డైలీ సీరియల్

ఎప్పుడె ప్పుడు?-16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతాలు వర్తమానాలు భవిష్యత్తు కాలాలు స్థితులు తప్పాయి.. దంపతుల దశను దిశను మార్చడానికి...
ఎప్పుడెప్పుడు సంవత్సరం గడుస్తుందా...? ఎప్పుడెప్పుడు రెండు రెళ్ళు నాలుగు గుండెల చప్పుళ్ళు ఏ నిజాన్ని చెబుతాయో..?
***
9
పావని.. కిరణ్...
ఇద్దరూ బెడ్‌రూమ్‌లో వున్నారు చెరోవైపు తిరిగి.
‘‘మీ ఫ్రెండ్ మనస్తత్వం నాకు అర్థం కావడంలేదు.. ఇదేదో సినిమా కథలా వుంది. లేకపోతే.. మనం ఒక సంవత్సరం వెనక్కి వెళ్ళడం ఏమిటి? ఇదేమైనా టైం మిషన్ స్టోరీనా?’’ అన్నాడు కిరణ్.
పావని సీరియస్‌గా ఆలోచిస్తోంది.. నిశ్చల చెప్పినపుడు తనకూ అలానే అనిపించింది. కానీ ఇపుడు ఆలోచిస్తుంటే నిశ్చల చెప్పిందాంట్లో ఎంతో కొంత నిజం ఉందనిపిస్తోంది. సంవత్సరం వెనక్కి వెళ్లండి.. గడిచిన గతాన్ని వెనక్కి తీసుకురావడం సాధ్యం కాదు కానీ ఆ గతంలో గడిపిన స్మృతులను మళ్లీ నిజం చేసుకోవచ్చుగా.. అప్పుడెలా ఉన్నామో, ఇప్పుడూ అలానే వుండి చూడొచ్చుగా.. ఒకే పనిని వేరు వేరు సమయాల్లో చేస్తే వేరు వేరు అభిప్రాయాలలు ఆలోచనలు కలుగుతాయని నిశ్చల చెప్పినపుడు తాను కొట్టిపడేసింది.. కానీ ఇపుడు నిజమే అనిపిస్తుంది..
నిశ్చల దగ్గరినుంచి వస్తూ దారిలో బుక్ షాప్‌లో ఒక పుస్తకం కొన్నది. అలా తిరగేస్తుంటే అందులోని ఓ కథ ఆలోచింపజేసింది.
‘‘ఇంటికి ఆలస్యంగావచ్చిన భర్తను భార్య నిలదీసి సాధిస్తుంది.. గొడవ చేస్తుంది.. పాతిళ్ళు గడుస్తాయి.. భర్త చనిపోతాడు. కొడుక్కి పెళ్లవుతుంది. ఆ రోజు కొడుకు ఇంటికి ఆలస్యంగా వస్తాడు. కోడలు కొడుకుతో గొడవ పడుతుంది. అచ్చు.. తాను పాతికేళ్ల క్రిందట భర్తతో గొడవపడ్డట్టే.. అపుడు తమ మధ్య వారం రోజులు మాటల్లేవు.. ఇపుడు ఆలోచిస్తుంటే ఒక చిన్న విషయానికి భర్తతో గొడవపడ్డం ఎంత మూర్ఖత్వమో అనిపిస్తుంది.. తమ జీవితంలోని విలువైన ఏడు రోజులు కోల్పోవడం కాదు.. తమ వైవాహిక జీవితంలో అర్థం లేని చేదుజ్ఞాపకంగా, మచ్చగా మిగిలిపోయింది.
ఇపుడు కోడలికి చెప్పినా అర్థం కాదు.. కాలం మాత్రమే చెప్పాలి.. కానీ కాలం చెప్పేసరికి వాళ్ళ ఆనందానికి కాలం చెల్లిపోతుంది.
ఇక్కడ విచక్షణ విశాల దృక్పథం, ప్రాక్టికల్ థింకింగ్ మాత్రమే పనికివస్తుంది కాబోలు...
