డైలీ సీరియల్

యాజ్ఞసేని-97

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నీ కులం ఏది? నీ పేరేమి? నీవు ఎవరిదానవు? ఏ పనిమీద ఎక్కడకు వెళ్ళుదామని బయలుదేరావు? అం తా మాకు స్పష్టంగా చెప్పుము’’ అని అన్నది. సుదేష్ణ ప్రశ్నలకు ద్రౌపది-
‘‘నేను సైరంద్రీ జాతిలో పుట్టాను. నా పేరు మాలిని. అయిదుగురు భర్తలతో ఉంటాను. ఒకానొక కారణంవలన విరోధులు నా మగల ఎదుటే నన్ను జుట్టుపట్టి లాగారు. మగలతో అడవికి వెళ్లాను. బ్రహ్మచర్యాన్ని అవలంభించాను. ఇక నా నియమం పూర్తికావటానికి ఒక యేడు మాత్రమే ఉన్నది. నీవు ధర్మపరురాలవని విన్నాను. నీ వద్దనే ఉండాలనుకొన్నాను. అందుచేత ఇక్కడకు వచ్చాను. నా చేతనైన పనులు చేస్తాను’’ అని చెప్పగా సుదేష్ణాదేవి-
‘‘్భమినీ! నీవు చెప్పినట్లు నీ రూపం లేదు. ఇట్టి రూపం కలది సైరంధ్రి కాజాలదు. అనేక దాసదాసీ జనులకు పని చెప్పేటట్లు నీవు ఉన్నావు. నీ మడమలు ఎత్తుగా లేవు. ఒరసిన తొడలు, లోతనై నాభి, వాక్కు, బుద్ధి కలదానవు. ముక్కు, చెవి, కళ్ళు, స్తనాలు, గోళ్ళు, పెడతల అనే ఆరూ వున్నంతగా వున్నాయి. హంసవలె గద్గద స్వరం ఉన్నది. వంపు తిరిగి కనుబొమలు గల నేత్రాలు, దొండపండు వంటి ఎఱ్ఱని పెదవి, శంఖం వంటి కంఠం, పున్నమి చంద్రుని పోలిన ముఖము కల్గిన నీవు సైరంధ్రివి కాజాలవు. వలువలతో సేవించబడే లక్ష్మితో సమానమైన రూపంగల నీవు దాసివి కాజాలవు. నిజము చెప్పుము. యక్షకన్యవా? దేవతవా? గంధర్వ యువతివా? అప్సరసవా? దేవకన్యవా? నాగకన్యవా? ఆలంబున, మిశ్రకేళి, పుండరీక, మాలిని అనే దేవకాంతలలో ఒకతెవా? ఎవరు నీవు? నిజం తెలుపుము’’ అని అడిగింది.
సుదేష్ణాదేవి వెలిబుచ్చిన సందేహాలను నిన్న ద్రౌపది-
‘‘మహారాణీ! నేను దేవకాంతను గాను. గంధర్వినిగాను. అసుర వనితను అసలే కాను. రాక్షస వనితగానూ గాను. నేను కేవలం పనికి వచ్చిన ‘సైరంధ్రి’ని మాత్రమే. ఇది నిజం. మల్లెలు, మాలలు, కలువలు, పద్మములు, సంపెంగలు మున్నగువానితో చిత్రములైనవి, మిక్కిలి సొంపైనవియగు మాలలను అల్లగలను. కలపాలు కలపటం తెలుసును. రకరకాల తిలకాలు దిద్దటమూ తెలుసు. వింత వింతలగు చెండ్లను ముద్దుగా తలలో ముడవటం బాగా నేర్చాను. నేను పూర్వం శ్రీకృష్ణుని పట్టపురాణి, ప్రియురాలు అయిన సత్యభామను కొలచి వుంటిని. అట్లే పాండవుల భార్య అయిన ద్రౌపదిని కూడా సేవించితిని. మంచి భోజనము లభించన చోట యిట్లే వృత్తిచేసికొనిచున్నాను. కూడు గుడ్డలిచ్చిన చాలు. నాకు ‘మాలిని’ అనే పేరు ఆయమ్మ పెట్టింది. ఓ సుదేష్ణాదేవి! నేను ఇప్పడు నీ ఇంటికి వచ్చితిని’’ అని అనగా-
‘‘్భమా! నీ రూపాన్ని చూచి మా రాజు వుబ్బి ఉవ్విళ్ళూరగలడు. అటువంటి నీ చేత ఎట్లా పనిచేయించుకొంటాను? ఆడవాళ్ళు కూడా నీ మీద చూపులు నిలిపి వింతగా చూస్తారు. నిన్ను భరించటం కష్టమైన పని. పీత గర్భం వంటిదే నీ రక్షణ. నా సంపూర్ణ వినాశనం నేనే కొని తెచ్చుకోవటం వంటిదే’’.
