డైలీ సీరియల్

పంచతంత్రం -- 8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు మార్కెట్‌లో పంతొమ్మిది పాయింట్ ఎనిమిది రూపాయలకు ఒక దిర్హామ్ ఇస్తున్నారు. మనం రద్దయిపోయిన కరెన్సీకి రెండువందల రూపాయలకు ఒక దిర్హామ్ చొప్పున ఇద్దాం...! ఆలోచించు అన్నా...! బోలెడు లాభం....!’’
నిరంజన్ నవ్వి చెప్పాడు.
‘‘నాకు అర్ధం ఐంది....! అంత డబ్బు తక్కువ టైములో కలెక్ట్ చేయటం చాలా కష్టం. హవాలామార్గంలో ఆ డబ్బంతా ఇక్కడికి తెప్పించి కన్వర్ట్‌చేయటం మనవల్లకాదు. ఇప్పుడు నాదగ్గర ఉన్న బ్లాక్‌మనీని ఎలామార్చుకోవాలో తెలియటంలేదు... ఫోన్ చేసినందుకు థాంక్స్’’ అంటూ చెప్పి సెల్ ఆఫ్ చేసాడు.
ఆ తర్వాత నగరంలోని వివిధ దేవాలయాలకు చెందిన ఇరవైమంది ధర్మకర్తలూ, ఇరవైమంది ప్రధాన అర్చకులూ వచ్చివచ్చి నిరంజన్ ముందు వినయంగా నిలబడ్డారు. వాళ్ళతో చెప్పాడు నిరంజన్.
‘మీ దేవాలయాల్లోని హుండీలలో పది లక్షల చొప్పున పెద్ద నోట్లువేస్తా! మర్నాడు జర్నలిస్టులను పిలిచి వాళ్ళ సమక్షంలో హుండీలు తెరవండి. పెద్దమొత్తంలో హుండీలలో భక్తులు డబ్బులు వేసినట్లు అనౌన్స్ చెయ్యండి. ఆ తర్వాత బ్యాంకుల్లో ఆ డబ్బు డిపాజిట్ చెయ్యండి. అంతా సద్దుమణిగిన తర్వాత డబ్బులు పంచుకుందాం.’’
ఆ మాట వినగానే ఆంజనేయస్వామి దేవాలయ ధర్మకర్త అన్నారు.
‘‘సారీ....! మరి మన వాటాల గురించి...!!’’
పెద్దగా నవ్విచెప్పాడు నిరంజన్.
‘‘నాకు ఎయిటీ పర్సంట్.... మీకు ట్వంటీ.... పర్సంట్......
వెంకటేశ్వరస్వామి దేవాలయ ధర్మకర్త అన్నాడు-
‘‘సర్..! మార్కెట్‌లో ఫిప్టీ ఫిప్టీ నడుస్తోంది.’’
‘‘అంత పర్సంటేజ్ కుదరదు. సెవెంటీ థర్టీ చేసుకుందాం..’’
వినాయక దేవాలయ ప్రధాన అర్చకుడు అన్నాడు.
‘‘పోనీ ఫార్టీ సిక్స్‌టీ చేసుకుందాం సార్... ప్లీజ్!’’
చివరకు ఫార్టీ.. సిక్స్‌టీకి ఒప్పుకున్నాడు నిరంజన్.
ఆ సమావేశం ముగిసేముందు వినయంగా అన్నాడు అయ్యప్ప టెంపుల్ ధర్మకర్త.
‘‘సార్! మా టెంపులో పది లక్షల రూపాయలు పట్టేంత పెద్ద హుండీ లేదు సార్!.. కొత్త హుండీ ఒకటి ఏర్పాటుచెయ్యండి సార్.’’
అందుకు నిరంజన్ అంగీకరించాడు.
***
ఆ తర్వాత...
నిరంజన్ పంపించిన నోట్ల కట్టలతో హుండీలు నిండిపోయాయి.
జర్నలిస్టుల సమక్షంలో హుండీలు తెరచుకున్నాయి. బ్లాక్‌మనీ ఉన్నవాళ్లు హుండీలలో డబ్బులు వేశారు అంటూ డైలీ పేపర్‌లలో వార్తలు ప్రచురింపబడ్డాయి.
ఐతే నిరంజన్ డబ్బులు వేసిన హుండీలలో నిరంజన్ ఇచ్చిన డబ్బు కాక మరికొన్ని లక్షలు ఎక్కువ బయటపడ్డాయి.. అవి బ్లాక్‌మనీ ఉన్న భక్తులు దేముడి హుండీలలో వేసిన పెద్ద నోట్లు.
అలా చాలా దేవాలయాల హుండీల్లో పెద్ద నోట్ల కట్టలు బయటపడ్డాయి.
***
దుర్గారావుకి చాలా ఆనందంగా ఉంది.
అతడు ఆ రోజే డిఎస్‌పిగా ప్రమోట్ అయ్యాడు. అతడు ఎస్‌ఐ మహేంద్రని తన దగ్గరికి పిలిపించుకుని చెప్పాడు.
‘‘ఆ నిరంజన్‌గాడిమీద ఓ కనే్నసి ఉంచు. వాడి గురించి ఏదైనా ఇన్‌ఫర్మేషన్ దొరికితే చెప్పు. వాడి దగ్గర బ్లాక్‌మనీ చాలా ఉంది.. మనం వాడి అంతుచూడాలి...! ఇది నా పర్సనల్ మేటర్’’
‘‘ఓకే సర్!’’ అంటూ వినయంగా సమాధానం చెప్పాడు మహేంద్ర.
