డైలీ సీరియల్

పచ్చబొట్టు-10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదిఏమైనా ప్రజలలో తప్పుచెయ్యటానికి ఆలోచించే దశకి వచ్చారు. తాము చాలాదూరంలో ఉన్నామని పచ్చబొట్టు చేతులు తమ చెంతకు చేరవని ధైర్యంగా ఉన్నవారి గుండెలు జారిపోయే తరుణం ఒక్క వారంలోనే ఉందని తెలిస్తే ఏమైపోతారీ జనం?
* * *
అది హైదరాబాదు నగరం. విద్యలకు నిలయంగా పేరుమోసిన ‘సరస్వతి కాలేజీ’ అంటే అందరికి ఇష్టం. ఆ కాలేజీలో సీటుదొరకటమే కష్టం. లంచాలకు, డొనేషన్లకు బహుదూరం. అందులో సీటురావాలంటే మెరిట్ ఉండాల్సిందే! ఇలా అన్ని కాలేజీలవాళ్ళూ ప్రవర్తిస్తే విద్య కొనుక్కొనే వస్తువులా మారేదే కాదు. అన్నీ అలాగే ఉంటే ఈ కాలేజీకి ఇంత పేరు ఎందుకొస్తుంది?
వచ్చింది చదువుకొందుకయినా కొందరు దాన్ని మరిచి ఈ వయసు ప్రేమించే వయసని తమనుతాము మరిచిపోతారు. ఆ మైకంలో చేసే చిన్న తప్పు భవిష్యత్తులో పెద్ద ముద్రగా మిగిలిపోతుందని తెలియనితనం. తెలిసినా పట్టించుకోని తత్వం.
కాలేజీ అంటేనే టీనేజ్. ఊహల పందిరిలో మనను ఊయలలు. అంతు తెలియని దూరతీరాలకు రెక్కలులేకుండా ఆనంద ప్రయాణం. ఆ వయసులో ప్రతి సంఘటన ఒక థ్రిల్. ప్రతి అనుభవం ఒక పులకరింపు. చెడువైపు నడుస్తున్నా, ముళ్ళకంప మీద పయనిస్తున్నా వారు దానినే పూలపాన్పుగా భావిస్తారు. అదే ప్రేమ మహత్యం.
ప్రేమలోపడ్డ జంటకు ఒళ్ళూ పైన తెలియదు. తామిద్దరూ ఉంటే చాలు లోకంలో జనాలులేని ప్రదేశాలన్నీ మావే అంటూ అలాంటిచోట్లు వెతుక్కొని, చేరి అక్కడ తామిద్దరూ ఒకరిలో ఒకరిలో లీనమైపోతే ఎంత బాగుంటుందో అన్నదే వారి ఊహ. ఊహలు, చేతలు అలా ఒంటరి దిశవైపువారికి లాక్కెళతాయి. ఇప్పుడు అదే స్థితిలో ఉన్న జంట ప్రేమ్, ప్రియ.
ప్రియ చాలా పట్టుదలగల మనిషి. ప్రేమకు కొన్ని అడ్డుగోడలుండాలని తనచుట్టూ గిరిగీసుకున్న ఆడపిల్ల. ‘నాలుగు అంతస్థుల భవనంమీద నుంచీ దూకి చచ్చిపోతా నువ్వు నిరాకరిస్తే’అన్న ఒక్కమాట వెయ్యి జేగంటలుగా మ్రోగి తనను ఆహ్వానిస్తున్నాయని భ్రమించి తను గీసుకున్న ‘జాగ్రత్త రేఖ’ను దాటి అతన్ని సమీపించింది.
‘‘ప్రియా!’’
‘‘ఊ!’’
‘‘మాట్లాడమ్మా!’’
