డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

6. నాద చికిత్స
పూజ గురించి చెప్పుకున్నాం. పూజ మంత్రంతో కూడి పడి వుంది. మంత్రం అంటే వేదం. వేదానికి మూల రూపం నాదం. ఆ నాదాన్ని గూర్చి కూడా కొంచెం తెలుసుకుందాం.
సృష్టిలోని విషయాలను మనం ఆరు ఇంద్రియాలతో గ్రహిస్తున్నాం. గ్రహించిన ఇన్ని విషయాలను ఇతరులకు తెలియజేయాలంటే మాత్రం ఒకే మార్గం వుంది. అదే శబ్దం. దీనికే మరో పేరు నాదం. దీన్ని సరిగా ఉపయోగించడం చేతనైతే ఇది ఒక్కటే శ్రోతల కన్నులకు రూపంగా, ముక్కులకు వాసనగా ఇలా ఆరు రకాలుగానూ పరాక్రమం చూపించగలదన్నమాట! మరి దీనికి ఈ శక్తి ఎలా వచ్చింది?
సూక్ష్మంగా చెప్పాలంటే- నాదం స్పందనలోంచి ఉద్భవిస్తుంది. ఒక ట్యూనింగ్ ఫోర్కును స్పందింపచేస్తే ఒక నాదం పుడుతోంది కదా! ఇదే ప్రక్రియను వెనుకకు తిప్పితే- నాదంలోంచి స్పందనను పుట్టించవచ్చు. మానవ శరీరంలో ససూక్ష్మాలైన నాడులు 72,000 వున్నాయి. వాటికి ఏడు ప్రధాన నాడీ కేంద్రాలు వున్నాయి. వీటినే చక్రాలు అంటారు. ఈ నాడులు, నాడీ కేంద్రాలుకూడ నిరంతరం నియమిత వేగాలతో స్పందిస్తూ వుంటాయి. ఈ స్పందనలు శరీరాన్ని, మనస్సును ఆరోగ్యస్థితిలో నిలబెడుతూ వుంటాయి. ఈ స్పందనల క్రమం తప్పినప్పుడు అనారోగ్యం ఏర్పడుతూ వుంటుంది. మరి ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన స్పందనలు క్రమం తప్పడం ఎందుకు జరుగుతుంది?
ఇందుకు కారణాలు రెండు. ఏదో ఒక ప్రలోభానికి లొంగి ఏదో ఒక దోషం చేసిన వ్యక్తి పైకి పవిత్రుడుగా వ్యవహరిస్తూ వుంటాడు. స్వార్థంవల్ల తెలిసికూడ దోషం కొనసాగిస్తూనే వుంటాడు. అలాంటప్పుడు అతని మనసులో ఒక కొత్త వత్తిడి పుడుతుంది. ఈ వత్తిడి ఫలంగా నాడుల స్పందన క్రమం తప్పుతుంది. ఫలితంగా అనారోగ్యం ఏర్పడుతుంది. ఇది ఒక రకం. రెండో రకం- పిడుగుపాటు వంటి బహిర్గత కారణాలవల్ల హృదయోద్వేగాలు తలక్రిందులై నాడుల స్పందనలో మార్పు రావడం. దీనివల్లకూడా అనారోగ్యం ఏర్పడుతుంది. ఈ రెండు రకాలలోనూ కూడా మనస్సుపై వత్తిడి, నాడులలో స్పందనాలలో మార్పు- ఇవే అనారోగ్యానికి మూలకారణాలు. మరి దీనికి చికిత్స ఎలా?
నాదంవల్ల స్పందనలను కలిగించవచ్చని చెప్పుకున్నాం కదా! సరియైన సంగీత స్వరాలద్వారా నాడీ తండ్రులలోకి నిర్ణీతమైన నాద తరంగాలను ప్రవహింపచేయడం ద్వారా నాడీ స్పందనల గతులను సరిచేయటమే నాద చికిత్స. హోమియో వైద్యం మనస్సుకి మందువేసి వ్యాధులను నయం చేయాలని చూడగా, నాద వైద్యం నాడీ స్పందనల ద్వారా వ్యాధులను నయం చేస్తోంది.
మానవ శరీరంలోని నాడులే కాదు. ఈ ప్రపంచంలోని అణువు, ప్రతి గోళము, ప్రతి బ్రహ్మాండము నియమితమైన విధానంలో స్పందిస్తూనే వుంది. అంటే నియమితమైన నాద తరంగాలను సృష్టిచేస్తోంది.
ఉదా: సూర్యోదయ సమయంలో సముద్రం అడుగునుంచి ఆకాశ గర్భంలోకి సూర్య కిరణాలు పొడుచుకొని వచ్చేటప్పుడు ఒక నాదం పుడుతుంది. మళ్ళీ ఆ సూర్యుడు అస్తమించేటప్పుడు వేరొక నాదం పుడుతోంది. అలాగే పూర్ణిమనాటి సముద్రుడు నాదం వేరు. అమావాస్యనాడు వేరు. ఇలా కాలాన్నిబట్టి ఈ విశాల ప్రకృతి సహజంగా ఆవిష్కరించే రాగాలు కొన్ని వున్నాయి. గాయకుడు వెలువరించే రాగాలు ఆ సమయ ప్రకృతి వెలువరించే రాగాలకు సజాతీయంగా వుంటే అవి రెండు పరస్పర సహకారులుగా పనిచేసి ఫలితాలను రెట్టింపుచేస్తాయి. అవి పరస్పరం విరుద్ధంగావుంటే ఫలితాలు దెబ్బతింటాయి అందుకే సంగీత శాస్త్రంలో రాగాలు ఉదయరాగాలనీ, మధ్యాహ్నరాగాలనీ, సాయంకాల రాగాలనీ, రాత్రి రాగాలనీ ఇలా విభజించారు.
ఉదా: మలయమారుత రాగం- ఇది ఉదయరాగం. ఉదయ సమయంలో ఈ రాగం పాడినా, విన్నా మత్తు విడుతుంది. ఈ రాగం వింటూ నిద్రలేస్తే బుద్ధి ప్రసన్నమై తెలివి పెరుగుతుంది. రోగికి రోగం అదుపులోకి వస్తుంది. యోగికి మనస్సు ఏకాగ్రవౌతుంది. ఇవి సామాన్యంగా ఉదయ రాగాల లక్షణాలు. మధ్యాహ్న రాగాలు సామాన్యంగా ఉదరకోశ వ్యాధులను నయం చేస్తాయి. సంధ్యారాగాలు హృదయ కోశాన్ని సరిచేస్తాయి. రాత్రి రాగాలు ఆయుష్షును వృద్ధిచేస్తాయి.
సౌమ్య రాగాలేవైనాసరే- నాద చికిత్సకు పనికివస్తాయి. వాటి సంయోజనం ఒక కళ. ఈ విషయంలో ఇంకా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి.
7. విజ్ఞానము- వేదాంతము
సత్యానే్వషణ మానవ స్వభావం- అలనాటి మన మహర్షులు సత్యానే్వషణలో తమ లోలోపలికి తవ్వుకుంటూ వెళ్ళారు. శాశ్వత సత్యాన్ని దర్శించారు. ఈనాటి మానవుడు సత్యానే్వషణలో తనను వదలి, తన చుట్టూవున్న ప్రపంచాన్ని వింగడించుకొంటూ పోతున్నాడు. అయినాసరే మహర్షులు దర్శించిన సనాతన సత్యానికే చేరువౌతున్నాడు. ఈ సత్యాన్ని నిరూపించడానికే ఈ వ్యాసం.
20వ శతాబ్దంలో విజ్ఞానశాస్త్రం విశ్వరూపంగా విస్తరించిందని చెప్పవచ్చు. విస్తరిస్తూవున్న విజ్ఞానశాస్త్రం వేదాలలో వున్న వేదాంత శాస్త్రానికి, నానాటికీ దగ్గరికి జరుగుతూ వుండటం, ప్రపంచంలోని మేధావులకు రానురాను ఆకర్షణీయాంశంగా మారుతోంది. కొద్దికాలం క్రిందటివరకు వేదాంతము, విజ్ఞానమూ, పరస్పర విభిన్న విరోధ శాస్త్రాలుగా కనపడుతూ వుండేవి. ఈనాటికి కూడా అలా భావిస్తున్నవారు కొందరు లేకపోలేదు. ఆ మాటకువస్తే వారి ఆలోచన కేవలం నిరాధారమైనది కాదు. ఇంకావుంది...

‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం,
పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్,
దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.

ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట,
విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి