డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ సమయంలో అతని కంఠంలోకి ఒక బ్రాహ్మణుడు భార్యతో సహా ప్రవేశించి అతని కంఠాన్ని దహించ సాగాడు. అపుడు గరుడుడు అతన్ని నోటిలో నుండి బయటకు రమ్మని కోరగా అతను బయటకు వచ్చాడు. అలా గరుడుని సంతోషపెట్టి అతను వేరే చోటికి వెళ్లిపోయాడు.
తర్వాత గరుడుడు మరల ఎగురుతూ తండ్రిని దర్శించాడు. కశ్యపుడు అతన్ని ‘‘నీకు కావలసినంత ఆహారం దొరుకుతున్నదా?’’ అని అడిగితే గరుడుడు ఇలా అన్నాడు.
‘‘నా తల్లి దాస్యవిముక్తి కోసం సర్పాలు నన్ను అమృతం తెమ్మన్నాయి. నేను ఇప్పుడు అమృతం తెచ్చేందుకు వెళ్తున్నాను. మార్గమధ్యంలో వేలకొద్దీ నిషాదుల్ని తిన్నాను. కాని నా ఆకలి తీరలేదు. కనుక నాకు అమృతం తేవడానికి శక్తినిచ్చే ఆహారం ఎక్కడ దొరుకుతుందో చెప్పండి’’.
కశ్యపుడు అతనితో ఇలా చెప్పాడు ‘‘కుమారా! మహాపుణ్యదాయకమైన సరస్సు ఒకటి ఇక్కడ ఉంది. అక్కడ ఒక ఏనుగు, తాబేలు నివసిస్తూ ఉన్నాయి. అవి జన్మశత్రువులు. ఆ రెండిటినీ భుజించి, పోయి అమృతం తీసుకొని రా’’ అని చెప్పి అని ఆశీర్వదించి పంపాడు.
తండ్రి ఇలా ఆశీర్వదించగానే గరుడుడు ఆ సరోవరానికి వెళ్లాడు. అతను ఒక గోటితో గజాన్ని, మరొక గోటితో తాబేలుని పట్టుకొని ఆకాశంలోకి ఎగిరాడు. అలా ఎగురుతూ వాటిని తినడానికి అనువైన స్థలాన్ని వెతుకుతూ వెళ్తున్న అతన్ని చూచి ఒక మఱ్ఱిచెట్టు ఇలా అంది ‘‘పక్షీంద్రా! నారుూ కొమ్మ నూరు యోజనాల పొడవు కలది. ఈ కొమ్మపై కూర్చుని గజకచ్ఛపాలని తిను’’.
గరుడుడు దానిపై వ్రాలగానే ఆ కొమ్మ విరిగిపోయింది. అప్పుడు అతను ఆ కొమ్మను కూడా పట్టుకొని ఆశ్చర్యంగా చూచాడు. ఎందుకనగా ఆ కొమ్మను పట్టుకొని వాలఖిల్యులు అధోముఖంగా వేలాడుతున్నారు. వారిని చూచి ‘‘మహర్షులను బాధించరాదు’’ అని తలచి అతను కొమ్మను గట్టిగా పట్టుకున్నాడు. ఈ మొత్తం భారం వహిస్తూ అతను ఆకాశంలో ఎగురుతూ ఉంటే మహర్షులైన వాలఖిల్యులు ఆశ్చర్యపోయారు. అలా ఎగురుతూ అతను గంధమాదన పర్వతాన్ని చేరి అక్కడ తపస్సు చేసుకొంటున్న తన తండ్రిని చూచాడు. అతన్ని చూచిన కశ్యపుడు ఇలా అన్నాడు.
‘‘కుమారా! సాహసం చేయకు. వాలఖిల్యులు నీపై కోపించకుండుగాక’’
ఈ విధంగా అతను వాలఖిల్యులను కూడా అనుగ్రహింపజేశాడు. అతను వారితో ఇలా అన్నాడు.
‘‘మహర్షులారా!ఈ నా పుత్రుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. దానికి మీరు అనుమతి ఇవ్వండి’’. అతని ప్రార్థన విన్న వాలఖిల్యులు గరుడుని ఆశీర్వదించి ఆ కొమ్మను వదిలి హిమాలయాలకు తపస్సు చేసుకొనేందుకు వెళ్లిపోయారు. అప్పుడు గరుడుడు ఆ కొమ్మను నోటితో పట్టుకొని దాన్ని ఎక్కడ విడిచిపెట్టాలి అని తండ్రిని అడిగాడు.
