డైలీ సీరియల్

పచ్చబొట్టు-13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛ! ఛ! తన ఆలోచనలు ఇలా వెళ్తున్నాయేమిటి? ఇక పోలీసు ఆఫీసర్‌నన్న విషయమే మరిచిపోతున్నాను. తెలియని ఉద్వేగం! ఏనాడూ ఇలాంటిది ఎదుర్కోలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకలా? ఏమో? అన్నీ ప్రశ్నలే! సమాధానం లేని ప్రశ్నలు!
పోనీ చెల్లికి చెప్పి కనిపెడుతుందో లేదో చూద్దామా?
‘‘నాటకాలు పచ్చబొట్టుతోనా!’’ అంతరాత్మ ఎదురుతిరిగింది.
ఏం చేస్తే ఏమవుతుంది?
‘‘ఇంత చిన్నదే తెలుసుకోలేకపోతే హైదరాబాద్‌లో బంజారాహిల్స్‌లో ఉన్నబ్బాయికి పచ్చబొట్టు ఎలా పొడవగలదు చెప్పు’’ అంతరంగం మళ్లీ ప్రశ్నించింది.
‘‘నిజమే కదా! మరెలా?’’
ఆ రోజంతా మరేమీ ఆలోచించాలనిపించలేదు.
విద్య పలకరించినా ముక్తసరిగా సమాధానమిచ్చాడు. మామూలుగా మాట్లాడితే ఎక్కడ బయటపడిపోతానో అని భయం.
పోలీసాఫీసర్‌గా ఎన్నో రహస్యాలను తన గుండె గోడని దాటనివ్వని తను ఇలా ప్రవర్తించటం తనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
వింత వింత ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. ఇంతవరకూ ఎన్నడూ అవి కనీ, వినీ ఎరుగనివి. ఇలాంటి పరిస్థితి వస్తుందని తనెప్పుడూ ఊహించలేదే?
‘‘ఊహించనివి జరగటమే కదా జీవితమంటే’’- పచ్చబొట్టు ప్రక్కనే నిలబడి కిలకిలా నవ్వినట్లనిపించింది.
మరీ పచ్చబొట్టు ధ్యాస ఎక్కువయిపోతోందే?
మరి తక్కువా? ఈ ఉత్తరం రాకపోయినా పచ్చబొట్టు ఆలోచనలు కదలాడుతూనే ఉండేవి. కానీ ఇప్పుడవి మరింతగా కలవరపెడుతున్నాయి.
ఎందుకీ కలవరం?
చెల్లితో షేర్ చేసుకోవాలని కాసేపు.. వద్దని కాసేపు.
పోనీ నాన్న గారితో.
ఛ! ఇలాంటివి నాన్నగారితో ఎలా మాట్లాడుతాడు?
ఆలోచనలతోనే ఆ రాత్రి తెల్లవారిపోయింది.
***
అది విజయవాడ. మాచవరం ఆంజనేయస్వామి గుడి దగ్గిర నాలుగు పోర్షన్లు కలగలిసి ఉన్న ఓ ఇల్లు. వంటలు వేరయినా, కులాలు వేరయినా వాళ్ళంతా కలిసే ఉంటారు. కానీ మధ్య పోర్షన్ వాళ్ళ అబ్బాయి మాత్రం వేరుగా ఉంటాడు. చదివేది ఇంటర్. బుద్ధులు మాత్రం భయంకరం. బ్రాహ్మణ వంశంలో పుట్టి ఈ బుద్ధులేమిటని తల్లే బాధపడుతుంటుంది. ప్రతి చిన్నదానికి ఆరడి. అందరితో తగాదా. ముఖ్యంగా పెద్దవాళ్ళను గౌరవించటం అతనికి తెలియదు. సంస్కారం అన్న పదం అతని జీవిత డిక్షనరీలో లేదు.
ఆరోజు ఆదివారం. ఉద్యోగం చేసే ఊర్మిళ వారమంతా ఖాళీ ఉండదు కాబట్టి ఆ రోజే బట్టలన్నీ ఉతుక్కుటుంది. అందరికీ ఒకటే కంబైన్డ్ తాడు. ఐకమత్యానికి ప్రతీక అయిన ఆ కుటుంబాలు ఆ రోజు తాడునంతా ఆమెకే వదిలేస్తారు. వరుసగా తాడుమీద బట్టలు ఆరేస్తోంది.
అక్కడే కూర్చుని మాగజైన్ చదువుతున్న రూపేష్ మధ్యలో కలుగజేసుకొని ‘ఆంటీ! మా ఇంటి ముందు మాత్రం వేయకండి’ అన్నాడు.
‘‘ఏంటోయ్! కొత్తగా మాట్లాడుతున్నావ్? వారమంతా మీరు మా ఇంటిముందు వేసుకోవడం లేదా? ఒక్కరోజు వేస్తే తప్పేంటి?’’ సరదాగా తీసెయ్యబోయింది అతని మాటను.
‘‘నేను సీరియస్‌గానే చెబుతున్నాను. నా బట్టలు వేసుకోవాలి, వెయ్యకండి’’
‘‘సరే! నీతో నాకు గొడవెందుకు? నీ బట్టలు వేసేటప్పుడు తీసేస్తాలే’’
‘‘అదేం కుదరదు. అసలు వెయ్యద్దంటున్నానంతే. వేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు’’.
‘‘అంత చిన్న పిల్లాడు పంతానికి పోతుంటే ఊర్మిళకు పంతం మరీ ఎక్కువయింది’’
‘‘ఏం చేస్తావ్?’’
‘‘ఏదయినా చేస్తాను’’ ముందుకు వస్తూ అన్నాడు.
‘‘ఆగు! నీతో నాకు గొడవ ఎందుకు? ఈ రోజు నేను బట్టలు వెయ్యకూడదంటే రేపటినుంచీ మీరు వెయ్యకూడదు’’.
అప్పటిదాకా వాళ్ళ వాళ్ళెంత సఖ్యతగా ఉండేవారో ఆ కోపంలో మరిచిపోయిందామె.
‘‘అదేం కుదరదు. మేం వేస్తాం, మీరు వెయ్యకూడదు’’.
అతని వితండవాదానికి విస్తుపోయింది.
‘‘రూపేష్! నా జోలికిరాకు’’ మర్యాదగా చెప్పింది.
‘‘ఎందుకు రాకూడదు? నేను మగాణ్ణి. నా మగతనం చూపించమంటావా?’’
మీదమీదకు వస్తున్న అతన్ని చూస్తే అసహ్యమేసింది. ఒక్క తోపు తోసింది. అప్పటికే తన కళ్ళజోడు అతని చెయ్యి తగిలి క్రిందపడి బద్దలయింది. లేచి తన మీద ఫైటింగ్‌కు వచ్చాడు. గాజులు బ్రద్దలయ్యాయి. చెంపలు పగలగొట్టాలనిపించింది.
కానీ అది ఎక్కడికి దారితీస్తుందో? విచక్షణ కాస్త ఆమెను ఆలోచింపజేసింది.
‘‘సాయంత్రం అంకుల్‌ని రానీ.. అప్పుడు చెబుతాను’’ అంటూ లోపలికి వెళ్లిపోయింది ఊర్మిళ.
ఇంటికి రాగానే భర్తకి అంతా వివరించింది. వెంటనే ఆవేశంతో వెళ్లి రూపేష్ కాలర్ పట్టుకుంటాడనుకున్న భర్త నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవటం అసహనాన్ని కలిగించింది.
‘‘ఏమిటండీ? మాట్లాడరు?’’
‘‘ఏమి మాట్లాడాలి? వాడో రౌడీ. వాడితో మనకెందుకు చెప్పు గొడవ. అసలు వాళ్ళ స్థలంలో వెయ్యద్దన్నపుడు నువ్వు ఊరుకోవచ్చుగా!’’
తప్పు అతనిది పెట్టుకొని తనకు పాఠాలు చెబుతాడే ఈయన అని ఒకింత విస్తుపోయింది ఊర్మిళ.
‘‘అదేంటండీ అలా అంటారు. వాళ్ళంతా మన తాడు రోజూ వాడుకోవడం లేదా, నేనూరుకోవటంలేదా? అప్పటికీ అన్నాను కూడా, మీరు వెయ్యకపోతే నేను వెయ్యనని. అదీ ఒప్పుకోవటంలేదు’’.
‘‘పోనీ వేసుకోనీ.. మనం ఎలాగూ ఉండం కదా. మన తీగ ఏమైనా అరిగిపోతుందా?’’
‘‘అదే! మీతో వచ్చే తంటా! వాళ్ళింటిముందు మనకి వేసుకొనే హక్కు లేనపుడు వాళ్ళెలా వేసుకుంటారు అనీ. అదంతా వదిలెయ్యండి. నేను మగాణ్ణి. మగతనం చూపించనా అంటాడా! చిన్నవాడు, ఆంటీతో అనాల్సిన మాటలేనా? అవి విన్నాక కూడా మీకు పౌరుషం రావటంలేదా? నేనే మీ స్థానంలో ఉంటే పోలీసు స్టేషన్‌లో రిపోర్టు చేసి ఉండేదాన్ని. వెధవకి బుద్ధి వచ్చేది’’.
‘‘ఇంత చిన్న విషయానికి పోలీసులదాకా ఎందుకు?’’ నిజంగా భార్య ఎక్కడ పోలీసుస్టేషన్‌కి వెళ్లిపోతుందో అన్నంత భయం అతని కళ్ళలో.
‘‘ఊర్మిళా! వదిలెయ్! ఈ ఒక్కసారికి అతన్ని క్షమించు. పోలీసులు ఇంత దాన్ని అంత చేస్తారు. ఇద్దరం అల్లరిపాలవుతాం.’’
తనకే నచ్చచెప్పాలని చూస్తున్న అతన్ని చూస్తుంటే చిరాకేసింది. పోలీసులు చిన్నది పెద్దది చేస్తారా? వాళ్ళంటే అందరికీ చిన్నచూపే. అవకాశమిస్తే వీడిని చితకబాది వాడి పొగరంతా వదిలేట్లు చేస్తారు. అలా చేస్తే మరో ఆడదాని జోలికి పోడు. ఇలాంటివాళ్ళను వదిలేస్తే ఎంతకైనా తెగిస్తారు.
మనసులో ఆలోచనల మంట నిలువెత్తున పెరుగుతున్నా భర్త వౌనం ఆమె ఆవేశాన్ని నీళ్ళలా చల్లార్చేసింది.
కానీ పచ్చబొట్టు ఊరుకోదుగా!
** -సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206