డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు--7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుపర్ణోపాఖ్యానము

గరుత్మంతుడు. దేవతలకు హితుడు. రాక్షసులకు సర్పాలకు శత్రువు. కనుక మీరు భయపడవలసిన అవసరం లేదు. అతని మాటలు విన్న దేవతలు ఋషులు గరుత్మంతుని ఇలా స్తుతించారు.
‘‘ఓ పక్షిరాజా! నీవు మహర్షివి. నీవే ఇంద్రుడవు, సూర్యుడవు. ప్రజాపతివి, అగ్నివి, నీవే మాకు ప్రభువువి. నీవు లోకరక్షకుడవు. నీవు బలసముద్రుడవు. నీవే జీవకోటికి అధిపతివి. నీవు మాపై కోపింపకుము. మాపై దయచూపుము. ఓ పక్షీంద్రా! నీ రుూ భయంకరమైన రూపాన్ని ఉపసంహరించు. మా కోసం కల్యాణరూపాన్ని ధరించు’’.
దేవతల ప్రార్థన విన్న పక్షీంద్రుడు తన భయంకర రూపాన్ని, ఉపసంహరించు కున్నాడు. తర్వాత అతను వారితో తన రూపాన్ని దివ్యతేజస్సును చూసి భయపడనక్కరలేదని తెలిపి తన తండ్రి ఆశ్రమానికి వెళ్లితన అన్నగారైన అనూరుని వీపుపై ఎక్కించుకొని సముద్రం అవతల ఉన్న తల్లి ఇంటికి చేర్చాడు.
సూర్యుడు ఆ సమయంలో తన తేజస్సుతో లోకాలన్నింటినీ దగ్ధం చేస్తున్నాడు. అప్పుడు గరుడుడు తన అన్న అనూరుని తీసుకొని వచ్చి సూర్యుని దగ్గరకు చేర్చాడు. సూర్యుడు లోకాలను అలా దగ్ధం చేయడానికి కారణం ఉంది. అమృతమదనం సమయంలో రాహువు దేవతా రూపంలో అమృతం త్రాగడానికి కూర్చోడం చూసి సూర్యచంద్రులు ఆ విషయం విష్ణుమూర్తికి తెలిపారు.
అప్పుడు విష్ణువు తన చక్రంతో రాహువు తల నరికాడు. అమృతం త్రాగడం వల్ల తలమాత్రం బ్రతికింది. రాహువు ఆ తలతో సూర్యచంద్రుల్ని బాధిస్తున్నాడు. దేవతలు చూస్తూ వున్నారు. కాని అడ్డుకోలేదు. అప్పుడు కోపం వచ్చిన సూర్యుడు ‘‘ఈ దేవతలు చూస్తూ ఉన్నారే కాని ఎవ్వరూ నివారించలేదు. కనుక అస్తాద్రిలోనే ఉండి అందరినీ బాధిస్తాను’’ అని తలచాడు. సూర్యుడు అస్తాద్రి నుండి లోకాలని తపింపజేస్తూ ఉండగా మహర్షులంతా దేవతల దగ్గరకు వెళ్ళి ఇలా అన్నారు ‘‘ఈ రాత్రి సమయంలో అత్యంత ఉష్ణంవల్ల లోకాలన్నీ దహించుకుపోతున్నాయి’’.
అప్పుడు దేవతలు, ఋషులు అంతా బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లారు. అతనికి సూర్యుడు చేస్తున్న పని వివరించారు. బ్రహ్మ వారితో ఈ సూర్యుని శాంతింపజేయగలవాడు అరుణుడు (అనూరుడు) ఒక్కడే.
అతను కశ్యప ప్రజాపతి పుత్రుడు. అతని శరీరం విశాలమైంది. అతన్ని సూర్యరథం పై కూర్చోపెట్టి సారధ్యం చేయిస్తే సూర్యుని యొక్క భయంకరమైన తేజస్సును కొంత ఆపగలడు’’ అని బ్రహ్మ చెప్పినవిధంగా దేవతలు అనూరుని సూర్య రథసారథిగా నియమించారు. సూర్యుడు అరుణునితో పాటు ఉదయించాడు.
గరుడుడు తల్లి దగ్గరకు వచ్చినప్పటికి వినత కద్రువకు దాస్యం చేస్తున్నది. ఆమె ఎంతో దుఃఖంతో ఉన్నది. ఒకరోజు కద్రువ వినతను ఆమె పుత్రుని పిలిచి ఇలా చెప్పింది. ‘‘వినతా! సముద్రం లోపల చూడదగిన నాగుల నివాసస్థలం ఉంది. మమ్మల్ని అక్కడకు తీసుకొనివెళ్లండి’’
