డైలీ సీరియల్

యాజ్ఞసేని -- 102

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలా సభాసదులు అంటూ వుండగా ధర్మరాజుకు కీచకునిపై కోపంతో నుదుటిపై చెమటలు పట్టాయి. ద్రౌపది దీర్ఘంగా నిట్టూర్చి నిలబడింది. ధర్మరాజు యేదో చెప్పటానికిసిద్ధపడటం చూచి వౌనంగా నిలబడింది.
అప్పుడు యుధిష్ఠిరుడు ద్రౌపదిని చూచి
‘‘సైరంధ్రీ! ఇప్పుడిక నీవు యిక్కడ నిలువకుము. రాణియైన సుదేష్ణాదేవి అంతఃపురానికి వెళ్ళుము. భర్తలను అనుసరించే వీరపత్నులు అన్ని కష్టాలను వౌనంగా భరిస్తారు. పతి సేవా పూర్వకమైన కష్టాలను అనుభవించే సాధ్వీమణులు పతులను మించి విజయం సాధించగలుగుతారు. తేజోవంతులైన గంధర్వపతులు కోపం చూపటానికి తగిన సమయం కాదనుకొంటున్నారని నేను అనుకొంటున్నాను. అందువల్ల వారు వెంటనే నీవద్దకు పరుగెత్తుకొని రావడం లేదు.’’ అని అన్నాడు.
అయినా ద్రౌపది అక్కడనే నిలబడి వుండటం చూచి ‘‘సైరంధ్రీ! సమయాన్ని నీవు గుర్తించుటలేదు. కనుకనే నటి లాగ రాజసభలో విలపిస్తున్నావు. పైగా పాచికలాడుచున్న మత్స్యరాజు సభకు సభలో విఘ్నం కలిగిస్తున్నావు. సైరంధ్రీ! వెంటనే వెళ్ళుము. గంధర్వులు నీకు ప్రీతిని తప్పక కలిగిస్తారు. నీకు అపకారం చేసిన వానిని చంపి నీ దుఃఖాన్ని దూరం చేస్తారు’’ అని అన్నాడు.
అని ధర్మరాజు పలుకగా ద్రౌపది ‘‘ఆ గంధర్వులలో పెద్దన్నగారు జూదం ఆడుతూ వుంటారు. ఆ దయాత్ముల పట్ల నేనెప్పుడూ ధర్మపరాయణురాలిగానే వుంటున్నాను. నాకు అవమానం కలిగించిన దురాత్ములను వారిలో ఎవ్వరైనా చంపవచ్చును’’ అని అంటూ కోపంతో విసురుగా నడుస్తూ సుదేష్ఠాదేవి భవనానికి వెళ్లిపోయింది.
ఏడుస్తున్న ఆమె అందమైన ముఖం ఆకాశంలో మేఘ సముదాయం నుండి విడివడిన చంద్రునివలె ప్రకాశించింది.
దుఃఖిస్తూ వచ్చిన సైరంధ్రిని చూచి సుదేష్ణ అన్నది. ‘‘సుందరాంగి నినె్నవరు కొట్టారు? నీవు ఎందుకు ఏడుస్తున్నావు? ఈ దినం ఎవరి ముఖం ముగిసిపోయింది? ఎవరు నీకు అపరాధం చేశారు? ఏడుపుతో ముఖం మీద కారుతున్న ఆ కన్నీటిని తుడుచుకో? నీ ముఖమిప్పుడు ఎందుకు కన్నీటిని వర్షిస్తున్నది? అందుకు ద్రౌపది దీర్ఘంగా నిట్టూర్చి
‘‘నీకు అంతా తెలిసి కూడా ననె్నందుకు అడుగుతావు? స్వయంగా నీవే నీ తమ్ముని వద్దకు పంపి యిప్పుడిలాంటి మాటలెందుకంటున్నావు? నేను నీకోసం మదిర తేవటానికి వెళ్ళాను. అక్కడ ఆ కీచకుడు నా చెయ్యి పట్టుకొనే ప్రయత్నించాడు. నేను భయంతో రాజున్న సభకు పరుగెత్తాను. అతడు నా వెంట పడ్డాడు. ఆ నీచుడు నా జుట్టుపట్టి నన్ను క్రిందపడవైచి రాజు చూస్తుండగానే నిర్జనవనంలో అబలను హింసించినట్లుగా తన్నాడు’’ అని చెప్పింది.
‘‘సుందరీ! కామోన్మత్తుడై నీవంటి దుర్లభమైన దేవిని అవమానించిన ఆ కీచకుని నీవు అంగీకరిస్తే చంపేస్తాను. శిక్షిస్తాను’’ అని అన్నది సుదేష్ణ. ఆ మాటలు విని ద్రౌపది
‘‘అతడు యెవరి పట్ల అపరాధం చేశాడో వారే అతనిని చంపుతారు. నాకు తెలుసు. వాడు నిశ్చయంగా యమలోకానికి పోతాడు.
రాణీ! ఈరోజే నీవు నీ తమ్ముడికి వెంటనే జీవశ్రాద్ధం పెట్టించుము. దానాలన్నీ యిప్పించుము. కన్నుల నిండా అతడిని చూచుకో. ఇక అతడి ప్రాణాలు నిలువవని నా నమ్మకం. నా భర్తలలో ఒకడు అత్యంత దుస్సహమైన క్రోధంగల వీరుడు. అతడితో సమానమైన బలం గలవాడు ఈ భూమిమీద వేరొకడు లేడు.’’ అని చెప్పింది ద్రౌపది.
కీచకుని వధకు వ్రతం పూనింది. ఇతర స్ర్తిలు, రాణి ఎంత చెప్పినా, బ్రతిమాలినా స్నానం చేయలేదు. భోజనం చేయలేదు. ఒంటి మీద ధూళి కూడా తుడుచుకోలేదు. అలా శోక సంతప్తురాలై యేడుస్తున్న సైరంధ్రిని చూచి అచ్చటి స్ర్తిలంతా మనసులో కీచకుని చావును ఊహించుకున్నారు.
(48)
కీచకుని వధకు మార్గానే్వషణ
ద్రౌపది అవమానాగ్నితో వేగిపోతూ పడక గదిలోనికి పోయింది. నడుం వాల్చింది. కన్నీరు ధారలుగా కారుతున్నాయి. ఎన్నో ఆలోచనలు చేసింది. రాత్రికావడం వలన జనులందరూ నిద్రలో మునగగా, పడక గదిని వదలి, శరీరంపై కమ్మిన దుమ్మును కడుగుకొని, ఉతికిన చీర ధరించి మెల్లగా వంట యింటిలో నిద్రిస్తున్న భీమసేనుని వద్దకు వెళ్ళింది. అతడిని లేపింది
‘ఓ భీమసేనా! నన్ను అవమానించిన కీచకుడు యింటికి వెళ్ళి హాయిగా యధావిధిగా నిద్రిస్తున్నాడు. నీవెలా నిద్రిస్తున్నావు? ధర్మరాజు సాహసం చూపటానికి సమయం కాదని చెప్పటంవలన యిలా నిద్రిస్తున్నావా? నాపై ఎలాంటి దయలేదా?’’ అని మెల్లగా చేతితో భీముని తాకింది.
ఆ స్పర్శకు వెంటనే భీమసేనుడు లేచి ‘‘ఎవరు?’’ అని అన్నాడు. ద్రౌపది నేనేనని సమాధానము యిచ్చింది. ఆమె యింత రాత్రివేళ యెందుకు వచ్చిందో వూహించాడు. ఏమి చెపుతోందని వినాలని మిన్నకున్నాడు. మరలా అన్నాడు.
..........................ఇంకావుంది

--త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము