డైలీ సీరియల్

యువర్స్ లవ్వింగ్లీ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త సీరియల్ ప్రారంభం

ప్రారంభానికి ముందు

‘‘హాయ్ భరణీ...’’
‘హల్లో...’’
‘‘ఏమిటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు?’’
‘‘బిజీగా వున్నాను గానీ ఏమిటి విషయం? ఎందుకు ఫోన్ చేసావో చెప్ప?’’
అవతలవైపు కాసేపు వౌనం.. తరువాత నెమ్మదిగా వినిపించాయి మాటలు- ‘‘నువ్వు చాలా మారిపోయావు భరణి... ఇన్నాళ్ళూ ఎందుకు ఫోన్ చేయలేదని అడిగేవాడివి. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు అని అడుగుతున్నావు?’’
‘‘కమాన్ సుజీ.. బిజీగా వున్నానని చెప్పాను కదా? నాన్చకుండా విషయం చెప్పు?’’’
‘‘సాయంత్రం ఫ్రీనేనా? షల్ వి మీట్?’’ ఆశగా అడిగింది.
‘‘ష్యూర్.. ష్యూర్..’’
‘‘ఓకే.. ఓకే.. ఎయిట్ థర్టీకల్లా ప్యారడైజ్‌కి వచ్చేస్తాను’’ హుషారుగా అంది సుజాత.
‘‘నో.. నో.. సుజీ.. ప్యారడైజ్ కాదు.. మా గెస్ట్ హౌస్‌లో కలుద్దాం’’
‘‘వై?..’’
‘‘మనిద్దరం ఫ్రీగా కలుసుకుని చాలా రోజులైంది కదా?’’ గొంతులో అదోరకమైన మార్దవాన్ని నింపుకుని అన్నాడు.
‘‘సిగ్గులేదు.. నీకీమధ్యన ఆ ధ్యాస ఎక్కువైపోతోంది’’ సిగ్గూ నవ్వూ కలిసిన స్వరంతో అంది సుజాత.
‘‘నీకు మాత్రం తక్కువైనట్లు?’’ నవ్వుతూ అన్నాడు.
అప్పటిదాకా అతడు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడడంతో ఆ సంభాషణంతా పక్కనే వున్న శ్రీను విన్నాడు. ‘‘ఏంటన్నా రాత్రికి మళ్లీ ప్యారడైజ్‌కి ఎగనామం పెట్టేస్తావా? గెస్ట్ హౌస్‌లో మస్త్ మస్తా?’’ నవ్వుతూ అన్నాడు.
‘‘నో.. నేను రాత్రి ప్యారడైజ్‌కే వెళ్తాను’’
‘‘అదేంటి? మరి సుజాతని గెస్ట్‌హౌస్‌కి రమ్మని చెప్పావు? ఏదో.. ప్రోగ్రామ్ కూడా చేసావు?’’
‘‘సుజాత గెస్ట్‌హౌస్‌కి వస్తుంది. కానీ నేను గెస్ట్ హౌస్‌కి వెళ్ళను.. నువ్వు వెళతావు! ఆసక్తి వుంటే, కొంచెం ఓపికా, తెలివితేటలూ ఉపయోగిస్తే ఆ ప్రోగ్రామ్ ఏదో నువ్వే ఫినిష్ చేసేయవచ్చు. ఎలాగంటావా? చాలా సింపుల్.. నువ్వెళ్ళగానే సుజాత భరణి రాలేదా? అని అడుగుతుంది. నువ్వు ఆమె వంక జాలిగా చూస్తూ భరణి సంధ్యతో కలిసి పబ్‌కెళ్ళాడు అని చెబుతావు. తను కాసేపు నన్ను తిడుతుంది. నువ్వు కూడా నన్ను తిడతావు. నీలాంటిదాన్ని వదులుకుంటున్నవాడు ఒట్టి ఫూల్ అంటావు. నువ్వు ఇన్నాళ్ళూ వాడిలాంటి వెధవ చుట్టూ తిరిగి టైమ్ వేస్ట్ చేసుకున్నావు అంటావు. అలా మా గెస్ట్‌హౌస్‌లో కూర్చుని మీరిద్దరూ కాసేపు నన్ను తిట్టుకున్నాక ఆమె నీ భుజమీద తలవాల్చి బాధపడుతుంది.. ఆ తరువాత ఏం చేయాలో నేను చెప్పక్కర్లేదు’’ నవ్వుతూ అన్నాడు.
‘‘ఏంటి భరణీ నువ్వు మాట్లాడేది?’’ ఆశ్చర్యంగా అన్నాడు శ్రీను.
‘‘ఏం? నీకిష్టం లేదంటే చెప్పు? ఆ సుందరంగాడు అదంటే పడి ఛస్తున్నాడు. వాడిని పంపిస్తాను’’ మళ్లీ నవ్వాడు భరణి.
***
‘‘ప్యారడైజ్ ఆన్ వీల్స్!’’
నిజంగానే స్వర్గాన్ని చక్రాలు కట్టి లాక్కొచ్చి అక్కడ వుంచినట్లుగా వుందక్కడి వాతావరణం. కుర్రకారంతా ఆనందంతో తుళ్ళి తుళ్ళి పడుతున్నారు.
‘షల్ వియ్ మీట్ ఇన్ ద ఈవినింగ్ ఎట్ పబ్?’ అని బాయ్‌ఫ్రెండ్స్ దగ్గరనుంచి వచ్చిన మెసేజ్‌లని సెల్‌ఫోన్‌లో చదువుకుని ముసి ముసి నవ్వుల్తో అడుగుపెడుతున్న అమ్మాయిలతోనూ, ‘తాము పిలిచిన అమ్మాయి వస్తుందా? రాదా?’ అన్న సందేహంతో ద్వారం దగ్గరే తిరుగుతూన్న అబ్బాయిలతోనూ ఆ ప్రదేశం కిటకిటలాడుతోంది.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