‘‘ఓ సుదేష్ణాదేవీ! నీవనుకొన్నట్లు కానే కాదు. అమ్మా! విరాటుడుగానీ, మరొకడుగానీ నా జోలికి రాలేరు. నాకు యువకులైన అయిదుగురు గంధర్వ భర్తలు అసామాన్యులు. బలం కల వారు వున్నారు. వారు గంధర్వ రాజు కుమారులు. ఒక్క నిమిషమైనా నా విషయంలో పరాకుగా వుండరు. నన్ను ఎవడైనా నీచ బుద్ధితో చూస్తే నా పతులు ఆ నీచుడిని ఆ రాత్రే కడతేరుస్తారు.
నేను కఠినమైన నియమం కలదానను. నాకు ఎంగిలి పదార్థాలు పెట్టరాదు. పాదాలు వత్తమని చెప్పరాదు. అటువంటివారి వద్ద నేను నివసిస్తే నా గంధర్వ పతులు సంతోషించరు. ఇతర స్ర్తిలవలె నన్ను కోరినవాడు ఆ రాత్రే ఈ శరీరం విడుస్తాడు. అమ్మా! నన్ను నా ధర్మం నుండి ఎవరూ చలింపజేయలేరు. ఇపుడు కష్టాలలో వున్నా బలవంతులైన నా భర్తలు రహస్యంగా వుండి నిత్యమూ నన్ను రక్షిస్తుంటారు’’.
ఆ మాటలు విన్న సుదేష్ణాదేవి ‘‘ఆనందదాయినీ! సైరంధ్రీ! నీవు కోరినట్లే అగుగాక. నీవు ఇక్కడ వుండవచ్చును. పాదాలు గానీ, ఎంగిలిగానీ, నీవు తాకనవసరంలేదు’’ అని అన్నది.
పతివ్రతా ధర్మం అనుసరిస్తూ ద్రౌపది ఆ విరాట నగరంలో సుదేష్ణ వద్ద నివసించసాగింది. ఆమెను గూర్చిన యధార్థం ఎవరూ తెలుసుకొనలేకపోయారు.
47
కీచకుడు సైరంధ్రిని మోహించుట
పాండవులందరూ వరుసగా ధర్మరాజు, భీమసేనుడు, ద్రౌపది, నకులుడు, అర్జునుడు, సహదేవుడు విరాటుని కొలువులో కంకుడు, వల్లవుడు, సౌరంధ్రి, గంధికుడు, బృహన్నల, తంతిపాలుడు అనే నామాలతో చేరారు. సుఖంగా వున్నారు.
ద్రుపదుని కూతురు, యాజ్ఞసేని, స్వయంగా రాణివలె సేవలు పొందటానికి అర్హురాలైనది సుదేష్ణాదేవికి సేవలు చేస్తూ మిక్కిలి కష్టంగా కాలం వెళ్ళబుచ్చుతోంది.
..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము