డైలీ సీరియల్

పంచతంత్రం-18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ అడవిలాంటి ప్రదేశంలో ఒకచోట దట్టంగా పెరిగిన పూపొదలు, పూల చెట్లు, పువ్వులతో నిండిన వృక్షాలు సువాసన వెదజల్లుతున్నాయి. వాటిమధ్య ఇద్దరూ నడుస్తున్నారు. చెట్లకొమ్మల్లోంచి పక్షుల అరుపులనీ, పుష్పాల సువాసనలనీ మోసుకువస్తున్న గాలి మంద్రంగా వీస్తోంది. చెట్లమీదనుంచి రాలిన పూలు వాళ్ళ తలల మీద, భుజాలమీద పడుతున్నాయి. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది.
గోపిక ఓరకంటితో కార్తీక్‌వైపు చూసింది. అతడు ముందుకు చూస్తున్నాడు. అంతకుముందు తమ స్నేహితులతో సమావేశం అయిన ప్రదేశాన్ని గమనిస్తూ చెప్పాడు కార్తీక్.
‘‘అదుగో!... వచ్చేశాం!!’’
అక్కడ గుబురుగా పెరిగిన పొదలమధ్య కూర్చోవటానికి అనువుగా ఉన్నదో రాతిబండ. ఇద్దరూ అక్కడ కూర్చున్నారు.
గోపిక తన దగ్గరున్న బ్యాగ్‌ని కార్తీక్‌కి అందించింది. ఆ బ్యాగ్ తెరిచి డ్రోన్‌ని బయటకుతీసాడు కార్తీక్. అది తను అనుకున్నట్లుగానే ఉంది. ఇరవై సెంటీమీటర్ల పొడవు, అంతే వెడల్పుతో నల్లగా మెరుస్తోంది. దాని రెక్కలుకూడా నలుపు రంగులో ఉన్నాయి. బరువు చాలా తక్కువగా ఉంది. దానికి ఉన్న కెమెరా వౌంటింగ్ ఫ్రేమ్‌కు కెమెరాను ఫిక్స్ చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే కెమెరా వౌంట్‌ని తీసేసి, సెల్‌ఫోన్ హోల్డర్‌ని అమర్చుకోవచ్చు.. బ్యాగ్‌లో ఇంకో అరలోంచి చిన్న కెమెరా బయటకు తీసాడు. ఆ కెమెరా రిమోట్ కంట్రోల్‌తో పనిచేయిస్తుంది. ఆడియో, వీడియో రికార్డింగ్‌తోపాటు స్టిల్స్‌కూడా ఆ కెమెరాతో తియ్యవచ్చు. సిక్స్ట్ఫీర్ జి.బి బిల్ట్ ఇన్ మెమొరీతోపాటు ప్రతిసారీ థర్టీటూ జిబి ఎక్సటర్నల్ మెమొరీకార్డు వేసుకోవచ్చు. యూజర్ గైడ్ తీసి అందులో తనకు కావలసిన ఇంపార్టెంట్ విషయాలు చదివాడు కార్తీక్.
తర్వాత ఒకసారి తాము ఉన్న ప్రదేశాన్ని గమనించాడు కార్తీక్. అంతా చెట్లు మొక్కలతో నిండిపోయి ఉంది. అక్కడ డ్రోన్‌ని ఆపరేట్ చేయటం కష్టం. తాము ఉన్న ప్రదేశానికి వంద అడుగుల దూరంలో చెట్లుపల్చగా ఉన్న విషయం గమనించాడు కార్తీక్. వెంటనే చెయ్యి చూపుతూ.
‘‘మనం అక్కడకు వెళదాం. పద!’’అని గోపికతో చెప్పాడు కార్తీక్.
ఇద్దరూ ఆ ప్రదేశానికి చేరుకున్నారు.
* * *
బాల్‌రాజ్ దగ్గర ఫోన్ మోగింది. అవతల పండిట్ లైన్లో ఉన్నాడు.
