డైలీ సీరియల్

జ్వాలాముఖి.. మంత్రాలదీవి-26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇది యువరాజు విజయులవారి కానుక అని యువరాణి సహస్రదర్శిని వారికి చెప్పడం మర్చిపోకు.’’ విజయుడివైపు చూసి చెప్పింది.
పంచకళ్యాణి నిలువుగా తలాడించింది.
సమయం ఆసన్నమైంది. మనమిక బయల్దేరుట అవశ్యం... గరుడపక్షి చెప్పింది.
విజయుడు గరుడపక్షి మీద ఆసీనుడయ్యాడు. రాయంచ విజయుడి ముందు కూచుంది. రెక్కలు విప్పింది. ఒక్కసారిగా ఆ రెక్కల తాకిడికి చెట్లు ఊగిపోయాయి. గాల్లోకి ఎగిరింది గరుడపక్షి.
ఆ పరిసర ప్రాంతం ఒక్కసారిగా కంపించింది. ప్రకృతి ఆ అద్భుత దృశ్యం చూసి మురిసిపోయింది. సముద్రం మీదుగా ఎగురుతుంది గరుడపక్షి.
* * *
ఒక్కసారిగా ఆ దృశ్యం చూసిన మాంత్రికుడు వకృటాసురుడు కోపంతో ఊగిపోయాడు. సముద్రాన్ని లంఘించి రావడం.. పురాణాల్లో మహావిష్ణువు మాత్రమే గరుత్మంతుడిని వాహనముగా చేసుకుని వున్నదని విన్నాడు. ఇప్పుడు.. తన కళ్ళనుతానే నమ్మలేకపోయాడు. తనను అంతమొందించే మొనగాడు రావడమా? అసంభవం...
తన మంత్రదండాన్ని గాల్లోకి లేపాడు. సముద్రాక్షి మన శత్రువు సముద్రం మీదుగా వస్తున్నాడు. వాడ్ని వాడితోపాటు ఉన్నవాటిని చంపి నీ ఆకలి తీర్చుకో.. వెళ్ళు..వెళ్ళు... అంటూ శాసించాడు.
ఒక్కసారిగా సముద్రంలో అలజడి. మాంత్రికుడి మాయాసృష్టి... మంత్రాల దీవికి రాకుండా సముద్రంలో కాపలాపెట్టిన సముద్రాక్షి భీకరాకారంతో సముద్రాన్ని చీల్చుకుని బయటకువచ్చింది. విచిత్రమైన ఆకారం... నీటితో తయారైన దేహం... పొడవాటి చేతులు వికృతమైన రూపం...
సముద్రగర్భం నుంచి పైకివచ్చింది. సముద్రాక్షి అలా వస్తున్నప్పుడు నీళ్లు సుడులు తిరిగాయి. సముద్రంలో అల్లకల్లోలం. సముద్ర జీవులు భయంతో భీతిల్లాయి. ఒక్కసారిగా సముద్రాక్షి క్రమక్రమంగా పైకి పెరుగుతుంది. అది గమనించిన రాయంచ యువరాజును హెచ్చరించింది.
* * *
యువరాజు విజయుడు ప్రమాదాన్ని పసిగట్టాడు.. ఆ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలా.. అని యోచిస్తున్నాడు. సముద్రుడు దయాసాగరుడు.. నీటితో వినాకృతరూపంలో ఆకాశాన్ని తాకేలా పెరిగిపోతున్న ఈ శక్తిని ఎలా ఆదుకోవాలో సముద్రుడినే అడగాలి... విజయుడు తల వంచి సముద్రుడి వైపు చూసాడు.
సముద్రుడికి రెండు చేతులు జోడించి నమస్కరించాడు.
‘‘దయాసాగరా... సముద్రుడా... నేను సుధర్ములవారి శిష్యుడిని, మహాపురి యువరాజుని... విజయుడు నా నామధేయం... లోక కళ్యాణార్థం వకృటాసురుడిని సంహరించడానికి కార్యార్థినై బయల్దేరాను... నీలో ఎన్నో సముద్రప్రాణులు బ్రతుకుతున్నాయి... కానీ ఒక విచిత్రమైన వికృతప్రాణి మా ప్రాణాలుతీయడానికి కోరలు చాస్తున్నది. తరుణోపాయం సూచించి మమ్మల్ని కర్తవ్యంవైపు నడిపించు సాగరా... నీకిదే మా ప్రణామం.’’
