డైలీ సీరియల్

పంచతంత్రం -- 3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇందాక నా గురించి డ్రైవర్‌తో ఏమన్నావ్? నేను నీకు ఏదో అవుతాను అన్నట్టున్నావ్??’’ కోపంగా అడిగింది గోపిక.
‘‘ఆ సంగతి ఇప్పుడు అడుగుతున్నావేంటి? అప్పుడే అడక్కపోయావా?’’
‘‘అడిగేదానే్న!....కానీ!!...’’
గోపికకు ఏంచెప్పాలో అర్ధంకాలేదు. ఆ సమయంలో ఆమె పిల్లర్ వెనక దాక్కుని ఉంది. ఆమె ఆలోచిస్తుండగానే కార్తీక్ పక్క సీట్లో కూర్చున్నాడు.
ఇక ఆ సంభాషణ పొడిగిస్తే తాను దాక్కున్న విషయం బయటపడుతుంది అని ఆమెకు భయం వేసింది. దాంతో ముఖం గంభీరంగాపెట్టి సంభాషణ మార్చుతూ-
‘‘నేను ముందరే కండిషన్ పెట్టా!.... నా పక్క సీట్లో కూర్చోకూడదని!’’ అన్నది గోపిక.
‘‘నువ్వు ఒప్పందాన్ని రద్దుచేసావ్!. నన్ను మోసంచేయాలి అనుకున్నావ్!. ఆ దేముడి దయవల్ల నా సీట్ నాకు దక్కింది. ఒప్పందం లేదు, గిప్పందం లేదు’’ అన్నాడు కార్తీక్.
‘‘నీలాంటి వాడితో వాదించకూడదు అనీ, అన్ని వేళల్లో ఆనందంగా ఉండాలి అనీ బాబా ఆనందబ్రహ్మ చెప్పారు. అందుకే నేను నీలాగా గొడవ పడను...’’అన్నది గోపిక.
బాబా ఆనందబ్రహ్మ అనే వ్యక్తి తానే దేముడిగా ప్రచారం చేసుకుంటున్నాడు. ఆయనకు గోపిక, ఆమె కుటుంబ సభ్యులు పరమ భక్తులు.
గోపిక తలపైకి లేపి కళ్ళుమూసుకుని ‘‘జై బాబా ఆనందబ్రహ్మ!’’అంటూ చెప్పి, సీట్‌కు ఆనుకుని- ‘‘నేను ఇక ధ్యానంలో ఉంటా నన్ను డిస్ట్రబ్ చేయవద్దు’’ అన్నది.
వెంటనే కార్తీక్ కూడా తల పైకి లేపి కళ్ళుమూసుకుని ‘‘జై! బాబా ఆనందబ్రహ్మ!’’ అన్నాడు.
కార్తీక్ అలా అన్న వెంటనే అతడి వంక ఆశ్చర్యంగా, అనుమానంగా, సంభ్రమగా చూస్తూ- ‘‘మీరుకూడా బాబా ఆనందబ్రహ్మ భక్తులా?’’ అంటూ అడిగింది.
‘‘అవును...! బాబా ఆనందబ్రహ్మగారి గుగ్గురువుగారు స్వయానా మా ముత్తాతయ్యగారు’’ అన్నాడు కార్తీక్.
‘‘నిజంగా?.... మీ ముత్తాతయ్యగారి పేరు ఏంటి?’’ అసలు గుగ్గురువు అంటే ఏంటి?’’ అంటూ ఆతృతగా అడిగింది గోపిక.
‘‘ప్లీజ్! నన్ను డిస్ట్రబ్ చేయవద్దు!. నేను ధ్యానంలో ఉన్నాను..... జై! బాబా ఆనందబ్రహ్మ!’’అంటూ కళ్ళు మూసుకున్నాడు కార్తీక్.
గోపిక ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని అతని వైపే చూస్తూ ఉండిపోయింది.
