డైలీ సీరియల్

యువర్స్ లవ్వింగ్లీ...26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కానీ వరుణ్ తన జీవితంలోకి అడుగుపెట్టాక తనకి తన కోసం, తన స్నేహితుల కోసం కేటాయించడానికి సమయమే మిగలకుండా పోయింది. క్రిందటి సంవత్సరమే లక్ష్మి ఇంజనీరింగ్ పూర్తయింది. డిస్టింక్షన్‌లో పాసయింది. ఎం.బి.ఎలో జాయిన్ అయిందని మాత్రం తెలుసు.
‘‘ఎలా వుంది కొత్త కాలేజీ? బాగా చదువుతున్నావా?’’ అడిగింది హరిత ఆమెని.
బిజినెస్ మానేజ్‌మెంట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అని అంతకుముందోసారి చెప్పిందామె హరితతో. తన అభిరుచికి తగ్గట్టుగా యం.బి.ఎలో చేరిన ఆమెని చూస్తే ఎప్పటికప్పుడు ఆశ్చర్యంగా కొంచెం అసూయగా వుంటుంది హరితకి.
తనకి మెడిసన్ అంటే ఆసక్తి. కానీ ‘అమ్మాయివి. మెడిసన్ చదివిస్తే బోలెడు ఖర్చు, తరువాత పెళ్లి కూడా చేయాలి కదా? నువ్వేమైనా ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళేలా?’ అంటూ తనని ఇంజనీరింగ్‌లో జాయిన్ చేసింది తల్లి.
‘‘బానే చదువుతున్నాను. అదిసరే, ఇంకో రెండేళ్ళలో నీ డిగ్రీ అయిపోతుంది కదా? నువ్వేం చేయాలనుకుంటున్నావు?’’ అడిగిందామె హరితని.
హరితకేం చెప్పాలో తెలియలేదు. ఏం చేయాలనుకుంటుందో.. ఆమెకే తెలియదు. సాధ్యమైనంత తొందరగా వరుణ్‌ని పెళ్లి చేసుకోవాలి అని మాత్రం అనుకుంటోంది.
‘‘ఇంకా ఏమీ అనుకోలేదు నాన్నగారు ఏమంటారో.. దాన్ని బట్టి’’ చెప్పింది. తన సమాధానం తనకే ఏదోలా అనిపించింది.
‘‘ఎవరిగురించేనా వెయిట్ చేస్తున్నావా?’’ అడిగింది లక్ష్మి.
‘‘అవును. ఒక ఫ్రెండ్ వస్తానని చెప్పింది, ఆమె కోసం ఎదురుచూస్తున్నాను’’ చెప్పింది హరిత.
నిజానికామె వరుణ్ కోసం ఎదురుచూస్తోంది. లక్ష్మి దగ్గిర ఆ విషయం చెప్పడానికి ఇబ్బందిగా అనిపించింది. ఎందుకో తెలియదు కానీ.. కావేరి దగ్గర చెప్పినంత సులువుగా లక్ష్మితో వరుణ్ విషయం చెప్పలేకపోతోంది.
‘‘సరే, ఈసారి కలిసినపుడు మాత్రం మా ఇంటికి రావాలి’’ అంది లక్ష్మి బయలుదేరుతూ.
‘‘తప్పకుండా’’ చెప్పింది హరిత.
ఆమె వెళ్ళగానే రిలీఫ్‌గా ఊపిరి పీల్చుకుంది. ఆమె ఉండగా ఎక్కడ వరుణ్ వచ్చేస్తాడోనని టెన్షన్ పడింది. సరిగ్గా ఆమె వెళ్లిన రెండు నిమిషాలకే వచ్చేడు వరుణ్.
‘‘లేటయిందా?’’ అడిగాడు.
‘‘లేదు. సమయానికే వచ్చేవు. కొంచెం ముందర వచ్చి వుంటే కొంపలంటుకునేవి’’ అంది హరిత.
‘‘ఏం?’’
‘‘ఇప్పటిదాకా మా డాడీ ఫ్రెండ్ కూతురు వుంది. నీతో నన్ను చూసి ఆ విషయం వాళ్ల నాన్నకి చెప్పిందంటే.. ఆయన ద్వారా మా ఇంట్లో తెలిసిపోయుండేది’’ వరుణ్ వౌనంగా వుండిపోయాడు.
‘‘వరుణ్.. ఎన్నాళ్లిలా దొంగచాటుగా తిరుగుతాం? ఎపుడో ఒకప్పుడు మా ఇంట్లో తెలియకుండా వుండదు’’ దిగులుగా అంది హరిత.
‘‘నిజమే’’
‘‘ఏం చేద్దాం?’’ అడిగింది ఆలోచిస్తూ.
‘‘మంచి హోటల్‌కి వెళ్లి కాఫీ తాగుదాం’’ అన్నాడు వరుణ్.
‘‘నీకు వేళాకోళంగా వుందా?’’ కోపంగా అంది.
‘‘వేళాకోళం కాదు హరీ.. ఎప్పుడో ఏదో సమస్య వస్తుందని చెప్పి ఇప్పటినుంచీ బాధపడి మనసు పాడుచేసుకోవడం ఎందుకు? అంటున్నాను. నిజంగా సమస్య వచ్చినపుడు దాని గురించి ఆలోచిద్దాం. అందాకా లెటజ్ ఎంజాయ్.. కమాన్’’
అతడు బైక్ స్టార్ట్ చేశాడు. హరిత అతను చెప్పినట్లుగానే అతడి కబుర్లలో పడి ఆ విషయాన్ని క్షణాల్లో మరిచిపోయి అతనితో కలిసి ఎంజాయ్ చేసింది. కానీ వాళ్ళు అనుకుంటున్నట్లు సమస్య ఎప్పుడో.. రాలేదు. చాలా తొందరగానే వచ్చింది.
****
గత కొద్దికాలంగా హరిత ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చినట్లు సుమతి గ్రహించింది. ఆమెకా అనుమానం రాగానే హరితని మరింత జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టింది.
ఇదివరకటికన్నా ఎక్కువసేపు అద్దం ముందు గడపడం, అలంకరణ, దుస్తుల విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం.. అన్నింటినీ మించి ఆమెలో అంతకుముందు లేని చలాకీతనం, హుషారు!
ఒక్క రోజు కూడా కాలేజ్ మానడానికి ఇష్టపడకపోవడం.. సాయంత్రాలు లేటుగా ఇంటికిరావడం.. ఇవన్నీ వయసులో వుండే పిల్లల్లో సహజంగా కనిపించే లక్షణాలే అయినా కూతురి ముఖంలో కనిపిస్తున్న అదోరకమైన మెరుపుని చూస్తుంటే ఆమెకెందుకో కూతురు కాలేజ్‌లో ఎవరితోనైనా ప్రేమలో పడిందేమోనన్న అనుమానం వచ్చింది.
హరిత ఇంట్లో లేనపుడు ఆమె పుస్తకాలూ, బ్యాగూ చెక్ చేసింది ఏమైనా ప్రేమలేఖలు బయట పడతాయేమోనని. అలాంటివేమీ కనబడకపోవడంతో కొంత రిలీఫ్‌గా ఫీలయ్యింది.
కానీ కావేరితో ఎక్కువ తిరగడం, ఆమె ఇంటికి వచ్చినపుడు ఇద్దరూ ఎవరూ వినకుండా మేడమీదికి వెళ్లి గంటల తరబడి కబుర్లు చెప్పుకోవడం చూస్తుంటే ఆమెకి తిరిగి అనుమానం బలపడసాగింది.
ఏముంటాయి వాళ్ళిద్దరి మధ్యనా అంతంతసేపు మాటలు?
ఒకసారి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినాలని డాబామీదికి వెళ్లింది. ఆమెని చూడగానే వాళ్ళు మాటలు ఆపేశారు. మళ్లీ వెంటనే టాపిక్ మార్చి ఏదో మాట్లాడుకుంటున్నారు. ఆమెలో అనుమానం ధృవపడింది.
****
‘‘ఇదుగో.. నీ కూతురు కాలేజ్‌కని చెప్పి వెళ్లి ఏం నిర్వాకం చేస్తోందో తెలుసా?’’ ఆ రోజు ఇంటికి వస్తూనే మండిపడుతూ అన్నాడు సుదర్శనరావు.
సుమతి గుండెల్లో రాయిపడింది.
‘‘ఏమయిందండి? ఏం చేసింది?’’ భయపడుతూనే అడిగింది.
‘‘నిన్న మధ్యాహ్నం ఎవడితోనో సినిమా హాల్లో కనబడిందట మా ఫ్రెండ్‌కి. మళ్లీ వాడితోనే బైక్‌మీద వెళ్లిపోయిందట, ఇవాళ క్లబ్‌లో చెప్పాడు. నా తల తీసేసినట్లయింది వాడలా చెబుతుంటే..’’ కోపంగా అన్నాడు సుదర్శనరావు
‘‘అసలు అదేదీ? వెధవ్వేషాలేస్తే నరికిపారేస్తాను ఏమనుకుంటోందో’’ రౌద్రరూపం దాలుస్తూ అన్నాడాయన.
‘‘ఊరుకోండి.. దానికి నేను చెబుతాను’’ అంటూ శాంతపరిచిందామె.
‘‘నువు దానికి ఏం చెబుతావో ఎలా చెబుతావో నాకు తెలియదు. నేను ఇంకోసారి దాని గురించి ఇలాంటి కామెంట్స్ వినడానికి వీల్లేదు అర్థమయ్యిందా?’’ హెచ్చరికగా అన్నాడాయన.
***
హరితకి తల్లేమంటోందో ఒక్క క్షణం అర్థం కాలేదు. అర్థమవ్వగానే గుండెలు దడదడలాడాయి. నాలుక తడారిపోయింది.
‘‘ఏమిటి మాట్లాడవు? ఎవరతను?’’ రెట్టిస్తూ అడిగింది సుమతి.
‘‘అతను.. వరుణ్ అనీ..’’ ఏదో చెప్పబోయింది.
సుమతి ఆమెని మాట్లాడనివ్వలేదు. ‘‘నిన్ను కాలేజ్‌కి పంపిస్తున్నది బుద్ధిగా చదువుకోమని. అంతేకాని ఇలాంటి వెధవ్వేషాలేవేయడానికి కాదు’’ కోపంగా అంది.
‘‘నేనేం వేధవ్వేషాలేయడంలేదు.. అతను నా ఫ్రెండ్...’’
‘‘నోర్ముయ్.. నీకు మగ పిల్లలతో స్నేహమేమిటే.. వాళ్ళ వెనకాల స్కూటర్లమీద ఎక్కి సినిమాలకి తిరగడమేమిటి?’’’

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