డైలీ సీరియల్

యమహాపురి - 73

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆలోచనుండాలి. ధ్యేయముండాలి. స్వంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడే బుద్ధి ఉండాలి. ఇవన్నీ సామాన్యులకీ సాధ్యమే సార్! కాలేజీలో చేరినప్పట్నించీ నేనిలాంటి విషయమై ఆలోచిస్తున్నాను. ఇప్పుడు అవకాశం రాగానే ఉపయోగించుకున్నాను’’ అని, ‘‘ఇంతవరకూ ఇక్కడ చేసిందంతా వృథా పోకూడదు సార్! అందుకే మిమ్మల్నిక్కడికి రమ్మన్నాను.
కావాల్సిన సాక్ష్యాలన్నీ ఇచ్చాను. మీరీ ఊరి ప్రజల్ని యమ బారినుంచి రక్షించండి. నాకా మాటిస్తే- నాకు తెలియకుండా ఒక బిచ్చగాడి చావుకి కారణమైనందుకు- మీకు లొంగిపోవడానికి ఇప్పుడే సిద్ధంగా ఉన్నాను సార్!’’ అన్నాడు రాజా.
శ్రీకర్ ఓ క్షణం ఆలోచించాడు. ‘‘సారీ మిస్టర్ రాజా! తమని తాము రక్షించుకోలేనివారిని ఎవరూ రక్షించలేరు. ఈ జనానికి యమ దేవుడు. బయటి జనానికి కూడా యమలాంటి ఎందరో దేవుళ్లు. ఈ దేశంలో ఎవరితోనైనా పోరాడగలం కానీ దేవుడితో మాత్రం పోరాడి గెలవలేం’’ అన్నాడు.
అది నిజమని రాజాకి తెలుసు. అతడప్పుడు కింకర్తవ్య విమూఢుడయ్యాడు.
***
శ్రీకర్ వెళ్ళే ముందు మాత తన భోజనాల గదిలో విందు ఏర్పాటుచేసింది.
ఆ గదిలో ముగ్గురు. మాత, రాజా, శ్రీకర్, పుత్ర లేడు.
వారికి భోజనం వడ్డిస్తోందో యువతి. కొత్త దుస్తుల్లో మిల మిల మెరిసిపోతోందామె. ఆమె మెడలో బంగారు గొలుసుంది. కాలికి గొలుసు లేదు.
‘‘తమలా!’’ అంది మాత.
‘‘చెప్పండమ్మా!’’ అందామె.
‘‘నిన్నిలా చూడ్డం, పిలవడం చాలా బాగుందే- రేపట్నుంచి మళ్లీ టామీవైపోతావంటే ఏదోలా వుంది నాకు’’ అంది మాత.
రాజాకి కడుపులో దేవినట్లయింది. ఆ యువతి మాత్రం మామూలుగా నవ్వి ఊరుకుంది.
‘‘నువ్వెళ్లొచ్చు. ఇక మేమే వడ్డించుకుంటాం’’ అని మాత ఆమెని పంపేసింది. తర్వాత భారంగా నిట్టూర్చి, ‘‘దాని మనసులో ఏముందో తెలియదు కానీ- రేపట్నించి దాని జీవితం తల్చుకుని నాకిప్పుడు చాలా బాధగా, భయంగా ఉంది’’ అంది రాజాతో.
‘‘ఏమైనా మీకెందుకు బాధ? పడితే నేను పడాలి కానీ..’’ అన్నాడు రాజా.
‘‘నిజం చెబుతున్నాను రాజా! నీ రాక ఈ నరకపురిని నాకపురిగా మార్చింది. నాకిలాగే బాగుంది. రేపట్నించి ఈ ఊరు పూర్వ స్థితికి వస్తే కనుక- నేను భరించలేననిపిస్తోంది..’’
‘‘ఎందుకు భరించలేరు? ఎనే్నళ్లుగానో భరిస్తున్నారు..’’ అన్నాడు రాజా.
‘‘నీకీపాటికి నా గురించి కొంతైనా అర్థమయుండాలి. ఈ ఊళ్ళో మిగతా జనమంతా సంకెళ్లు తగిలించిన బానిసలైతే- నేను పసిడి తీవెల పంజరంలో బందీని. నీకు నా కథ తెలియదు కదూ! ఇప్పుడు చెప్పకపోతే ఎవరికైనా చెప్పుకునే అవకాశం కూడా నాకుండదు. అందుకే ఈ విందు ఏర్పాటుచేశాను’’ అంది మాత.
ఆమె చెబుతోంది. మిగతా ఇద్దరూ వింటున్నారు.
