డైలీ సీరియల్

జ్వాలాముఖి.. మంత్రాలదీవి-7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకలంటూ వచ్చినవారిని దేహీఅంటూ చెయ్యి జాపిన వారిని ఆదరించి ఆకలితీర్చే మహాపురి సామ్రాజ్యం ఇది పరదేశీ... కానీ ఏ దుష్టశక్తులో మా రాజ్యంమీద మా పొరుగురాజ్యాల మీద పగబూనాయి... కరువు కాటకాలు... చెలమల్లోని నీరు చెరువుల్లోని గంగమ్మతల్లి అదృశ్యమై పోతుంది.
పచ్చని పంటపొలాలు వడగండ్ల వానతో పనిరాకుండా పోతున్నాయి.
చీకటిపడితే మాయదారి పులులు నగరంమీద పడి ఆవులను మేకలను దొంగిలిస్తున్నాయి. పాడియావులను భక్షిస్తున్నాయి.
ఒకనాడు దివ్యప్రభతో వెలిగిన మహాపురి ఇప్పుడు దుర్భర దారిద్య్రంతో... నరకపురిగా మారినది. పౌరులు ప్రాణభయంతో బ్రతుకుతున్నారు... అందుకే ఈ చోరుడిని వెంబడించావు. అందులో వున్న మూడురొట్టెలలో ఒకటి అతడికి ఇచ్చి రెండు మా కుటుంబం ఆకలి తీరుస్తాయని... అంతేకానీ ఆకలితో అలమటించే ఈ బక్క ప్రాణిని శిక్షించాలని కాదు. ‘‘ఆ పౌరుల్లోని వున్న ఒక వ్యక్తి చెప్పాడు.
రొట్టెలు దొంగిలించిన వ్యక్తి ప్రజల పాదాలముందు మోకరిల్లి ‘‘నన్ను మన్నించండి. నా ఒక్కగానొక్క కొడుకు. నా ముదుసలి జనకులు గత పక్షంరోజులుగా క్షుద్బాధతో వున్నారు. నేను కుంతల రాజ్యపౌరుడిని.. మీ రాజ్యంలోకి ప్రవేశించి మీ ఆహారాన్ని దొంగిలించాను.. నన్ను శిక్షించండి’’అంటూ బోరుమన్నాడు.
అతన్ని వెంబడించిన పౌరులే అతడిని ఓదార్చి ‘‘పరదేశీ నువ్వే మమ్మల్ని మన్నించాలి. ఆకలితో అదీ నీ కన్నబడ్డ... జనకుల ఆకలి తీర్చడానికి వచ్చావని తెలిసి నీకేమీ సాయం చేయలేకపోతున్నాం... ఈ రొట్టెలతో మీ కుటుంబం ఆకలి తీర్చండి’’ అన్నారు.
విజయుడి కళ్ళుచెమర్చాయి. తన రాజ్యంలోని పౌరుల సహృదయాన్ని ఔదార్యాన్నిచూసి.
బక్కపలచని వ్యక్తి విజయుడికి పౌరులకు నమస్కరించి అక్కడినుంచి నిష్క్రమించాడు.
విజయుడు తన మొహాన్ని పూర్తిగా కనిపించకుండా వస్త్రంతో కప్పిపుచ్చి ‘ఇంత జరుగుతున్నా మీ మహారాజు చేతులు కట్టుకుని కూచున్నాడు? ప్రభువుగా మీ కష్టసుఖాలు చూడవలసిన బాధ్యత పట్టలేదా? ఆ పౌరుల అభిప్రాయాన్ని తెలుసుకోవాలనే ఉత్సుకతతో అడిగాడు విజయుడు.
పౌరులు చెప్పే సమాధానంకోసం విక్రముడు కూడా ఎదురుచూస్తున్నాడు.
‘‘మన్నించండి పరదేశీ.. పొరపాటున మా మహారాజును తూలనాడవద్దు. ధర్మప్రభువు... మా కష్టాలుచూసి చలించి పన్నులు ఎత్తివేసాడు... ఖజానాను మొత్తం పౌరులపరం చేసాడు. విందు వినోదాలు రాజభవనంలో రద్దుచేసాడు... మా మహారాజు కూడా సామాన్యుడివలె బ్రతుకుతున్నారు. పండితులను మహర్షులను ఆహ్వానిస్తున్నారు... దేవాలయాల్లో ప్రజలక్షేమంకోసం యాగాలు చేయిస్తున్నారు...
అంతవరకు ఎందుకు తన పుత్రుడు. మా యువరాజు శ్రీశ్రీశ్రీ విజయులవారు విద్యాభ్యాసం పూర్తిచేసుకుని పట్ట్భాషుక్తుడు అయ్యేందుకు విచ్చేస్తున్న... ఈ పరిస్థితుల్లో ఆడంబరాలు వద్దని.. స్వాగత తోరణాలువద్దని ఆ ధనంతో బీద సాదలకు అన్నదానాలు చేయాలని ఆదేశించారు.
మా యువరాజావారు వస్తారు... సుధర్ముల వారివద్ద అన్ని విద్యలు నేర్చుకుని సర్వశక్తి సంపన్నుడై మా కష్టాలు తీర్చే మహారాజుగా వస్తున్నారు.’’ ఆనంద భాష్పాలతో చెప్పారు పౌరులు.
ఆ మాటలు విన్న విజయుడి కళ్ళు చెమర్చాయి.. విక్రముడు కంట తడిపెట్టారు. చిలుక కూడా కన్నీటి పర్యంతమైంది.
‘‘పరదేశీయుల్లారా మీకు మా కష్టాలుచెప్పి బాధపెడితే మన్నించండి. మీరు తిరుగుప్రయాణం అయితే మీకు క్షేమము. ఇక్కడ ధర్మసత్రాలు కూడా మూతపడ్డాయి.’’ నిట్టూర్చి చెప్పాడు ఆ పౌరుడు.
* * *
తమ గుర్రాలను నడిపిస్తూ ముందుకు కదిలారు మిత్రులిరువురు. రాయంచ పంచకల్యాణి మీద కూచుంది.
‘‘మిత్రమా మనం ఏదో ఒకటి చేయాలి... ఈ విపరీతాలకు కారణాలు అనే్వషించాలి. ఆ రాత్రి ఇక్కడే ఉండి పరిస్థితులను గమనిద్దాం. ఉదయమే మన పితృదేవులను కలుద్దాం. ఇక ఉపేక్షించి లాభం లేదు’’దృఢంగా చెప్పాడు విజయుడు.
అప్పటికే అలిసిపోయారు. దగ్గర్లోవున్న గుడిదగ్గర ఆగారు. గుడి అరుగుమీద సేదతీరారు.
చంద్రుడిని కప్పివేశాయి కరిమబ్బులు.. నిశిరాత్రి..
మూతలుపడుతున్న కళ్ళు ఉలిక్కిపాటుతో తెరుచుకున్నాయి.
విజయుడు ఉలిక్కిపాటుతో కళ్ళు తెరిచాడు.
పురవీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి.
అపుడు వినిపించింది విచిత్రమైన ధ్వని...
విజయుడు విక్రముడు లేచారు. అశ్వం ప్రమాద సూచకంగా సకిలించింది.
రాయంచ చిలుక గాల్లోకి ఎగిరింది.
* * *
మంత్రాల దీవి.
ఒక్కసారిగా దుష్టశక్తులు ఒళ్ళు విరుచుకున్నాయి. భూత ప్రేత పిశాచాలు కళ్ళెర్రచేశాయి.
ఆ దీవిలోకి అడుగుపెట్టిన సామాన్యులెవరూ ప్రాణాలతో తిరిగి వెళ్ళరు. టక్కుటమార, మాయా విద్యలు, భూత ప్రేత పిశాచాల వికృత విన్యాసాలు.. భయానక దృశ్యాలు భీతావహమైన వాతావరణం.
ఆ దీవిలో పంచభూతాలు వకృటాసురుడి ఆధీనంలో ఉంటాయి. మంత్రాల దీవి అనేక మంత్రాలు మాయలతో కూడి ఉంది.
అది మంత్రాలు మాయలతో కూడిన వకృటాసురుడి నివాసమైన మంత్రాల దీవి. సుమారుగా ఒక యోజనం పొడవునా విస్తరించి ఉంది. పొగలు వెలువడుతూ మానవమాత్రులు ఏమాత్రం ప్రవేశించలేని దుర్లభమైన దుర్భేధ్యమైన దీవి.
ఆ దీవి ముఖద్వారంలో ఒక పెద్ద ఊడలమర్రి చెట్టు విస్తరించి ఉంది. ఆ మర్రి చెట్టు ఎంతో దూరం విస్తరించి శాఖోపశాఖలుగా ఊడలు ఊడలుగా వ్యాపించి ఉంది. ప్రతీ ఊడలో ఓ దుష్టశక్తి కాపలాగా ఉంటుంది. అపరిచితులు ఆ మర్రిచెట్టుమీద రంగురంగుల చిలుకలు వాలి ఉంటాయి. కానీ అవన్నీ నిజమైన చిలుకలు కావు.
వకృటాసురుడి శాపానికి గురైన వారందరూ ఆ మర్రిచెట్టు మీద చిలుకలై బందీలుగా ఉన్నారు.
ఆ మర్రి చెట్టు దాటగానే ఎన్నో వందలాది మర్రిచెట్లు వ్యాపించి ఉన్నాయి. అవన్నీ సాధారణమైన మర్రిచెట్లు కావు. ఒంటికన్ను కలిగి ఉండి పెద్దపెద్ద ఊడలతో వాటివైపు వచ్చిన వారిని ఊడలతో చుట్టేసి వారి ప్రాణాలను హరించివేస్తాయి.

-సశేషం

- శ్రీ సుధామయి