దుర్గారావ్‌కి ఒక బామ్మర్ది ఉన్నాడు. అతడి పేరు గురుదేవ్. గురుదేవ్ గుడుంబా వ్యాపారం చేసేవాడు. ఐతే గురుదేవ్ గుడుంబా వ్యాపారానికి అడ్డు తగిలాడు నిరంజన్. ఎందుకంటే నిరంజన్ కూడా గుడుంబా వ్యాపారం చేస్తున్నాడు. గురుదేవ్ తరఫున రంగంలోకి దిగాడు దుర్గారావ్. అపుడు జరిగిన గొడవలో నిరంజన్‌ది పైచేయి అయింది. పోలీసు స్టేషన్‌లో అందరి ముందూ దుర్గారావ్ చెంప పగలగొట్టాడు నిరంజన్. అప్పట్లో పొలిటికల్‌గా నిరంజన్‌కి ఫుల్ సపోర్టు ఉంది. దాంతో అవమానాన్ని మనసులోనే దిగమింగుకుని అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు దుర్గారావ్. ఇపుడు దుర్గారావ్ డిఎస్‌పి అయ్యాడు. అదే సమయంలో నిరంజన్‌కి పొలిటికల్ సపోర్టు తగ్గింది. ఇదే అదనుగా నిరంజన్‌ని దెబ్బ కొట్టాలి అని నిర్ణయం తీసుకున్నాడు దుర్గారావు.
***
కొత్త రెండువేల రూపాయల నోట్లతో నిండుగా వున్న సూట్‌కేసు తీసుకువచ్చి, నిరంజన్ ముందు ఉంచాడు బాల్‌రాజ్.
ఆ సూట్‌కేసును పక్కన పెట్టి చెప్పాడు నిరంజన్.
‘‘పదేళ్ల క్రితం మనం కొండాపూర్‌లో, ఆ పక్కనే అలకాపురిలో వెంచర్స్ వేసి ఫ్లాట్స్ అమ్మాము గుర్తుందా?’’
గుర్తు ఉంది అన్నట్లు బాల్‌రాజ్ తల ఊపాడు.
‘‘ఇప్పుడు ఆ ఫ్లాట్స్ ధరలు బాగా పెరిగాయి. ఆ స్థలాలను కొన్నవాళ్లను అబ్జర్వ్ చెయ్యి. వాళ్లలో మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లస్ వాళ్ళను లిస్ట్ అవుట్ చెయ్యి. ఆ లిస్ట్‌లో వీక్‌గా వున్నవాళ్లను ఎయిమ్ చెయ్యి. వాళ్లను ఆ స్థలాలను మనకు అమ్మమని బెదిరించు. వాళ్లకు పాత నోట్లు ఇచ్చి ఆ స్థలాలను మార్కెట్ రేటుకు కొనేద్దాం. ఎదిరించినవాడిని లేపెయ్. మిగిలిన వాళ్లు వాళ్లే దారికి వస్తారు’’
బాల్‌రాజ్ తల ఊపి చెప్పాడు.
‘‘అలాగే నాన్నా! మనం పాత నోట్లు అన్నీ కొత్త నోట్లుగా మార్చుతున్నాం. ఇపుడు మన దగ్గర కొత్త నోట్ల బ్లాక్‌మనీ పోగవుతోంది. ఆ దుర్గారావ్‌గాడు డిఎస్‌పి అయ్యాడు. అసలే వాడు డేంజర్‌గాడు. మనం జాగ్రత్తగా ఉండాలి’’
సమాధానంగా చెప్పాడు నిరంజన్.
‘‘నేను వేలాయుధంతో మాట్లాడాను. వాడు తన మనిషిని పంపిస్తాడు.. మనం కేర్‌ఫుల్‌గా ఉందాం... నువ్వు ఆ దుర్గారావ్‌గాడి మీద ఓ కనే్నసి ఉంచు. ఎస్‌ఐ మహేంద్రగాడు ఆ దుర్గారావ్ గాడికి రైట్ హ్యాండ్.. కొడుకులు.. ఇద్దరూ తోడుదొంగలు..’’
‘‘వేలాయుధం తన మనిషితో మనకు ఏం పంపిస్తున్నాడన్నా?’’
‘‘తెలియదు..! మళ్లీ మనం రేపు కలుద్దాం’’ అన్నాడు నిరంజన్.
ఆ మాటతో వాళ్ళ ఇద్దరిమధ్యా సంభాషణ పూర్తి అయింది.
***
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మర్నాడే కార్తీక్‌కు సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంటర్వ్యూ జరిగింది. ఈసారి టెలిఫోన్ ఇంటర్వ్యూ ఉంటుంది అనీ, ఆ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందో తర్వాత చెపుతాం అనీ హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కార్తీక్‌తో చెప్పారు.
అంతకుముందు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసేవాడు కార్తీక్. ఐతే ఆర్డర్స్ తగ్గిపోవటంతో ఆ కంపెనీని మూసేశారు. తర్వాత కార్తీక్ రెండు, మూడు కంపెనీలకి అప్లై చేశాడు. లింక్డ్ ఇన్, నౌకరి డాట్‌కా మొదలైన వాటిలో తన ప్రొఫైల్ అప్‌డేట్ చేశాడు. విజయవాడలో ఫ్రెండ్ పెళ్లికి వెళ్లినపుడు, పెళ్లిలో ఉండగా ఇంటర్వ్యూకి రమ్మంటూ సాఫ్ట్‌వేర్ కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. నిజానికి మరొక్క రోజు విజయవాడలోనే ఉండి అక్కడి ఫ్రెండ్స్‌తో గడుపుదాం అనుకున్నాడు కార్తీక్.
-సశేషం

-జి.వి.అమరేశ్వరరావు