ఫోన్ రిసీవ్ చేసుకుని-
‘‘అన్నా! చెప్పన్నా!!’’ అన్నాడు బాల్‌రాజ్.
‘‘నీ ఫోన్ కొట్టేసిన వాడిని ట్రాక్ చేశా. అదృష్టవశాత్తు వాడు నీ ఫోన్ స్విచ్‌ఆఫ్ చెయ్యలేదు. సిమ్ము కూడా తియ్యలేదు. అందుకే వాడిని తొందరగా ట్రాక్ చేశా!’’
‘‘చెప్పన్నా! ఆడు ఎక్కడ ఉన్నాడు?’’ ఆతృతగా అడిగాడు బాల్‌రాజ్.
‘‘నీకు పివిపి ఇంజనీరింగ్ కాలేజ్ తెలుసా?’’
‘తెలుసన్నా!’’
‘‘ఆ కాలేజ్ వెనక ఓ అడవి లాంటి ఏరియా ఉంది. ఆ ఏరియాలో వాడు ఉన్నాడు. వెళ్లి పట్టుకో... .. మరి నా విషయం?’’
‘‘సాయంత్రం సెటిల్ చేస్తా అన్నా!’’
‘‘ఓకే!’’అంటూ ఫోన్ కట్ చేసాడు పండిట్.
ఆ టైంలో బాల్‌రాజ్ గండిమైసమ్మ అనే ఏరియాలో ఉన్నాడు. అడ్డా కూలీల చేత పాత నోట్లు జన్‌ధన్ ఖాతాల్లో వేయిస్తున్నాడు. బ్యాంకుల్లో, పోస్ట్‌ఆఫీసుల్లో నోట్లు ఎక్స్ఛేంజి చేయిస్తున్నాడు. పఠాన్, బైరాగిలు కూడా అదే పనిలో మరోచోట ఉన్నారు. వెంటనే ఫోన్లో వాళ్ళని కాంటాక్ట్‌చేసి పివిపి ఇంజినీరింగ్ కాలేజ్ దగ్గర కలుసుకోమని ఆర్డర్ జారీచేసాడు బాల్‌రాజ్. వెంటనే వాళ్ళు బయలుదేరారు. బాల్‌రాజ్ కూడా జీప్‌లో బయలుదేరాడు.
* * *
కెమెరాను డ్రోన్‌కి ఫిక్స్‌చేసి, జాయ్‌స్టిక్ చేతిలోకి తీసుకున్నాడు కార్తీక్. ఆ జాయ్ స్టిక్‌తో కెమెరానుకూడా కంట్రోల్ చెయ్యవచ్చు. జాయ్‌స్టిక్‌కు చిన్న డిటాచబుల్ మానిటర్ అమర్చిఉన్నది. కెమెరా రికార్డుచేసే దృశ్యాలను అందులో చూడవచ్చు. డ్రోన్‌ను టేక్ ఆఫ్, లాండింగ్ చేయటానికి, డ్రోన్‌ను క్లాక్‌వైస్, యాంటీ క్లాక్‌వైస్ తిప్పటానికి, నిట్టనిలువుగా పైకి లేపటానికీ, కిందికి దించటానికి, కుడివైపుకూ, ఎడమవైపుకూ తిప్పటానికి, రివర్స్‌లో వెనక్కి రావటానికి అవసరం అయిన గేర్స్, బటన్స్, కంట్రోల్ రాడ్స్, యాంటెన్నా మొదలైనవి ఉన్నాయ్. డ్రోన్‌కి ఉన్న వైర్లెస్ మైక్రోఫోన్ డ్రోన్ ఉన్న ఏరియాలోని శబ్దాలను ట్రాన్స్‌మిట్ చేస్తుంది. వాటిని వైర్లెస్ ఇయర్ ఫోన్స్‌లో వినవచ్చు. రెండు ఇయర్‌ఫోన్ సెట్స్ ఆ బ్యాగ్‌లో ఉన్నాయ్. ఒకటి తను తీసుకుని మరొకటి గోపికకు ఇచ్చాడు కార్తీక్.
