డైలీ సీరియల్

పంచతంత్రం--25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిమిషం తర్వాత బైరాగి కూడా బయటకు వచ్చాడు.
రవి, జైరాంలు తినటం, తాగటం మధ్యలోనే ముగించి, బిల్లు చెల్లించి ఆ పక్కనే పార్క్‌చేసి ఉన్న బైక్స్‌దగ్గరకు చేరుకొని, హెల్మెట్స్ పెట్టుకున్నారు.
బాల్‌రాజ్ వచ్చి పఠాన్ పక్కన జీపులో కూర్చున్నాడు. వెంటనే జీప్ కదిలించాడు పఠాన్.
వాళ్ళ వెనకే బయలుదేరాడు బైరాగి.
బైరాగిని రవి-బాల్‌రాజ్, పఠాన్‌లను జైరాం ఫాలో అవసాగారు.
* * *
నిరంజన్ ప్రయాణిస్తున్న కారు ఒక సినిమా థియేటర్ ప్రాంగణంలోకి ప్రవేశించింది. అక్కడ పార్కింగ్ ప్లేస్‌లోని వ్యక్తికి వెయ్యి రూపాయల నోటు ఇచ్చాడు నిరంజన్.
పార్కింగ్‌లోని వ్యక్తి ‘‘సార్! పాత వెయ్యి నోటు చెల్లదు... అంత పెద్ద నోటుకు చిల్లర లేదు’’ అన్నాడు.
వీళ్ళని ఆ పక్కనే నిలబడి ఉన్న ఓ వ్యక్తి గమనిస్తున్నాడు. అతడు నిరంజన్ దగ్గరికి వచ్చి.
‘‘సార్!... నేను వెయ్యి నోటు తీసుకుని ఒక కొత్త ఐదొందల నోటు, రెండు పాత వంద నోట్లు ఇస్తా!.... .... మిగతా మూడు వందలు నా కమిషన్’’ అంటూ చెప్పాడు.
‘‘సరే ఇయ్యి!’’ అన్నాడు నిరంజన్.
ఆ వ్యక్తి నిరంజన్ దగ్గర ఉన్న వెయ్యి నోటు తీసుకుని, ఏడు వందలు ఇచ్చాడు.
పార్కింగ్‌లోని వ్యక్తి నిరంజన్‌తో అన్నాడు.
‘‘సార్!... ఈమధ్య నోట్లతో వ్యాపారంచేసే నాయాళ్ళు ఎక్కువ అయిపోయారు సార్!!’’
నిరంజన్ నవ్వి, కారు పార్క్‌చేసి, టోకెన్ తీసుకుని, కౌంటర్లో టికెట్ కొనుక్కుని థియేటర్‌లోకి నడిచాడు.
అతడినే గమనిస్తున్నాడు కార్తీక్.
అతడు కూడా తన బైక్ పార్క్‌చేసి, టికెట్ కొనుక్కుని థియేటర్లోకి ప్రవేశించాడు.
* * *
తమ ఏరియాలోని పోలీస్‌స్టేషన్ దగ్గరలో ఓ చెట్టుకింద ఉన్న బడ్టీకొట్టు పక్కన బైక్‌మీద కూర్చుని మహేంద్రకోసం చూస్తున్నాడు హరీష్.
మహేంద్ర పోలీస్‌స్టేషన్లో ఉన్నాడో లేడో హరీష్‌కి అర్ధంకావటంలేదు. సెల్‌ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతున్నట్టు నటిస్తున్నాడు హరీష్.
ముప్పావుగంట సమయం గడిచింది. హరీష్ నిరీక్షణ ఫలించింది. సివిల్ డ్రస్‌లో ఉన్న ఎస్‌ఐ మహేంద్ర పోలీస్‌స్టేషన్‌నుంచి బయటకు వచ్చి, అక్కడ పార్క్‌చేసిన బైక్ స్టార్ట్‌చేసి బయలుదేరాడు. అతడిని ఫాలో అవసాగాడు హరీష్.
* * *
బాల్‌రాజ్, పఠాన్‌లను ఫాలో అవుతున్నాడు జైరాం.
బాల్‌రాజ్, పఠాన్‌లు ప్రయాణిస్తున్న జీప్ కార్తీక్ వాళ్ళు ఉంటున్న కాలనీ వైపు ప్రయాణించసాగింది.
జైరాంకు అర్ధం అయింది. వాళ్ళు తమ పేరెంట్స్‌ను రిజిస్ట్రేషన్‌కు తీసుకుపోయే ప్రయత్నంలో ఉన్నారు. దారిలో వాళ్ళు ఏ ఇరానీ కేఫ్‌లోకో, ఏ కల్లుకాంపౌండ్‌లోకో, లేకపోతే ఏదన్నా బార్‌లోకో ప్రవేశిస్తే బాగుండు అనుకుంటూ వాళ్ళని ఫాలో అవసాగాడు.
జీప్ నడుపుతున్న పఠాన్ అన్నాడు ‘‘అన్నా! దారిలో ఒక రెండు పెగ్గులు కొట్టివెడదాం!’’