కొద్దిక్షణాలు సముద్రం ఒక్కసారిగా పొంగిపొర్లింది. అల్లకల్లోలమైనది. సముద్రుడు సముద్రగర్భంలోనుంచి బయటకు వచ్చాడు.
విజయుడు జలవర్ణంతో మెరిసిపోతున్న సముద్రుడికి నమస్కరించాడు. గరుడపక్షి సముద్రుడికి మనసులోనే నమస్కరించి గాలిలో అలానే నిలబడిపోయింది.
‘‘నాయనా విజయుడా... నిన్ను అంతం చేయవలెనని సంకల్పించు వికృతప్రాణి పేరు సముద్రాక్షి.. దుష్టమాంత్రికుడు వకృటాసురుడు నాలో ఒక భాగాన్ని దిగ్బంధించి తన మంత్రశక్తితో బంధించిన సముద్ర భాగాన్ని సముద్రాక్షిగా సృష్టించి దానికి కొన్ని శక్తులను ఇచ్చాడు.
సముద్రమార్గంలో మంత్రాల దీవిని ఎవరుచేరాలని ప్రయత్నించినా సముద్రాక్షి తన శరీరాన్ని ఆకాశంవరకు విస్తరించి చంపగలదు. నాలోని సముద్రం జలంతోనే సృష్టించబడిన సముద్రాక్షిని మట్టుపెట్టగల శక్తి నా దగ్గర లేదు’’ సముద్రుడు విజయుడితో చెప్పాడు.
‘‘నువ్వు తలచినంత సమస్త భూమండలమే అంతరించిపోతుంది. ప్రకృతి అతలాకుతలం అవుతుంది, సమస్త సృష్టి జీవనాధారం నువ్వే... అలాంటి సాగరుడు. ‘‘విజయుడి మాటలను మధ్యలోనే అందుకుని... ‘‘క్షుద్రమాయను చేధించాలంటే ఒక మార్గమున్నది... నేరుగా నేను కాకుండా నా మరోరూపమైన మేఘంతో నీ ఖడ్గాన్ని అభిషేకించు. అప్పుడు నీ ఖడ్గం జలఖడ్గంగా మారుతుంది. జలఖడ్గాన్ని ప్రయోగించి సముద్రాక్షిని సంహరించు. సముద్ర జలమే మేఘమవుతుంది. అది నా ప్రతిరూపమే... మేఘం కరిగి వర్షించి సముద్రంలో కలుస్తున్నది. సముద్రుడు చెప్పాడు.
విజయుడు రెండుచేతులు జోడించి ‘‘్ధన్యోస్మి సాగరా... కర్తవ్యాన్ని బోధించారు’’అని ఆకాశంవైపు చూసాడు.
అప్పటికే సముద్రాక్షి చేతులుపైకి పొడుచుకు వస్తున్నాయి. క్రమక్రమంగా ఆ రూపం పెరిగిపోతుంది.
రాయంచ క్షణంకూడా ఆలస్యం చేయలేదు.. ఆకాశంలో తారట్లాడుతున్న మేఘాలను చూసింది.. వెంటనే ఒక మేఘాన్ని చేరింది.
‘‘మేఘమా నీకు రాయంచ చిలుక ప్రణామాలు’’ అంది.
మేఘం రాయంచ చిలుకవైపు చూసి.. ‘‘ఎప్పుడో వర్షమై భూమిమీద చినుకై కురిసే మా ఆయువు అల్పమే.. మాకు నమస్కరిస్తున్నావా’’ అని అడిగింది.
‘‘మీ రూపాలు మాత్రమే మారుతాయి.. మేఘమా.. ప్రజలు దాహార్తి తీర్చే దయకలిగిన మేఘాలు.. మీకోసం అనంత ప్రజాకోటి ఎదురు చూస్తుంటుంది. మీరు చినుకై కురిస్తే ఈ విశ్వం సస్యశ్యామలమై పచ్చదనంతో అలరారుతుంది. సమయం లేదు మిత్రమా.. మీనుంచి ఒక దైవకార్యం నెరవేరవలసి వున్నది. మీ జలంతో మా విజయుడి ఖడ్గాన్ని అభిషేకించినచో సముద్రాక్షిని అంతమొందించు శక్తి లభించగలదు..’’ అంటూ సూక్ష్మగా వివరించింది.
వెంటనే మేఘం రాయంచ వైపు చూసి ‘‘మా బ్రతుకుకు సార్థకత చేకూరే అవకాశము... ఒక దుష్టశక్తిని అంతమొందించడానికి మాకుమేము ఆత్మార్పణ చేసుకోవడానికి సదాసిద్ధం.. అంటూ ఆ మేఘం ముందుకు కదిలింది.
అప్పటికే సముద్రాక్షి భారీ శరీరం ఆకాశమువైపు పెరిగిపోతున్నది. గరుడపక్షి ఎంత పైకి ఎగిరినా అంతే పైకి పెరుగుతున్నది సముద్రాక్షి శరీరం.
మేఘం గాల్లో ప్రయాణించి లిప్తకాలంలోని విజయుడి దగ్గరికి వచ్చింది.
మేఘం రాయంచవైపు చూసి ‘‘రాయంచ మిత్రమా.. నువ్వు మా వీపు పైభాగాన అధిష్టించు.. మేము కరిగి విజయుడి ఖడ్గాన్ని అభిషేకిస్తాం.
‘‘మేఘం చెప్పింది’’ విజయుడు కరవాలాన్ని ఆకాశంవైపు నిలిపాడు. కరవాలానికి పైభాగం మేఘం వుంది. రాయంచ మేఘంమీద కూచుంది... మేఘం కరుగుతూ వర్షంగామారి విజయుడి శిరస్సుమీదుగా కరవాలాన్ని తడిపేస్తూ గరుడిని పావనంచేసి సముద్రంలోకి జారిపోతున్నది.
ఎప్పుడైతే మేఘం వర్షంగామారి ఖడ్గాన్ని తడిపివేసిందో అప్పుడే ఖడ్గం నీటి ధారతో మెరిసిపోతూ కనిపించింది. సముద్రాక్షి విజయుడిని చేరింది.. అప్పుడే జలఖడ్గంగా మారిన విజయుడి కరవాలం తనను చేరిన సముద్రాక్షి హస్తాలను నరికి వేసింది. రెండు హస్తాలు సముద్రంలోకి జారిపోయాయి. ఈసారి సముద్రాక్షి శిరస్సును ఖండించాడు. ఒక్కసారిగా శిరస్సుభాగం ఆకాశంలోకి ఎగిరి.. సముద్రంలోకి కుప్పకూలిపోయింది. వకృటాసురుడు సృష్టించిన సముద్రాక్షి ఆ విధంగా హతమైంది.
‘‘మహావీరా జయం జయం సముద్రాక్షి పీడ విరగడ చేసావ్. జలఖడ్గానికి వరాన్ని అనుగ్రహిస్తున్నాను.. నువ్వు కోరుకున్న దిశలో నీ జల ఖడ్గం ప్రయాణించగలదు. విజయోస్తు’’ అంటూ ఆశీర్వదించాడు. విజయుడు సముద్రుడికి నమస్కరించాడు. మంత్రాల దీవివైపు ప్రయాణం కొనసాగించాడు.
* * *
అగ్నితో ప్రజ్వరిల్లుతున్న యజ్ఞగుండంలో శూన్యంనుంచి వచ్చిన సముద్రాక్షి పడిపోయింది. అగ్నిగుండం చల్లారింది. ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టు వకృటాసురుడి గుహ కంపించిపోయింది. ఉలిక్కిపాటుతో కళ్ళు తెరిచాడు.. ఇంకావుంది...

- శ్రీ సుధామయి