డైలీ సీరియల్

ఎప్పుడె ప్పుడు?-19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రిజ్‌లో.. మామూలుగా పెట్టడానికి, డీప్ ఫ్రీజర్‌లో పెట్టడానికి తేడా అదే.. నిహార్ లాంటి వ్యక్తి ప్రేమలో మార్పు ఉండదు.. జీవిత సత్యాన్ని తెలుసుకోవడానికి అట్టే సమయం అవసరం ఉండదు. మెరుపువేగంతో అతనికి సమస్య అర్థమైంది. జీవితంలో ఎప్పుడూ కలిసే ఉండాలన్న థియరీ బలంగా అతనిలో నాటుకుంది.
‘‘నిశ్చలా.. ఏమిటీ దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?’’’ అడిగింది పావని.
అప్పుడే నిహార్ నుంచి పావనికి ఫోన్ వచ్చింది.
‘‘నిహార్..’’ పావని నిశ్చలకు చెప్పింది.
‘‘లిఫ్ట్ చేయ్.. స్పీకర్ ఆన్ చేయ్..’’ చెప్పింది నిశ్చల. అనుమానంతో కాదు నిహార్ గొంతు వినాలన్న కోరికతో..
‘‘హలో నిహార్.. చెప్పు..’’ అంది పావని.
‘‘నాకు చిన్న హెల్ప్ చేయాలి. చిన్న హెల్ప్ కాదు పెద్ద సాయమే.. ప్లీజ్ పావని.. చేస్తావు కదూ...’’ చిన్నపిల్లాడిలా అడుగుతున్నాడు.
వెంటనే విషయమేమిటో అర్థం కాలేదు.. నిశ్చల కూడా అదే సందిగ్ధంలో వుంది.
‘‘నువ్వు అర్జెంట్‌గా మా ఇంటికి వెళ్ళాలి.. నేను నిశ్చల కోసం స్టార్ హోటల్ నుంచి మీల్స్ పట్టుకొస్తాను... ఈ రోజు నీ పుట్టినరోజనో.. మరోటో చెప్పి బలవంతంగా నువ్వు నిశ్చలతో అన్నం తినిపించాలి.. ప్లీజ్ పావని.. పాపం, తను ఉదయం నుంచి ఏమీ తినలేదు.. మీ ఫ్రెండ్ కోసం ఈ పని చేయ్..’’ నిహార్ గొంతు బాధతో కూరుకుపోయింది. ఒక్క క్షణం పావని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నిశ్చల అయితే ఏడ్చేసింది.
వెంటనే పావని చేతిలోనుంచి ఫోన్ లాక్కుంది.
‘‘ఏయ్ మొద్దు.. నువ్వు ఆఫీస్ అయిపోగానే ఇంటికొచ్చేయ్.. ఆపరేషన్ ‘ఎప్పుడెప్పుడు’ ఈవేళ్టితో ఫినిష్.. తొందరగా వచ్చేయ్..’’ అంది ఫోన్ కట్ చేస్తూ..
పావని నిశ్చల ఒకరినొకరు గట్టిగా వాటేసుకున్నారు.
‘‘పావని నువ్వు తొందరగా వెళ్లిపోవే.. నా మొగుడికి డిన్నర్ రెడీ చేయాలి.. బెడ్‌రూమ్ డెకరేట్ చేసుకోవాలి.. ఇంకా..’’ అంటూ పావని వైపు చూసి అంది.
‘‘చాల్చాల్లేవే... నీకు ఒక్కర్తికే మొగుడున్నట్టు.. మాకూ వున్నాడు.. మేమూ డెకరేట్ చేసుకుంటాం’’ నవ్వుతూ అంది నిశ్చల చేతిని గట్టిగా నొక్కి వదిలి.
ఉపసంహారం.. సర్జికల్ స్ట్రైక్
ఆఫీస్ వదలగానే కిరణ్, నిహార్ బయటకు వచ్చారు. నిహార్‌లో ఆనందం తెలుస్తూనే వుంది. పావని కిరణ్‌కు ఫోన్‌చేసి అంతా చెప్పింది.
‘‘నిహార్ ఈసారి నన్ను ఇంటిదగ్గర దింపి నువ్వు వెనక్కి వచ్చి సన్నజాజులు నువ్వొక్కడివే కొనుక్కోకుండా నన్నూ తీసుకువెళ్ళు.. మేమూ తీసుకుంటాం..’’ అన్నాడు.
