డైలీ సీరియల్

పంచతంత్రం-28

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాపు ఉదయం ఐదూముప్పావు అవుతుండగా నిరంజన్ ఇంట్లో గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఒక గదిలో లైట్ వెలిగింది. అది నిరంజన్ బెడ్‌రూమ్.
నిరంజన్ బెడ్‌రూంలో లైట్ వెలగగానే డ్రోన్‌ను కదిలించాడు కార్తీక్. దాన్ని బెడ్‌రూమ్ కిటికీవైపు పోనించాడు. చలికాలం అవటంతో కిటికీ తలుపులు దగ్గరకు వేసి ఉన్నాయ్. ఏంచేయాలో కార్తీక్‌కి అర్ధంకాలేదు. అంతలో అతడికి వెంటిలేటర్ కనపడింది. డ్రోన్‌ను పైకిలేపి వెంటిలేటర్ దగ్గరకు పోనించాడు. వెంటిలేటర్‌కు జాలీ ఫిక్స్‌చేసి ఉంది. కార్తీక్ ఆలోచిస్తుండగా నిరంజన్ గదిలో టీపాయ్ మీద ఉన్న సెల్‌ఫోన్ మోగింది. ఆ శబ్దం కార్తీక్‌కు హెడ్‌సెట్స్‌లోనుంచి వినపడింది. నిరంజన్‌కు ఫోన్ వచ్చిన విషయం కార్తీక్‌కి అర్ధంఅయింది. ఫోన్ సంభాషణ వినేందుకు అనువుగా డ్రోన్‌ను మళ్ళీ కిందకు దించి, దగ్గరకువేసి ఉన్న కిటికీ తలుపుల దగ్గరకు తీసుకువచ్చి, అక్కడ దాన్ని గాలిలో నిలిపాడు. కిటికీ తలుపుల సందులోంచి కొంచెం కనపడుతోంది నిరంజన్ బెడ్‌రూమ్.
మోగుతున్న ఫోన్‌వైపు నిరంజన్ కదిలాడు.
నిరంజన్ ఫ్రేమ్‌లోకి వచ్చి, ఫ్రేమ్ అవుట్ అవ్వటం కిటికీ సందుల్లోనుంచి కొద్దిగా కనపడింది. మానిటర్లో చూస్తున్న కార్తీక్‌కి.
‘‘హలో!... గుడ్‌మార్నింగ్ వేలాయుధం చెప్పండి!’’అన్నాడు నిరంజన్. అతడు గదిలో అటూఇటూ నడుస్తూ మాట్లాడుతున్నాడు. దాంతో అప్పుడు అప్పుడు ఫ్రేమ్‌లోకి వచ్చి కార్తీక్‌కి కనపడుతున్నాడు.
వేలాయుధం పేరు వినగానే ఎలర్ట్‌అయ్యాడు కార్తీక్.
అవతలనుంచి వేలాయుధం ఏదో మాట్లాడుతున్నాడు. అతడు మాట్లాడిన తర్వాత అడిగాడు నిరంజన్.
‘‘నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. ఎలా గుర్తుపట్టాలి?’’ వేలాయుధం ఏదో చెప్పాడు.
‘‘సరే! మీ ముఖం నాకు చూపించవద్దు... నా ముఖంకూడా మీకు చూపించను. మాస్క్ పెట్టుకుంటూ.. ఓకే!... ఓకే!... ఆ ఐదొందల నోటు నాదగ్గరే ఉంది... సరే!’’అంటూ సంభాషణ ముగించాడు నిరంజన్.
ఆ సంభాషణలో వేలాయుధం ఎక్కువసేపు మాట్లాడాడు. అతడు ఏం మాట్లాడి వుంటాడు? తననుతాను ప్రశ్నించుకుంటూ కార్తీక్.
అతడి అనుమానానికి వెంటనే సమాధానం లభించింది.
గదిలో అటూఇటూ నడుస్తూ సెల్‌ఫోన్‌లోని బటన్స్ కదిపాడు నిరంజన్.
అతడు తనకూ వేలాయుధంకూ జరిగిన సంభాషణ అంతా రికార్డుచేసాడు.
సెల్‌ఫోన్‌లో ‘మైఫైల్స్’లోకి వెళ్లి సౌండ్స్ ఫైల్స్‌లో రికార్డుఅయి ఉన్న ఆడియో ఫైలు ఓపెన్‌చేసి, ప్లే చేసాడు. ఆ సంభాషణ వింటూ నేరుగా కిటికీ వైపు వచ్చాడు. అతడి మూమెంట్స్ కొంచెం కార్తీక్‌కి కనపడుతున్నాయి.
నిరంజన్ కిటికీ తలుపులు తెరిచాడు. అదే సమయంలో డ్రోన్‌ని పైకి లేపాడు కార్తీక్. కిటికీ దగ్గర నిలబడి వింటున్నాడు నిరంజన్.
