డైలీ సీరియల్

బంగారుకల 36

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివాహం అనేది జరిగినా జరక్కున్నా చంద్రప్ప తనూ మానసికంగా ఏనాడో భార్యాభర్తలయ్యారు. మంత్రాలు, సూత్రాలు లేకుంటే మాత్రమేం! కానీ లోకం...
‘‘మంజూ!’’ చంద్రప్ప పిలుపుకి ఈ లోకంలోకి వచ్చింది.
ఏమాలోచిస్తున్నావు మంజూ! గురువుగారి మాటలకు బాధపడకు. జ్యోతిష్యంలో ఉండే ప్రతి దోషానికి నివారణ, శాంతి ఉంటుంది. అన్నీ మళ్లీ చర్చించి చేద్దాం’’.
‘‘ఇక వెళ్దాం చంద్రా! దేవేరి వారు నాకోసం ఎదురుచూస్తారు’’
‘‘అవును గదూ! మరిచాను... తిమ్మరుసు మంత్రిగారు నిన్ను అన్నపూర్ణాదేవి మందిరంలో నియోగించారు. కదా!’’
‘‘అవును చంద్రా! అన్నపూర్ణదేవి చాలా గుణవంతురాలు. ఆ వీరేంద్రుడే ఆమె మనసును కలతపెడుతున్నాడు.’’
‘‘నువ్వు జాగ్రత్త. మనం త్వరలో ఒకింటి వాళ్లమవుతాం. ఎటువంటి భయాలు సందేహాలు పెట్టుకోకు’’ ఆమె చేతిని సున్నితంగా నొక్కి అశ్వారోహిణుడై వెళ్లిపోయాడు చంద్రప్ప.
అతను వెళ్ళినవైపే చాలాసేపు చూస్తుండిపోయిందామె. తనవల్ల అతనికి గండం అనే మాట ఆమెను బాధిస్తోంది. తాను మరణించయినా అతనికి జీవితాన్నివ్వాలనుకునే హిందూ స్ర్తి ఆమె. దానికి పునాదిగా ఒక ఆలోచన మబ్బుతెరలా కదిలిందామె మనసులో.
***
10
శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరసు మంత్రి, పెమ్మసాని రామలింగ నాయకుడితో సుదీర్ఘ సమాలోచన జరుపుతున్నారు.
‘‘రాయా! మనం అనుకున్నట్లుగానే కర్ణాటక, తమిళ ప్రాంతాలు, దక్కనులో మలబారు ప్రాంతమేగాక సింహాళంలోని కొంతభాగం కూడా మన వశమైంది.’’ తిమ్మరుసు గంభీర ఉత్సాహంతో చెప్పాడు.
‘‘దక్షిణ సముద్రాధీశ్వర’’ అనే బిరుదు ప్రభువుల వారి కీర్తిని మరింత ఇనుమడింపజేస్తున్నది మహామంత్రి!’’ రామలింగ నాయకుడు సంతృప్తిగా అన్నాడు.
శ్రీ కృష్ణదేవరాయలు ఆనందాన్ని చిరునవ్వుతో వ్యక్తంచేశాడు. తర్వాత తిమ్మరుసు తన వ్యూహరచనను వెల్లడించాడు.
‘‘ఇప్పటివరకు మనం జయించిన దక్షిణ ప్రాంతాలు గాక ముఖ్యమైన శత్రువుల గురించి ఆలోచించాలి ప్రభూ!’’
తిమ్మరుసు మాటలకు అవునన్నట్లు తల పంకించారు రాయలు. తిమ్మరుసు ఇలా చెప్పారు.
‘‘మన శత్రువులలో అతి బలవంతులు బహ్మనీలు. బహ్మనీ ప్రభువు మామూద్‌షాయే గాక బహ్మనీ రాజ్యంలో బీజాపూర్, గోల్కండ, అహ్మద్‌నగర్ రాష్ట్ర పాలకులు సుల్తాన్ అధికారాన్ని ధిక్కరించి స్వతంత్రంగా ప్రవర్తిస్తున్నారు’’.
‘‘అది వారి సమస్య కాదా అప్పాజీ?’’ రాయలు ప్రశ్నించాడు.
