డైలీ సీరియల్

పచ్చబొట్టు (కొత్త సీరియల్ ప్రారంభం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోరున కురుస్తున్న వర్షం. అది చాలదన్నట్లు పెనుగాలి తోడయ్యింది. ఆ వేగానికి టపటపా చినుకుల్లా రాలిపోతున్న చెట్లు. బీభత్సమైన వాతావరణం. చలి వణికిస్తున్న సమయం. భయం ఎరుగని వాళ్ళు కూడా గడగడలాడుతూ మునగదీసుకొని ముసుగులో మూగగా రోదిస్తున్న వేళ.
చీకటిగదిలో లాంతరుముందు వీటినేమీ లెక్కచెయ్యకుండా ఎడతెరిపి లేని ఆలోచనల్లో నేను. రివ్వున వీస్తున్న గాలి తనతో పాటూ నా ఆలోచనలను కూడా లాక్కెళ్లాలని తెగ ప్రయత్నిస్తోంది. గాలికి దీపం రెపరెపలాడుతోంది. రకరకాల భావాలతో నా హృదయం అలాగే కొట్టుమిట్టాడుతోంది. తరతరాలుగా మగవారి అహంకారంముందు అన్యాయంగా ఓడిపోతూ విలవిల్లాడుతున్న స్ర్తియే కనిపిస్తోంది ఆ దీపంలో.
ఆదినుంచీ స్ర్తికి ఒక న్యాయం, పురుషుడికి ఒక న్యాయం. తరాలు మారుతున్నా, కాలం కరుగుతున్నా ఈ విషయంలో మాత్రం మార్పు ఉండటంలేదు. పెళ్లి అయిన స్ర్తిని మనం సులభంగా గుర్తిస్తాం. ఎందుకంటే ఆమె మెడలో మంగళసూత్రం, కాళ్ళకు మెట్టెలు ఉంటాయి కాబట్టి. అదే పెళ్లయిన మగవాడిని అలా మనం కనుక్కోగలమా? లేదే? ఎందుకంటే అతనికి సమాజం ఏ గుర్తులూ పెట్టలేదు కనుక. ఎందుకీ వ్యత్యాసం? ఆడవారిలాగానే మగవారికీ ఒక చిన్న గుర్తుపెడితే ఎంత బాగుంటుంది? అలా లేదు కాబట్టే మగ మహారాజులు పెళ్లిళ్లు అయినా పెళ్లికానివారిలా నటించి, ఆడవారిని ప్రేమలోకి దింపి, అనుభవం, అనుభూతులను ఆస్వాదించి ఆనందం మనసంతా నింపుకొని ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు ఆడవారిని వారి మానాన వారిని వదిలేసి జారుకుంటున్నారు. అసలు ఆడవాళ్ళను అనాలండీ! మగవాడి బుద్ధి తెలిసి కూడా ప్రేమ మంత్రం వల్లె వెయ్యగానే అతని చేతిని అందుకొని ఊబిలోకి కూడా ఆనందంగా దిగేస్తుంటారు. అతను మాత్రం చక్కగా అందులోకి దింపి, ఆమె కోపంతో, బాధతో బయటకు రాలేక ఆక్రోశిస్తుంటే పడి పడి నవ్వుతూ, కాలర్ ఎగరేసి పువ్వు పువ్వును ముద్దుపెట్టుకొని మకరందం పీల్చే తేనెటీగలా మరో స్ర్తి పొందును వెతుక్కుంటూ వెళ్లిపోతాడు.
మగవాళ్ళు అంటే అందరూ ఈ కోవకే రారండోయ్! శ్రీరామచంద్రులూ ఉంటారు. రావణాసురులు ఉంటారు. నేను చెప్పేది ఇలాంటి రాక్షసుల గురించి. మనుషులలో రాక్షసత్వాన్ని చూడగానే కనిపెట్టలేం కదా! అందుకే.. అందుకే.. చూడగానే వీడు రాక్షసుడు అని తెలిసేలా గుర్తుపెట్టాలి. అపుడు స్ర్తిలు జాగ్రత్తపడతారు.
అవును. స్ర్తికి ఒక మనసుందని ఎవరైనా గుర్తిస్తున్నారా? పుట్టినప్పటినుంచీ ఎవరో ఒకరు చెప్పినది వినటమే. అవతలివారి ఇష్టాలకు ‘ఊ’ కొట్టడమే! మొదట తల్లిదండ్రుల అదుపాజ్ఞలలో, తర్వాత భర్త అడుగుజాడలలో, చివరగా కొడుకు ఆజ్ఞలతో ఆమె జీవితం ముగిసిపోతుంది. పురుషునిలా స్ర్తి ఎందుకు స్వతంత్రంగా జీవించలేకపోతోంది? పురుషుల కబంధ హస్తాల పంజరంలో సీతలా బ్రతుకుతున్నా ఈ వెంటాడే రావణాసురులను ఈనాటి స్ర్తి కూడా ఎదుర్కోవలసి వస్తోంది. అందుకే నా మెదడులోని నరాలన్నీ చిట్లిపోయి రక్తం ధారలు కట్టి ప్రవహించినా ఆలోచించి, చించి తుదిశ్వాస వదిలేలోపు నేనే దీనికో మందు కనిపెట్టాలి. అప్పటిదాకా నాకు విశ్రాంతి లేదు.. విశ్రాంతి లేదు.
దూరంగా మైకులోంచి పాత ‘పవిత్రబంధం’ ఇనిమాలో పాట ‘‘పచ్చబొట్టు చెరిగిపోదులే..’’ వస్తోంది. ఆ పాట వింటూ లాంతరునే తదేకంగా చూస్తున్నా! ఆ పాటకు, ఈ నీడకు ఏదో అవినాభావ సంబంధం. ఎస్.. ఈ రెంటినీ కలిపితే.. అంటే! ఇన్నాళ్ళ నా ఆవేదనకు దారి దొరికింది. ఆనందం పట్టలేకపోతున్నాను. గాలిలా ఈ ప్రపంచమంతా వ్యాపించి అణువణువుకూ నా ఆనందాన్ని పంచాలనిపిస్తోంది. ఇపుడు కాదు ఆనందం. తన ప్లాన్ సక్సెస్ అయి మగవాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గిలగిలలాడుతున్నపుడు.. అప్పుడు.. అప్పుడు.. తను ఆనందపు శిఖరాల అంచులను తాకాలి. అదే అసలు సిసలైన ఆనందం.
ఈరోజే.. ఇప్పుడే శంఖారావం పూరిస్తున్నా! రేపటి నుంచీ నా ఉద్యమం ప్రారంభం. కొన్నాళ్లకు ప్రతి ఒక్కరూ ఉద్యమకారులై విజృంభిస్తే అపుడు రాముళ్ళే మిగులుతారు. రామరాజ్యం కదిలి వస్తుంది.
ఉన్నట్టుండి వాతావరణమంతా ప్రశాంతంగా కనిపించటంతో నాలుగడుగులు బయటకు వేసింది. అప్పటిదాకా వున్న ఉధృతమంతా ఏమయిపోయిందో, ఆకాశంలో వెలుగుల చంద్రుడు. భూమిమీద పరచుకున్న వెనె్నల. ఆ అందం, చందం మనసును తృప్తిపరుస్తూ జోలపాడింది. ఎన్నాళ్లనుంచో కరువైన నిద్ర ఒక్కసారి తనదాన్ని చేసుకుంది.
****
బాల్కనీ తలుపు తెరిచి, పేపరుకున్న దారాన్ని తీసి, ఉండగా వున్న పేపరును విప్పదీసి కళ్ళజోడును సవరించుకున్నాడు రామకృష్ణప్రసాద్. ఆయన స్టేషన్‌మాస్టర్‌గా ఉద్యోగం చేసి ఈమధ్యనే పదవీ విరమణ చేశారు. తెల్లవారి లేవగానే మొదట పేపరు చదవనిదే ఆయనకు ఆనందం కలగదు. ఎప్పుడయినా పేపరుకు సెలవు అయితే ఆ రోజంతా ఆయన దిగులుగా ఉంటారు. బిడ్డను కోల్పోయిన తండ్రి పరిస్థితిలా. మరునాడు పేపరు చూడగానే తప్పిపోయిన బిడ్డ దొరికినట్లుగా దానికి చేరువవుతారు. ఈరోజు ఆయన అదే ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
పేపరులో మొదటి వాక్యం చదవగానే కనురెప్ప వెయ్యటం మరిచారు.
ఆశ్చర్యంతో ఆయన కళ్లు విప్పారాయి.
విచిత్రంగా చెవులు రిక్కించాయి.
ఎన్నడూ చూడని, ఎప్పుడూ విననుకున్న విషయం హఠాత్తుగా ఎదుటపడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన పరిస్థితి. మళ్లీ కళ్ళు ఆ పదాల వెంట పరుగెత్తాయి.
హెచ్చరిక
స్ర్తిలను మోసగించే కామాంధులారా! వీర మధాంధులారా!
మీకిదే నా హెచ్చరిక!
మీ అహంభావానికి
నేను పెడతాను ఒక మచ్చ
అది తెస్తుంది మీ జీవితానికి రచ్చ
ఉండదులే భవిష్యత్తులో మీకు భద్రత
కాచుకోండి!
-మీ కరకు గుండెల్లో నిదురించబోయే
‘పచ్చబొట్టు’
పాఠక మహాశయులారా! మా కార్యాలయానికి రాత్రి పనె్నండు గంటల సమయంలో చేరిన వార్త. ఇదో ఆకాశరామన్న ఉత్తరం. ఇందులో నిజానిజాలను వేచి చూసి తెలుసుకోవలసిందే- మీ సంపాదకుడు. -సశేషం

యలమర్తి అనూరాధ. 9247260206