘ్రేశ్వరుడి కబురొకటి తెలిసింది.
అతగాడు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు పడి ఆరేళ్ల క్రితం అమెరికా చేరాడు. అప్పటికి తల్లిదండ్రులు పోయారు. తలిదండ్రుల జీవితం చూసిన విరక్తి భావంతోనో ఏమో- అతడు పెళ్లి చేసుకోలేదు. హాబీగా మొదలెట్టిన షేర్ల వ్యాపారం అతడి దశ మార్చేసింది. కోట్లకు పడగెత్తాడు.
ఇండియా వచ్చి తనకు ముఖ్యులైన అనంతం కుటుంబ సభ్యుల్ని కలవాలనుకున్నాడు. దురదృష్టవశాత్తూ అప్పుడే అతడికి కాన్సర్ అడ్వాన్స్‌డ్ స్టేజీలో ఉన్నట్లు తెలిసింది. ఇక ఎంతోకాల బ్రతకనని తెలిసేక అతడు ఇండియా వెళ్ళే ఉద్దేశ్యం మానుకున్నాడు. తన తదనంతరం తన ఆస్తిని ప్రభాకరం, జయ సమంగా పంచుకోవాలని వీలునామా వ్రాశాడు. ఆ వీలునామా ప్రకారం వారిద్దరిలో ఎవరైనా చనిపోతే కనుక- ఆ వాటా వారి పిల్లలకి చెందాలి. ఆ పిల్లలు మైనర్లయితే కనుక- వాళ్లు మేజర్లయ్యేదాకా జీవించి ఉన్నవారు ఆ వాటాకి ట్రస్టీగా ఉండాలి. ఈ విల్లుని వ్యాఘ్రేశ్వరుడు చనిపోయిన ఏడాదిలోగా అమలు చెయ్యకపోతే ఆ ఆస్తి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకుగానూ- అమెరికా ప్రభుత్వానికి చెందుతుంది.
రెండు వారాల క్రితం వ్యాఘ్రేశ్వరుడు మరణించాడు. పది రోజుల క్రితం ఈ కబురు జయమ్మని చేరింది.
అంటే వ్యాఘ్రేశ్వరుడి ఆస్తిని ఇప్పుడు రాజా, జయమ్మ సమంగా పంచుకోవాలి. రాజా కనుక జీవించి లేకపోతే- గోపాల్ మేజరయ్యేదాకా - అతడి వాటాకి జయమ్మే ట్రస్టీ ఔతుంది. ఆ తర్వాత ట్రస్టీ నుంచి ఓనరుగా మారడం ఆమెకి నల్లేరుపై బండి నడక.
కబురందిన వెంటనే జయమ్మ రాజాని శివగిరికి పంపింది.
****
‘‘అంటే మీ అత్తయ్య టీవీ సీరియల్ కేరెక్టరన్నమాట!’’ అన్నాడు సుందరం.
‘‘ఔను. ఇప్పుడామెని తల్చుకుంటే భయమేస్తోంది’’ అన్నాడు గోపాల్.
‘‘అది సరే- ఈ సమాచారమంతా నువ్వెలా సేకరించావూ?’’ అన్నాడు శ్రీకర్.
‘‘‘చెట్టునుంచి పండు రోజూ రాలిపడుతూనే ఉంటుంది. అది భూమ్యాకర్షణ శక్తి అని తెలుసుకుందుకు బుర్రుండాలి. అమ్మ మాకు వ్యాఘ్రేశ్వరుడుగారి గురించి చాలాసార్లు చెప్పింది. ఏదో రామాయణం విన్నట్లే అదీ వినేవాణ్ణి..’’ అన్నాడు గోపాల్.
‘‘నీకే కాదు- మన దేశంలో అందరికీ ఉన్న తెగులే ఇది. మనకి ఎవరో చెబితే వినడమే తప్ప సొంతంగా ఆలోచించడం తెలియదు. దేశం అవినీతితో నిండిపోయింది మొర్రో అంటాడు అన్నాహజారే. విని కామోసని అన్నాకీ జై అంటాం. అన్నా మాట్లాడ్డం మానెయ్యగానే మనమూ ఆ విషయం ఆలోచించడం మానేస్తాం. అవినీతిదేముంది? అన్నా చెప్పకముందూ ఉంది, చెప్పకపోయినా ఉంది. చెప్పేక కూడా ఉంది’’ అని- ‘‘కానీ నేనడిగింది వ్యాఘ్రేశ్వరుడి కథ నీకెలా తెలిసిందీ అని కాదు- ఆయన వీలునామా గురించి. ఆ విషయం నీకెలా తెలిసింది?’’ కొంపదీసి మీ అత్తగాని చెప్పిందా?’’ అన్నాడు శ్రీకర్.
‘‘అమ్మో! తనెందుకు చెబుతుందీ’’ అన్నాడు గోపాల్.
‘‘ఎందుకు చెబుతుందంటే- ఇప్పుడు కబురుగా వచ్చిన వార్త- తొందరలోనే కాగితం రూపంలో మీ ఇంటికొస్తుంది. అందుకని ముందు జాగ్రత్తగా తనే చెప్పిందేమో అనుకున్నా!’’ అన్నాడు శ్రీకర్.
‘‘అబ్బే- తనకలా చెప్పే ఆలోచనా లేదు. విషయం మాదాకా రానిచ్చే ఉద్దేశ్యమూ లేదు. నేను అత్తయ్యమీద మాటువేశాను. నేనలా వేస్తానని అనుమానం కూడా లేదుగా- అందుకని నా పని చాలా ఈజీ ఐపోయింది. ఈ ఆస్తి పంపకం గురించి అత్తయ్య మామయ్యతో మాట్లాడుతుండగా విన్నాను’’ అన్నాడు గోపాల్.
‘‘గుడ్‌వర్క్!’’ దీనికి మీ అమ్మగారేమంటున్నారు?’’ అన్నాడు శ్రీకర్.
‘‘అమ్మో! ఈ విషయం అమ్మకి చెప్పొద్దని మీరే అన్నారుగా’’ అన్నాడు గోపాల్.
‘‘వెరీ గుడ్! బాగానే గుర్తుంది నీకు. మీ అత్తయ్యది నోటి దురుసు మాత్రమే అనుకునే అమాయకత్వం మీ అమ్మగారిది. ఇలాంటి రహస్యాలు మీ అత్తయ్యకు తెలియకుండా దాచకపోవడం ప్రమాదమని తెలియదు. ఇంతకీ మీ అమ్మగారి వంట్లో ఇప్పుడెలా వుంది?’’ అన్నాడు శ్రీకర్.
గోపాల్ ముఖం బాధగా ఐపోయింది. ‘‘ఏమో సార్ అన్నయ్య కనిపించకుండా పోయినప్పట్నించీ అమ్మ బెంగెట్టుకుంది. వాడికేం కాదని అత్తయ్య అమ్మకి ధైర్యం చెబుతోంది కానీ- నాకు తెలుసు. అన్నయ్య చనిపోయాడని నమ్ముతోంది అత్తయ్య. మీరా బిచ్చగాడి చావు గురించి చెప్పి ఉండకపోతే- నేనూ బెంగపడేవాణ్ణి’’ అన్నాడు.
‘‘రాజా చనిపోయాడని మీ అత్తయ్య నమ్మడం రాజాకి కూడా చాలా మంచిది. నేనడిగింది మీ అమ్మగారు కొడుకు గురించి బెంగెట్టుకున్నారా అని కాదు. ఆమెకి క్యాన్సరనీ, అర్జంటుగా ఆపరేషన్ చేయించాలనీ అంది కదా మీ అత్తయ్య. ఆ ప్రయత్నాలేమైనా జరుగుతున్నాయా అనడుగుతున్నాను’’ అన్నాడు శ్రీకర్.
గోపాల్ ఏదో అనబోయి ఆగిపోయాడు. అతడికి కాసేపు గొంతు పెగలలేదు. తర్వాత నెమ్మదిగా, ‘‘సార్! మీ అమ్మ బ్రతుకుతుదంటారా?’’ అన్నాడు నీరసంగా. మాట నూతిలోంచి వచ్చినట్లుంది.
శ్రీకర్ ఆప్యాయంగా గోపాల్ భుజం తట్టి, ‘‘మేమంతా ఉండగా, ఆమెకేం కాదు. అనవసరంగా బెంగెట్టుకోకు’’ అన్నాడు.
‘‘మీరు పోలీసులు. తనని అత్తయ్యనుంచి రక్షించగలరు. కానీ క్యాన్సర్నించి రక్షించాల్సింది డాక్టర్లు కదా! ఆ డాక్టర్లకు కావాల్సింది డబ్బు కదా! అది ఏర్పాటుచేయాల్సింది అత్తయ్య కదా. ఇప్పుడు అత్తయ్య ఆ విషయమే ఆలోచిస్తున్నట్లు లేదు. అమ్మ ఏమైపోతోందోనని నాకు చాలా బెంగగా ఉంది’’ అన్నాడు గోపాల్.

ఇంకా ఉంది

వసుంధర