డైలీ సీరియల్

పచ్చబొట్టు-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన అరవై ఏళ్ళ జీవితంలో ఇలాంటి వార్త ఏ రోజూ వినలేదు, కనలేదు. ఇలాంటి విచిత్రం ఏదో జరిగి ఆడవారికి జరిగే అన్యాయాలు వీగిపోవాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉండేవాడు. ఈనాటికి తన కోరిక తీరింది. ఇదే నిజమయితే ఎంత బాగుంటుంది? రామరాజ్యం తొందరలోనే అవతరిస్తుందన్న మాట. ఈ దేశానికి మంచిరోజులు వస్తున్న శుభ తరుణంలో గుడికి వెళ్లాలి. ఆయన అంతరంగం ఒక నవ యువకుడిలా ఉరకలు వేస్తోంది. హుషారుగా ఆయన కిష్టమైన ‘సావిరహే తవదీనా..’ పాడుకుంటూ స్నానానికి వెళ్లాడు. ఈ ఆనందాన్ని పంచుకోవటానికి భార్య ‘సత్యవతి’ ప్రక్కన లేని లోటు ఆయన్ని పీడిస్తోంది. వరుసకు అన్నగారైన ఆదినారాయణ మనవరాలిని ఉయ్యాలలో వేస్తున్నారంటే పంపించాడు. తను కూడా వెళితే బాగుండేది. దూరాభారాలు. ఒక ఖర్చు తగ్గినా తగ్గినట్లే కదా అని ఒక్కర్తినీ పంపాడు. అప్పటికీ ఒక్కర్తినీ వెళ్లనని ఎన్నిసార్లు అందో! ఈ ఒక్కసారికి వెళ్ళు.. ఇంకెప్పుడూ ఒక్కర్తివీ వెళ్లద్దు, ఇద్దరూ కలిసే వెళ్దాం, లేకుంటే మానేద్దాం, సరేనా!’’ అంటే అపుడు ప్రయాణం కట్టింది. ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండాలంటే ఇద్దరికీ ఒప్పదు. వయసు పెరిగేకొలది తమ అనుబంధం గట్టిపడుతోంది. అది తమకే తెలుసు. బయటివారు ‘‘ఏమిటి వీళ్ళు కొత్తదంపతుల్లా..’’ అని ఎక్కడ ఎగతాళి చేస్తారో అని మనసులో శంక. అయినా ఇంటి సామ్రాజ్యంలో తను మహారాణి. నేను మహారాజు. తమ ఇల్లు ఓ ప్రశాంత నిలయం. ఈ జీవితం కడదాకా ఇలా సాగిపోతే. అంతకంటే తాను కోరుకొనేదేమీ ఉండదు.
ఈ ‘కాళహస్తి’లో వున్నంతవరకూ తమ కులదైవం తమను కరుణిస్తూనే వుంటాడు. అంటే ఈ ఊరు నుంచీ వెళితే శివుడు వదిలేస్తాడా? అంతరంగం ప్రశ్నకు తన ఊహ ఎంత తప్పో అర్థమయింది. ఈ ఊర్లు, పేర్లు తమకుగానీ సర్వం ఈశ్వరమయం కదా! ఏ ఊర్లో ఉన్నా భక్తుడు పిలవాలే కానీ భోళాశంకరుడు వచ్చి వాలిపోడూ! శివ శివా అంటూనే స్నానం చేసి తన కిష్టమైన తెల్లడ్రెస్సు వేసుకొని శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనానికి బయలుదేరారు. మెయిన్ రోడ్డుమీద వున్న రెండంతస్థుల మేడలో ఒక పోర్షన్‌లో అద్దెకుంటున్నారు. బాల్కనీలోకి రాగానే దర్శనమిస్తుంది గుడి. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పటికే తెల్లవారిపోవటంతో ఆ రోడ్డంతా కళకళలాడుతోంది. గుంపులు గుంపులుగా జనం. ఒక్కో గుంపుమధ్య ఒకరి చేతిలో పేపరు. మరి ఆ వార్త మామూలుదా? పెద్ద సంచలనమే. ఈనాటి అన్నిప్రముఖ దినపత్రికలలో అదే వార్త. వారందరి స్పందనకు మాష్టారి పెదాలమీద చిరునవ్వే సమాధానం. గుడిలో పూజారులు కూడా దీనిమీదనే చర్చ. వచ్చిన భక్తులను ఆశీర్వదించటం, మళ్లీ కబుర్లలో పడటం. జ్ఞానప్రసూనాంబిక, శ్రీవార్ల దర్శనం కూడా చేసుకొని పున్నాగ చెట్టు చప్టామీద కూర్చున్నారు.
ప్రక్కనే ఉన్న మంచినీళ్ళ పంపులో నీళ్ళు త్రాగి ఆయనకి కొద్ది దూరంలో కూర్చున్నారు ఒక జంట. వాళ్ళ మాటలు వద్దనుకున్నా ఆయన చెవిన పడుతున్నాయి.
‘‘సీతా! ఈ రోజు పేపరులో వార్త విన్నావా?’’
‘‘విన్నాను’’
‘‘నీకు సంతోషమా?’’
‘‘కాదా మరి! నవమాసాలు మోసి, కని పెంచిన కన్నతల్లిని, తల్లి మాటలను లెక్కచెయ్యకుండా, భార్యను బానిసలా, చెల్లిని శత్రువులా, పరాయి ఆడపిల్లలను పతితల్లా మార్చేందుకు ప్రయత్నించే వాళ్ళందరినీ చీల్చి చెండాడడానికి ఈ అమ్మవారే ‘పచ్చబొట్టు’ రూపంలో వచ్చి ఉంటారు.’’
‘‘అలా ఎందుకనుకుంటావ్? గరళకంఠుడే ఆ అవతారమవ్వవచ్చుగా’’
‘‘ఏం కాదు. పచ్చబొట్టు ఒక స్ర్తియే అయి ఉంటుంది. మగవారిలో ఆడవారిమీద జాలి ఉన్నా తమ జాతిమీద వున్న ప్రేమతో ఇలాంటి మంచి పనులు చేసే సాహసం చెయ్యలేరు’’
‘‘మహనీయులు. దేముళ్లకు అలాంటి భేదాలుండవు’’.
‘‘ఎందుకుండవు, చక్కగా ఉంటాయి’’.
‘‘వాళ్ళందరికీ ఇద్దరే భార్యలు. ఒక్క రామావతారంలోనే ఒక్క భార్య. అందుకే మగవాళ్ళంతా తాము మాత్రం ఏం తక్కువమని ఒక్కరితో సరిపెట్టుకోకుండా ఇద్దరు, ముగ్గురినీ ఊగుతున్నారు’’.
‘‘నేనున్నానుగా శ్రీరామచంద్రుడిలా’’.
‘‘ఈ మాట ఇప్పుడు కాదు. మన వృద్ధాప్యంలో అంటే అప్పుడు నమ్ముతాను. యవ్వనంలో, అదీ పెళ్ళయిన కొత్తలో ప్రతి భర్తా ఇలాగే కబుర్లు చెబుతాడు. పెళ్లాం పురుటికెళితే మరో ఆడదాని పొందుకు తహతహలాడే జనాలు తొంభైకిపైనే!
‘‘పోనీ ఆ కొద్దిమందిలోనన్నా నన్ను చేర్చు’’.
‘‘నాకే వాళ్ళు ఉంటారా అని అపనమ్మకం. తెలియకుండా ఉంటారేమోనని అనుమానంతో అలా చెప్పా! అంతేకానీ వాళ్ళు ఉంటారని నమ్మి కాదు’’.
