డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో వెలుతురు యొక్క లేదా విద్యుదయస్కాంత తరంగాల యొక్క వేగమే అతి పెద్ద వేగం. అది సెకనుకి 1,86,000వేల మైళ్ళు. దాన్ని మించిన వేగం వుండటానికి వీలు లేదు. ఇది ఐన్‌స్టీన్ నిరూపించిన సత్యం. ఇలాంటి పరిస్థితిలో 8,00,000 మైళ్ళ దూరాన వున్న అణువులు ఒకే క్షణంలో ఒకే రీతిగా ఎలా స్పందిస్తున్నాయి? ఈ సంబంధమేమిటీ? దానిని సైన్సువారు ‘సూపర్ ల్యూమినల్’’ సంబంధం అన్నారు. అంటే కాంతిని మించిన వేగం గల సంబంధం అని భావం. ఈ సమస్య వైజ్ఞానికులకు విషమ ప్రశ్న.
అయితే డేవిడ్‌బోమ్ అనే వైజ్ఞానికుడు ఆ అణువులకు ఏదో బంధం వుందని అనుకోవడం పొరపాటనీ, నిజానికి రుూ ప్రపంచమంతా అఖండం కనుక ఎంత దూరాన వున్నా సరే ఒక అణువుకి మరొక అణువుకు వేరే సంబంధం వుండక్కరలేదని ప్రతిపాదించాడు. మీరు, మీ శిరస్సు లోంచి పాదంలోకి వార్త పంపడానికి టెలిఫోను చేయాలా? అలాగే రుూ ప్రపంచమంతా ఒకే పరమాత్మ యొక్క శరీరం. అందువల్లనే దీనిలో వుండే అవయవాల మధ్య నిరంతరమైన అంతస్సంబంధం శాశ్వతంగా వుంటుంది. అంతేకాని విద్యుదయస్కాంత తరంగాల వంటి వార్తాహరులతో పనిలేదు అనేదే ‘బోహమ్’ సిద్ధాంతం. ఇది వైజ్ఞానికుల ఆమోదం పొందింది. మన విరాట్ స్వరూప వర్ణన చెప్పే సత్యం యిదే.
సృష్టి స్థితి లయలు:
ఇలా ఈ ప్రపంచమంతా సంబంధ బధురమైతే: యిది ఎక్కడినుంచి వచ్చింది? ఈ సృష్టిలేని సమయం వెనుక ఒకటి వుండేదని, రుూ సృష్టి అంతంలో మళ్ళీ అలాంటి పరిస్థితి రాబోతోందని, యివే సృష్టి స్థితి ప్రళయాలని, రుూ చక్రం నిరంతరం యిలా తిరుగుతూనే వుంటుందనీ చెబుతోంది. మన పురాణాలలో అనేకచోట్ల రుూ వర్ణనలు కనిపిస్తాయి.
గత శతాబ్ది వైజ్ఞానిక శాస్త్రం మాత్రమే దీన్ని అంగీకరించలేదు. ఐన్‌స్టీన్ వంటి మేధావి కూడా ఈ ప్రపంచం స్థిరమని మొదట్లో ప్రతిపాదించాడు. కాని, 1922లో ‘ఎడ్విన్‌హబ్బుల్’’అనే వైజ్ఞానికుడు వౌంట్ విల్సన్ అబ్జర్వేటరీలో పరిశీలిస్తూ సుదూర నక్షత్ర మండలాలు ఆకాశంయొక్క కేంద్రస్థానం నుంచీ బహువేగంతో దూరంగా కదలిపోతున్నాయని కనిపెట్టాడు. ఐన్‌స్టీన్ మొదట్లో దానిని తిరస్కరించినా చివరిలో అంగీకరించక తప్పలేదు. ఇంతకూ, నక్షత్ర మండలాలు దూరంగా జరిగిపోతుంటే ప్రపంచం పెరిగిపోతోందన్నమాట. ఎందుకిలా జరుగుతోంది? ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక బాంబు ప్రేలుడు వంటిది జరిగి వుండాలి. దానిలోనుంచి వచ్చిన తుంపరలు యింకా ఎగురుతున్నాయన్నమాట. ఇది నిజమైతే సృష్టిలోని అన్ని భాగాల్లోనూ, ఎంతోకొంత వేడి మిగిలిపోయి వుండాలి. అది 3 డిగ్రీల కెల్విన్ రేడియేషన్ అయి వుండాలని వైజ్ఞానికులు లెక్కలువేశారు. 1967లో పెన్‌జియాస్, విల్సన్ అనే వైజ్ఞానికులు ఒక ప్రయోగం ద్వారా పైలెక్కలు సత్యమే అని ప్రత్యక్షంగా నిరూపించారు. వారికి నోబుల్ బహుమతి వచ్చింది.