‘‘ఏం మాట్లాడను? నీ ప్రేమతో నా మనసు నిండిపోయి మూగబోయింది. నినే్న చూడాలని, నీ మాటలే వినాలని తపిస్తోంది. నవ్వు మాట్లాడుతుంటే అవన్నీ నా హృదయపు టేప్ రికార్డర్‌లో రికార్డుచేసుకుంటున్నాను. వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు రీవైండ్ చేసుకొని పరవశించి పోతుంటాను. మైమరచిపోతాను. నీ చేతిని అందుకొని కలలతీరంలో విహరిస్తూ ఉంటాను. ఈ ధ్యాసలో పడి అసలు చదవలేకపోతున్నాను. పుస్తకం తెరిస్తే అక్షరాలబదులు నీ రూపం’’ అప్పటిదాకా ఆమె చెప్పేది తమకంగా వింటున్న అతను ఆమె గడియారం వంక చూడటం భరించలేకపోయాడు.
‘‘ఏయ్! ఏమిటి? ఎదురుగా నన్ను పెట్టుకొని వాచీలు, స్విచ్‌లు చూస్తావ్ ఇది తగదమ్మా!’’
‘‘చీకటి పడుతోంది. బస్సు దొరక్కపోతే కష్టం. ఇక వెళదాం.’’
‘‘నిన్ను వదిలిపెట్టాలని లేదు. జీవితమంతా ఇలా నీ కబుర్లలో కరిగిపోవాలని ఉంటుంది. వెధవ చీకటి మన ప్రేమను క్రమ్మేస్తోంది. కొన్నాళ్ళు ఈ రాత్రుళ్ళు లేకుంటే ఎంత బాగుండును?’’ విసుగ్గా అన్నాడు ప్రేమ్.
ఒక చిరునవ్వు ప్రియ పెదాలమీద అందంగా విసిరి మాయమయ్యింది.
‘‘ప్రేమ్! ఏమిటలా చూస్తున్నావ్?’’
‘‘నీ హృదయం టేప్ రికార్డయితే నా కళ్ళు కెమెరాలే. క్షణంలో విరబూసిన నీ నవ్వును అనుభూతిగా గాలిలో కలిసిపోనివ్వకుండా నా కళ్ళ వెలుగునే ఫ్లాష్‌చేసి ఫొటో తీసాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు నా హృదయ రాణి చిరునవ్వును తిలకించవచ్చు.
ఆ మాటలకు చిన్నగా నవ్వి ‘‘ప్రేమ్! పద! ఇక వెళదాం’’ అంది.
కాలేజీ గార్డెన్స్‌నుంచీ బయటకు వచ్చారు ఇద్దరూ!
రోడ్డుమీద ఒక్క మనిషి కూడా లేడు.
ఏం జరిగింది? ఏం జరిగింది?
ఈ హైదరాబాదు నగరంలో ఏ నిముషాన ఏ హత్య ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలుసు? వెంటనే 144 సెక్షన్ అమలులోకి వచ్చేస్తుంది. ప్రజల యాంత్రిక జీవనం స్తంభించిపోతుంది అనుకుంటూ కిళ్ళీషాపు కిట్టయ్య హడావిడిగా తలుపులకు తాళం వేస్తున్నాడు.
ప్రేమ్ అక్కడికి పరుగెత్తాడు.
‘కిట్టయ్యా! ఏమయింది?’
‘‘ప్రేమ్ బాబూ! మీరా! ఇంకా ఇంటికి వెళ్ళలేదా? ప్రక్క సందులో యం.యల్.ఏ. గారిల్లుందిగా. వాళ్ళింటిముందే ఎవరో బాంబులు వేసి ఆయన్ని చంపేశారట. మరో ఇద్దరిని నరికేసారట. 144 సెక్షన్ పెట్టారు.
ఏదో టాడాయాక్ట్ అట. సాక్ష్యాలులేకపోయినా బొక్కలో తోసెయ్యచ్చట. ఈ పోలీసులతో తగాదాలు మనకు తెలిసినవే ఎందుకొచ్చిన గొడవ అని కొట్టు మూసేసాను. మా ఇల్లువెనకే కాబట్టి బ్రతికిపోయాను. మీరూ వెళ్ళిపోండి’’ మాట్లాడుతూనే లగెత్తాడు. అది పరుగులాంటి నడక.
ఏదో అడగాలని నోటిదాకా వచ్చిన మాటలు అక్కడే ఆగిపోయాయి. నీరసంగా తనముందుకు వచ్చి నుంచున్న ప్రేమ్‌ను చూస్తూ ‘‘ప్రేమ్! అలా ఉన్నావేం?’’ అడిగింది కంగారుగా.
కిట్టయ్య చెప్పిందంతా చెప్పి అతని ఇల్లెక్కడ? ఈ రాత్రికి ఆశ్రయమిస్తాడా అని అడిగేలోపే పరుగు. ముందు ఇలా జరుగుతుందని ఊహించలేదు. నాకూ మాటరాలేదు.
ప్రియ భయంగా చూసింది. సిటీలో సంగతులు తెలిసి కూడా తను ఇలా ఉండటం తన తప్పే! ఈ తప్పుకు ఎంత పెద్ద శిక్ష వేస్తుందో అమ్మ.
‘‘ప్రేమ్! ఎలాగో ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వు కూడా నాతోరా! ఇక్కడ మాత్రం ఉండద్దు మనం.’’
‘‘ప్రియా! నీకేమయినా పిచ్చిపట్టిందా? రోడ్డుమీద మనిషి కనిపిస్తే లాకప్‌లో తోసేస్తారు. అందమయిన ఆడపిల్లవి. పోలీసుల ముందు మనమేంటి? ప్రక్క సెల్‌లోకి నన్ను తోసి నాముందే నిన్ను అనుభవిస్తారు. ఈ దరిదాపులలో తెలిసిన స్నేహితులు కూడా ఎవరూ లేరు. ఈ ఒక్క రోజు కాలేజీలో ఉండిపోదాం. అదే మనకు సరైనచోటు. పద పద. పిచ్చిపిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నేను ఉండగా నీకు భయం ఏమిటి?
‘నువ్వు ఉన్నావనే ఆ భయం’అంటూ ఆక్రోషించింది ఆమె కనె్న హృదయం కొన్నాళ్ళు ఆమె అతనిని దూరంగా ఉంచగలిగింది. కానీ వయసు చేసే అల్లరి, పరిస్థితుల ప్రభావం వారిని మరింత చేరువ చేసింది. ఇలాంటి సమయంలో తామిద్దరే ఇక్కడ ఉండటం ఆమెను భయభ్రాంతురాల్ని చేస్తోంది.
రాత్రంతా ఎక్కడున్నావ్ అని ఇంట్లో అడిగితే ఏం సమాధానం చెప్పాలి? అందరూ ఏమనుకుంటారు? తెలిసిన తిట్లు అన్నింటిని ఒక్కొక్కటిగా తనమీదే ప్రయోగించుకోవటం ప్రారంభించింది. అప్పటిదాకా ఉన్న కాస్త ధైర్యం నెమ్మదిగా సడలిపోతోంది.
ఉన్నట్టుండి ఆకాశం గర్జించింది భూదేవి హత్యలతో తనని రక్తసికం చేస్తున్నారని మూగగా రోధిస్తుంటే ఆకాశం కరిగి కన్నీరై ఆమెను పున్ణీతురాలిని చేస్తోంది. గాలి ఆమెను చల్లగాతాకి ఓదార్చి వెళ్ళింది. వాతావర్ణంలో నిముష నిముషానికి ఎంతో మార్పు. ఆగకుండా కురుస్తున్న వర్షం స్ర్తి కన్నీరుని తలపిస్తోంది. దూరంగా పిడుగుపడిన శబ్దం. అప్పటిదాకా ఒకమూల ఒదిగి కూర్చున్న ప్రియ ‘‘నాకు భయం వేస్తోంది ప్రేమ్’’అంటూ అతన్ని కరుచుకుపోయింది.

-సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206