ఇద్దరూ పూల మార్కెట్ దగ్గరికి వచ్చారు. పూలు అమ్మే అవ్వ నిహార్‌ను గుర్తుపట్టింది.. ‘‘అవ్వా.. ఈ బుట్ట మొత్తం ఎంతకిస్తావు?’’ అడిగాడు హుషారుగా.
‘‘మొత్తం ఇస్తే మీ స్నేహితుడు బాధపడతాడు బాబు.. సగం బుట్ట ఇస్తాను’’ కిరణ్‌ను చూసి అంది. పెళ్ళైన కొత్తలో ప్రతిరోజూ ఇక్కడే కిరణ్ పూలు తీసుకువెళ్ళేవాడు...
ఒక్కక్షణం గిల్టీ ఫీలింగ్.. ఇన్నాళ్లు తను మిస్సయిన జ్ఞాపకాలు రోజులు గుర్తొచ్చాయి.
ఇద్దరూ పూలు తీసుకున్నారు. కిరణ్‌ను ఇంటిదగ్గర దిగబెట్టి వెళ్తుంటే... పావని ఆపి గిఫ్ట్ ప్యాకెట్ నిహార్ చేతిలో పెట్టింది.
‘్థంక్యూ’ గిఫ్ట్ అంది.
***
బైక్ ఇంటిముందు ఆపగానే గుమ్మం దగ్గర అభిసారికగా నిలబడి వుంది. ఇద్దరిమధ్యా దూరం క్షణాలే.. ఎవరు ముందు కదిలారో.. ఎవరు ముందు గట్టిగా హత్తుకున్నారో.. కాలానికి సైతం అర్థం కానీ వేగం..
***
‘‘నిశ్చల ఇది కలా? నిజమా? కొన్ని రోజులు దూరంగా ఉండలేకపోయాను... జీవితాంతం మనం గొడవపడుతామని ఎలా అనుకున్నావు? ఆమె ఒడిలో తలపెట్టి అడిగాడు.
‘‘అనుకోలేదు.. మనల్ని మనం పరీక్షించుకున్నాం.. సర్జికల్ స్ట్రైక్‌లా మెరుపు వేగంతో మనమేమిటో.. మన ప్రేమ ఏమిటో తెలుసుకున్నాం. అందుకే ఎప్పుడెప్పుడు అని ఎదురుచూసే విరహానికి సెలవిచ్చి, ప్రతీక్షణం మనకు మధురోహలు మిగిల్చే కాలానికి ఎప్పటికప్పుడు స్వాగతం పలుకుతూ ఉందాం.
‘‘మనసులో ప్రేమ ఉంటే, ఆ ప్రేమలో నిజాయితీ ఉంటే, ఒకరినొకరు అర్థం చేసుకోగలిగితే.. జీవితంలోని రాలిపోయే క్షణాలను అందమైన జ్ఞాపకాలుగా మార్చుకోగలిగితే.. గతం జ్ఞాపకంగా, వర్తమానం అనుభూతిగా, భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది.. మనకే కాదు ఏ జంటకైనా వర్తించే నిజం ఇది’’- అతడి మనసును చుట్టేస్తూ అంది.
***
వాళ్ళమధ్య అపార్థాలు రావు.. ఎందుకంటే ప్రేమకు అర్థం తెలుసుకున్నారు కాబట్టి..
వాళ్ళమధ్య అపోహలు వుండవు...
ఎందుకంటే అపోహలను అనుభవించి, అవి (అపోహలు) అర్థంలేనివి అని తెలుసుకున్నారు కాబట్టి.
వాళ్ళ మధ్య శూన్యం ఉండదు.. ఎందుకంటే శూన్యాన్ని భర్తీ చేసుకునే ప్రేమ వాళ్ళమధ్య నిలిచిపోయింది కాబట్టి.
వాళ్ళమధ్య అద్భుతమైన నిరీక్షణ అనుక్షణం ఎదురుచూస్తుంది..
ఎందుకంటే.. ఎప్పుడెప్పుడు అంటూ ప్రతిక్షణాన్ని వాళ్ళు ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ ఆహ్వానిస్తారు కాబట్టి..
నిహార్ తెచ్చిన సన్నజాజులను పాన్పుగా అలంకరించి తను దుప్పటిగా మారింది నిశ్చల.
పెళ్ళైన సంవత్సరంపాటు వుండే ఆకర్షణ, ఆ తరువాత ప్రతీ క్షణం ప్రేమగా మారితే.. పరస్పరం అనుబంధం ఆలుమగలను అల్లుకునే బంధమనే తీగగా మారి కట్టిపడేయాలి... ఆకట్టుకోవాలి.

-అయిపోయింది

-తేజారాణి తిరునగరి