‘‘కానేకాదు, ఇది మన సమస్య కూడా! ఎందుకంటే వారిలో వారికి ఎంత విద్వేషమున్నా ఒక్క విషయంలో వారికి ఐక్యత ఉంది. అదే విజయనగర సామ్రాజ్యం పట్ల ద్వేషం. మన సిరిసంపదలు, వైభవం చూసి అసూయ పొందటమే గాక ఈ ఐశ్వర్యాన్ని కొల్లగొట్టటం లక్ష్యంగా భావించి అదను దొరికినప్పుడల్లా మన రాజ్యంపై దురాక్రమణ జరపటం వారికి పరిపాటి అయింది.’’ తిమ్మరుసు విశదీకరించాడు.
‘‘మరి మన కర్తవ్యం?’’ రాయలు సూటిగా కర్తన్యోన్ముఖుడయ్యాడు. ‘‘బహ్మనీ సుల్తాన్ మహ్మద్ షా విజయనగరంపై ‘‘జీహాదు’’ ప్రకటించినా బీజాపూర్ సుల్తాన్ ఆదిల్‌షా యుద్ధం చేసినా బహమనులతో మన యుద్ధాలు ముగియలేదు ప్రభూ’’
‘‘గతంలో మీరు బీజాపూర్ జయించి బీదర్‌ను వశం చేసుకుని బందీగా ఉన్న బీదర్ సుల్తాన్‌ను తిరిగి బహ్మనీ సింహాసనంపై ప్రతిష్టించి ‘‘యవనరాజ్యస్థాపకాచార్య’’ అనే కీర్తి పొందినాక బహమనీ సుల్తానులకు మీ కీర్తి ప్రతిష్టల మీద కనె్నర్ర అయింది రాయా’’.
తిమ్మరుసు ప్రశంసకు రాయలు చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో ఆత్మవిశ్వాస సాహసాలు తొంగిచూశాయి.
***
చంద్రప్ప ఈమధ్య బాగా గమనిస్తున్నాడు, మంజరి తనని తప్పించుకు తిరుగుతోందని. కారణం బోధపడటం లేదు. క్షమాభిక్ష పొంది కారాగారం నుంచి విడుదల అయిన కంటకునితో రెండు మూడుసార్లు కన్పించింది కూడా!
చంద్రప్పకి తీరని వేదనగా ఉంది. మంజరి ప్రవర్తనలోని మార్పు అతడిని వేధిస్తున్నది. బాధ్యతా నిర్వహణ కూడా సరిగా చేయలేకపోతున్నాడు. పిచ్చివాడిలా విఠల దేవాలయం, రాతి రథం చుట్టూ తిరుగుతూ మంజరి కోసం పరితపిస్తున్నాడు.
అన్నపూర్ణాదేవి మందిరంలో ఉంటున్న మంజరి అతనికి పంజరంలో చిలకలా కన్పిస్తోంది. ఆమె సాన్నిహిత్యం కోసం అతని మనస్సు పరితపిస్తున్నది.
మంజరికి కూడా అలాగే ఉన్నా చంద్రప్ప మేలుకోరింది కనుక దూరంగానే ఉండదలిచింది. ఈమధ్య ఎవరో ఆమెకి చెప్పారు. అతను నవమోహిని విగ్రహం దగ్గరే సొమ్మసిల్లి పడి ఉన్నాడట. ఎవరు కన్పించినా ‘‘మంజూని చూశారా?’’ అని అడుగుతున్నాడట.
ఇవన్నీ వింటుంటే మంజరికి కన్నీళ్ళాగటం లేదు.
‘‘చంద్రా! నీవు లేని నా జీవితం తావిలేని పూవే కదా! ఏం చేయను? మనిద్దరికీ ఆ బ్రహ్మ రాయలేదు అనుకుంటూ దుఃఖిస్తున్నది. మరోపక్క కంటకుని చొరవ ఆమెకు చీదరగా ఉంది.
ఆమె మనసు విషాద గీతికలా వుంది.
***
రాయలు బహమనీలను అదుపుచేయగలిగానని తలిచారు. విజయోత్సవాలు జరిగాయి. తిరుమల వేంకటేశుని దర్శనానికి వెళ్ళివచ్చారు.

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి