డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకరోజు అలసటతో ఉన్న జగత్కారుడు ఆమె ఒడిలో తలపెట్టుకొని నిద్రిస్తున్నాడు. అప్పుడే సంధ్యాసమయం అయింది. ఆ సమయంలో సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి కనుక భర్త నిద్రించడం ధర్మం కాదని భావించింది. ‘‘నా భర్త యొక్క స్వభావం చాలా కఠినమైనది. నిద్ర లేపితే ఆగ్రహిస్తాడు. లేపకపోతే అతనికి ఆగ్రహం కలుగుతుందేమో. ధర్మహాని కలుగును. కనుక అతనికి ఆగ్రహం వచ్చినాసరే ధర్మలోపం చేయకూడదు. కనుక లేపుతాను’’ అని నిశ్చయించుకొని ఆమె భర్తను లేపింది.
నిద్ర నుండి లేచిన అతను కోపంతో ఇలా అన్నాడు ‘‘ఓ నాగకన్యా! నీవు నన్ను అవమానించావు. కనుక నేను నీ దగ్గర ఇక ఉండను. నిన్ను విడిచి వెళ్లిపోతాను. నేను నిద్రిస్తూ ఉంటే సూర్యుడు అస్తమించగలడా! అంత శక్తి అతనికి ఉందా? నాలాంటి ధర్మశీలునికి వేరే ప్రత్యేకంగా చెప్పాలా? ఈ అవమానాన్ని నేను సహించను’’.
భర్త పలికిన ఈ కఠినమైన మాటలు విన్న జరత్కారువు ఇలా అంది. ‘‘స్వామీ! నేను మిమ్మల్ని అవమానించాలని అనలేదు. మీకు ధర్మలోపం జరుగరాదని తలచి నిద్రలేపాను.’’
భార్యను విడిచిపెట్టాలి అన్న నిశ్చయంతో ఉన్న జరత్కారుడు ఆమెతో ఇలా అన్నాడు ‘‘నాగకన్యా! నేను ఎప్పుడూ అసత్యమాడలేదు. అందుకని నిన్ను విడిచిపెట్టి వెళ్లిపోతున్నాను. నీవు నీ సోదరునితో ఈ విషయం చెప్పు - దుఃఖించవద్దు.
జరత్కారువు కన్నీళ్లతో భర్తను వేడుకొంది. ‘‘స్వామీ! మీరు ధర్మాన్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు. అలాగే నేను కూడా ధర్మం తప్పకుండా మిమ్మల్ని సేవిస్తూ ఉన్నాను.
నిరపరాధిని అయిన నన్ను త్యజించడం మీకు ధర్మం కాదు కదా! ఈ ఆశయంతోనే మా అన్న నన్ను మీకిచ్చి వివాహం చేశాడు. అతను నాతో పూర్వం ఇలా అన్నాడు ‘‘సోదరీ! మన వంశంలోని వారిని నాగమాత శపించింది. నీ సంతానం వలన మేము ఉద్ధరింపబడతాము’’. కనుక దేవా! మీతో ఏర్పడిన సంబంధం వ్యర్థం కాకూడదు. పైగా నేను ఇప్పుడు గర్భవతిని. ఆ శిశువు ఇంకా జన్మించలేదు. ఇటువంటి క్లిష్టసమయంలో మీరు నన్ను విడిచి వెళ్లడం ధర్మమా?’’
జరత్కారుడు ఆమెతో ఇలా అన్నాడు -
‘‘నీ గర్భంలో పెరుగుతున్న బాలుడు అగ్నితో, సూర్యునితో సమానమైన తేజస్సు కలవాడు. మహా తపస్వి. వేదవేదాంగ పారంగతుడు. అతడే మీరు కోరుకుంటున్న బాలుడు. ’’ ఇలా భార్యకు చెప్పి అతను తపస్సు చేసుకొందుకు వెళ్లిపోయాడు.
భర్త విడిచిపెట్టి వెళ్లిన తర్వాత జరత్కారువు ఎంతో దుఃఖంతో వాసుకికి ఈ విషయం అంతా వివరించింది. ఇది విని వాసుకి కూడా దుఃఖించాడు. ఆమెతో ఇలా అన్నాడు.
‘‘సోదరీ! సర్పాలకు ఒక గొప్ప కార్యం జరుగబోతున్నది. దాని సాధనకై ఆ మునితో నీకు వివాహం చేశాము. అతని ద్వారా జన్మించే కుమారుని వల్ల సర్పజాతికి మహోపకారం జరుగుతుంది. తేజస్సంపన్నుడైన నీ పుత్రుడు భవిష్యత్తులో జనమేజయుడు చేసే సర్పయాగాన్ని నివారిస్తాడు.
కనుక నీ వివాహం నిష్ఫలం కాకూడదు. తపస్వి అయిన నీ భర్తను ఆపలేమని నాకు తెలుసు. అందుకే అతన్ని నేను ఆపలేదు. అలా ఆపితే అతను నన్ను శపించవచ్చు. నీ భర్త గురించి నాకు చెప్పు’’.
వాసుకి సోదరి తన భర్త గురించి ఇలా చెప్పింది. ‘‘నా సంతానాన్ని గురించి నా భర్తను అడిగాను. ఆయన ‘అస్తి’ అని మాత్రం చెప్పి వెళ్లిపోయాడు. అతను మహానుభావుడు. సదా సత్యవాక్పాలన చేసేవాడు. పరిహాసానికైనా అబద్ధం చెప్పలేడు. నిష్ఠాగరిష్ఠుడు. అతను వెళ్తూ నాతో ఇలా అన్నాడు.
‘నాగకన్యా! నీ కార్యం తప్పక సిద్ధిస్తుంది. నీవు చింతించవలదు. నీ గర్భంలో అగ్నితో సమానమైన తేజస్సు కలవాడు ఉన్నాడు’ అని ఈ మాటమాత్రం చెప్పి వెళ్లిపోయాడు’’.
కొంతకాలానికి ఆమెకు తల్లిపక్షాన తండ్రి పక్షాన ఉన్న భయాన్ని తొలగించేవాడు జన్మించాడు. అతడు చ్యవనుని వద్ద వేద వేదాంగాలను అధ్యయనం చేశాడు. అతడు ఆస్తీకుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. తల్లి గర్భంలో ఉండగా తండ్రి ‘అస్తి’ అని చెప్పాడు కనుక అతనికి ఆస్తీకుడు అని ప్రసిద్ధనామం వచ్చింది.
ఆస్తీకుడు పుట్టుటకు కారణముంది. నాగమాత అయిన కద్రువ తన పుత్రులైన సర్పాలను ‘‘మీరు జనమేజయుడు చేసే యాగంలో అగ్నిలో పడి భస్మమగుదురు’’ అని శాపం ఇచ్చింది. ఆ శాపాన్ని నివారించడానికే వాసుకి తన చెల్లెలిని జరత్కారునికి వచ్చి వివాహం చేశాడు. ఆ విధంగానే తర్వాత కాలంలో జనమేజయుడు సర్పయాగాన్ని తలపెట్టాడు. ఆ యాగంలో సర్పాలు గుంపులు గుంపులుగా అగ్నిలోపడి నశిస్తూ ఉంటే, అది తెలిసిన వాసుకి కుమిలిపోతున్నాడు.
జనమేజయుడు సర్పయాగం మొదలుపెట్టాడు అని తెలియగానే తక్షకుడు ఇంద్రుని వద్దకు వెళ్లి అతన్ని శరణుకోరాడు. ఇంద్రుడు అతనికి భయం చెందవలసిన అవసరం లేదని అభయమిచ్చాడు. సంతోషంతో తక్షకుడు ఇంద్రుని భవనంలోనే ఉండిపోయాడు. చాలా సర్పాలు అగ్నిలో ఆహుతి అయిపోయారు.
కొద్దిమంది మాత్రమే మిగిలారు. అప్పుడు వాసుకి తన సోదరితో ఇలా అన్నాడు ‘‘సోదరీ! ఈ సర్పాల ఆహుతి చూడలేకపోతున్నాను. ఈ ఆపద నుండి రక్షించడానికే నిన్ను జరత్కారునికి ఇచ్చి వివాహం చేశాను. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. నీవు నీ బంధువులను రక్షించు. పూర్వం బ్రహ్మయే స్వయంగా ‘‘ఈ సర్పయాగాన్ని ఆస్తీకుడు ఒక్కడే నివారించగలడు’’ అని చెప్పాడు. కనుక నీవు నీ పుత్రునితో మా కష్టాలను తొలగించుమని చెప్పు’’.
అప్పుడు జరత్కారువు ఆస్తీకుని పిలిచి ఇలా పలికింది ‘‘కుమారా! ఏ కార్యం కోసం నా అన్న నీ తండ్రికి నన్ను ఇచ్చి వివాహం చేశాడో, ఆ కార్య సమయం ఇప్పుడు వచ్చింది. కనుక నీవు ఆ పని నెరవేర్చు’’. ఆస్తీకుడు ఆ కారణమేమిటని అడిగాడు. (ఇంకావుంది)

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి