డైలీ సీరియల్

యాజ్ఞసేని -- 92

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొప్ప పాముల జంటను పాదాలతో త్రొక్కి కోపింపచేయటం వంటిదే! జాగ్రత్త!
ఓ సైంధవా! నీకు ఆయువు తీరింది. నీకింక చావు తప్పదు. ఈ పరిపాకాన్ని తప్పించుకొనటం నీకు సాధ్యం కాదు.
ఆడు ఎండ్రకాయ తన చావుకోసం గర్భం దాల్చినట్లు నీవు పాండవుల చేత రక్షింపబడుచున్న నన్ను అపహరించాలనుకొంటున్నావు. (తేలు, ఎండ్రి ఆయువు తీరిన సమయాననే గర్భం ధరిస్తాయి) అని కఠినంగా అన్నది.
ద్రౌపది మాటలను విన్న సైంధవుడు ‘‘ఓ ద్రౌపదీ! పాండవుల సంగతి మాకు చిరకాలంనుండి బాగా తెలుసు. ఇప్పుడు ఇక్కడ నీవు వారి పరాక్రమాతిశయాల గురించి అభివర్ణించి నన్ను భయపెట్టనవసరం లేదు. మేము పిరికిపందలముగాము.
అనవసరమైన మాటలు మాట్లాడి ఊరడింపచేస్తే చక్కబడే పనిగాదు. అదిగో అది నా పసిడితేరు. వేగమే దానిని ఎక్కుము. లేదా అల్లదిగో ఆ ఏనుగునెక్కుము. ఆత్మప్రశంసలు మానుము. మంచి మాటతో నా అనుగ్రహానికి పాత్రురాలవుగమ్ము’’.
నీచుడా! నేను వీరుల యొక్క ధర్మపత్నిని. ‘‘నా అన్న శ్రీకృష్ణుడు’’. ఆయన వృష్ణికేకయ గొప్ప సేనలతో నన్ను కాపాడటానికై నీమీదికి వేగంగా దండెత్తి రాగలడు. నీవు చేసే తప్పులకు నీవు పశ్చాత్తాపం చెందే తరుణం ఆసన్నమైంది, జాగ్రత్త! అని అన్నది ద్రౌపది.
కానీ దుర్మార్గుడైన సైంధవుడి చూపుతో అతడు తనను బలాత్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లు గ్రహించి ‘నన్ను తాకవద్దు’ అని అంటూ తన పురోహితుడైన ధౌమ్యుడిని పేరెత్తి పిలిచి బిగ్గరగా ఏడ్వటం మొదలుపెట్టింది. ధౌమ్యుడు ద్రౌపది ఆర్తనాదం విని మిక్కిలి వేగంతో పరుగెత్తుకొని రాసాగాడు. అతడు వచ్చేటంతలోనే దుష్టుడైన ఆ జయద్రథుడు పతివ్రత అయిన ద్రౌపది పయ్యెద కొంగు పట్టి లాగాడు. ద్రౌపది కూడా వేగంగా వాడిని ప్రక్కకు నెట్టి కోపంతో గట్టిగా కొట్టగా వాడు పెనుగాలికి కూకటివేళ్ళతో పెల్లగిలిపడిన వృక్షమో అన్నట్లు ఆశ్చర్యకరంగా నేలపై పడ్డాడు. అయినా వాడు వేగంగా తిరిగి లేచి ద్రౌపదిని పట్టుకున్నాడు. నిట్టూర్పులు విడుస్తూ బలవంతంగా లాగుతుండగా ధౌమ్యుని పాదాలకు నమస్కరించి రథం ఎక్కింది. అది చూచిన ధౌమ్యుడు-
‘‘జయద్రథా! క్షత్రియుల యొక్క ప్రాచీన ధర్మాన్ని గుర్తించు. మహారథులైన పాండవులను జయించకుండా ఈమెను నీవు తీసికొని పోలేవు. ధర్మరాజు మొదలైన పాండవ వీరుల ఎదుటపడి నీవు చేసిన నీచ కృత్యానికి తగిన పాపఫలాన్ని అనుభవిస్తావు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు, జాగ్రత్త!’’ అని పలికి ధౌమ్యుడు అపహరింపబడిన ద్రౌపది వెంట పదాతిదళం మధ్యలో అనుసరించసాగాడు.
అనంతరం కుంతీ పుత్రులైదుగురు అన్ని దిక్కులలో విహరిస్తూ క్రూర జంతువులను చంపి వేరువేర్వేరుగా తిరుగుతూ ఒక్కచోటకు చేరారు. అప్పుడు ధర్మరాజు తమ్ముళ్లను వెంటనే ఆశ్రమానికి రండి, ఆలస్యం చేయకండి అని, తాను ఏదో భయంకరమైన ఉత్పాతాన్ని చూడపోతున్నానని అంటాడు. అంతలో ఒక నక్క వారికి ఎడమ ప్రక్కగా రావడం, అరవడం చూచి ‘‘పాపాత్ములైన కౌరవులు మనలను ధిక్కరించి బలవంతంగా పెద్ద అపచారం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది’’ అని అన్నాడు ధర్మరాజు. ఈ రీతిగా వారు ఆశ్రమాన్ని సమీపిస్తుండగా తమ ప్రియమైన భార్య ద్రౌపది యొక్క దాసి, తమదాసుని యొక్క భార్య అయిన ధాత్రేయిక ఏడుస్తూ ఉండటం చూశారు.
అప్పుడు రథసారథి అయిన ఇంద్రసేనుడు రథంనుండి దూకి ధాత్రేయిక దగ్గరకు వచ్చి ఏడుస్తున్నందుకు గల కారణాన్ని అడిగాడు. అందుకు ధాత్రేయిక-
‘‘పంచేంద్రులవంటి పాండవులను తిరస్కరించి జయద్రథుడు బలవంతంగా ‘కృష్ణ’ను అపహరించాడు. పాండవులారా! మీరు మీ మీ రథాలను వెనకకు త్రిప్పండి. శీఘ్రంగా శత్రువులను వెంబడించండి. రాజకుమారి ద్రౌపది ఇప్పటికింకా దూరంగా వెళ్లి ఉండదు. ఆమె తనువును అర్పించకపూర్వమే వెళ్ళండి’’ అని అన్నది.
ఆ మాటలు విన్న యుధిష్ఠిరుడు ‘‘్భద్రా! ప్రక్కకి తొలుగుము. మా ఎదుట అతి పౌరుషంగా మాట్లాడుతున్నావు. అతడు రాజుగానీ, రాజపుత్రుడుగానీ ముప్పు తప్పదు’’ అని అన్నాడు.

..........................ఇంకావుంది

-- త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము