డైలీ సీరియల్

పంచతంత్రం-22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీక్ వేగంగా టైపు చేయసాగాడు.
కార్తీక్‌కి తప్ప మిగిలిన ముగ్గురిలో టెన్షన్ పెరిగిపోతోంది.
రెండు నిమిషాల తర్వాత బాల్‌రాజ్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్ ఓపెన్ అయింది.
ఫ్రెండ్స్‌ని ఉద్దేశించి కార్తీక్ చెప్పాడు.
‘‘వాడి అకౌంట్‌లో మొత్తం రెండు కోట్ల డెబ్భై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నాయ్. అంతా వైట్‌మనీ అయి ఉంటుంది. అందుకే ధైర్యంగా అకౌంట్‌లో వేసుకున్నాడు.’’
‘‘రెండు కోట్లే?’’ ముగ్గురూ ఆశ్చర్యంగా ఒకేసారి అన్నారు.
‘‘ఇప్పుడు నువ్వు ఏం చెయ్యబోతున్నావ్?’’ అడిగాడు జైరాం.
‘‘ఈ అవౌంట్‌ని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి, తిరుపతి వెంకటేశ్వరస్వామి, శ్రీ వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి, బెజవాడ కనకదుర్గ, వరంగల్ భద్రకాళి, శ్రీశైలం మల్లిఖార్జునస్వామి, కొమరవెల్లి మల్లిఖార్జునస్వామి, కాణిపాకం గణపతి, మహానందీశ్వరస్వామి... మహానంది, కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి, షిరిడీసాయిబాబా దేవాలయాల అన్నదాన పథకాలకూ, ప్రైమ్‌మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్‌కూ, రామకృష్ణమఠం, రెడ్‌క్రాస్ సొసైటీలకూ, సమానంగా డొనేట్ చేస్తున్నా. ఎస్‌బి అకౌంట్‌లో మినిమం పదిహేను వందలు ఉండాలి. అది పోను రెండు కోట్ల డెబ్భైఎనిమిది వేల నాలుగువందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటాయి. ఆ అవౌంట్‌ను పధ్నాలుగు భాగాలుచేస్తే... ఒక్కొక్క భాగం పధ్నాలుగు లక్షల, ముప్ఫైనాలుగువేల నూటడెబ్బై ఎనిమిది రూపాయల యాభై పైసలు అవుతుంది. ...’’ అంటూ చెప్పాడు కార్తీక్.
* * *
బాల్‌రాజ్ దగ్గర ఫోన్ మోగింది.
పండిట్ లైన్లో ఉన్నాడు.
‘‘అన్నా!... నీ ఫోన్ కొట్టేసినోడు మళ్ళీ నీ ఫోన్ ఓపెన్ చేసాడు. నేను ట్రాక్‌చేశా! ఇప్పుడు వాడు పాతబస్తీ గల్లీల్లో తిరుగుతున్నాడు..... వెళ్లి పట్టుకోండి!’’
బాల్‌రాజ్ చేతి గడియారం వంక చూసుకుని చెప్పాడు.
‘‘ఇప్పుడు అంత దూరంవెళ్లే టైం లేదు.’’
‘‘సరే అన్నా!....మరి నా విషయం!’’
‘‘ఇవ్వాళే సెటిల్ చేస్తా!’’
‘‘సరే అన్నా!’’అంటూ ఫోన్ పెట్టేసాడు పండిట్.
* * *
కార్తీక్ చాలావేగంగా బాల్‌రాజ్ అకౌంట్‌లో ఉన్న డబ్బులు అన్నీ ట్రాన్స్పర్ చేసాడు. డబ్బు బదిలీఐన ప్రతిసారీ కార్తీక్ దగ్గరున్న బాల్‌రాజ్ సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌లు వస్తున్నాయి.