ఇపుడు నిశ్చల చెప్పింది కూడా అలానే వుంది.. తాను కానీ కిరణ్ కానీ, తమలాంటి వాళ్ళు కానీ ఆలోచించి చూస్తే పరిష్కారం దొరకవచ్చు. పావని కిరణ్ దగ్గరికి వచ్చి ‘‘కిరణ్.. ఓసారి నిశ్చల చెప్పినట్టే చేద్దాం.. సంవత్సరం.. జీవిద్దాం.. కుదరకపోతే నటిద్దాం.. కొట్టుకుంటూ జీవించే బదులు నవ్వుకుంటూ నటిస్తే బావుంటుంది కదా’’ అతని మొహన్ని తన చేతుల్లోకి తీసుకుని అంది.
చాలా రోజుల తర్వాత.. కిరణ్‌కు ఆ స్పర్శ కొత్తగా అనిపించింది. అలానే పావనిని దగ్గరికి తీసుకున్నాడు.
***
సడెన్‌గా మెలకువ వచ్చింది నిశ్చలకు. పక్కనే వుండవలసిన భర్త లేడు.. ఒక్క ఉదుటన లేచింది. ఆమె మనసులో చిన్న భయం.. కంగారు.. ఆదుర్దా.. కిచెన్ రూములోనుంచి వంట పాత్రల శబ్దం.. కిచెన్‌లోకి వెళ్లి చూసి షాకయింది.. లుంగీ, బనియన్‌తో కిచెన్‌లో కుస్తీ పడుతున్నాడు. స్టవ్ మీద పాలు పొంగుతున్నాయి. షుగర్ డబ్బా కోసం వెతుకుతున్నాడు. ఈలోగా పాలు పొంగుతున్నాయని స్టవ్‌మీద వున్న గినె్నను చేత్తో దించబోయాడు. వేడిగా వున్న గినె్న కాలింది. పెద్దగా కేక వేసి పాలగినె్న వదిలేశాడు. వేడిపాలు నేలమీద పడి.. మరికొన్ని పాలు అతని పాదాలమీద పడ్డాయి.
అరవబోయి ఆ చేత్తో తన నోరు తానే మూసుకున్నాడు.. క్లాత్ తీసుకుని కింద పడ్డ పాలను తుడుస్తున్నాడు. ఏ మాత్రం శబ్దం అయినా నిశ్చల నిద్రలేస్తుంది.
‘‘ఒక్క ఉదుటున పరుగెత్తుకు వెళ్లింది.. నిహర్‌ని గట్టిగా పట్టుకుంది. అతడిని బెడ్‌రూమ్‌లోకి తీసుకువచ్చింది. అతని పాదాలను టవల్‌తో తుడిచింది. నిశ్చలకు ఏడుపు తన్నుకు వస్తోంది..
‘‘మీకసలు బుద్ధి ఉందా? అసలు కిచెన్‌లోకి ఎందుకు వెళ్లారు..?’’ ఏడుస్తూనే వుంది. అలానే చూస్తూ ఉండిపోయాడు.
‘‘ఏమిటలా చూస్తున్నారు.. ముందు పడుకోండి.. ఇంత పొద్దునే్న అసలు మిమ్మల్ని ఎవరు లేవమన్నారు?’’ ఏడుస్తూనే మాట్లాడుతోంది.
‘‘నా మొగుడు...’’ బాధను ఓర్చుకుంటూనే చిన్నగా నవ్వుతూ చెప్పాడు. భార్య చూపించే ప్రేమ అతనికి నొప్పిని తెలియనివ్వడంలేదు. ఇష్టమైన వ్యక్తి అంతకన్నా ఇష్టంతో చుట్టేసిన స్పర్శ ఎనస్థీషియాకన్నా ఎక్కువగా పనిచేసి నొప్పి తెలియకుండా చేస్తుందేమో..
‘‘మీ మొగుడా.. వాడెవడు.. నేనేగా?’’ అని నోరు కర్చుకుంది నిశ్చల.. అంత ఏడుపులోనూ నవ్వు వచ్చింది. నేను మీ మొగుడిని ఏమిటి.. నేనెప్పుడూ మీ భార్యనే.. మిసెస్ నిశ్చలా నిహార్’’ అంది.
‘‘నిశ్చలా.. నీకన్నా ముందే లేచి నువ్వు నాకెలా కాఫీ ఇచ్చి గుడ్ మార్నింగ్ చెబుతావో.. అలానే నేనూ నీకు గుడ్ మార్నిగ్ చెబుదామని అనుకున్నాను. టిఫిన్ కూడా ప్రిపేర్ చేద్దామనుకున్నాను.
‘‘చట్నీ ఇడ్లీ పిండితో చేస్తారా, దోసె పిండితో చేస్తారా?’’ అనే విషయంలో క్లారిటీ రాలేదు. పైగా మనం ఇపుడు ఫ్యూచర్‌లో వున్నాం.. పొద్దునే్న పెళ్లానికి బెడ్ కాఫీ ఇచ్చి లేపొచ్చుగా అని నువ్వు విసుక్కోవాలి.. వెంటనే నేను సీరియస్‌గా రియాక్టయి.. మగాడ్ని.. నేనెందుకు చేస్తాను.. అని నీ మీద విసుక్కోవాలి.. ఇద్దరం చెరోవైపు కోపంగా తిరిగి పడుకోవాలి.. నేను విసురుగా ఆఫీస్ వెళ్తాను.. అక్కడ ఆకలేస్తే ఏదో ఒకటి తింటాను.. నువ్విక్కడ పస్తు ఉంటావు.. పైగా నాతో గొడవ పడ్డందుకు బాధపడుతూ వుంటావు.. నటన ఒక భాగమైనా భరించలేను.. నీతో జీవించడమే నాకు ఇష్టం..
నిశ్చల ఒడిలో తలపెట్టి ఆమె మంగళసూత్రాలతో ఆడుకుంటూ అన్నాడు.
అలానే చప్పున వంగి మొగుడిని ముద్దులతో ముంచెత్తింది.. కన్నీటి చెమ్మను స్పర్శ అనే వైపర్‌తో క్లీన్ చేస్తుంది.
‘‘వద్దండీ పొరపాటున ఈ ఆట మొదలుపెట్టాం.. ఇక్కడితో ఆపేద్దాం..’’ ఏడుస్తూ అంది నిశ్చల.
‘‘లేదు నిశ్చలా.. యుద్ధమైనా.. పందెమైనా మధ్యలో వదిలిపెట్టకూడదు.. నువ్వే కరెక్ట్.. ఏ సంఘటన నీ మనసులో జరిగింది కాబట్టి.. ఇంకెప్పుడూ నాతో ఇలాంటి పని చేయించవు.. కొన్ని పనులు భార్యలు చేస్తేనే అందంగా ఉంటుంది. భార్యకు ఒంట్లో బావోలేనపుడు భర్త చేసే సేవలు స్వీట్ మెమెరీస్‌గా ఉంటాయి.. అపుడపుడు పొద్దునే్న సర్ప్రయిజ్‌గా భర్త భార్య కోసం కాఫీ చేసినా, టిఫిన్ చేసినా చూడబుల్‌గా ఉంటుంది.
భార్య కిచెన్‌లో వంట చేస్తుంటే, భార్యకు సాయం చేస్తూ, అపుడపుడు హగ్ చేసుకుంటూ, అల్లరిచేస్తూ ఉంటే కలర్‌ఫుల్‌గా రెయిన్‌బోలా, రొమాంటిక్‌గా వుంటుంది...
ఇలాంటప్పుడే.. నాకు చిన్న దెబ్బ తగిలినపుడు తల్లడిల్లే నీ బాధను, నువ్వు చూపించే ప్రేమను, నీకు నామీద వున్న ఇష్టాన్ని చూడగలుగుతున్నాను...
యు ఆర్ రైట్.. కొంతకాలం కంటిన్యూ చేద్దాం.. ప్రస్తుతానికి నాకు నీ ట్రీట్‌మెంట్ చాలా అవసరం..’’ అన్నాడు నిహార్.
‘‘నేనా.. ట్రీట్‌మెంట్ చేయడానికి నేను డాక్టర్‌ను కాదుగా... కళ్ళు తుడుచుకుంటూ’’ అంది.
‘‘మనసుకు ట్రీట్‌మెంట్ చేయడానికి డాక్టర్ ఎందుకు.. నువ్వు చాలు.. ఫీజుగా కౌగిలి కూడా ఇచ్చుకుంటాను’’ ఆమెను చుట్టేస్తూ అన్నాడు.

-సశేషం

-తేజారాణి తిరునగరి