అంగీకార సూచకంగా తల ఊపాడు బాల్‌రాజ్. తర్వాత ఇద్దరూ ప్రయాణిస్తున్న జీప్ ఆ దగ్గరలోఉన్న ఒక బార్ దగ్గర ఆగింది. ఇద్దరూ ఆ బార్‌లోకి వెళ్లారు. ఓచోట కూర్చుని రెండు ‘మార్గరిట’ కాక్టైల్స్ ఆర్డర్ చేశారు.
జైరాం కూడా ఆ బార్‌లోకి నడిచాడు. బార్‌రాజ్, పఠాన్‌లు కాక్టైల్స్ ఆర్డర్ చేయటం గమనించాడు. లిక్కర్ కాబిన్‌లో ఉన్న వ్యక్తి కాక్టైల్స్ తయారుచేసి, బేరర్‌కోసం ఎదురుచూస్తున్నాడు.
జైరాం తన షర్ట్ పాకెట్‌లో ఉన్న చిన్న పొట్లాన్ని బయటకు తీస్తూ కౌంటర్‌లోని వ్యక్తితో చెప్పాడు.
‘‘్భయ్యా! ఒక మార్టిని!!’’
వెంటనే కౌంటర్‌లోని వ్యక్తి లిక్కర్ క్యాబిన్ వైపు వెనక్కి తిరిగాడు.
అదే సమయంలో తన దగ్గర ఉన్న పొట్లంలోని రెండు ‘జమాల్‌గొట్ట’ మాత్రలు తీసుకున్నాడు జైరాం. ‘జమాల్‌గొట్ట’అనేది ఉర్దూ పదం. ఆ మాత్రల గురించి జైరాంకి కార్తీక్ చెప్పాడు. వాటిని ఆయుర్వేద మందులు అమ్మే షాప్‌లో కొన్నాడు జైరాం. ‘జమాల్‌గొట్ట’ మాత్రలు మింగిన వాళ్లకు విపరీతంగా విరోచనాలు అవుతాయి. కొందరికి కడుపునెప్పి వస్తుంది. ఆ మాత్రలను గేదెలకు కూడా విరోచనాలు అవడానికి వాడతారు.
జైరామ్ ఆ మాత్రలను తన ఎదురుగా ఉన్న లిక్కర్ గ్లాసుల్లో పడేసాడు. ఈలోపు బేరర్ వచ్చి ఆ రెండు లిక్కర్ గ్లాసులనూ తీసుకువెళ్లి బాల్‌రాజ్, పఠాన్‌లకు సర్వ్ చేసాడు. వెంటనే వాళ్ళు లిక్కర్ తాగసాగారు. ఈ దృశ్యం చూసిన జైరాం కౌంటర్‌లోని వ్యక్తితో
‘‘సారీ భయ్యా!.... ఆర్డర్ క్యాన్సిల్ చెయ్యి! అర్జెంటు పని ఉంది!’’ అంటూ చెప్పి అక్కడినుంచి చిరునవ్వుతో బయటకు వెళ్లిపోయాడు.
సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత-
ప్రపంచంలోనే విరోచనాలు పుట్టించటంలో ప్రముఖస్థానం వహించిన జమాల్‌గొట్ట ప్రభావంతో బాల్‌రాజ్, పఠాన్‌లు ఆ బార్‌లోఉన్న టాయిలెట్‌కు పరుగుతీశారు. కానీ ఆ బార్లో ఒకేఒక టాయిలెట్ ఉంది. అనేకసార్లు ఆ టాయిలెట్‌లోకి వెళ్లి వచ్చిన తర్వాత, చివరకు ఇద్దరూ ఆగలేక, ఆ టాయిలెట్‌లోకి ఒకేసారి దూరి తలుపులు వేసేసుకున్నారు.
అలా తలుపులు వేసుకున్న రెండు నిమిషాల తర్వాత బాల్‌రాజ్ దగ్గర ఉన్న సెల్ మోగింది. అవతలనుంచి వాసుదేవరావు లైన్‌లోకి వచ్చి-
‘‘సార్! రిజిస్ట్రేషన్‌కి మేము అంతా రెడీగా ఉన్నాం. మీరు ఎప్పుడు వస్తున్నారు?’’అంటూ అడిగాడు.
‘‘మేము ఇక్కడ చాలా అర్జెంటు పనిలో ఉన్నాం!... ఇవ్వాళ కుదరదు..’’అంటూ అరుస్తూ చెప్పాడు బాల్‌రాజ్.
పక్కనే కూర్చుని ఉన్న పఠాన్.
‘‘అన్నా! నీ దగ్గర ఏదో మహాత్యం ఉంది. మోషన్స్ వస్తున్నాయ్ అని అన్నతో అన్నావ్. నిజంగానే వస్తున్నాయి. ఎందుకో నాక్కూడా వస్తున్నాయి’’ అన్నాడు బాల్‌రాజ్‌తో.
అదే సమయంలో-
‘‘అంతా ఆ ఆంజనేయస్వామి మహాత్యం!’’అని అనుకున్నాడు వాసుదేవరావు.
-సశేషం

-జి.వి.అమరేశ్వరరావు