డైలీ సీరియల్

యమహాపురి 71

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంతువులంటే జంతువులం. ఆయన మాకేది కావాలని చెబితే అదే మాకు కావాలి. ఆయన మాకు స్వేచ్ఛనిస్తే స్వేచ్ఛనీ, బానిసత్వాన్నిస్తే బానిసత్వాన్నీ సంతోషంగా స్వీకరిస్తాం. మా దేవుడు చెప్పిందే మాకు వేదం’’ అన్నాడు.
రాజా తెల్లబోయాడు. ఇన్నాళ్ల తన కృషి ఫలితం ఇలా ప్రతిధ్వనిస్తుందని అతడనుకోలేదు. అయితే అతడు నిరుత్సాహపడలేదు. ‘‘మీలో ఒకరు తమ అభిప్రాయాన్ని వినిపించారు. సంతోషం. ఇదేవిధంగా మిగతావారు కూడా ఒకరొక్కరుగా తమ అభిప్రాయాలు వినిపించండి’’ అన్నాడు.
సభలో ఒక్కరు కూడా లేవలేదు. ఇది ప్రజాస్వామ్యమనీ, మెజారిటీ అభిప్రాయానికే విలువ వుంటుందనీ రాజా పదే పదే చెప్పినా సభలోంచి ఒక్కరు కూడా లేవలేదు. అతడు విసిగిపోయినా తమాయించుకుని, ‘‘అభిప్రాయం చెప్పమనగానే ఒక పెద్దాయన లేచి మాట్లాడేడు. ఇక్కడున్నవారిలో ఇంకా యువకులున్నారు. బాలురున్నారు. మహిళలున్నారు. ఒక్కొక్కరి తరఫునా ఒక్కొక్కరు మాట్లాడితే బాగుంటుంది’’ అని ప్రోత్సహించే ప్రయత్నం చేశాడు.
‘‘ఒరేయ్! మన ప్రతినిధిగారికి యువకుల అభిప్రాయం కావాలిట. యువకుల్లో ఎవరైనా లేచి చెప్పండిరా’’ అన్నాడు తొలుత లేచిన వృద్ధుడు.
ఓ యువకుడు చప్పున లేచాడు, ‘‘ఆ పెద్దాయన అభిప్రాయమే మా అభిప్రాయం’’ అన్నాడు. ఆ తర్వాత ఓ మహిళ లేచి తనూ అదే మాట చెప్పింది. ఆ తర్వాత ఓ బాలిక కూడా అదే మాట చెప్పింది.
అంతలో తల్లి పొత్తిళ్ళలో ఉన్న ఓ నెలల శిశువు ఉక్కకో మరెందుకో కేరుమని ఏడ్చింది. రాజాకి అది ఏడుపులా కాక, ‘‘ఆ పెద్దాయన అభిప్రాయమే మా అభిప్రాయం’’ అని వినిపించింది.
‘‘స్ర్తి బాల వృద్ధులు అంతా ఈ గ్రామంలో శిశువులే’’ అనుకుని నిట్టూర్చాడు రాజా. సభ ముగిసింది.
ఆ తర్వాత రాజా, రాణి కలుసుకుని మాట్లాడుకున్నారు.
‘‘ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఎన్ని విప్లవాలొచ్చినా నాయకుడి నిష్క్రమణతో ఆగిపోయే ప్రగతి మనది. అందుకు కారణం జనం మనస్తత్వం. దీనికి నువ్వూ నేనూ చెయ్యగలిగిందేం లేదు. ఇక నువీ ఊర్నించి నిష్క్రమించడం మంచిది’’ అంది రాణి.
‘‘నాకిప్పుడు నా గురించికంటే, ఈ ఊరి జనం గురించే ఎక్కువ బాధగా వుంది. స్వేచ్ఛ ఎంత బాగుంటుందో కొన్ని వారాలపాటు రుచి చూసిన ఈ జనం- స్వేచ్ఛకంటే ఎక్కువగా నాయకుణ్ణి అభిమానిస్తున్నారు. నాయకుడి మీద గుడ్డి నమ్మకంతో- నీచమైన బానిసత్వాన్ని కూడా నిరసించని అమాయకులైపోయారు. వీళ్లకోసం ఈ రెండు నెలలూ మనం చేసినదంతా వృధా అయిపోయింది’’ అన్నాడు రాజా బాధగా.
‘‘ఇక్కడ నువ్వో విషయం గుర్తుంచుకోవాలి. మనం నరకపురి వాసుల్ని సంస్కరించాలని అనుకోలేదు. నీ అవసరం కోసం నువ్వూ, నా ఆశతో నేనూ తాత్కాలికంగా ఈ కార్యక్రమం చేపట్టాం. ఇప్పుడు నువీ ఊరొదలకా తప్పదు. నేను యమ విధించే శిక్షకి సిద్ధపడకా తప్పదు. జగదానందుడి దీవెన నిజంగా గొప్పదైతే మన సమస్యలకు మంచి పరిష్కారం లభిస్తుంది. మనమూ దీవెనని నమ్ముదాం. అందుకు మా నరకపురి వాసుల్నే ఆదర్శంగా తీసుకుందాం’’ అంది రాణి.
‘‘నరకపురి వాసులు మనకి ఆదర్శమా- ఏం మాట్లాడుతావు? ఔనులే- నీదీ ఈ ఊరేగా- ఏ గూటి చిలకది ఆ గూటి పలుకు’’ అన్నాడు రాజా కోపంగా.
రాణి నొచ్చుకోలేదు. ‘‘మావాళ్ళని చూడు. రాక్షసుణ్ణి దేవుడని నమ్మారు. ఆ నమ్మకంతో ఎంతో సంతోషంగా ఉన్నారు. మనం దేవుణ్ణే దేవుడిగా నమ్మి సంతోషంగా ఉండలేమా?’’ అంటూ తన మాటకు వివరణ ఇచ్చింది.
రాజా ఆలోచనలో పడ్డాడు. ఓ క్షణమాగి ‘‘ఐడియా...’’ అన్నాడు.
రాణి అతడికేసి చూస్తే అతడి ముఖంలో కొత్త ఉత్సాహం కనబడింది.

14
జేబులో ఫోను మ్రోగితే యథాలాపంగా తీశాడు శ్రీకర్. తెలిసిన నంబరు కాదు. ‘‘హలో’’ అన్నాడు అనాసక్తంగా.
‘‘హలో! ఇనస్పెక్టర్ శ్రీకర్‌గారేనా?’ అంది అవతలి గొంతు.
‘‘ఊ..’’
‘‘నా పేరు రాజా. రెండు నెల్ల క్రితం శివగిరి దగ్గిర ఒక బిచ్చగాడి హత్య జరిగింది. ఆ కేసులో నేను అనుమానితుణ్ణి. ఒకే ఒక్క షరతుమీద నేను మీకు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను’’.
శ్రీకర్ ఉలిక్కిపడ్డాడు. కలా, నిజమా అనుకుని ఓసారి తనని తాను గిల్లుకున్నాడు.
‘‘ఓహో! రాజా! ఎక్కణ్ణించి మాట్లాడుతున్నారు మీరు?’’ అడిగాతడు.
‘‘నరకపురి’’
‘‘ఓహో, నరకపురిలో రాజా ఇంకా క్షేమంగానే ఉన్నాడన్నమాట!’’ అనుకుని, ‘‘ఏమిటి మీ షరతు?’’ అన్నాడు శ్రీకర్.
‘‘మీరొక్కసారి నరకపురి సందర్శించాలి. పోలీసులూ కాదు. ఒక మామూలు మనిషిలా వచ్చి ఒక రోజు ఇక్కడ గడిపి వెళ్లాలి. ఆ తర్వాత మీతోపాటే వచ్చి మీకు లొంగిపోతాను’’.
శ్రీకర్ మళ్లీ తన్ను తాను గిల్లుకున్నాడు.
నరకపురి వెళ్లాలని తను తపించిపోతున్నాడు. చివరికి నరకపురే తనని వెదుక్కుంటూ వచ్చింది. అలా వస్తుందని సరదాగా తమ సుందరం అన్నమాట నిజమైంది.
‘‘నరకపురి ప్రమాదకరమైన ఊరని నాకు తెలుసు. పోలీసులా కాక మామూలు మనిషిలా వస్తే ఆ ప్రమాదం రెట్టింపౌతుంది’’ అన్నాడు శ్రీకర్ అనుమానంగా.
‘‘సార్! నేను మీకంటే చాలా చాలా మామూలు మనిషిని. ధైర్యంగా ఇక్కడకొచ్చాను. బట్టలు మామూలువే వేసుకున్నా- మీదెప్పుడూ పోలీసు గుండే! ధైర్యంగా రండి సార్! మీ ధైర్యం ఎందరికో కొత్త ఊపిరినిస్తుంది. మీ రక్షణకు నాదీ హామీ!’’ అన్నాడు రాజా.
‘‘ఆ ఊరికి మకుటం లేని మహారాజు యమ అని విన్నాను. నాకు హామీ ఇవ్వడానికి మధ్య నువ్వెవరు?’’ అన్నాడు శ్రీకర్.
‘‘ప్రస్తుతం నేనిక్కడ యమకి ప్రతినిధిని సార్!

ఇంకా ఉంది

వసుంధర