* * *
మనీ ఎక్స్ఛేంజి, మనీ ట్రాన్స్ఫర్ చేసే సంస్థల్లో ‘ది ఇంటర్నేషనల్ కరెన్సీ ఎక్స్ఛేంజి లొకేషన్ లిమిటెడ్’కూడా ఒకటి. ఆరోజు ఉదయం చాలా ఎర్లీగా ఆ సంస్థ కార్యాలయంలో పని మొదలైంది. అప్పటికే కస్టమర్లు కిటకిటలాడుతున్నారు. ఆరోజు డాలర్-రూపాయి మారకం విలువ ఒక్క డాలర్‌కి 67 రూపాయలు ఉంది. కానీ అక్కడ మాత్రం ఒక్క డాలర్ 100 రూపాయలు పలుకుతోంది. ‘ది ఇంటర్నేషనల్ కరెన్సీ ఎక్స్ఛేంజి లొకేషన్ లిమిటెడ్’ ఒక్కటే కాదు, దేశంలోని అనేక మనీ ఎక్స్ఛేంజి సంస్థలు డాలర్‌లను చాలా ఎక్కువ మొత్తానికి అమ్ముకుంటున్నాయి. రద్దయిన కరెన్సీ నోట్లను బ్లాక్‌మనీ ఉన్నవాళ్లు డాలర్‌లలోకి మార్చుకుంటున్నారు.
* * *
కార్తీక్ కళ్ళుమూసుకున్న ఐదు నిమిషాలవరకూ గోపిక చాలా ఓపికగా గడిపింది. కార్తీక్ ముత్తాత గురించీ, తన గురువు గుగ్గురువు గురించీ తెలుసుకోవాలి అని ఆమెకు మహా ఇదిగా ఉంది. అదే సమయంలో కార్తీక్‌కి కుడివైపు సీట్లలో అటు చివర విండో పక్కన కూర్చుని ఉన్న ఒక టీనేజ్ అమ్మాయి తల తిప్పి కార్తీక్ వైపు చూసింది. వెంటనే ఆమె ఫీలింగ్స్ మారిపోయాయి. ఆ అమ్మాయికి ఎడమ పక్కన ఇద్దరు లేడీస్ కూర్చుని ఉన్నారు. ఆమె వాళ్లతో-
‘‘ప్లీజ్! నేను ఆ చివర కూర్చుంటాను. మీరు ఇక్కడికి షిఫ్ట్ అవుతారా?’’ అంటూ అడిగింది. అందుకు వాళ్ళు ఒప్పుకున్నారు. సీట్స్ ఎక్స్ఛేంజి చేసుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయికీ, కార్తీక్‌కీ మధ్య దూరం తగ్గిపోయింది. అదే సమయంలో ఆ అమ్మాయిని చూసింది గోపిక. తను ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్లు గోపికకు అనిపించింది. వెంటనే ఆమెకు గుర్తుకు వచ్చింది. ఆ అమ్మాయిని తను వేణుగోపాలస్వామి టెంపుల్‌లో చూసింది. తన పక్కన కూర్చున్న వీడు టెంపుల్‌లో ఆ అమ్మాయిని కామెంట్ చేసాడు. ఆ అమ్మాయి గొడవ పడింది. ఇప్పుడు ఇక్కడ ఆ అమ్మాయిని చూసిన గోపిక ఒక్కసారిగా షాక్ అయింది.
‘‘ఐపోయింది! వీడి పని మటాష్...!! అప్పుడు ఎలాగోలా గుళ్లో తప్పించుకున్నాడు, ఇప్పుడు బస్సులో ఎక్కడికి పారిపోతాడు? ఎలా తప్పించుకుంటాడో చూద్దాం!’’
అనుకుంటూ ఆ అమ్మాయి వైపే కుతూహలంగా చూడసాగింది గోపిక. జరగబోయే సన్నివేశం తలచుకుంటే ఆమెకు నవ్వు ముంచుకు వస్తోంది. ఐనా పైకి నవ్వకుండా కంట్రోల్ చేసుకుంది.- ‘ఆ అమ్మాయితో గొడవ పడలేక వీడు తన హెల్ప్ అడగవచ్చు. తాను వాడికి ఏమాత్రం సహాయపడకూడదు’ అని నిర్ణయించుకుంది.