ఆ సంభాషణ కార్తీక్‌కి కూడా వినపడుతోంది. ముఖ్యంగా తాను మిస్ అయిన వేలాయుధం మాటల్ని మరింత శ్రద్ధగా వినసాగాడు కార్తీక్.
‘‘ఒకరికి నా ముఖం చూపించటం నాకు ఇష్టంలేదు. నాతో డీల్‌చేసేవాళ్ళ ముఖం చూడటం కూడా నేను ఇష్టపడను. నీ ముఖం నాకు చూపించకు. ఒకే సిమ్ములో మాడ్లాడటం కూడా నాకు నచ్చదు... నేను పంపించిన ఐదొందల నోటు నీ దగ్గర ఉంది కదా?... మనం కలిసినప్పుడు అది నాకు ఇయ్యి. నిన్ను గుర్తించటానికి అది పనికివస్తుంది. ఇక నేను నిన్ను ఇవ్వాళ ఎక్కడ, ఎప్పుడు కలుస్తానో... చెప్పను... నువ్వే నీ టైం చూసుకుని, నీకు నచ్చినచోటికి వెళ్లు...!... నేనే వచ్చి నిన్ను కలుస్తాను. నువ్వు నన్ను కాంటాక్ట్ చెయ్యకు... గుర్తుంచుకో!... నేను నీవరకే వేలాయుధాన్ని, మరొకడికి మరొకడ్ని.’’
ఇంకొక్కసారి ఆ సంభాషణ విన్నాడు నిరంజన్.
తనకు తెలిసిన కాంటాక్ట్స్ ద్వారా వేలాయుధంతో టచ్‌లోకి వచ్చాడు నిరంజన్. వేలాయుధాన్ని అతడు ఎప్పుడూ చూడలేదు.
నిరంజన్ ఆలోచించసాగాడు.
అసలు వేలాయుధం అనే వ్యక్తి ఆడదా? మగాడా? వేలాయుధం గొంతు ఆడో, మగో అర్థం కాకుండా బొంగురుగా ఉంది. అసలు అతడు తమిళయేనేనా? అతడి వయసు ఎంతుంటుంది. ముసలోడా? మధ్య వయసువాడా? ఇపుడు అతడు తనతో చెన్నై నుంచే మాట్లాడాడా? ఆలోచిస్తున్నాడు నిరంజన్.
మరోవైపు కార్తీక్ కూడా అలాగే ఆలోచిస్తున్నాడు. తనలాగే ఆ వేలాయుధం కూడా గుర్తింపు బయట పడటానికి ఇష్టపడటంలేదు అనుకున్నాడు.
నిరంజన్ ఫోన్ పక్కన పెట్టి ఠక్కున లేచాడు. ఏదో శబ్దం అతడి ఆలోచనలను భగ్నం చేసింది. అది డ్రోన్ సృష్టిస్తున్న శబ్దం.
‘వెధవ దోమలు’! అనుకున్నాడు నిరంజన్.
పది నిమిషాల సమయం గడిచింది.
నిరంజన్ ఇంటి ఆవరణలోకి ప్రవేశించింది ఒక మోటార్ సైకిల్. దానిమీద నుంచి నలభై సంవత్సరాల వయసున్న ఓ వ్యక్తి కిందకి దిగి, బైక్‌ను ఓమూల పార్క్ చేసి, కాలింగ్ బెల్ నొక్కాడు. ఆ వ్యక్తి పరు హరేరామ్. నిరంజన్ దగ్గర వంట మనిషిగా పనిచేస్తున్నాడు హరేరామ్.
కూరగాయలనే కాదు అవసరం అయితే మనుషుల గొంతులుకూడా కోస్తాడు హరేరామ్.
కాలింగ్ బెల్ శబ్దం వినగానే నిరంజన్ వచ్చి తలుపు తీశాడు. ఇద్దరూ నిరంజన్ ఆఫీస్ రూమ్‌లోకి నడిచారు.
వేగంగా ఆలోచించాడు కార్తీక్. తర్వాత ఏదో నిర్ణయానికి వచ్చాడు.
వీధి తలుపు తీసి ఉండటం గమనించాడు కార్తీక్. వెంటనే అతడు డ్రోన్‌ను కిటికీ దగ్గర నుంచి కదిలించాడు. మెల్లగా వీధి గుమ్మం దగ్గరకు తీసుకువచ్చాడు. నేలబారుగా డ్రోన్‌ను నిరంజన్ ఇంట్లోకి పోనించాడు.
నిరంజన్ ఇంటి లోపలి గదులు మానిటర్‌లో కార్తీక్‌కు కనబడుతున్నాయి. ఆఫీస్ గది ఎక్కడ ఉందో కార్తీక్‌కు అర్థం అయింది. మెల్లగా డ్రోన్‌ను అటువైపు పోనించాడు కార్తీక్. విశాలమైన టేబుల్ వెనక కూర్చొని ఉన్నాడు నిరంజన్. ఎదురుగా నిలబడి ఉన్నాడు హరేరామ్.
-సశేషం

-జి.వి.అమరేశ్వరరావు