డైలీ సీరియల్

పంచతంత్రం--36

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బైరాగి దగ్గరపడి ఉన్న నాటుపిస్తోలు తీసుకుని, దాన్ని హరేరామ్‌కు ఇచ్చాడు.
పఠాన్, హరేరామ్‌లతో చెప్పాడు బాల్‌రాజ్.
‘‘ఆ నిరంజన్‌గాడు ఎక్కడ ఉన్నాడో అర్ధంఅయింది... పదండి!’’
పఠాన్, హరేరామ్, బాల్‌రాజ్‌లు అక్కడ ఆగిఉన్న ఆల్టోకారు ఎక్కి బయలుదేరారు. వాళ్ళు మారుతి కారును అక్కడే వదిలేశారు.
వాళ్ళు వెళ్లిన పది నిమిషాల తర్వాత జైరాం, రవి, హరీష్‌లు కూడా బైక్స్‌మీద బయలుదేరారు.
ఎర్రచెరువు అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.
* * *
ఎర్ర చెరువు అనేచోట ఒకప్పుడు నిజంగానే ఒక పెద్ద చెరువు ఉండేది. జనం ఆ చెరువుకింద వెయ్యి ఎకరాల పొలాన్ని సాగుచేసేవారు. ఆ ప్రాంతం అంతా ఎర్రమట్టి నేల అవటంతో వాన పడినప్పుడు ఎర్రటి నీళ్లతో చెరువు నిండేది. అందుకే ఆ చెరువుకు ఎర్రచెరువు అనే పేరు వచ్చింది.
తర్వాత రాజకీయ నాయకుల, ప్రభుత్వ అధికారుల అండతో గూండాలు ఆ చెరువును ఆక్రమించి, ప్లాట్స్‌వేసి అమ్ముకున్నారు. అమాయక ప్రజలు తాము కష్టపడి దాచుకున్న సొమ్ముతో ఆ ప్లాట్స్ కొనుక్కుని ఇళ్లు కట్టుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆ ఇళ్లను కూల్చివేసింది. ప్రస్తుతం అక్కడ అంతా మొండి గోడలతో నిండి ఉంది. ఐతే ఆ ప్రాంతం పల్లంగా ఉండటంతో వానపడినప్పుడు నీటితో నిండిపోతూ ఉంటుంది. వానలు తగ్గినప్పుడు మొండిగోడల మధ్య నీళ్లు అలాగే నిలిచిపోయి ఉంటాయి. అలా ఆ ఏరియా అంతా నీళ్లతో నిండిన మెగాసైజు కుండలు, సంపులు అన్నీ ఒకచోటికి చేర్చినట్టు కనపడుతూ ఉంటుంది. నీళ్లు నిల్వ ఉండటంతో పాచి వాసన ఆ ప్రాంతం అంతా వ్యాపించింది.
ఆ మొండిగోడల మధ్య అంబులెన్సును ఆపి కిందకు దిగాడు నిరంజన్.
అతడు ఒకసారి తను ఉన్న ప్రదేశాన్ని పరిశీలించాడు. అక్కడ ఎవరూ లేరు అని నిర్ణయించుకున్నాడు.
ఓసారి అంబులెన్సు వెనక్కివెళ్లి డోర్ తెరిచి చూశాడు నిరంజన్. లోపల అంతా సెలైన్ బాటిల్స్‌కు చెందిన పెద్దసైజు అట్టపెట్టెలతో నిండిపోయి ఉంది.
ఆ అట్టపెట్టెల్లో సెలైన్ బాటిల్స్‌లేవు. వాటికి బదులుగా నిండుగా ఉన్నాయ్ పాత, కొత్త కరెన్సీ నోట్లకట్టలు- అంతా బ్లాక్‌మనీ.
ఓ పది నిమిషాల తర్వాత అక్కడకు వచ్చింది ఒక ‘బ్యాంకు సెక్యూరిటీ వెహికిల్’.
ఎటిఎంలలో డబ్బు నింపటానికి అలాంటి వెహికిల్స్ వాడుతుంటారు. ఆ వెహికిల్ డ్రైవింగ్ సీట్‌లోనుంచి ఒక వ్యక్తి కిందకుదిగాడు. ఆ వ్యక్తి ముఖం కనపడకుండా మంకీక్యాప్ పెట్టుకున్నాడు.
అతడు వేలాయుధం. పోలీసుల కన్నుకప్పటానికి బ్యాంకు సెక్యూరిటీ వెహికిల్‌లో వచ్చాడు వేలాయుధం.
అతడు నిరంజన్ దగ్గరకు నడుచుకుంటూ వచ్చాడు.