సీట్‌కు తల వాల్చి, కళ్ళుమూసుకుని పడుకుని ఉన్న కార్తీక్ వైపు ఆ అమ్మాయి చూసింది. చూసిన వెంటనే అసంకల్పితంగా ఆ అమ్మాయి పెదవుల మీద చిరునవ్వు ప్రత్యక్షం అయింది. కళ్ళలో ఏదో మెరుపు. ఆ అమ్మాయి ముఖంలో వచ్చిన మార్పులు చూసిన గోపికకు అనుమానం వచ్చింది.
‘తను చదివిన మిల్స్ అండ్ బూన్ నవలల్లో హీరోని చూస్తే, హీరోయిన్‌లో వచ్చే మార్పు ఈ అమ్మాయిలో కూడా కనపడుతున్నదేంటబ్బా...?’’ అనుకున్నది.
అదే సమయంలో ఆ అమ్మాయి ముందుకు వంగి కార్తీక్ భుజం మీద చెయ్యివేసి, మృదువుగా, ప్రేమగా తట్టింది. వెంటనే కార్తీక్ కళ్ళు తెరిచి ఆ అమ్మాయి వైపుచూసాడు, మరుక్షణం అతడు షాక్ అయాడు.
ఆ టైంలో అతడి ముఖం ఆ అమ్మాయి వైపు తిరిగి ఉంది. దాంతో అతడి ఫేస్ ఫీలింగ్స్ గోపికకు కనిపించటం లేదు. గోపికకు చాలా నిరాశ కలిగింది.
ఆ అమ్మాయి కార్తీక్‌తో ఏదో అనబోతోంది. అదే సమయంలో బస్సు ఆగింది.
‘‘ఫ్రంట్ టైర్‌లో గాలి తగ్గింది!. టైరు మార్చాలి!’’అంటూ డ్రైవర్ బస్సు దిగిపోయాడు. అదే అదనుగా....
‘‘అర్జంట్!’’అంటూ ఆ అమ్మాయికి చిటికిన వేలు చూపించి, వేగంగా బస్సు దిగి, ఆ పక్కనే ఉన్న చెట్ల చాటుకు పరుగుతీసాడు కార్తీక్.
అంత వేగంగా కార్తీక్ రియాక్ట్ అవుతాడని గోపిక గానీ, ఆ అమ్మాయి గానీ ఊహించలేదు.
‘‘నాక్కూడా అర్జంట్!’’ అనుకుంటూ ఆ అమ్మాయి కూడా వేగంగా బస్సు దిగింది.
ఊహాతీతంగా జరిగిన ఈ సంఘటనల పర్యవసానం ఏమిటో ఊహించలేక, జరగబోయే విషయం ఎలా జరుగుతుందో అర్ధంకాక, జరగబోయే గొడవ అంతా చూసి ఆనందించాలి అనే ఉత్కంఠతో తాను కూడా బస్సు దిగింది గోపిక.
అప్పటికి ఏపుగా పెరిగిన చింత చెట్టు వెనక ఉన్న దట్టమైన రెల్లుగడ్డి పొద చాటుకు వెళ్లి, రిలాక్స్ అయి జిప్ పెట్టుకుంటూ వెనక్కివస్తూ ముందుకు చూసి షాక్ అయ్యాడు కార్తీక్.
ఎదురుగా ఆ టీనేజ్ పిల్ల నిలబడి ఉంది.
‘‘అమ్మయ్య! ఇక్కడ ఎవరూ లేరు. ఇది తనను ఎన్ని తిట్టినా ఎవరూ వినరు.’’ అనుకున్నాడు కార్తీక్.
కానీ అప్పటికే ఆ పక్కనే ఉన్న పున్నాగ చెట్టు చాటున నిలబడి వాళ్ళు ఇద్దరినీ పరిశీలిస్తోంది గోపిక. ఈ విషయం తెలియని కార్తీక్, ఆ అమ్మాయితో-
‘ఇక కానివ్వండి!.... అయామ్ రెడీ!!’’అంటూ చెప్పాడు.
-సశేషం

-జి.వి.అమరేశ్వరరావు