డైలీ సీరియల్

పంచతంత్రం-20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొమ్మలకు తగలకుండా డ్రోన్‌ను ముందుకు కదిలించాడు కార్తీక్.
బాల్‌రాజ్, బైరాగి, పఠాన్‌లు మానిటర్‌లో స్పష్టంగా కనపడుతున్నారు.
గోపికలో భయం తగ్గింది. ఆమె సిగ్గుపడుతూ కార్తీక్‌నుంచి దూరంగా జరిగింది. ఆమె పరిస్థితి కార్తీక్‌కి తెలుసు. అందుకే ఆమె ముఖంవైపు చూడకుండా అతడు జాగ్రత్తపడుతున్నాడు.
బాల్‌రాజ్ అతడి అనుచరులు ఒకచోట ఆగారు. వాళ్ళని అనుసరిస్తున్న డ్రోన్ మెల్లగా ముందుకు కదిలింది. వాళ్ళు ఆగినచోట ఉన్న ఒక చెట్టు పక్కన డ్రోన్ ఆగింది.
తన అసిస్టెంట్ పఠాన్‌తో బాల్‌రాజ్ అన్నాడు ‘‘ఒరే పఠాన్! ఆ పండిట్‌గాడు... చెప్పాడు కదా! నా ఫోన్ కొట్టేసినోడు ఇక్కడే ఉన్నాడు అని!’’
పఠాన్ సమాధానం చెప్పాడు. ‘‘ఆ పండిట్‌గాడు నీ ఫోన్ నెంబర్‌ని సరిగా ట్రాక్ చెయ్యలేదేమో!’’
బాల్‌రాజ్ అన్నాడు ‘‘లేదు! వాడు ఇంతకుముందు మనకు కావలసిన ఫోన్ నంబర్స్ కరక్ట్‌గానే ట్రాక్ చేసాడు... ఆ పిక్‌పాకెటర్‌గాడు ఇక్కడినుంచి వెళ్ళిపోయి ఉంటాడు.’’
ఆ సమాధానం వినగానే ముందుకు కదిలాడు బాల్‌రాజ్. అతడిని పఠాన్, బైరాగి అనుసరించారు.
నడుస్తూనే అడిగాడు బైరాగి. ‘‘అసలు వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు?’’
సమాధానంగా అన్నాడు పఠాన్ ‘‘మందుకొట్టటానికి వచ్చి ఉంటాడు. బార్‌లో ఐతే డబ్బు ఖర్చు అవుతుందిగా!’’
‘‘మరి ఇక్కడ మందు బాటిల్స్ ఏమీ కనపడలేదే?’’
‘‘లేకపోతే గర్ల్‌ఫ్రెండ్‌తో వచ్చుంటాడు. హాయిగా ఎంజాయ్ చేసి వెళ్లి ఉంటాడు.’’
ఈ మాటలు అన్నీ కార్తీక్, గోపికల హెడ్ సెట్స్‌లోంచి వినపడుతున్నాయి.
గోపిక కార్తీక్‌వైపు చూడలేకపోతోంది.
‘‘ఇక్కడ చాలా బాగుంది... కట్టమైసమ్మ కల్లు కాంపౌండ్ దగ్గర చీకులు అమ్మే రత్తాల్ని ఓసారి ఇక్కడికి తీసుకురావాలి’’అన్నాడు బైరాగి.
బైరాగి ఉండే ఏరియాలోని కల్లుకాంపౌండ్‌లో చీకులు అమ్ముతుంటుంది రత్తాలు. ఆమెకు బైరాగికీ మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోంది.
‘‘అవును! నేనుకూడా నా గర్ల్‌ఫ్రెండ్‌ని తెచ్చుకుంటా! ఫుల్ ఎంజాయ్ చేస్తా’’. అని చెప్పి. ‘‘హి...హి...!’’అంటూ నవ్వాడు పఠాన్.
‘‘ఇక్కడ ఒకచోట మల్లెపూల పొద ఒకటుంది. చుట్టూ రకరకాల పూల చెట్లు. అచ్ఛం సినిమా సెట్టింగ్లాగుంది. రేపు రత్తాల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఆ పొదలో...’’
మధ్యలోనే అందుకుని చెప్పాడు పఠాన్ ‘‘ఐడియా బాగుంది!... ముందు నేను రేపు నా హసీనాతో వస్తా...! తర్వాత నువ్వు...!’’
‘‘కుదరదు!. ఆ స్పాట్ నేను కనిపెట్టా! కాబట్టి నాదే ఫస్ట్ఛాన్స్..! రేపు మార్నింగ్ పదింటికి... నా రత్తాలుతో వస్తా. టెన్‌టూ లెవెన్ వరకూ ఆ స్పాట్‌లో నేనుంటా... ఆ తర్వాత నువ్వు, నా హసీనా ఎంతసేపైనా ఉండండి... నాకు అనవసరం.’’ అన్నాడు బైరాగి.
‘‘ఒరే! బైరాగి వేధవా! ఆ స్పాట్ మొదట చూసింది నువ్వే!... ఐనా... నేను నీకంటే సీనియర్ని...! నేను ఇప్పటికి పది మర్డర్లు ఇరవై రేపులు చేశా. ఇందులో సగం కూడా నువ్వు చెయ్యలేదు. ...కనుక... నాదే ఫస్ట్ ఛాన్స్!’’
‘‘ఏం కుదరదు...!’’ అన్నాడు బైరాగి.