వినత కద్రువను తన వీపుపై ఎక్కించుకుంది. గరుడుడు నాగులను తన వీపుపై ఎక్కించుకొన్నాడు. అతను సూర్యునికి ఎదురుగా ఎగిరాడు. అప్పుడు సూర్యతాపానికి ఆ సర్పాలన్నీ మూర్ఛపోయాయి. తన పుత్రుల దీనావస్థను చూసి కద్రువ ఇంద్రుని స్తుతించగా అతను వారిపై వర్షాన్ని కురిపించాడు. భూమి అంతా జలమయం అయింది. నాగుల తాపం తగ్గింది. నాగులు తల్లితో
సహా మెల్లగా నాగలోకానికి చేరాయి. ఆ ద్వీపాన్ని విశ్వకర్మ నిర్మించాడు. అది మొసళ్లకు నిలయం. ఇప్పుడు నాగులుకూడా అక్కడికి వచ్చి చేరడంతో ఆ ద్వీపం భయంకరంగా కన్పించింది. అక్కడ నాగులకు ఇష్టమైన గంధపు చెట్లు అనేకం ఉన్నాయి. ఆ వృక్షాలన్నీ నాగులపై పుష్పవృష్టి కురిపించాయి. కద్రువ సంతానం చాలా సంతోషించారు. వారు ఆ గరుడునితో ఇలా అన్నారు. ‘‘గరుడా! నీవు ఆకాశంలో విహరిస్తూ అనేక సుందరమైన ప్రదేశాలు చూసి ఉంటావు కదా! మమ్మల్ని స్వచ్ఛమైన, నిర్మల జలాలు ఉన్న మరో ప్రదేశానికి తీసుకొని వెళ్లు’’.
వారి మాటలతో ఎంతో బాధపడి గరుడుడు తన తల్లితో ఇలా అన్నాడు. ‘‘తల్లీ! నేను ఈ సర్పాల చేత ఎందుకు ఆజ్ఞాపించబడాలి? వారిని మూపుపై ఎందుకు మోయాలి?’’
అప్పుడు వినత దుఃఖంతో ఇలా అంది. ‘‘నాయనా! నా దురదృష్టం వల్ల సర్పాల మాత చేతిలో ఓడిపోయాను. కనుక దాస్యం చేస్తున్నాను. అందువల్ల సర్పాలు నిన్ను ఆజ్ఞాపిస్తున్నాయి’’.
తల్లి దాస్యానికి గరుడుడు చింతించి సర్పాల దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు ‘‘పాములారా! మా తల్లి దాస్యం పోవడానికి మీకు ఏం కావాలో చెప్పండి’’.
అప్పుడు సర్పాలు తమకు అమృతాన్ని తెచ్చిస్తే ఆమెను దాస్యం నుండి విముక్తి కలిగిస్తామని చెప్పాయి.
గరుత్మంతుడు తన తల్లికి ఈ విషయాన్ని చెప్పి, తాను అమృతం తెచ్చేందుకు వెళ్తున్నాని, తనకు తగినంత ఆహారం కావాలని, ఆ ఆహారం ఎక్కడ దొరుకుతుందో చెప్పుమన్నాడు.
వినత ఇలా చెప్పింది. ‘‘సముద్రమధ్యంలో ఒక బోయపల్లె ఉంది. అక్కడ ఎందరో నిషాదులు ఉన్నారు. వారిని ఆహారంగా భుజించు. వారిలో బ్రాహ్మణుడు ఉంటే అతడ్ని విడిచిపెట్టు’’ అన్నది.
గరుత్మంతుడు బ్రాహ్మణుని ఎలా గుర్తుపట్టడం అని అడిగాడు.
‘‘నీవు మ్రింగినప్పుడు అతను కంఠంలోకి పోకుండా నిన్ను దహిస్తూ ఉంటాడు’’ అని వినత చెప్పింది.
తర్వాత ఆమె కుమారుని ఇలా దీవించింది. ‘నీ రెక్కల్ని వాయుదేవుడు కాపాడుగాక! నీ వీపుని సూర్యచంద్రులు రక్షించుగాక! అగ్ని నీ శిరస్సు కాపాడుగాక! తల్లి దీవెన పొంది గరుడుడు ఆకాశంలోకి ఎగిరాడు. నిషాదుల పాలిట యమునిలాగా అతను వారిని సంహరించి తన నోటిలో ఇముడ్చుకున్నాడు.

(ఇంకావుంది)

-- డాక్టర్ ముదిగొండ ఉమాదేవి