డైలీ సీరియల్

జ్వాలాముఖి.. మంత్రాలదీవి-18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశ్చర్యంనుంచి తేరుకుంటూ వెనక్కి కోట పైభాగం వైపు చూసింది. కరవాలం అక్కడినుంచే వచ్చిందని ఆమె భావన. అక్కడ తననే చూస్తోన్న విజయుడు.
తన ప్రాణాన్ని కాపాడిన తన మనోవల్లభుడు. ఆమె మనసు మేఘాలలో తేలియాడింది.
చూస్తూ ఉండగానే విచిత్ర ప్రాణులు అక్కడినుంచి మాయమయ్యాయి.
* * *
ఒక్కసారిగా తమతమ ఇళ్లల్లోనుంచి ప్రజలు బయటకువచ్చారు. తోడేళ్లు విచిత్ర జంతువులు అదృశ్యమైపోగానే ఆనంద ఘంటిక మోగించారు సైనికులు. త్వరలో తమ కష్టాలు తీరిపోతాయన్న సంతోషంలో నమ్మకంతోవున్నారు. విక్రముడికి జైజైలు పలికారు. పులికి జయజయ ధ్వానాలు చేసారు. కొందరు చిన్నారులు పులితో ఆడుకుంటున్నారు.
విజయుడి కళ్ళు నూనూగుమీసాల యువకుడిని అనే్వషిస్తున్నాయి. తమ రాజ్యపౌరుడు కాకపోయినా తమకోసం పోరాడాడు. ఆ యువకుడిని మనసారా అభినందించాలనుకున్నాడు. కానీ అతడు తారసపడలేదు. గురుదేవుడు నిర్ణయించిన ముహూర్తంలోనే విజయుడు మంత్రాలదీవికి బయల్దేరాడు. విక్రముడు విజయుడిని ఆలింగనం చేసుకున్నాడు.
‘‘నీకోసం సమస్త రాజ్యాల ప్రజలు నేను పులిమిత్రుడు అందరం ఎదురుచూస్తూ ఉంటాం... నీ పేరును సార్థకంచేసుకుని విజయుడిపై తిరిగిరా’’ అన్నాడు.
విజయుడు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించాడు. ఆశీర్వదించారు.
‘‘చిరంజీవ... నీకోసం మహాపురి సామ్రాజ్య సింహాసనం ఎదురుచూస్తున్నది. నీ విజయం ప్రజావిజయం’’ అంటూ ఆశీర్వదించారు. ఋషులు మునివర్యులు మంత్రోచ్ఛారణలతో ఆశీర్వాదం తెలిపారు.
సుధర్ములు దీవించారు.
విజయుడు పంచకళ్యాణిని అధిరోహించాడు. పంచకల్యాణి తలమీద రాయంచ చిలుక...పులి తన మిత్రుడికి వీడ్కోలు చెబుతూ ‘‘నిశ్చింతగా వెళ్ళిరా మిత్రమా... నా ప్రాణం ఉన్నంతవరకూ నీకు ఇచ్చినమాట నిలబెట్టుకుంటాను..’’అన్నది.
విజయుడు అధిరోహించిన పంచకల్యాణి ముందుకు పరుగెత్తింది.
* * *
మంత్రాలదీవిలోని మాంత్రికుడి గుహ.
అగ్నిగుండం ముందు పద్మాసనం వేసుకుని కూచునివున్నాడు వకృటాసురుడు. ఎదురుగా నిలువెత్తు విగ్రహం. అతని పెదవులు మంత్రాలను ఉచ్చరిస్తున్నాయి. గుహలో మెరుపులు మెరిసాయి. ఆ మెరుపుల్లో వివిధ వికృత ఆకారాలు వికటాట్టహాసం చేస్తున్నాయి.
‘‘మాంత్రికా వకృటాసురా... నీ ప్రయత్నం ఫలించదు ఫలించదు ఫలించదు’’ అంటూ ముమ్మారు వినిపించింది.
వకృటాసురుడు కళ్ళుతెరిచాడు. అతని కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా వున్నాయి.
‘‘ఈ వకృటాసురుడు ఓడిపోవడం... నా ప్రయత్నం ఫలించకపోవడమా...నేను కనె్నర్ర చేస్తే గంధర్వ కినె్నర కింపురుషులు వణికిపోతారు... ‘‘ తన పొడవాటి గడ్డాన్ని చేత్తో విమురుకుంటూ అన్నాడు.
గుహలో దక్షిణంవైపువున్న బండరాయిలోని తల ఆకారం పెదవులు కదిలాయి.
‘‘నువ్వు పంపించిన కపాలకుండ భయంతో పారిపోయివచ్చాడు... మాయతోడేళ్లు విచిత్ర ప్రాణులు భయంతో భీతిల్లుతున్నాయి. పొలిమేరల్లోనుంచి పరుగులు పెట్టాయి. కళ్ళుతెరుచుకుని చూడు వకృటాసురా.’’ ఆ విచిత్ర శిరస్సు నవ్వుతోంది.
‘‘నను చూసి పరిహసిస్తావా... చూడు నినే్నం చేస్తానో... ఓ క్రియామ్ క్రిమ్’’అంటూ మంత్రదండాన్ని గాల్లోకిలేపాడు. ఆ మరక్షణమే ఆ బండరాయి గాల్లోకి తేలిపోతూ నేలమీద పడి ముక్కలైంది. శిరస్సువక్కలైంది. ఆ శిరస్సులోని పెదవుల భాగం మాట్లాడుతోంది.
‘‘మహామంత్రికా నీ ప్రతాపం చూపించవలసినది ఆ విజయుడి మీద, నిన్ను తుదముట్టించడానికి నీ అంతాన్ని చూడడానికి పంతంపట్టి వస్తున్నాడు. కాచుకో మంత్రికా... కాచుకో కాచుకో.’’
వకృటాసురుడు శాంతించాడు మంత్రదండాన్ని గాల్లోకి లేపాడు. వక్కలైనా శిరస్సు అతుక్కుని యథాస్థానంలోకి వెళ్ళింది. విగ్రహానికి కుడివైపువున్న కపాలం దగ్గరికి వెళ్ళాడు. వకృటాసురుడు ‘‘చూపించవే కపాలమా... నన్ను ఎదిరించు పిల్లకుంకను.’’ అంటూ మంత్ర దండాన్ని గాల్లోకి లేపాడు.
కపాలం తన నోటిని తెరిచింది. అందులోనుంచి దృశ్యం కనిపిస్తుంది. పంచకల్యాణిమీద వస్తోన్న విజయుడు కనిపించాడు.
‘‘ఔరా దివ్యతేజస్సుతో ఉన్నాడు... వీడి కళ్ళలో బెదురులేదు.’’ అనుకున్నాడు అంతలోనే తేరుకుని... మంత్రదండాన్ని గాల్లోకి లేపగానే కపాలం నోరుమూసుకుంది.
మంత్రదండాన్ని శిరస్సుకు ఆనించి..
‘‘కపాలకుండ’’ అని గట్టిగా అరిచాడు. వెంటనే వకృటాసురుడి ముందు ప్రత్యక్షమయ్యాడు కపాలకుండ ‘‘చెప్పిన కార్యం పూర్తిచేయక వెన్ను చూపి వచ్చావా... చూడు నినే్నం చేస్తానో’’అంటూ కోపంతో మంత్రదండాన్ని గాల్లోకి లేపాడు.
‘‘మన్నించు మహామంత్రికా ఇందులో నా తప్పిదం ఏమియూ లేదు. ఆ విజయుడు తన మంత్రశక్తిని ప్రయోగించాడు. అస్త్రాలను ప్రయోగించాడు. పులి మా మీద పడి మాయతోడేళ్ళను చీల్చివేసింది. అది మామూలు పులిలాలేదు.’’ భయంతో వణికిపోతూ చెప్పాడు కపాలకుండ.
‘‘వెళ్ళు మన మంత్రాల దీవివైపు ఒంటరిగా వస్తున్న ఆ విజయుడి శిరస్సు తీసుకురా... ఇదే చివరి అవకాశం... వెన్నుచూపి వచ్చావో యజ్ఞగుండం మంటల్లో మాడిమసైపోతావ్...వెళ్ళు’’ అన్నాడు.
‘‘ఆజ్ఞ మాంత్రికా’’అంటూ అక్కడినుంచి మాయమయ్యాడు కపాలకుండ.
* * *
పంచకళ్యాణి పరుగులు తీస్తుంది. విజయుడు ఏమాత్రం అలసటలేకుండా పంచకళ్యాణిని పరుగులు తీయిస్తున్నాడు.
చుట్టూ చెట్లూచేమలు ఫలవృక్షాలు... దట్టమైన అడవిలో ప్రయాణం కొనసాగుతుంది.
‘‘మిత్రమా అలిసిపోయావు... ఆహారం కూడా స్వీకరించలేదు. కాసింత విశ్రాంతి తీసుకోవచ్చుకదా’’ అంది రాయంచ చిలుక.
‘‘నీకు ఆకలివేస్తుందని చెప్పొచ్చుకదా’’ ముద్దుగా అన్నాడు విజయుడు.
‘‘పాపం పంచకళ్యాణికి దాహంవేస్తున్నట్టు వుంది... కాసేపు సేద తీరనీ... నీ మనోవేగాన్ని చూసి పంచకళ్యాణి ఆయాసపడిపోతున్నది’’ అంది.
‘‘మాటలునేర్చిన చిలుకవు’’ అంటూ గుర్రం దిగాడు. దూరంగా సరస్సు కనిపిస్తోంది. చల్లగాలి తెమ్మెరలు శరీరాన్ని తాకుతున్నాయి. అంతకుమించిన పరిమళం ఏదో అతడి మనసును తాకుతోంది. చిత్రంగా అతని మనసులో ఏదో అలజడి.
ఎవరో తన్ను అనుసరిస్తున్నారన్న భావన.
హితులా? ‘‘శత్రువులా? నిజంగా తనను వెంబడిస్తున్నారా? తాను భ్రమపడుతున్నాడా? ఆలోచిస్తూ ఉండగానే పంచకళ్యాణితో కలిసి రాయంచ సరసు దగ్గరికి వెళ్ళింది. పంచకళ్యాణి తలను సింహాసనంగా భావించిన రాయంచ పంచకళ్యాణి చెవిదగ్గర నోటినిపెట్టి ‘‘మిత్రమా కాస్త నెమ్మదిగా పరుగుతీయవచ్చు కదా? నువ్వు పరుగులరాణివి... నీ వేగాన్ని మామూలు అశ్వాలు అందుకోగలవా? శే్లషగా చెప్పింది.
‘‘పంచకళ్యాణి సరే అన్నట్టు తలూపింది?
‘‘విజయుడు మళ్ళీ నిన్ను పరుగులు పెట్టిస్తాడు.. కాస్త నెమ్మదిగా వెళ్ళు’’ అంది.
పంచకళ్యాణి దాహం తీర్చుకుంటుంది.
రాయంచ విజయుడి వైపు చూసింది. అతను ఏదో ఆలోచనలో ఉన్నట్టు గ్రహించింది. ఇదే సమయం అన్నట్టు గాల్లోకి ఎగిరింది.
* * *
యువరాణి సహస్రదర్శిని అధిరోహించిన అశ్వం వేగం మందగించింది. పంచకళ్యాణి వేగాన్ని అందుకొనలేకపోతుంది. యువరాజు విజయుడు బయలుదేరగానే అతడితోపాటు అతనికి తెలియకుండా అనుసరించింది. విజయుడికి ఏమాత్రం అనుమానం రాని రీతిలో పంచకళ్యాణిని అనుసరిస్తోంది. కొన్ని యోజనాలు వెళ్ళాక అప్పుడు విజయుడిని బ్రతిమిలాడుకోవాలి. అతడితోపాటు తానూ మంత్రాలదీవికి వెళ్లాలన్న ఆలోచన.
*
-సశేషం

- శ్రీ సుధామయి