‘‘నోరు ముయ్యండ్రా! ఆడిని ఎలా ఖతం చెయ్యాలా అని నేను ఆలోచిస్తుంటే... గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఎలా గడపాలో మీరు ప్లాన్ వేస్తారా...?’’అంటూ పెద్దగా అరిచాడు బాల్‌రాజ్.
ఆ అరుపుతో బైరాగి, పఠాన్‌లు ఠక్కున నోరుమూసుకున్నారు.
ఆ సమయంలో బైరాగికి తనకు కుడివైపున ఉన్న చెట్టుపక్కన ఏదో కదిలినట్టు అనిపించింది.
అతడికి అలా అనిపించడానికి కారణం ఆ చెట్టుపక్కనుంచి వాళ్ళని ఫాలో అవుతున్న డ్రోన్.
బైరాగి ఆగి తల తిప్పి చూసాడు. బైరాగి మూమెంట్స్ గమనిస్తున్న కార్తీక్ వెంటనే డ్రోన్‌ని పక్కకు తప్పించాడు. తల పక్కకు తిప్పి చూసిన బైరాగికి ఏమీ కనిపించలేదు.
ఆగిన బైరాగిని ఉద్దేశించి అన్నాడు బాల్‌రాజ్.
‘‘ఏంట్రా? ఆగిపోయావ్??’’
‘‘ఏదో పక్షి. కానీ అది అచ్ఛం దోమలాగ సౌండ్ చేస్తోంది.’’
‘‘మరి ఏదిరా ఆ పక్షి?’’
‘‘ఎటో ఎగిరిపోయింది!’’
పఠాన్ అన్నాడు. ‘‘ఏరా బైరాగీ? పక్షి దోమలాగా అరుస్తోందా?’’
‘‘అవునన్నా!’’
కసురుకుంటూ అరిచాడు బాల్‌రాజ్.
‘‘రాత్రి కొట్టిన మందు ఇంకా దిగలేదనుకుంటా.. నోరుమూసుకుని పద!’’
దాంతో వాళ్ళను బైరాగి వౌనంగా అనుసరించసాగాడు.
ఒక నిమిషం తర్వాత బాల్‌రాజ్‌తో పఠాన్ అన్నాడు.
‘‘అన్నా! ఇల్లుకాలిపోయిందిగా!! ఆ లాడ్జింగ్‌లో ఎందుకు... మా ఇంట్లో ఉందువుగాని...’’
‘‘సరే!... చెన్నైనుంచి పార్టీ వస్తోందని అన్న చెప్పాడు. మనం ఎలర్ట్‌గా ఉండాలి’’ అంటూ చెప్పాడు బాల్‌రాజ్.
ఆ మాటతో బాల్‌రాజ్ గ్యాంగ్ అక్కడినుంచి వెళ్లిపోతున్నట్లు గ్రహించాడు కార్తీక్.
బైరాగి ఎవరో, పఠాన్ ఎవరో కార్తీక్‌కి అర్ధం అయింది. వాళ్ళల్లో పొడుగువాడు పఠాన్. పొట్టివాడు బైరాగి.
కార్తీక్ వెంటనే డ్రోన్‌ని తన దగ్గరకు తెప్పించుకుని, పవర్ ఆఫ్‌చేసి దాన్ని బాగ్‌లోకి సర్దాడు.
బాల్‌రాజ్ గ్యాంగ్ ఆ ప్రదేశంనుంచి బయటకు నడిచారు. వాళ్ళకి తనకూ దూరం ఉండేలా జాగ్రత్తపడుతూ కార్తీక్, గోపికలు కూడా బయటకు నడిచారు.
బాల్‌రాజ్, పఠాన్, బైరాగి అక్కడవున్న తమ వాహనాలను ఎక్కి బయలుదేరారు.
రెండు నిమిషాలు ఆగాడు కార్తీక్.
తర్వాత అతడు గోపికను బైక్‌మీద ఎక్కించుకున్నాడు.
ముఖం కనపడకుండా గోపిక చున్నీ చుట్టుకుంది. తలకు హెల్మెట్ ధరించాడు కార్తీక్. అతడు పఠాన్ నడుపుతున్న బైక్‌ని ఫాలో అవసాగాడు. అలా ఫాలోఅవుతూనే తన ఫోన్ ఆన్‌చేసి, హరీష్‌కి ఫోన్‌చేసి, తనూ గోపికా అక్కడ లేము అనీ, పఠాన్‌ను ఫాలోఅవుతున్నాము అనీ, మళ్ళీ ఎక్కడ కలిసేదీ ఫోన్లో చెపుతాను అనీ చెప్పి ఫోన్ కట్ చేసాడు.
మెయిన్ రోడ్‌లోకి వచ్చిన తర్వాత ఓ పక్కగా బైక్ ఆపాడు.
గోపికతో చెప్పాడు. ‘‘నేను ఆ పఠాన్ గాడిని ఫాలోఅవుతా. నువ్వు ఇంటికి వెళ్లు!’’
గోపిక బైక్ దిగింది. అక్కడనుంచి ఆమె ఇల్లు చాలాదగ్గర. ఆమె కార్తీక్‌తో చెప్పింది.
‘‘జాగ్రత్తగా ఉండు!’’
బదులుగా కార్తీక్ చిరునవ్వు నవ్వి బైక్‌ను ముందుకు కదిలించాడు.
దాదాపు రెండుగంటలసేపు బాల్‌రాజ్, వాడి అనుచరులు నగరంలో వివిధ ప్రాంతాల్లో తిరిగారు. తర్వాత వాళ్ళు పఠాన్ ఇంటివద్దకు చేరుకున్నారు.
- ఇంకా ఉంది

-జి.వి.అమరేశ్వరరావు