డైలీ సీరియల్

పచ్చబొట్టు--28

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీకటిలో ఆ దీపాలు ఆకాశంలో నక్షత్రాలు క్రిందకు దిగాయా అనిపిస్తోంది. ఆమె ఆలోచనలలో ఆమె, ఆమె ఆరాధనలో అతను పరిసరాలనే మర్చిపోయారు. కొద్ది క్షణాల తరువాత గుడిలో ఒక ప్రక్కగా అరుగుమీద కూర్చున్నారు.
ఇక లానం లేదని ధైర్యం తెచ్చుకొని వినీల్ అడిగేశాడు.
‘‘విద్యా! పెళ్లిమీద మీ అభిప్రాయం ఏమిటి?’’
‘‘పెళ్ళా! ఇప్పుడెందుకామాటలు?’’
‘‘ప్లీజ్! చెప్పండి!’’ అభ్యర్థనగా చూసాడు.
‘‘పెళ్లి.. ఈ వయసులో పెళ్లి అంటే అందరికీ మధురమైన ఊహలు ఉంటాయి. కానీ నాకు అది తలచుకుంటేనే భయం. పెళ్లి చేసుకుంటే మా అన్నయ్యను విడిచి వెళ్లాలని.. ఆ ఆలోచన నా దరి దాపులకు కూడా రానివ్వను. అన్నయ్య, నేను ఒక ప్రాణంలా ఉంటాం. అలాంటి అన్నయ్యను విడిచిపెట్టి వెళ్లాలన్న ఊహవల్లే నాకు పెళ్లి ఆలోచనలు సగం రావు. అయినా నా వృత్తిలో ఇలాంటి వాటి గురించి ఆలోచించే సమయమే ఉండదు. ఈ రోజు మీరు అడిగారు కాబట్టి చెప్పాల్సి వచ్చింది నా అభిప్రాయం’’.
‘‘మీకు సిల్లీగా అనిపించినా నేనేం అనుకోను. ఇల్లరికం వచ్చే అబ్బాయి అయితే ఇష్టపడతారా?’’
‘‘మన సినిమాలు ఇల్లరికం అంటే అల్లుడు ఇంట్లో నౌకరు, వాల్యూ లేని మనిషి అన్నట్లుగా చూపెడతాయి. నేను అలాంటి అర్థంలో మాట్లాడటం లేదు. నేనూ, మా అన్నయ్యా ఒక చోట ఉండాలి. అందుకు మమ్మల్ని చేసుకొనేవాళ్ళు ఇష్టపడాలి. గొడవలు లేకుండా మాతో కలిసిపోయేలా ఉండాలి. ఎందుకంటే మా అమ్మా, నాన్నలను భగవంతుడే తీసుళ్లిపోయాడు. ఇక మిగిలింది మేమిద్దరమే. వచ్చే వదిన కూడా అంగీకరిస్తే అందరూ ఒకే ఇంట్లో ఉండాలని, లేదంటే ప్రక్క ప్రక్క పోర్షన్స్‌లోనైనా ఉండాలి. అలా జరగకపోతే అసలు నేను పెళ్లే చేసుకోను.
ఆమె మనసు అతనికి అర్థమయింది. అందులో ప్రేమకు తప్ప కల్మషానికి తావు ఉండదు అనుకున్నాడు.
‘‘మరి పెళ్లికొడుకు ఎలా ఉండాలో’’ ఆ మాట అడగటానికి అతని పెదాలు తొందరగా ఒప్పుకోలేదు.
ఏదైనా నెగెటివ్ వస్తే తట్టుకునే శక్తి అందరి ప్రేమికులలా అతనికీ లేదు.
‘‘వినీల్! ఈ రోజు తమాషాగా అడుగుతున్నారే! పెళ్లికొడుకు ఇలా ఉండాలని నేనెప్పుడూ అనుకోలేదు. మంచివాడు, భార్యను పోషించుకోగలవాడయితే చాలు. జస్ట్ మీలాగా అనుకోండి.’’
అతని గుండె ఆగినంత పనయింది.
‘‘హమ్మయ్యా! ఆమె ఓ ఉదాహరణగా నన్ను సూచించిందంటే చాలు, ఈ జన్మకిది చాలు’’.
అప్పటికి సంతృప్తిపడింది అతని హృదయం.
వినీల్ మనసు ఇపుడు దూదిపింజలా ఎగిరిపోతోంది. అప్పటిదాకా ఉన్న టెన్షన్ మొత్తం పోయి ఫ్రీ అయిపోయాడు.
‘‘విద్యా! పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా?’’
‘‘లేదు లేదు! మీ మంచి ప్రశ్నలకు నా సమాధానాలే పిచ్చిపిచ్చిగా ఉన్నాయనుకుంటున్నాను. అయినా అమ్మా, నాన్నలు పోయిన నాటినుంచీ మీరు మాతో వుండి మమ్మల్ని ఆ బాధ మరిచిపోయేట్లు చేస్తున్నారు. మీవలనే మేము ఇలా ఉండగలుగుతున్నామేమో అనిపిస్తుంది కూడా. అన్నయ్య కూడా నాతో ఈ మాట చాలా సార్లు అన్నాడు. మీకు తెలియకుండానే మాకెంతో సహాయం చేస్తున్నారు. ఆ ఇంట్లో ఉండలేకపోతున్నామని చిన్నమాట అంటే ఊరు ఊరంతా గాలించేస్తున్నారు ఇంటికోసం. ఇవన్నీ చేయటం అంటే మాటలా?
‘‘మనసులు కలిసాక ఇవన్నీ చిన్నవే విద్యా నా లెక్కలో’’ మనస్ఫూర్తిగా అన్నాడు వినీల్.
‘‘మీ గురించి చెప్పండి’’
‘‘ఏముంది చెప్పటానికి.. చిన్నప్పటినుంచీ అనాధలా బ్రతికాను. ఎవరు ఏదన్నా ఫ్రీగా ఇస్తే మాత్రం తీసుకొనేవాడ్నికాదు. దానికి తగ్గ కష్టం వాళ్ళకు చేసిపెట్టి తీసుకునేవాడ్ని. వాళ్ళ ఇళ్లలో పనులో, సరుకులు తేవటమో.. ఏదో ఒకటి. అలా డిగ్రీ పూర్తిచేసాను. ప్రైవేటుగా చదువుకుంటూనే టాక్సీ అద్దెకు తీసుకున్నాను.
తర్వాత బ్యాంకు వారు లోన్ ఇస్తున్నారంటే నిరుద్యోగిని కదా వెళ్లి కలిసాను. వాళ్ళకి కావాల్సినవన్నీ నా దగ్గిర ఉన్నట్లున్నాయి. లోన్ ఇచ్చారు. నెల నెలా వాళ్ళకివ్వాల్సింది ఇచ్చేసి మిగిలింది నా కోసం ఖర్చుచేసుకుంటాను.
ఉండటానికన్నట్లు ఒక చిన్న రూము ‘దుర్గమ్మ’ కొండ దగ్గిర ఉంది. నాకు నా టాక్సీని చూస్తుంటే ఒక్కోసారి ఇల్లుకూడా అక్కర్లేదనిపిస్తుంది. నాకు పని లేనపుడు నాకదే నా బెడ్‌రూమ్. ఏదైనా తినేటప్పుడు అదే డైనింగ్ రూమ్. గెస్ట్‌లతో మాట్లాడేటప్పుడు అదే డ్రాయింగ్ రూమ్.
అతను ఇంటిని కారుగా, కారును ఇంటిని చేసి మాట్లాడటం విని నవ్వు ఆపుకోలేకపోయింది విద్య.
ఆ నవ్వు గుప్పెడు ముత్యాలు గుమ్మరించినట్లుంది.
అలా ఆమెనే చూస్తూ ఉండాలనిపిస్తోంది వినీల్‌కు.
ఆకాశం నుంచి ఏ ధృవతారో తనకోసం రాలినట్లనిపిస్తుంది విద్యను చూస్తే.
‘‘చాలాసేపయింది. ఇక వెళ్దామా?’’ అన్నయ్య వచ్చి ఉంటాడేమో?
‘‘తప్పకుండా వెళ్దాం. రమ్మని పిలవగానే కాదనకుండా వచ్చినందుకు చాలా థాంక్స్’’
‘‘కష్టంలో ఉన్నపుడు మీరు చేసిన త్యాగం కంటే ఇది ఎక్కువా?’’
‘‘అంటే బాకీ తీర్చుకుంటున్నరా?’’ చిన్నబుచ్చుకుంటూ అడిగాడు.
‘‘లేదు వినీల్! అపార్థం చేసుకోకండి. మిమ్మల్ని చూస్తే నాకు పరాయివారిలా అనిపించరు, మా ఫ్యామిలీ మెంబర్‌లాగే అనిపిస్తారు. అందుకే రమ్మనగానే వచ్చాను. అసలు నేను ఎవ్వరితో బయటకు వెళ్ళను, ఒక్క మా అన్నయ్య తప్ప. ఇలా మీతోనే మొదటిసారి బయటకు రావడం. అదీ మిమ్మల్ని బయటివారిలా చూడకపోవడంవల్ల.’’
‘‘్థంక్యూ!’’
‘‘ఇట్సాల్‌రైట్, ఇక వెళ్దామా?’’
‘‘పదండి!’’ ఇద్దరూ లేచారు.
ఇంటిదాకా వచ్చాక ‘‘ఇక వెళ్తాను విద్యా! మీతో గడిపిన ఈ సాయంత్రం నేనెన్నటికీ మరువను’’.
‘‘అన్నయ్య వచ్చేవరకూ ఉండి భోజనం చేసి వెళ్ళండి’’
‘‘వద్దులేండి, మరోసారి వస్తాను’’ అనబోయి ఆ మాటను మధ్యలోనే అదిమిపెట్టాడు.
‘‘అన్నయ్య లేని ఈ ఇంట్లో ఉండలేను’’ అన్న విద్య మాటలు గుర్తువచ్చి, ఉంటాను కానీ మీల్స్‌వరకూ కాదు- అనే్వష్ వచ్చేవరకూ ఉంటాను’’.
‘‘సరే మీ ఇష్టం!’’
తాళం తీసి లోపలకు వచ్చాక ‘‘పేపరు చూస్తూ ఉండండి. ఇపుడే వస్తాను’’ అంటూ లోపలికి వెళ్లిన విద్య ఐదు నిమిషాలలో ఫ్రెష్‌గా తయారయి వచ్చింది.
‘‘వస్తూనే మీకు చెస్ వచ్చా’’ అని అడిగింది.
‘‘ఊ! వచ్చు’’ అన్నాడు.
‘‘అయితే ఆడదామా?’’ అని అడిగింది.
ఖాళీగా కూర్చుంటే ఆలోచనలు మెదడును తినేస్తున్నాయి. వాటిని తప్పించుకోవటానికి ఇలాంటి మార్గాలను ఎన్నుకుంటోంది.
‘‘కాస్త టిఫిన్, టీ తీసుకొని’’ అంటూ వంటింట్లోకి వెళ్లింది విద్య.
అప్పుడే ఇంట్లోకి వచ్చిన అనే్వష్ ‘హాయ్! వినీల్! ఎప్పుడొచ్చావ్?’ అన్నాడు.
‘‘ఇప్పుడే వచ్చాం. విద్య ఉండమంటే..’’
‘‘ఓ కేసు ఎంక్వయిరీ వచ్చి ఉండిపోవాల్సి వచ్చింది. బయటకు వచ్చాక విద్య ఏం చేస్తోందో ఇంతసేపు అని వ్యధ. ఇంటికి వచ్చేవరకూ ధ్యాస అంతా విద్యమీదే. వీలయినప్పుడల్లా వచ్చి మా విద్యకు కంపెనీ ఇవ్వచ్చుగా’’.
‘‘తప్పకుండా!’’

-సశేషం
9247260206

-యలమర్తి అనూరాధ సెల్:9247260206