కశ్యపుడు మంచుతో కప్పబడిన పర్వతంపై దాన్ని విడువుమని చెప్పాడు. గరుడుడు ఆ విధంగానే చేశాడు. అతని రెక్కల వేగానికి ఆ పర్వతం కంపించింది. గరుడుడు ఆ పర్వతంపై కూర్చుని గజకచ్ఛపాలను భక్షించాడు. వాటిని తిని అతను మరల ఆకాశంలోకి ఎగిరాడు. అతను అలా ఎగిరి వస్తుంటే దేవతలకు చాలా అపశకునాలు కన్పించాయి. ఆకాశం నుండి ఉల్కలు రాలి పడ్డాయి. దేవతాగణాల ఆయుధాలు ఒకదానితో ఇంకొకటి ఢీ కొన్నాయి. ఆకాశం భయంకరంగా ఉరుములతో గర్జించింది.
దేవతల మెడలలోని పుష్పహారాలు వాడిపోయాయి. వారి తేజస్సు తక్కువయింది. ఈ ఉత్పాతాలకు భయపడి వారు తమ గురువు బృహస్పతిని, వీటికి కారణాన్ని గురించి ఇలా అడిగారు.
‘‘ఆచార్యా! ఈ ఉత్పాతాలు ఎందుకు కల్గుతున్నాయి? మనల్ని ఎదిరించగల శత్రువులు ఎవరూ లేరే?’’
దానికి బృహస్పతి ఇలా సమాధానం చెప్పాడు ‘‘దేవేంద్రా! ఈ ఉత్పాతాలు అన్నీ నీ అపరాధం వల్లనే కలిగాయి. వాలఖిల్యులకు నీవు చేసిన అవమానం వల్లే ఇవన్నీ కలిగాయి. వినతా కశ్యపుల పుత్రుడు గరుడుడు. అతడు అమృతాన్ని తీసుకొని వెళ్లడానికి ఇక్కడకు వస్తున్నాడు. అతను అత్యంత సమర్థుడు.’’
ఇంద్రుడు గురువు అన్న మాటలు విని అమృత రక్షకులతో ఇలా అన్నాడు. ‘‘బలవంతుడైన వాడు అమృతాన్ని హరించడానికి వస్తున్నాడు. అతను ఆ పని చేయకుండా జాగ్రత్తగా అమృతాన్ని రక్షించండి. దేవతలు వెంటనే అమృతం చుట్టూ రక్షణ ఏర్పాటు చేశారు. వారంతా కవచాలు ధరించి ఆయుధాలతో సంసిద్ధులైనారు.
ఇంద్రుని వాలఖిల్యులు శపించడానికి కారణముంది. పూర్య కశ్యపప్రజాపతి పుత్రకామేష్టి యాగాన్ని చేస్తున్న సమయంలో అతనికి సహాయం చేయడానికి చాలామంది ఋషులు వచ్చారు. యజ్ఞానికి కావలసిన సమిధలను తేవడానికి కశ్యపుడు, ఇంద్రుని, దేవతల్ని వాలఖిల్యులను నియమించాడు. ఇంద్రుడు బలశాలి కనుక పెద్ద కట్టెల మోపుని తెస్తూ ఉండగా, అంగుష్టమాత్ర శరీరంతో ఉన్న వాలఖిల్యులు ఒక్కొక్కరావి సమిధను పట్టుకొని యజ్ఞశాలకు వస్తున్నారు. వారిని చూసి ఇంద్రుడు అపహసించాడు. దానితో కోపం వచ్చిన ఆ మహర్షులు ‘‘ఇంద్రుని కంటె బలవంతుడు వీరుడు సకల దేవతలకు ఇంకొక ఇంద్రుడు జన్మించుగాక. అతను ఇంద్రునికి భయం కలిగించుగాక’’ అని తలచి అగ్నికి ఆహుతులు సమర్పించారు.
ఇంద్రునికి ఈ సంగతి తెలిసింది. అతను భయపడి కశ్యప మహర్షిని శరణుకోరాడు. వాలఖిల్యుల శాపం గురించి తెలుసుకున్న కశ్యపుడు వారి దగ్గరకు వెళ్లి వారి సంకల్పం గురించి అడిగాడు. ఆ మహర్షులు కశ్యపునితో ఇలా అన్నారు. ‘‘మేము సంకల్పించినట్లే శత్రుభయంకరుడైన ఇంకొక ఇంద్రుడు జన్మించుగాక’’. (ఇంకావుంది)