‘‘అన్యాయం సీతా! అలా అందరిలో నన్ను కలిపెయ్యటం’’.
‘‘మీరెంత అరిచి గీపెట్టినా ఈ మాట నేను వెనక్కి తీసుకోను. ఓ పాతిక సంవత్సరాలు గడిచాక మీ ప్రవర్తన ఇలాగే ఉంటే అపుడు నమ్ముతాను’’ ఖచ్చితంగా చెప్పింది ఆమె.
‘‘ఎంతయినా నీ మొండి పట్టుదల నీదే! నీకు తెలుసా! నీ చేతే నున్వన్నట్లు పాతిక సంవత్సరాల తరువాత ఈ చెట్టు క్రిందే నీచేతే నేను శ్రీరామచంద్రుడినని అనిపించుకుంటాను. ఛాలెంజ్!’’
‘‘ఓ.కె. ఛాలెంజ్! మీరు అలా ఉండగలిగితే ఆనందించే తొలి వ్యక్తిని నేనే! మీరే కాదు అందరూ ఈ దేశంలో శ్రీరామచంద్రులులాగే ఉండాలి. అపుడే మన భారతీయ సంస్కృతి నిలబడుతుంది’’.
‘‘సరే! నీకు ఆకలి వేస్తూ ఉండాలి. హోటల్‌కి వెళ్లి టిఫిన్ తిందామా?’’
‘‘వద్దు! ఈ రోజు ఈ వార్తతో నా కడుపు నిండిపోయింది. ఈ రోజంతా నేను ఏమీ తినను. మీరు వెళ్లి తినేసిరండి. నేనిక్కడే ఉంటాను’’.
‘‘పదవోయ్! నీకు లేని ఆకలి నాకేమిటి? సత్రానికి పోదాం పదా’’ అన్నాడు అతను.
‘‘సరే!’’ అంటూ లేచింది ఆమె.
ఆ జంట కనుమరుగయ్యేవరకూ అలా చూస్తూనే ఉన్నారు మాష్టారు.
‘‘్భగవంతుడా! అన్ని జంటల మాట ఎలా ఉన్నా ఈ జంటను మాత్రం జీవితాంతం విడిపోకుండా ఉండేట్లు చూడు స్వామి’’ అని ప్రార్థించి ఇంటిదారి పట్టాడు.
రోడ్డుమీద జనం ‘పచ్చబొట్టు’ వార్త గురించి ఇంకా చర్చలు జరుపుతూనే ఉన్నారు. నిముష నిముషానికి గుంపులు పెరుగుతున్నాయే కానీ తరగటంలేదు. అసలు ఇది నిజమేనా? బూటకమా? పేపరు సర్క్యులేషన్ పెంచటానికి ఎవరైనా వేసిన ప్లాను కాదు కదా! ఒక్కొక్కరికీ వంద సందేహాలు. వేల ప్రశ్నలు.
వెనుకనుంచీ ఎవరిదో చెయ్యి పడింది భుజంమీద.
ఎవరా అని చూస్తే ‘వరహాలరావు’. అతనూ ఈ నెలలోనే రిటైర్ అవబోతున్నాడు. మంచి స్నేహితులు.
‘‘గుడికి వెళ్లివస్తున్నావా?’’ అడిగాడు ఆయన.
‘‘అవును. నువ్వు కూరగాయలకు బయలుదేరినట్లున్నావే?’’ అతని చేతిలో బుట్టను చూసి.
‘‘కాదురా, చిన్నమ్మాయికి పెళ్లి సంబంధం. పండ్లు, స్వీట్స్ కావాలంటే బయటపడ్డా!’’
‘‘సాయంత్రం కలుస్తాంగా, అప్పుడు తీపి కబురు అందిద్దువుగాని’’.
‘‘ఏం తీపి కబుర్లులే. నా సంపాదనంతా ఈ పెళ్లిచూపుళ్లకే అయిపోయేట్లుంది’’. -సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206