డైలీ సీరియల్

ఎప్పుడె ప్పుడు?-15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యకాంక్ష మహాభారతాన్ని కురుక్షేత్రం వైపు నడిపించినట్టు.. ఈ ఎప్పుడెప్పుడు యుద్ధం ఏదో ఒక నీతిని చెబుతుంది. ఒక నిత్య సత్యాన్ని, జగన్నాటక కారణాన్ని విశే్లషిస్తుంది.. అనిపించింది ఆ ఇద్దరికీ..
కలిసి ఉండడంకన్నా ఒకరినొకరు ప్రేమించుకునేవారు.. ఒకరితో ఒకరు గొడవపడటం ఎంత కష్టమో తెలిసింది.
ప్రేమించడంకన్నా ప్రేమించుకునేవారు ద్వేషించుకోవడం అంత ఈజీ కాదని అర్థమైంది.
జీవితసత్యాన్ని ప్రస్తావించాలంటే పురిటినొప్పులు తప్పవు.
కోపంగా (కోపాన్ని నటిస్తూ) ఆఫీస్‌కు వెళ్ళాడు నిహార్.
అదే కోపాన్ని నటిస్తూ గుమ్మం వరకు వచ్చి టాటా కూడా చెప్పలేదు నిశ్చల.
కానీ భర్త వెళ్ళగానే తలదిండును తడిపేసింది.. కన్నీటిని వర్షించేసింది.
ఆఫీసుకు వెళ్లిన నిహార్ భార్యమీద కోపంతో (ప్రేమతో) ఏమీ తినకుండా వుండిపోయాడు. ఇదంతా అర్థంకానీ కిరణ్‌కు అర్థమయ్యేలా చెప్పారు నిశ్చల నిహార్‌లు.
***
‘మీకేమైనా పిచ్చా?’ షాకింగ్‌గా అన్నాడు కిరణ్, నిహార్ చెప్పింది విన్నాక. ఉదయం తనను పిక్ చేసుకోవడానికివచ్చిన నిహార్ డల్‌గా ఉండడం, మధ్యాహ్నం కూడా లంచ్ చేయకపోవడం.. పదే పదే నిశ్చలకు ఫోన్ చేయడం.. కట్ చేయడం చూసేక అనుమానం వచ్చి ‘‘అసలు ఏం జరిగింది?’’ నిలదీశాడు కిరణ్.
అప్పుడు మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాడు నిహార్. అదంతా విన్నాక అన్నాడు కిరణ్- ‘‘మీకేమైనా పిచ్చా?’’ అని. ‘‘అయినా ఇదేమైనా సినిమానా? భవిష్యత్తులో గొడవపడతామని, ఆ గొడవేమిటో ఇపుడే పడాలని నిర్ణయించుకోవడం ఏమిటి? అయినా ఇప్పటికిప్పుడు గొడవెలా పడగలరురా..? నువ్వేమైనా నేచురల్ స్టార్‌వా? నిశ్చల ఏమైనా సహజ నటా?’’
‘‘కిరణ్.. నిశ్చల ఏం చేసినా కరెక్టుగానే ఉంటుంది..’’ భార్యను వెనకేసుకు వచ్చాడు నిహార్.
‘‘ఇదేం కరెక్టురా.. సంవత్సరం వరకూ గొడవ పడ్డమేమిటి? ఈ ఐడియా ఏ సినిమా వాళ్లతో చెబితే, అబ్బో.. పాయింట్ బావుందే అని నొక్కేస్తారు.. నో డౌట్.. కానీ ప్రాక్టికల్‌గా ఎలా వర్కవుట్ అవుతుంది?’’ సాలోచనగా అన్నాడు కిరణ్.
‘‘సాయంత్రం మనం నలుగురం.. మనింట్లో కలుస్తున్నాం.. అక్కడ మాట్లాడుకుందాం’’ చెప్పాడు నిహార్.
ఒక్క క్షణం అయోమయంగా బుర్ర గోక్కున్నాడు. ఆలోచిస్తూ ఉంటే మైండ్ బ్లాంక్ అవుతుందేమోనన్న భయంతో కామ్‌గా ఉన్నాడు.
అప్పుడే నిశ్చల నుండి ఫోన్ వచ్చింది నిహార్‌కు.
‘‘నిశ్చలా నువ్వా.. ఎగ్జయిట్‌మెంట్‌గా మాట్లాడబోయాడు.. అప్పుడే తమ ఒప్పందం గుర్తొచ్చి చాలా క్యాజువల్‌గా మాట్లాడుతున్నట్టు.. చెప్పు..’’ అన్నాడు.
‘‘ఈరోజైనా పెందరాళే వచ్చేదుందా.. రాచకార్యాలున్నాయా?’’ అవతలివైపునుంచి నిశ్చల గొంతు బయటకు కూడా వినిపిస్తోంది.
కిరణ్ ఒక్కక్షణం స్థాణువయ్యాడు. నిశ్చల నోట అలాంటి పరుషమైన మాటలా?
‘‘నేనేం ఇంట్లో కూచోని గోళ్లు గిల్లుకుంటూ లేను.. ఆఫీసులో పని వుంది.. లేట్ అవుతుంది. నువ్వు తిను..’’ రెక్‌లెస్‌గా చెప్పాడు నిహార్.. చెప్పినట్టు నటించాడు.
అంతే టక్కున ఫోన్ కట్ చేసింది నిశ్చల.
అలానే పిచ్చిచూపులు చూస్తూ ఉండిపోయాడు కిరణ్.
‘‘ఏమిట్రా ఇదంతా?’’ అయోమయంగా అన్నాడు కిరణ్.
‘‘ఏమీ అనలేదు.. అతనికి మనసంతా దిగులుగా వుంది.. అనవసరంగా తాను నిశ్చలను హర్ట్ చేశాడు.. తాను అలా మాట్లాడినందుకు నిశ్చల ఎంత బాధపడుతుందో.. వెంటనే ఫోన్ చేసి సారీ చెప్పాలి..’’ అనుకున్నాడు.
అటువైపు నిశ్చల కూడా అలానే ఫీల్ అవుతుందన్న విషయం అతని మనసుకు తెలుస్తూనే వుంది.
ఎందుకంటే రెండు దేహాల ఏకాత్మ వాళ్లు కాబట్టి.
***
రాత్రి ఏడు గంటలు..
నిశ్చల-నిహార్, కిరణ్-పావని ఆ గదిలో సమావేశమయ్యారు.
పావని నిశ్చల వంక అలానే చూస్తూ ఉండిపోయింది. చాలాసేపటివరకూ తేరుకోలేకపోయింది. ‘‘అసలు నువ్వేం చేస్తున్నావే.. నేను నీకు చెప్పిందేమిటి? నువ్వు చేస్తున్నదేమిటి? నాకసలు ఏమీ అర్థం కావటంలేదు..’’ పావని సూటిగా అడిగింది.
‘‘ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది.. వెరీ సింపుల్.. నువ్వు చెప్పిన థియరీ ప్రకారం పెళ్లయ్యాక సంవత్సరంపాటు భార్యాభర్తల్లో ప్రేమ ఇష్టం ఉంటాయి.. ఆ తరువాత గొడవలు మొదలవుతాయి.. అలా గొడవలు ఎందుకు మొదలవుతాయి.. ఆకర్షణ తగ్గడంవల్లనా? ఒకరిమీద మరొకరికి నమ్మకం లేకపోవడంవల్లనా? నాకూ క్లారిటీ లేదు కానీ, ఒక్కటి అర్థమైంది.. సంవత్సరం వరకూ కొత్తగా పెళ్ళైన మేము.. సంవత్సరం తర్వాత ఎలా ఉంటామో.. ఇపుడే అలా వుండాలనిపించింది.. ఈ సంవత్సరంపాటు గొడవలు అలకలు అపార్థాలతో గడిపేస్తాం.. సంవత్సరం పూర్తయ్యేసరికి మా లోపలు మాకు తెలిసివస్తాయి.
ఇక సంవత్సరం తర్వాత మిగతా జీవితమంతా ఆనందంగా వుంటాం.. ఈ సంవత్సరకాలంలో చేసిన తప్పులు పొరపాట్లుచేయం.. ఒక్కసారి మమ్మల్ని మేము సెల్ఫ్ చెక్ చేసుకుంటాం..’’
పావనికి, కిరణ్‌కు కొత్తగా అనిపిస్తోంది.. ఆలోచించి చూస్తే బాగానే అనిపిస్తోంది..
నిశ్చల కొనసాగించింది ‘‘కాకపోతే మాదొక రిక్వెస్ట్.. పెళ్ళైన సంవత్సరం తర్వాత గొడవలు ఎందుకు వస్తాయో తెలుసుకోవడం కోసం మేము ఎలాగైతే వర్తమానాన్ని భవిష్యత్తులోకి పంపి, భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకువచ్చామో.. మీరూ అలానే.. మీ గతాన్ని ఆహ్వానించండి.. ఒక్క సంవత్సరంపాటు.. కొత్తగా పెళ్ళైనవారిలా వుండండి.. మీరు ఎక్కడ ప్రేమను మిస్సయ్యారో.. ఎక్కడ అపార్థాలతో గొడవలు పడ్డారో మీకు అర్థమవుంది’’ చెప్పింది నిశ్చల.
‘‘మేమా.. నో.. నెవర్’’ కిరణ్, పావని ఒకేసారి అన్నారు కోరస్‌గా.
‘‘ఇలాంటి రాక్షసితో ప్రేమగా వుండడమా?’’ కిరణ్ అన్నాడు.
‘‘ఇలాంటి మనిషిని మళ్లీ సంవత్సరంపాటు భరించి ప్రేమ నటించడమా? నెవర్’’ అంది పావని.
‘‘ఈ ప్రపంచంలో పెళ్ళై సంవత్సరమో.. రెండేళ్లో నిండిన ప్రతివారూ ఇలానే అనుకుంటే... విడాకులతో దేశంలోని ముప్పావువంతు దంపతులు కోర్టు మెట్లు ఎక్కాలి.. పావని.. నువ్వు చెప్పినట్టు మేము వింటున్నాం. మేము చెప్పినట్టు మీరు వినండి.. సంవత్సరంపాటు.. ప్లీజ్’’ అంది నిశ్చల.
అయిష్టంగానే ఒప్పుకున్నారు.
పాత్రలు మారిపోయాయి.

-సశేషం

-తేజారాణి తిరునగరి