డైలీ సీరియల్

పంచతంత్రం--6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అకిటోహికిటో... వాడెవడు?’’
‘‘ప్రపంచానికి సహజీవన వ్యవస్థను పరిచయం చేసిన మహానుభావుడు. అందుకే ఆయనకు నోబెల్‌ప్రైజ్ వచ్చింది.’’
‘‘ఓహో!... మన ఇద్దరిలో నువ్వే సీనియర్‌వి... ఐతే ఎప్పుడూ నీమాటే చెల్లుతుంది అన్నమాట?’’
‘‘అవును! అందుకే మనం ఇప్పుడు ఇడ్లీనే తినాలి... నువ్వు నా మాటే వినాలి!’’ కామేశ్వరి కోపంగా చెప్పింది.
‘‘నేను తినను...! అంతేకాదు మన సహజీవనం క్యాన్సిల్!’’
ఈ మాట వినగానే ఎందుకనో గోపికకు రిలీఫ్‌గా అనిపించింది.
‘‘ఏంటి...?... అప్పుడే క్యాన్సిలా?!’’
‘‘అవును...! నీకంటే ఆ కపిల్‌గాడే బెటర్.!’’
‘‘వాడెవడు?’’
‘‘నా క్లాస్‌మేట్...! నన్ను లవ్ చేస్తున్నాట్ట... నా వెంట పడుతున్నాడు... వాడు నీలా కాదు... వాడు నేను తిని పారేసిన ఐస్‌క్రీం పుల్లలు, చప్పరించి పారేసిన లాలిపాప్ స్టిక్కులు, నమిలి పారేసిన మొక్కజొన్న కండెలు అలా ఎన్నో ఎనె్నన్నో సేకరించాడు.’’
‘‘మరి చీకి పారేసిన ఆవకాయ బద్దలు?’’
‘‘నా మీద ప్రేమతో అవి కూడా సేకరించాట్ట!’’
‘‘ఆ కపిల్ కాకుండా మరొకడు నువ్వు తిని పారేసిన ఐస్‌క్రీం పుల్లలు. చప్పరించి పారేసిన లాలిపాప్ స్టిక్కులు, నమిలి పారేసిన మొక్క జొన్న కండెలు, చీకి పారేసిన ఆవకాయ బద్ధలు కలెక్ట్‌చేస్తే వాడినికూడా ప్రేమించదానివా?’’
ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో కామేశ్వరి అర్ధంకాలేదు.
కార్తీక్ అన్నాడు. ‘‘నువ్వు నిజంగా కపిల్‌ని ప్రేమించటం లేదు. నువ్వు తిని పారేసిన ఐస్‌క్రీం పుల్లలు, చప్పరించి పారేసిన లాలిపాప్ స్టిక్కులు అతడు సేకరించటం నీకు క్రేజీగా అనిపించింది. అలా సేకరించటాన్ని గొప్పగా ఫీల్ అవుతున్నావ్. అతడు ఆ పనిచెయ్యకపోతే నువ్వు అతడి ముఖంకూడా చూసేదానివి కాదు. నువ్వు నిజంగా ప్రేమించేది కపిల్‌ని కాదు. అతడు నీ చుట్టూ తిరిగే ప్రక్రియని ప్రేమిస్తున్నావ్. అతను అలా నీ వెంట పడితే నేనుకూడా అందగత్తెనే అనే ఆత్మవిశ్వాసం నీలో కలుగుతుంది.’’
కార్తీక్ చెప్పిన విషయంలో నిజం ఉంది.
అది కామేశ్వరికి అర్ధం అయింది.
ఆమె బలహీనంగా అన్నది ‘‘అంతేనంటావా?’’
‘‘అవును!’’
రెండు నిమిషాలు తీవ్రంగా ఆలోచించుకున్న తర్వాత అన్నది కామేశ్వరి.
‘‘మీరు చెప్పింది కరెక్ట్‌అనిపిస్తోంది...!’’
కామేశ్వరి లేచి నిలబడింది. ఏదో అడగబోయింది. అంతలోనే మనసు మార్చుకుని బస్సువైపు కదిలింది.
కామేశ్వరి వైపు చూస్తూ కార్తీక్‌తో మనస్ఫూర్తిగా అన్నది గోపిక.
‘‘ఆ అమ్మాయికి చక్కగా కౌన్సిలింగ్ చేసారు.’’
కార్తీక్ మెల్లిగా నవ్వాడు.
నవ్వుతూ అన్నది గోపిక.
‘‘మీకు నిజంగా పెళ్ళికాలేదు కదూ? మీ భార్య పేరు మాధవి అని నాతో, సత్యభామ అని ఈ అమ్మాయితో చెప్పారు’’ కార్తీక్ కూడా నవ్వుతూ చెప్పాడు.
‘‘అవును! అవసరార్ధం అబద్ధం చెప్పవచ్చు అని బాబా ఆనందబ్రహ్మ చెప్పారు. నేను ఆచరించాను....
రండి....! బస్సు బయలుదేరుతుంది.
ఇద్దరూ బస్‌వైపు నడిచారు.
మరికొన్ని గంటల సమయం గడిచింది.
కార్తీక్, గోపికలు ప్రయాణిస్తున్న బస్ హైదరాబాద్ చేరుకోవటానికి ఇంకొద్ది నిమిషాల టైము ఉంది. గోపిక అడిగింది.
‘‘ఇందాక... ఆ అమ్మాయితో మాట్లాడుతూ. లవ్ గురించి చెప్పారు కదా.?!.... అసలు ఒక వ్యక్తికి మరొక వ్యక్తిమీద ప్రేమ కలగటానికి ఎంతకాలం పడుతుంది?’’
సమాధానంగా అన్నాడు కార్తీక్.
‘‘ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవటానికి ఎంతకాలం పడుతుందో అంత కాలం.’’
‘‘ఒక నాలుగైదు గంటల్లో ఒక మనిషిని మరొక మనిషి అర్ధం చేసుకోవచ్చా?’’
‘‘అది మరీ తక్కువ సమయం.’’
నవ్వుతూ అన్నది గోపిక.
‘‘నేను ఐతే ఆ సమయం చాలు అనుకుంటున్నా!’’
‘‘అలా తక్కువ సమయంలో ఏర్పడే లవ్‌ని పాశ్చాత్య దేశాల్లో విర్ల్‌విండ్ రొమాన్స్ అంటారు.’’
‘‘అలాంటి రొమాన్స్ గురించి నేనూ చదివా... టామ్‌క్రూస్- కేట్ హోమ్స్, కేట్‌పెర్రీ- రస్సెల్ బ్రాండ్ ఇలా చాలామంది హాలీవుడ్ సెలబ్రిటీస్ ది విర్ల్ విండ్ రొమానే్సట.’’
‘‘ఏమో! మన దగ్గర అంత తక్కువ టైం సరిపోదు.’’
నవ్వుతూ అన్నది గోపిక.
‘‘మా నాన్న చెపుతుండేవాడు. ప్రింటింగ్ ప్రెస్సులు రాకముందు. తాటాకుల మీద రాసే టైములో...’’
‘‘వాటిని తాళపత్ర గ్రంథాలు అంటారు...’’
‘‘అవే...! అవి ఉన్న రోజుల్లో... టీచర్స్ చెప్పేదాన్ని ఒక్కసారి విని అర్ధం చేసుకుని గుర్తుపెట్టుకునే స్టూడెంట్స్ ఉండే వాళ్ళుట.’’
‘‘వాళ్ళని ఏక సంధాగ్రాహులు అంటారు.’’
‘‘అదే...! అలా ఒక మనిషిని, మరొక మనిషి ఏక సంధాగ్రాహంతో అర్ధం చేసేసుకుని ప్రేమలో పడకూడదా?’’
‘‘ఏమో నాకు తెలియదు...! ఫీలింగ్స్ అనేవి అనుభవించే వాడికే తెలుస్తాయి. ఈ విషయం జిడ్డు కృష్ణమూర్తి చెప్పాడు.’’
గోపిక ఏదో అనబోయింది.
అంతలో గౌలిగూడా బస్సు డిపోలో బస్సు ఆగింది.
కార్తీక్, గోపిక బస్ దిగి ఎవరి దారినవాళ్ళు వెళ్ళిపోయారు.
* * *
ఓ పది రోజులు గడిచిపోయాయి.
డైలీ పేపర్లలో నోట్లరద్దు గురించి వార్తలు వస్తున్నాయి. జనం పాత నోట్లను మార్చుకోవటానికి అలవాటుపడుతున్నారు.
అది ఒక ఇరానీ కేఫ్.
ఆ కేఫ్‌లో ఒక కార్నర్ టేబుల్ దగ్గర ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. ఒకడు సన్నగా, మరొకడు లావుగా ఉన్నారు. సన్నటి వ్యక్తి ఒక బ్యాంక్ మేనేజర్. లావుపాటి వ్యక్తి లోకల్ గుండా. లోకల్ గుండా ముందు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీల కట్ట పడి ఉంది. అవి అన్నీ ఆ ఏరియాలోని అడ్డాకూలీల తాలూకు ఆధార్‌కార్డుల జిరాక్స్ కాపీలు.
బ్యాంక్ మేనేజర్‌తో అన్నాడు లోకల్ గుండా.
‘‘మొత్తం రెండు వందల యాభయ్ ఆధార్ కార్డులు, ఒక్కొక్క కార్డుకి రెండువేల చొప్పున పాత నోట్లు తీసుకుని, నీ కమిషన్ పోను మిగిలిన డబ్బు కొత్త నోట్లలో ఇయ్యి!’’
బ్యాంక్ మేనేజర్ ఆధార్‌కార్డు జిరాక్స్ కాపీలను దగ్గరకు తీసుకున్నాడు.
* * *
పులిగడ్డ నిరంజన్ అనే వ్యక్తి ఒక పెద్ద గుండా. బాగా తెలివైనవాడు. పచ్చి నెత్తురుతాగే రాక్షసుడిగా అతడికి పేరుంది.
హైదరాబాద్ నగరంలోని కాలాడేరా అనే ప్రాంతంలో నివసిస్తుంటారు నిరంజన్.
గంజాయి, గుడుంబా, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్‌వంటి వ్యాపారాల్లో బాగా సంపాదించాడు నిరంజన్. పెద్ద నోట్లురద్దు అయిన వార్త వినగానే అతడు షాక్ అయ్యాడు.

-జి.వి.అమరేశ్వరరావు