‘‘మొదట్నించీ నాదీ, యమదీ ఈ ఊరు కాదు. మేము బాల్య స్నేహితులం. నాది చాలా సున్నిత మనస్తత్వం. మేము పేదవాళ్లం. యమకి డబ్బు సంపాదించాలన్న కోరిక బలంగా వుండేది. పదహారేళ్ల వయసులో మా ఊరొదిలి వెళ్లి- పాతికేళ్లప్పుడు కాబోలు తిరిగొచ్చారు. రావడం మహావైభవంగా వచ్చారు. నన్ను పెళ్లి చేసుకుని ఈ నరకపురికి తీసుకొచ్చారు. ఆయనకి నేనంటే ప్రాణం. కానీ ఆయనలో ఓ భయంకరమైన శాడిస్టు వున్నాడు.
మేమొచ్చినప్పటికే ఆయనకీ ఊళ్లో ఎదురులేదు. అంతా దేవుడిలా కొలుస్తున్నారు. అయినా శాడిస్టు మనస్తత్వంతో ఊళ్ళో ఇప్పుడున్న నియమాలు, శిక్షలు ఒకటొక్కటిగా అమలు చేశారు. నేను భరించలేనంటే, ‘అలవాటు చేసుకో. ఈ సామ్రాజ్యానికి నువ్వు మహారాణివి. మన బిడ్డ దీనికి వారసుడు’ అనేవారు. ఇలాంటి వాతావరణంలో నా హోదాని జీర్ణించుకోలేకపోయాను. కానీ తప్పనిసరి. నన్ను ప్రాణప్రదంగా ప్రేమించే ఆయన బలహీనత- నన్ను ముల్లయి గుచ్చుతున్నా భరించడం అలవాటు చేసుకున్నాను. కానీ నా బిడ్డది నాకంటే సున్నిత హృదయం. ఊళ్ళో ఇలాంటి నియమాలు కొనసాగించే వారసుడి జీవితం వాడికి సుతరాం ఇష్టం లేదు.
అందుకే ఎప్పుడూ అన్యమనస్కంగా ఉంటాడు. నాకెలాగూ తప్పదు. వాడినైనా ఇక్కణ్ణించి తప్పించాలని నా కోరిక. లేదా ఏదో అద్భుతం జరిగి ఈ ఊరు మారాలని నా ఆశ. ఇనే్నళ్ల తర్వాత నీ రాకతో నా ఆశకు ఊపిరందింది. పుత్రలో నెమ్మదిగా కొత్త ఉత్సాహం చోటుచేసుకోవడం చూసి మనసారా ఆనందించాను. ఇక యమ వచ్చినా, స్వేచ్ఛకి అలవాటుపడ్డ ప్రజలు- యమనే మార్చగలరనుకున్నాను. కానీ అది ఎండమావి అని నిన్నటితో తేలిపోయింది. రేపట్నించి ఇక్కడ పునరావృతం కానున్న జీవితాన్ని తల్చుకుంటే- గుండె తరుక్కుపోతోంది..’
ఆమె మాటలు రాజా, శ్రీకర్ కూడా ఆశ్చర్యంగా విన్నారు. శ్రీకర్ ఆమెతో, ‘‘మాతా! మీరు మీ స్వార్థాన్ని కొంచెమైనా త్యాగం చేసి ఈ ఊరి గురించి ఒక ఫిర్యాదు ఇవ్వగలిగితే- మొత్తం పోలీసు బలగమంతా ఈ ఊరిపై దాడిచేసి- ఇక్కడి పరిస్థితి సరిచెయ్యగలదు’’ అన్నాడు.
మాత నవ్వి, ‘‘వెర్రివాడా! ఇక్కడి పరిస్థితులు బయటి ప్రపంచానికి తెలియవని భ్రమ పడుతున్నావా? అవినీతితో, అక్రమాలతో ప్రజల్ని పీడించి, దోచి డబ్బు కూడబెట్టడంలో అన్ని రాజకీయ పక్షాలూ తోడుదొంగలు.
ఆ డబ్బులో కొంత విదేశాల్లో స్విస్ బ్యాంకులకి వెడుతుంది. స్వదేశంలో ఈ నరకపురి కూడా ఆ స్విస్ బ్యాంకుల వంటిదే! ఉగ్రవాదులు మతోన్మాదాన్నో, జాత్యభిమానాన్నో ప్రేరేపించి మహా విధేయులైన అనుచరుల్ని తయారుచేసుకోవడం లేదూ? నరకపురి- అవినీతి ఉగ్రవాదుల శిక్షణ కేంద్రం.
ఆ శిక్షణనివ్వడంలో ప్రతిభావంతుడైన యమకి దేశంలో ఏ శక్తీ అడ్డురాదు. మిగతా విషయాల్లో సిగపట్లు పట్టుకునేవారందరూ యమ విషయం వచ్చేసరికి ఒక్కటై మద్దతునిస్తారు. అదీ యమ ప్రభంజన రహస్యం’’ అంది.
అప్పుడు అర్థమైంది శ్రీకర్‌కి మొత్తం నరకపురి గుట్టు.

ఇంకా ఉంది

వసుంధర