తర్వాత కార్తీక్ టైంచూశాడు. ‘బాల్‌రాజ్ వాళ్ళు తమ ఇంటికి బయలుదేరటానికి రెడీఅవుతూ ఉంటారు’అనుకున్నాడు. బాల్‌రాజ్ దగ్గర రెండో ఫోన్ ఉంది. ఆ ఫోన్ నుంచే అతడు క్రితంరోజు ఫోన్‌చేసి కార్తీక్‌ను బెదిరించాడు.
ఆ ఫోన్ నంబర్ కార్తీక్‌కు గుర్తుంది. వచ్చిన ఎస్‌ఎంఎస్‌లు అన్నిటినీ ఆ నంబర్‌కు ఫార్వర్డ్‌చేసాడు కార్తీక్.
* * *
బాల్‌రాజ్ దగ్గర ఉన్న ఫోన్‌కు వరసగా పధ్నాలుగు ఎస్‌ఎంఎస్‌లు వచ్చాయి.
‘‘ఏంట్రా! ఇన్ని ఎస్‌ఎంఎస్‌లు వస్తున్నాయి...? ఎవరో మార్కెటింగ్ వాళ్ళో...! లేకపోతే మీ మొబైల్‌కి లాటరీ వచ్చింది అంటూ మోసంచేసే కేడీగాళ్ళో చూడు!’’అంటూ తన ఫోన్‌ని పఠాన్‌కి ఇచ్చాడు బాల్‌రాజ్. ఆ ఎస్‌ఎంఎస్‌లు చూసి-
‘‘అన్నా!.... నువ్వు చాలా గ్రేట్ అన్నా!... చాలా గొప్పోడివి అన్నా!.... నీ అకౌంట్లో ఉన్న డబ్బులు అన్నీ.... దేముళ్ళకి దానం చేసావ్.... అన్న దానాలు చేశావ్.... ప్రైమ్‌మినిస్టర్ ఫండ్‌కీ... రెడ్డు క్రాసు వాళ్ళకీ, రామకృష్ణ మఠానికి పంచిపెట్టావ్... నీలాంటివాళ్ళు ఉంటే దేశంలో అవినీతి అంతమవుతుందన్నా!... అంతమవుతుంది!’’ అంటూ చెప్పాడు పఠాన్ ఆవేశంగా.
ఆ మాటలు వినగానే కంగారుగా-
‘‘ఏంట్రా!... నీకు ఏమైనా మెంటల్ ఎక్కిందా?... నేను దానం చేయటం ఏంట్రా?’’అంటూ అరిచాడు బాల్‌రాజ్. అంతలో పఠాన్ చేతిలోని ఫోన్ రింగ్ అయింది. వెంటనే ‘‘నీకే అన్నా! ఫోను!!’’అంటూ దాన్ని బాల్‌రాజ్‌కి ఇచ్చాడు పఠాన్.
ఫోన్ అందుకుని డిస్‌ప్లే యూనిట్‌వైపు చూసాడు బాల్‌రాజ్. అందులో తన ఫోన్ నెంబర్ కనపడగానే ఉలిక్కిపడి-
‘‘వాడే!... నా ఫోన్ కొట్టేసినోడు లైన్లో ఉన్నాడ్రా! నా ఫోన్‌నుంచే నాకు ఫోన్ చేస్తున్నాడు!!’’అంటూ అరిచి, కాల్ రిసీవ్ చేసుకుని-
‘‘రేయ్!.... ఎక్కడ ఉన్నావురా? నీ అంతుచూస్తా!’’ అంటూ గావుకేక పెట్టాడు.
‘‘రేయ్! హౌలే! జాగ్రత్తగా విను...!!! నీ బ్యాంకు అకౌంట్లోఉన్న డబ్బు అంతా దేవాలయాలకీ, మఠాలకీ, పిఎమ్ ఫండ్‌కీ, రెడ్‌క్రాస్ సౌసైటీకీ దానం చేసేశా... ఇప్పుడు నీ అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్ పదిహేను వందల రూపాయలు మాత్రమే ఉన్నాయ్... ఎవడన్నా సెల్‌ఫోన్‌లో పాస్‌వర్డ్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలూ ఫీడ్ చేసుకుంటాడ్రా వెధవా?... ఇలా ఫీడ్ చేసుకునేవాళ్ళు అందరికీ నీగతే పడుతుందిరా బద్మాష్!... బాయ్...! హ్యావ్ ఏ నైస్ డే!’’అంటూ చెప్పి ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసాడు కార్తీక్.
‘‘నా డబ్బు...! నా డబ్బు...! అంతా పంచిపెట్టేసాడు.. మొత్తం డబ్బుపోయింది... మొత్తం పోయింది... మొత్తం... పోయింది!’’ అని అరుస్తూ స్పృహతప్పి పడిపోయాడు బాల్‌రాజ్.
రెండుగంటల తర్వాత బాల్‌రాజ్ జేబులో ఉన్న సెల్‌ఫోన్ మోగింది.
దాన్ని తీసి కాల్ రిసీవ్ చేసుకుని ‘‘హలో!’’అన్నాడు పఠాన్.
అవతలినుంచి వాసదేవరావు కంఠం వినపడింది.
ఆయన విచారంగా అడుగుతున్నాడు.
‘‘మేము అంతా రెడీగా ఉన్నాం. రిజిస్ట్రార్ ఆఫీస్‌కి ఎప్పుడు వెడదాం?’’
పఠాన్‌కు ఏంచెప్పాలో అర్ధంకాలేదు. అతడు హాస్పటల్ బెడ్‌మీద స్పృహ లేకుండా పడిఉన్న బాల్‌రాజ్‌వైపు చూసాడు. తర్వాత బెడ్ పక్కన విరాగిలా కూర్చుని ఉన్న బైరాగివైపు చూసాడు. ఆ తర్వాత ఏదో ఆలోచించి-
‘‘ప్రస్తుతం మేము చాలా ముఖ్యమైన మీటింగ్‌లో ఉన్నాం. ఈరోజు రిజిస్ట్రేషన్లు వద్దు... మళ్ళీ ఎప్పుడో తర్వాత చెపుతాం...!’’ అంటూ చెప్పాడు.
* * *
మరికొన్ని గంటల తర్వాత.
కార్తీక్ వాళ్ళ ఇంటిముందు టాటానానో ఆగింది.
కార్తీక్‌ని దించటానికి హరీష్, జైరాం, రవి వచ్చారు. ఇంట్లోనుంచి పెద్దగా ఏదో భజన వినపడుతోంది. కార్తీక్ అతడి ఫ్రెండ్స్ ఇంట్లోకి వెళ్లారు. అక్కడ ఆంజనేయస్వామికి ఆకుపూజ జరుగుతోంది. హరీష్, రవి, జైరాం, గోపికల తల్లితండ్రులు కూడా అక్కడ ఉన్నారు. అంతా హనుమాన్‌చాలీసా పఠిస్తున్నారు.
‘‘ఇవ్వాళ కూడా రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. అంతా ఆ ఆంజనేయస్వామి మహిమ. కరెక్ట్ టయానికి వచ్చారు. ఆంజనేయస్వామికి ఆకుపూజ చేయిస్తున్నాం...! రండి! మీరుకూడా చాలీసా పఠించండి!!’’అంటూ ఆశ్చర్యంగా చూస్తున్న కార్తీక్, అతడి ఫ్రెండ్స్‌తో చెప్పాడు వాసుదేవరావు.
అర్జెంటుగా చేసే పని ఏదీలేకపోవటంతో కార్తీక్ అతడి ఫ్రెండ్స్ కూడా అక్కడ కూర్చుని-
‘‘జయ హనుమాన జ్ఞానగుణ సాగర- జయ కపీశ తిహులోక ఉజాగర.’’
‘‘రామదూత అతులిత బలధామా- అంజని పుత్ర పవన సుత నామా.’’
అంటూ హనుమాన్ చాలీసా పఠించటం ప్రారంభించారు.

-సశేషం

-జి.వి.అమరేశ్వరరావు