చిన్నప్పుడు రకరకాల జాయ్‌స్టిక్స్‌తో ఆడిన అనుభవం కార్తీక్‌కి పనికి వచ్చింది. టేకాఫ్ లివర్‌ని ఆపరేట్ చేస్తూ డ్రోన్‌ని మెల్లగా నిట్టనిలువునా గాలిలోకి లేపాడు కార్తీక్. డ్రోన్ పైకి లేచింది. ఐతే దోమ ఎగిరేటప్పుడు వచ్చే శబ్దంలాంటి శబ్నాన్ని చాలా తక్కువ స్థాయిలో సృష్టిస్తోంది డ్రోన్. దాని రెక్కలకూ, గాలికీ ఏర్పడుతున్న ఘర్షణవల్ల ఆ శబ్దం వస్తోంది. మొత్తానికి చాలా తక్కువ శబ్దాన్ని ఉత్పత్తిచేస్తోంది డ్రోన్. ఆ డ్రోన్ పరిధి రెండువందల అడుగులు. అంతకుమించి వెడితే కంట్రోల్ తప్పిపోతుంది.
జాయ్‌స్టిక్స్‌తో అదుపుచేస్తూ చెట్లమధ్యగుండా దాన్ని మెల్లగా ముందుకు పోనిచ్చాడు కార్తీక్. గోపిక ఆశ్చర్యంగా చూస్తోంది.
మానిటర్‌లో చెట్లు, ఆకులు, పువ్వులు, పక్షులు కనపడుతున్నాయి. ఇయర్ ఫోన్స్‌లో గాలి వీచే శబ్దం, పక్షుల అరుపులు వినపడుతున్నాయి. డ్రోన్‌ను చెట్లమధ్యనుంచి చాకచక్యంతో నడుపుతున్నాడు కార్తీక్. దాన్ని అన్ని యాంగిల్స్‌లో ఆపరేట్ చేసాడు. తర్వాత దాన్ని మెల్లిగా దానికి, కొమ్మలు ఆకులు తగలకుండా తన దగ్గరకు తీసుకువచ్చి, జాగ్రత్తగా ల్యాండ్ చేసాడు. కెమెరాలో రికార్డ్‌అయిన దృశ్యాలను పరిశీలించాడు. తర్వాత మరో రెండుసార్లు డ్రోన్‌ను ఆపరేట్ చేసాడు. ఇప్పుడు అతను దాన్ని సులువుగా ఆపరేట్ చేస్తున్నాడు.
గోపికతో ‘‘లాస్ట్‌టైం ఒక్కసారి ఆపరేట్ చేద్దాం...!’’అంటూ చెప్పి డ్రోన్‌ని పైకి లేపాడు.
అదే సమయంలో పఠాన్, బైరాగి, బాల్‌రాజ్‌లు ఇంజనీరింగ్ కాలేజ్ వెనుక వైపున ఉన్న అడవిలాంటి ప్రదేశం బయట తమ వాహనాలను ఆపారు.
‘‘వాడు ఇక్కడే ఉన్నాడు. జాగ్రత్తగా వెతుకుదాం... కనిపించగానే వాడిని... వేసేద్దాం!’’అంటూ తన జీప్ సీట్లకింద నుంచి మూడు పొడవాటి కత్తులు తీసాడు బాల్‌రాజ్. వాటిల్లో ఒకటి బైరాగికీ, మరొకటి పఠాన్‌కీ ఇచ్చి మూడోది తను తీసుకుని ముందుకు కదిలాడు.
ఆ ముగ్గురు గూండాలూ చెట్లకొమ్మల్ని తప్పించుకుంటూ నడవసాగారు.
* * *

-సశేషం

-జి.వి.అమరేశ్వరరావు