డైలీ సీరియల్

పచ్చబొట్టు-8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాయిగా అనిపించింది. అప్పుడు గుర్తువచ్చి ‘‘చెల్లీ! నాన్నగారు కనిపించటం లేదేం?’’ అని.
వరహాలరావుగారు వచ్చి తీసుకువెళ్ళారు. వాళ్ళ అమ్మాయికి సంబంధం కుదిరినట్లుంది. వచ్చాక మనకు మంచివార్తే వినిపిస్తారు. చూస్తూ ఉండు.
‘‘అవునురా! ఈ కట్నాలు ఇవ్వలేక ఎందరి పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయో! అసలు కట్నాలు మేమెందుకు ఇవ్వాలి అని మీ ఆడవాళ్ళంతా తిరగబడాలి. అలా ఎప్పుడు జరుగుతుందో?’’
‘‘అసలు మగవాళ్ళు తీసుకోం అని చెప్పచ్చుగా!’’
‘‘అలా వాళ్ళు చెబితే సమస్య ఏముంది? చాలలేదని చంపేస్తుంటే నువ్వెంత తక్కువగా ఆలోచిస్తున్నావో?’’
‘‘అదే! మగవాళ్ళని ఎక్కువగా ఆలోచించమనే చెబుతున్నా!’’
‘‘మనం ఎంతచెప్పినా వినేవాళ్ళు లేరు. పోనీ మనమయినా కట్నం తీసుకోవద్దు. ఇవ్వద్దు అనే మాటకు కట్టుబడి ఉందాం. ఓ.కే.నా?’’
‘‘ఓ.కే!’’
‘‘ఇలా అని ఓ జమిందారునో అడుగుతావా?’’ ‘‘్ఫ! అన్నయ్యా! నువ్వెప్పుడూ ఇంతే!’’
మా చెల్లిని రోజుకొకసారయినా ఇలా బుంగమూతిలో చూసుకోకపోతే నాకు తోచదురా...’’
అలా అనే్వష్ అంటే విద్య అపురూపంగా అన్నయ్యను చూస్తుంది. కళ్ళనిండా అనురాగాన్ని నింపుకుంటుంది. వాళ్ళిద్దరూ అన్నాచెల్లెళ్ళ అనుబంధానికే ప్రతీకలు.
ఇంతలో రారనుకున్న తండ్రి సంతోషంతో రావటం ఇద్దరూ ఒకేసారి గ్రహించారు అసలు విషయాన్ని.
‘‘అమ్మా! విద్యా! వరహాలరావు కూతురుకు సంబంధం ఖాయమైంది.’’
‘‘పోనీలేండి, ఆయన దిగులు కాస్త తగ్గుతుంది’’ అంది విద్య.
‘‘కాస్త ఏమిటమ్మా! అసలు దిగులంటే ఏమిటో తెలియని వాడిలా ఉన్నవాడిని చూస్తుంటే నాకెంతో ఆశ్చర్యమేసింది. ఆ అమ్మాయి విషయంలో బెంగ ఉందని తెలుసుకానీ ఇంత బాధపడుతున్నాడని నాకు తెలియదు.’’
‘‘మరి మిమ్మల్ని అంత తొందరగా వదిలిపెట్టారే!’’
‘‘వదిలితేనా? వాడి పొగడ్తలు భరించలేక నేనే పారిపోయి వచ్చేసాను. సంబంధం చూసేరోజున నాకు కనిపిస్తే ఈ సంబంధం కుదురుతుందిలే అన్నాను. ఆ మాటవల్లే ఇదంతా జరిగిందంటాడు. ఇదంతా నీ నోటి చలవే అని. ఆపకుండా ఒకటే మాట తిప్పితిప్పి మాట్లాడుతున్నాడు. ఈ వయసులో ఎక్కువ ఆనందాన్ని భరించటంకూడా గుండెకు కష్టమే. వాడిని కాసేపు ఒంటరిగా వదలటమే మంచిది అనిపించింది. అందుకే వచ్చేసాను.’’
‘‘మంచి పని చేసారు’’ అన్నాడు అనే్వష్.
ఇంకాసేపు అక్కడే కూర్చుంటే భార్య గురించి ఎక్కడ అడుగుతారో అని తన గదిలోకి వెళ్ళిపోయారు.
‘‘నాన్నగారికి అమ్మలేకపోతే ఏమీ తోచటంలేదురా అన్నయ్యా’’అంది విద్య.
‘‘ఇన్నిరోజులు అమ్మ ఎప్పుడూ ఉండలేదు. ఈసారి ఎందుకు ఆలస్యవౌతోందో అర్థంకావటంలేదు. నాన్నగారు ఏదో దాస్తున్నారని అనిపిస్తోంది.’’
‘‘నీకన్నీ అనుమానాలే.’’
‘‘కాదు. ఇప్పుడు గదిలోకి వెళ్ళిపోవటానికి కూడా కారణం అదే!’’
‘‘నువ్వు మరీ చెబుతావు అన్నయ్యా! కేసుల విషయంలో ఆలోచించినట్లు ఇక్కడ కూడా అనుకుంటున్నారే.’’
‘‘అంత తేలికగా తీసిపారెయ్యకు ఈ బుర్రను. ఏదైనా ఆలోచన వచ్చిందంటే అది నిజమవ్వాల్సిందే!’’
‘‘నాలుగురోజులలో వచ్చే అమ్మ గురించి ఇంత డిస్కషన్ అవసరమంటావా?’’
‘‘లేదు. మరి ఏంచేద్దాం?’’
‘‘వంటింట్లోకి వెళ్ళి వేపుడు చేసుకుంటే వేడివేడిగా తినచ్చు.’’
‘‘ఇది బాగుంది. పద. నేను ముక్కలు తరిగిస్తాను. నువ్వు వేయించేద్దువుగాని. అయ్యాక నాన్నగారిని పిలిచి భోజనాలు కానిచ్చేద్దాం.
‘‘నువ్వేం చెయ్యక్కర్లేదు. ప్రక్కన కూర్చుని కబుర్లు చెప్పు చాలు’’ అంది విద్య.
* * *
పరమానందాన్ని తీసుకొని కోర్టుకు హాజరయ్యాడు అనే్వష్.
సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు కేసుకొట్టివేసింది. ఆమెది ఆత్మహత్యగా కోర్టు నిర్ధారించింది. పరమానందాన్ని నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది.
తల్లితండ్రుల అనుమానం అంతా ప్యూన్ మీదే. అందుకే ఆ తీర్పు వాళ్ళను ఆశ్చర్యంలో ముంచింది.
స్కూలుకి ఉన్న మంచిపేరు దెబ్బతింటుందేమో అని భయపడ్డ యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు.
వెయ్యి రూపాయలతో బడ్డీకొట్టు వెంకయ్య నోరు మూయించి కేసు మాఫీ చేయించగలిగానని పరమానందం మాత్రం ఆనందంగా నవ్వుకున్నాడు మనసులో.
అనే్వష్‌కి మాత్రం అతనే దోషి అని ప్రగాఢ నమ్మకం. కానీ సరైన సాక్ష్యం చూపించకపోతే కళ్ళుండీ గ్రుడ్డిగా ప్రవర్తిస్తుంది కోర్టు. అది తెలిసిందే.
అసహనంగా కోర్టునుంచీ బయటకు వచ్చాడు.
* * *
ఆపరేషన్ కేసుకు సంబంధించిన పుస్తకాన్ని చదువుతున్న విద్య అన్నయ్య నిద్రలో అటు ఇటూ తిరగటం గమనించింది.
‘‘అన్నయ్యా! ఎనీ ప్రాబ్లమ్?’’ ఆతృతగా వచ్చి అతని నుదిటిమీద చేయి వేసింది.
చల్లటి పసిపాప లాంటి ఆ చేతిని అలానే నుదిటిమీదనుంచీ తియ్యకుండా పట్టుకున్నాడు.
కళ్ళుతెరిచి తను బెడ్‌మీద ఉండటం గమనించి ‘‘అంటే తను కల కన్నాడా? తనింకా కోర్టుబయట ఉన్నాననుకుంటున్నాడు. ఆరునెలల తర్వాత జరిగేది అంతా కలలో కొట్టవచ్చినట్లు కనిపించింది.
‘‘ఏంటిరా? మాట్లాడవు?’’
‘‘కలంతా వివరించాడు. ఎవరికివాళ్ళు తమకి ఎందుకులే అనుకుంటే కేసు దర్యాప్తు ముందుకెలా సాగుతుంది?’’
‘‘నువ్వు చెయ్యగలిగినంత చేస్తున్నావుగా. ఇంక బాధ పడటం ఎందుకు చెప్పు?’’
‘‘ఏమోరా! ఇంక నిద్రపడుతుందని నమ్మకం లేదు.’’
‘‘నీకోమాట చెప్పానంటే ఇట్టే నిద్రపోతావ్.’’
‘‘ఏమిటది?’’
‘‘ఆరోజు పేపర్లో పచ్చబొట్టు ఎవరినీ వదలనందిగా. పచ్చబొట్టు నిజం అయితే ఫస్ట్ విక్టిమ్ ఈ పరమానందమే అవుతాడు.’’
‘‘్భలే దానివే? ఆ పచ్చబొట్టు అసలు ఉన్నాడా? ఎక్కడ ఉంటాడు? వాడికి ఈ ఊరి విషయాలు ఎలా తెలుస్తాయి? ఎవరో ఆకతాయితనంతో ఇచ్చిన స్టేట్‌మెంట్లన్నీ పేపరువాళ్ళు సర్క్యులేషన్ పెంచుకోవటానికి ఉపయోగించుకున్నారు. అంతే తప్ప ఇందులో నిజంలేదని నా నమ్మకం.’’
‘‘ఏమోలే! నా మనసుకు అలా అనిపించింది. ప్రశాంతంగా నిద్రపోతావని అలా అన్నాను. దాని గురించి మానేసి ఇప్పుడు దీని గురించి ఆలోచించేట్లున్నావే.’’
‘‘నిజమేరా! నాకు ఈ రోజు నిద్రపోవాలని లేదు. పేపర్లో పచ్చబొట్టు వార్త ఉంటుందంటున్నావుగా. చూస్తాను. లేచే ఉంటాను. నువ్వు పడుకో’’.
‘‘ఏమిటో ఒక్కోసారి మంచి చెయ్యాలంటే చెడుగా మారుతుంది. వాడిని హాయిగా పడుకోనిద్దామని తను చూస్తే రివర్స్ అయ్యింది. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వాడిని, వాడి నిర్ణయాన్ని ఎవరూ మార్చలేదు. ఇక తను చేయగలిగేది ఏమీ లేదని మళ్లీ చదువుకోవటంలో నిమగ్నమైంది.

-సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206