దీనినిబట్టి గెలాక్సీలు దూరంగా జరగటం సత్యమేనన్నమాట. అలా అయితే ఏదో ఒకనాటికి రుూ ప్రపంచం తనలోని శక్తినంతా ఖర్చుబెట్టివేసి మొత్తం రాలిపోయి నల్లరంధ్రంగా మారిపోతుందా? చంద్రశేఖర్ అనే భారతీయ వైజ్ఞానికుడు ఈ విషయంలో పరిశోధనచేసి నోబుల్ బహుమతి పొందాడు.
ఒక నక్షత్రం యొక్క సాంద్రత పెరుగుతున్నకొద్దీ, దానిలోని అయస్కాంత శక్తివల్ల దానిలోని అణువులు పరస్పరం ఆకర్షించుకుని దగ్గరకు వస్తాయి. ఆ గోళంయొక్క చలనంవల్ల దానిలోని అణువులలో ఒక వికర్షణ శక్తికూడా బయలుదేరుతోంది. ఇలావుండగా ఆ నక్షత్రంయొక్క బరువు ఒక పరిమితిని దాటితే- దానినే ఇపుడు చంద్రశేఖర్ పరిమితి అని పిలుస్తున్నారు- ఆ నక్షత్రం కూలిపోవడం మొదలుపెడుతుంది. ఈ పరిమితి సూర్యగోళం యొక్క బరువుకన్న 1.44 రెట్లు అని చంద్రశేఖర్ నిరూపించాడు. సరి, ఆ బరువుదాటితే ఆ నక్షత్రం కూలిపోవడం ఆరంభించి, దానిలో వున్న ఆకర్షణశక్తి ఫలితంగా చుట్టూతా వున్న అణువులను తనలోకి ఆకర్షించుకొనసాగుతుంది. ఈ ఆకర్షణశక్తి ఎంత బలంగా వుంటుందంటే కాంతి అణువులనుకూడా అది తనలోకి పీల్చుకుంటుంది. కాంతి హరించుకుపోతుంది కనుక దానిని నల్ల రంధ్రం అని పిలుస్తారు.
అలా ఏర్పడిన నల్లరంధ్రం తనలోనుంచి శక్తిని బయటకు విరజిమ్ముతుంది. అద్భుత వేగంతో శక్తిని బయటకు విరజిమ్మటమంటే తనలోని పదార్థాన్ని కోల్పోవటమే. ఇలా తనలోని పదార్థాన్నంతా కోల్పోయి అది శూన్యం అయిపోతుందా?
ఇక్కడే స్టీఫెన్ హాకింగ్ అనే వైజ్ఞానికుడి పరిశోధన పనిచేసింది. ఆయన హైసన్‌బర్గ్ యొక్క అనిశ్చిత సిద్ధాంతాన్ని ఖగోళశాస్త్రానికి సమన్వయించి, నల్లరంధ్రం ఎన్నటికీ శూన్యం కానేరదు అని నిరూపించాడు. మరి ఏవౌతుంది? అది శూన్యం కాబోయే ముందర మరొక క్రొత్త ప్రేలుడుగా మారిపోతుంది. ఈ విధంగా మళ్ళీ నూతన సృష్టి ప్రారంభవౌతుంది.
ఇంకావుంది...

‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం:
ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.

ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004.
ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి