డైలీ సీరియల్

యువర్స్ లవ్వింగ్లీ..-20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీలో హరిత అంటే ఎవరు?’’’ అనడిగింది కళ్ళజోడు పైకి తోసుకుంటూ.
హరిత ఆ అమ్మాయి వంక ఆశ్చర్యంగా చూస్తూ ‘‘నా పేరే హరిత’’ అంది.
ఆ అమ్మాయి హరితని చూసి చిరునవ్వు నవ్వి ‘‘నా పేరు లక్ష్మి. మీ నాన్నగారి స్నేహితుడు రావుగారమ్మాయిని’’ అంది.
అప్పుడు గుర్తొచ్చింది హరితకి తల్లి ఆమెని కలుసుకోమని చెప్పిన సంగతి. ఆ తర్వాత తల్లి కూడా ఆ విషయం అడగకపోవడంతో తనూ మర్చిపోయింది. హరితకి గిల్టీగా అనిపించింది.
‘‘ఓహ్.. మీరా.. మీ గురించి నాన్నగారు మొదటిరోజే చెప్పారు. కానీ కలుసుకోలేకపోయాను. సారీ అండీ’’ అంది నొచ్చుకుంటున్నట్లుగా.
లక్ష్మి నవ్వి ‘‘మరేం ఫర్వాలేదు.. ఎలా వుంది కాలేజ్? బాగా చదువుతున్నావా?’’ అంది.
‘‘చాలా బాగుందండీ.. బాగా అలవాటయిపోయింది’’ ఆనందంగా చెప్పింది హరిత.
తండ్రి చెప్పినపుడు లక్ష్మి అన్న పేరుగల అమ్మాయంటే జుట్టు సన్నగా దువ్వుకుని సంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని వుంటుందనుకుంది. కానీ ఈ అమ్మాయి అందుకు భిన్నంగా వుంది. హరిత ఆమె వంక పరిశీలనగా చూసింది.
జీన్స్ ప్యాంట్ మీదికి టీషర్ట్ వేసుకుని జుట్టుని పోనీటైల్ కట్టుకుంది. అంత మోడరన్‌గా అలంకరించుకున్నా ఆమెలో ఎక్కడా అసభ్యత కనిపించడంలేదు. ఎంతో హుందాగా కనిపిస్తోంది. హరితని ఎక్కువగా ఆకట్టుకున్నది ప్రశాంతమైన ఆమె ముఖ కవళికలూ, మర్యాదని నింపుకున్న ఆమె ప్రవర్తన.
‘‘మీ నాన్నగారు మా నాన్నగారికి మంచి స్నేహితులు. ఒకసారి నిన్ను కూడా చూసారుట మీ ఇంట్లో. నువ్వు ఆయనకి బాగా నచ్చావు. ఆడపిల్లలంటే అలా వుండాలి అని చెబుతుంటారు నీ గురించి. ఆయన మాటలవల్ల నాకూ నిన్ను చూడాలనిపించేది. ఇపుడు చూసాను. లంగా ఓణీల్లో నిన్ను చూస్తుంటే ఆయన మాటలు అబద్ధం కాదనిపిస్తోంది’’ అంది.
ఆమె మాటలకి హరిత సిగ్గుపడింది. అంత కలివిడిగా మాట్లాడుతున్న ఆమెని చూస్తుంటే ఆ రోజు తను ఆమెని కలుసుకోకుండా తప్పు చేసాననిపించింది. పది నిమిషాల్లోనే ఆమె ఎంతో ఆత్మీయ స్నేహితురాల్లా అనిపించింది హరితకి.
‘‘మీ డిపార్ట్‌మెంట్ ఎక్కడ?’’ అడిగింది.
‘‘మీ బ్లాక్‌కి రెండు బ్లాక్‌ల అవతల. ఎప్పుడైనా కలుస్తూండు. నీకు ఎప్పుడు అవసరం వచ్చినా నా దగ్గరికి రా...’’ అందామె.
‘‘ఆరోజు మీరు నా గురించి వెయిట్ చేస్తారన్నారట. మిమ్మల్ని కలుసుకోలేకపోయినందుకు సారీ.. అది మనసులో పెట్టుకోకుండా నా గురించి వచ్చారు చాలా థాంక్స్’’ కృతజ్ఞతగా అంది.
‘టేకిట్ ఈజీ’ అన్నట్లుగా నవ్వింది లక్ష్మి.
ఆమెతో మాట్లాడుతున్నకొద్దీ ఆమెలో ఏదో ప్రత్యేకత వుందనిపించింది హరితకి. ఆ కాలేజ్‌లో అప్పటిదాకా తను చూసిన ఎంతోమంది అమ్మాయిలెవరిలోనూ లేని.. ప్రత్యేకత! అది హరితకి బాగా నచ్చింది. ఆమెతో స్నేహం చేయాలనుకుంది.
ఆమె లక్ష్మితో స్నేహం చేస్తే ఎలా వుండేదో కానీ, ఒక కారణంవల్ల ఆమెకి మళ్లీ లక్ష్మిని గురించి ఆలోచించే అవకాశం రాలేదు. ఆ కారణం పేరు.. వరుణ్!
***
‘‘మైడియర్ ఫ్రెండ్స్..’’ భరణి కంఠం మైక్‌లో వినిపించడంతో అందరూ మాటలు ఆపి అటువైపు చూసారు. అతడేదో చెప్పాలని అందరినీ పిలుస్తున్నాడని అర్థమవడంతో అంతా అతడి చుట్టూ చేరారు.
‘‘ఫ్రెషర్స్ డే పార్టీకి వచ్చి ఈ పార్టీని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మీకందరికీ కృతజ్ఞతలు. ర్యాగింగ్‌లో సీనియర్సేమైనా మిమ్మల్ని నొప్పించి వుంటే మర్చిపోండి. ఏదైనా సమస్య వచ్చినపుడే మనకి సాటి మనిషి అవసరం గుర్తుకు వస్తుంది. కాలేజ్‌లోకి అడుగుపెట్టగానే ఎదురైన ర్యాగింగ్ అన్న చిన్న సమస్యవల్ల ఎక్కడెక్కడినుంచో వచ్చిన మీ జూనియర్స్ అందరి మధ్యా పరిచయాలు పెరిగి ఒకరికొకరం అన్న భావనతో మీరంతా దగ్గరయ్యారని భావిస్తాను.
ర్యాగింగ్ అన్నది మీలో మీకు తెలియకుండానే వుండే ఒకరమైన బెరుకుని పోగొట్టి మిమ్మల్ని ఫ్రీగా వుంచడానికే అని గ్రహించాలి. నేను స్టూడెంట్ లీడరై వచ్చిన దగ్గరనుంచీ, కాలేజ్‌లో ర్యాగింగ్ పరిమితులు దాటకుండా, ఆ పేరుతో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాను’’ అతడు ఒక్క క్షణం మాట్లాడడం ఆపి అందరి వంకా చూసాడు. వింటున్న చాలామంది జూనియర్స్‌కి ర్యాగింగ్ సమయంలో అతడు మధ్య మధ్యలో వచ్చి తమని సీనియర్స్ బారినుంచి రక్షించడం గుర్తుకు వచ్చింది.
‘‘మన కాలేజ్‌లో ఒక రూల్ వుంది. దాని ప్రకారం విద్యార్థుల్లో కొంతమంది కలిసి ఒక కమిటీగా ఏర్పడి కాలేజ్ అడ్మినిస్ట్రేన్లో భాగం పంచుకుంటూ యాజమాన్యానికి విద్యార్థుల తరఫున సలహా సహకారాలు అందజేస్తారు.
కాలేజ్‌లో ప్రతి విషయంలోనూ, అంటే హాస్టల్ మెయింటనెన్స్, క్యాంటీన్ మెయింటనెన్స్ దగ్గరనుంచీ, కాలేజ్ గార్డెన్, లైబ్రరీ, లాబొరేటరీ, కల్చరల్ ప్రోగ్రామ్స్ మేనేజ్‌మెంట్ వరకూ ప్రతి విషయాన్నీ విద్యార్థుల తరఫున పర్యవేక్షించి అవసరమైన సలహాలు, సహకారాలు అందజేస్తుందీ బృందం. ఒకరకంగా ఈ సాంప్రదాయం మనల్ని ఇక్కడ సౌకర్యవంతంగా వుంచడానికే కాకుండా, కాలేజ్ నుంచి బయటికి వెళ్ళేసరికి మనలోని అడ్మినిస్ట్రేటివ్, లీడర్‌షిప్ స్కిల్స్‌ని పెంచుకోవడానికి కూడా దోహదపడుతుంది. అందుకే ప్రతి సంవత్సరం ప్రతి బ్రాంచి నుంచి కొంతమందిని ఈ బృందంలో జేరడానికి ఎన్నిక చేసి సాధ్యమైనంత ఎక్కువమందికి అవకాశం కల్పిస్తారు’’.
అతడి మాటలకి అందరూ చప్పట్లు కొట్టారు. తరువాత నెమ్మదిగా అన్నాడు. ‘‘మీ బ్యాచ్‌లోంచి ఈ సంవత్సరకాలానికి ఆ గ్రూపులోకి చేరడానికి ఎంపికైన విద్యార్థులు..’’ అంటూ అప్పుడే ఆఫీసునుంచి ప్యూన్ తీసుకువచ్చిన లిస్ట్‌ని చదవసాగారు.
‘‘మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి సందీప్, వరుణ్, ఎలక్ట్రానిక్స్ నుంచి హరిత..’’

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