వేలాయుధానికి నిరంజన్ తనదగ్గర ఉన్న ఐదువందల నోటు చూపించాడు.
అది నిజమైన ఐదువందల నోటు కాదు. కలర్ జిరాక్స్ తీసిన ఐదువందల నోటు. ఆ నోటుకు అంగుళం పొడవు. అంతే వెడల్పుతో కెమెరాల్లో వాడే మెమొరీకార్డులాంటి ఒక పరికరం సెల్‌ఫెన్ టేపుతో అతికించి ఉంది. అది ఒక మినీ వైర్లెస్ ట్రాన్స్‌మీటర్. దాని సహాయంతో నిరంజన్‌ని వేలాయుధం ట్రాక్ చేయగలిగాడు.
వేలాయుధం ఆ నోటుకు ఉన్న ట్రాన్స్‌మీటర్ ఊడదీసి, దాన్ని నేలమీద పడేసి, బూటుకాలుతో తొక్కి, దాన్ని పనికిరాకుండా చేశాడు.
అప్పటికి వీళ్ళు ఉన్న ప్రదేశానికి దూరంగా ఆగింది కార్తీక్ నడుపుతున్న బైక్. అతడు బైక్‌ను ఓచోట ఆపి వేగంగా పరుగులాంటి నడకతో, మొండి గోడలను చాటుచేసుకుంటూ మూవ్ అవుతున్నాడు.
నిరంజన్, వేలాయుధం ఇద్దరూ అంబులెన్స్ దగ్గరకు చేరుకున్నారు. వేగంగా అంబులెన్స్‌లోని అట్టపెట్టెలను కిందికి దించటం ప్రారంభించారు.
ప్రతి అట్టపెట్టెనూ తెరిచి చెక్‌చేస్తున్నాడు వేలాయుధం.
కార్తీక్ ఒకచోట ఆగి, తను ఉన్న ప్రదేశాన్ని పరిశీలించాడు.
తను, తన స్నేహితులు నిరాయుధులు.
ఒకోసారి పరిసరాలే ఆయుధాలుగా మారతాయి.
అతడి ముఖంలో చిరునవ్వు ప్రత్యక్షం అయింది.
వెంటనే జైరాంకి ఫోన్‌చేసాడు. అతడు లైన్‌లోకి రాగానే మెల్లగా అడిగాడు.
‘‘ఎక్కడ ఉన్నారు?’’
‘‘వచ్చేశాం!. ఆ బాల్‌రాజ్ గ్యాంగ్‌కూడా ఇప్పుడే ఎంటర్ అయ్యారు.’’
‘‘ఓకే!... మీరు ఎటువైపు ఉన్నారు?’’
జైరాం చెప్పాడు.
జైరాంకి తాను ఎక్కడ ఉన్నాడో వివరించి వెంటనే తనదగ్గరకు రమ్మని చెప్పాడు కార్తీక్.
పది నిమిషాల తర్వాత కార్తీక్‌ని కలిశారు జైరాం, రవి, హరీష్.
ఒకవైపు చూపిస్తూ వాళ్ళతో చెప్పాడు కార్తీక్.
‘‘ఆ మొండి గోడలు చూసారా?...వాటిని మనం కూలకొట్టాలి.’’
కార్తీక్ ముందుకు నడిచాడు.
అతడిని జైరాం, రవి, హరీష్‌లు అనుసరించారు.
అక్కడ మొండి గోడలమధ్య నీళ్లు నిలబడి ఉన్నాయి. అక్కడి ప్రదేశం ఒక చిన్న చెరువులా ఉన్నది.
మొండి గోడలను కూలకొట్టటానికి గడ్డపలుగులు వంటి సాధనాలు వాళ్ళ దగ్గర ఏమీలేవు. చేతులే ఆయుధాలుగా చేసుకోవాలి.
నలుగురూ నీళ్ళలోకి దిగారు. నీళ్లు దిగువకు పారటానికి అడ్డుగాఉన్న గోడను చేతులతో బలంగా నెట్టిసాగారు.
* * *
అదే సమయానికి బాల్‌రాజ్, పఠాన్, హరేరామ్‌లు కూడా నిరంజన్, వేలాయుధంలు ఉన్నచోటికి వచ్చారు.
అప్పటికి అంబులెన్సులో ఉన్న అట్టపెట్టెలు అన్నీ కిందికి దించటం పూర్తి అయింది.
వాటిని నిరంజన్, వేలాయుధంలు బ్యాంక్ సెక్యూరిటీ వ్యాన్‌లోకి ఎక్కించబోతుండగా పెద్దశబ్దంతో పేలాయి. బాల్‌రాజ్ చేతిలోని రివాల్వర్స్ అవి సర్వీస్ రివాల్వర్స్.
అవి దుర్గారావ్, మహేంద్రలవి.

-సశేషం

-జి.వి.అమరేశ్వరరావు